9, ఆగస్టు 2021, సోమవారం

Video: భలే ఉంది కదా... దీన్ని ముట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

కొక్కా (image credit - twitter)

Viral Video: సోషల్ మీడియా అద్భుతమైనది. కొత్త విషయాలు, ఆసక్తికరమైన సంగతులు తెలుసుకోవాలి అనుకునేవారికి సోషల్ మీడియాను మించినది ఉండదేమో. ఐతే... అదే సోషల్ మీడియాలో అసత్యాలు కూడా చాలా ఉంటాయనుకోండి. సరే... మనం అసలు టాపిక్‌కి వద్దాం. ఆ జంతువు పేరు కొక్కా (quokka). పలకడం కష్టమే. చిన్న తోకతో... పిల్లి అంత సైజులోనే ఉంటుంది. ఆస్ట్రేలియాలో కంగారూలు, వల్లబీలతోపాటూ... ఈ జంతువులూ ఉంటాయి. కానీ ఇవి అంతగా కనిపించవు. ఇవి శాఖాహార (herbivorous) జీవులు. రాత్రిపూట (nocturnal) తిరిగేవి. అందువల్ల పగటి వేళ ఈ జంతువులు అరుదుగా కనిపిస్తాయి.

తాజాగా ఓ కొక్కా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ మహిళ... జూలోని కొక్కాకు బొప్పాయి ముక్క లాంటిది ఇచ్చింది. ఆ ముక్కను తింటూ కొక్కా ఎంతో ఆనందపడింది. తన జీవితంలో ఇదే అత్యంత సంతోషకరమైన సమయం అన్నంత ఆనందం దాని ముఖంలో కనిపిస్తోంది. అలా అది తింటూ... ఓ సందర్భంలో... ఆ మహిళకు థాంక్స్ చెబుతూ... ఆమెను టచ్ చెయ్యబోయింది. కానీ ఆ మహిళ కాస్త వెనక్కి జరిగింది. మొత్తంగా కొక్కాను ఆమె అస్సలు ముట్టుకోలేదు.

నిజానికి అంత కలివిడిగా ఉండే జంతువును ఎవరైనా అలా ముట్టుకొని... నిమురుతారు. కానీ ఆమె టచ్ చెయ్యకపోవడానికి ప్రత్యేక కారణం ఉంది. ఈ కొక్కాలను ముట్టుకున్నా... వీటికి ఆహారం పెట్టినా ఆస్ట్రేలియాలో ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ రూ.8వేల నుంచి రూ.5 లక్షల దాకా ఉంటుంది. అక్కడి అధికారులు జాలిపడి వదిలేయరు. కచ్చితంగా ఫైన్ వేసేస్తారు. అందుకే అక్కడ ఎవ్వరూ కొక్కాల జోలికి వెళ్లరు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి.



పశ్చిమ ఆస్ట్రేలియాలో ఓ చిన్న ప్రాంతంలోనే ఈ జంతువులు జీవిస్తున్నాయి. ఇవి అంతరించే జంతువుల జాబితాలో చేరాయి. అందువల్ల వీటిని రక్షించే విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం రాజీ పడట్లేదు.



ఈ వీడియోలో చూడండి... ఈ అమ్మాయి కొక్కాను ముట్టుకోవడమే కాదు... ఆహారం కూడా పెట్టగలదు. ఎందుకంటే... ఆమె ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ ఉద్యోగి.



మన దేశంలో కూడా చాలా జంతువులు, పక్షులు అంతరించే దశలో ఉన్నాయి. పునుగు పిల్లి, మూషిక జింకల వంటివి చూద్దామన్నా కనిపించట్లేదు. అలాంటి వాటిని రక్షించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు నెటిజన్లు. 

8, ఆగస్టు 2021, ఆదివారం

B House: అరుదైన ఇల్లు... ఇండియాలో అలాంటిది అది ఒక్కటే..!

Symbolic Image - Not real one

B House: ఇండియాలో 140 కోట్ల ఉంది జనాభా. కోట్ల ఇళ్లు ఉన్నాయి. కానీ ఆ ఇల్లు ప్రత్యేకమైనది. అది ఏ ప్రధాని ఇల్లో, రాష్ట్రపతి భవనమో కాదు. ఓ సాదాసీదా ఇల్లు. మరెందుకు అది ప్రత్యేకమైనదో చూద్దాం.

భారత్-బంగ్లాదేశ్ మధ్య... సరిహద్దు అనగానే చెక్ పోస్టులు, కంచెలు, రెండు దేశాల ఆర్మీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఓ ఇల్లు సరిగ్గా సరిహద్దులో ఉంది. ఆ ఇంటి మధ్య నుంచే బోర్డర్ గీత వెళ్లింది. అందువల్ల ఆ ఇంటి వరకూ... ఫెన్సింగ్ లేదు. అంటే 385 గజాల స్థలానికి కంచె లేదు. ఆ స్థలమే ఆ ఇల్లు. ఆ ఇంటికి ఒకవైపు భారత్, మరోవైపు బంగ్లాదేశ్ ఉంది. అందువల్ల ఆ ఇంట్లో రెండు దేశాల వారూ ఉంటారు. వారి మధ్య ఏ గొడవలూ ఉండవు. పూర్తి స్నేహపూర్వకంగా ఉంటారు. అసలు వాళ్లకు బోర్డర్ ఆలోచనే ఉండదు. కానీ ఆ ఇల్లు సగం ఇండియాది, సగం బంగ్లాదేశ్‌ది.

భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న సరిహద్దులో ఈ ఇల్లు ఉన్న ప్రదేశాన్ని జీరో లైన్ అంటారు. ఆ ఇంటికి రెండు వైపులా... సరిహద్దు అంతా ఫెన్సింగ్‌తో ఉంటుంది. ఇంట్లోంచీ ఓ గీత లాంటిది వెళ్లినట్లుగా గుర్తు ఉంటుంది. ఆ గుర్తే సరిహద్దు. ఈ ఇల్లు... బెంగాల్‌లోని హరి పుకుర్ (Hari pukur)లో సరిహద్దులో ఉంది. ఈ ఇంట్లో గోడకు... ఓవైపు ఇండియా అనీ, మరోవైపు బంగ్లాదేశ్ అని రాసి ఉంటుంది. 

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఇల్లు (Image credit - ANI)

ఇంట్లో ఉన్నవారు... కలిసి పండుగలు చేసుకుంటారు. కలిసిమెలిసి ఉంటారు. కానీ వాళ్లను చూసినప్పుడు ఎవరు భారతీయులో, ఎవరు బంగ్లాదేశీయులో ఈజీగా గుర్తుపట్టేయవచ్చు. ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతతే ఉంటుంది. ఈ సరిహద్దు టెన్షన్లు ఉండవు. కానీ ఇంటి బయట మాత్రం మిగతా సరిహద్దులో లాగే... సెక్యూరిటీ ఉంటుంది. ఆ ఇంటిని కూడా రెండు దేశాల ఆర్మీ గమనిస్తూనే ఉంటుంది. ఇండియావైపున బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గమనిస్తూ ఉంటుంది. బంగ్లాదేశ్ వైపున బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ (Border Guards Bangladesh (BGB)) సైన్యం ఉంటుంది.

ఇండియా-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అలా ఉండదు. చాలా వరకూ ప్రశాంత వాతావరణమే ఉంటుంది. అందువల్ల ఆ ఇంటి చుట్టుపక్కల రెండు దేశాల సైన్యమూ రోజూ లాగే కలుసుకుంటూ... ప్రశాంతంగా ఉంటారు.

"ఆ ఇంటికి ఫెన్స్ లేదని మేం ఎప్పుడూ ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఇండియాతో ఎప్పుడూ మాకు సత్సంబంధాలే ఉన్నాయి" అని 2019లో BGB మేజర్ నయీమ్ కమాండర్ ANIకి తెలిపారు.

"చెప్పాలంటే... ఇక్కడ ఆలయాలు, మసీదుల దగ్గర ఎలాంటి సరిహద్దు రేఖలూ లేవు. అలాగని ప్రజలు ఫ్రీగా తిరిగే అవకాశమూ లేదు. ఇక్కడ 24 గంటలూ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి... ప్రజలు కూడా కొన్ని రూల్స్ పాటించాలి. బంగ్లాదేశీయులు, భారతీయులూ కలిసి నమాజు చేసుకోవడానికి ప్రత్యేక మసీదు ఉంది. అక్కడ ఏదైనా పండుగ, వేడుకలు జరపాలి అనుకుంటే... రెండు దేశాల భద్రతా దళాలు ముందుగానే మాట్లాడుకుంటాయి" అని BSF కమాండర్ బీఎస్ నేగీ... ANIకి తెలిపారు.

ఇలా సరిహద్దులో ఇల్లు ఉండటం... ఆ ఇంట్లోంచే సరిహద్దు గీత వెళ్లడం... ఆ ఇంట్లోనే రెండు దేశాల ప్రజలూ హాయిగా నివసిస్తుండటంతో... ఇండియాలోనే ఇదో ప్రత్యేక ఇల్లుగా ఉందనుకోవచ్చు.


1, ఆగస్టు 2021, ఆదివారం

NASA: మనం ఎప్పుడూ చూడని చిత్రం... 3 గెలాక్సీల యుద్ధం

3 గెలాక్సీల యుద్ధం (Image credit: ESA/Hubble & NASA, J. Dalcanton)

NASA: మన పాలపుంత (Milkyway) గెలాక్సీలో... కొన్ని కోట్ల నక్షత్రాలున్నాయి. వాటిలో జస్ట్ 10 పర్సెంట్ నక్షత్రాల్ని మాత్రమే మనం చూస్తున్నామేమో. మన గెలాక్సీ గురించే మనకు పూర్తిగా తెలియదు. అలాంటి ఈ అనంతవిశ్వంలో ఎన్నో అద్భుతాలు జరిగిపోతున్నాయి. అలాంటి వాటిని మనకు చూపిస్తున్న హబుల్ స్పేస్ టెలిస్కోప్... మరో అత్యంత అరుదైన దృశ్యాన్ని చూపించింది. ఒకేలా ఉన్న మూడు పాలపుంతలు (3 galaxies) కొట్టేసుకుంటున్న దృశ్యాన్ని చూపించింది.

అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ - నాసా (NASA), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) కలిసి ఈ దృశ్యాన్ని అభివృద్ధి చేశాయి. ఇందులో మూడు పాల పుంతలు.. మూడు గురుత్వాకర్షణలతో కొట్టేసుకుంటున్నాయి. ఒకదాన్ని మరొకటి లాగేసుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను ఆర్ప్ 195 (arp 195) అని పిలుస్తారు. అత్యంత అసాధారణ, విచిత్రమైన గెలాక్సీల వ్యవస్థలను ఆర్ప్ 195 అని పిలుస్తారు. ఇలాంటి గెలాక్సీలు మన విశ్వంలో అక్కడక్కడా ఉన్నాయి. ఇవి ఎప్పుడూ అంతుచిక్కని విధంగా, మిస్టరీగా, ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. 

3 గెలాక్సీల యుద్ధం (Image credit: ESA/Hubble & NASA, J. Dalcanton)


హబుల్ టెలిస్కోపుతో పనిచేసే వ్యోమగాములు (Astronomers)... ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకో తెలుసా... ఆ ఒక్క సెకండ్‌లోనే హబుల్ టెలిస్కోప్ చూపించే ఏదైనా అద్భుత దృశ్యం మిస్ కావచ్చు. ప్రత్యేక కంప్యూటర్ ఆల్గారిథమ్ ద్వారా... హబుల్ శోధనలను... వ్యోమగాములు పరిశోధిస్తూ ఉంటారు. కొన్ని అరుదైన సందర్భాల్లో హబుల్ టెలిస్కోప్ నుంచి పైన కనిపించే అత్యంత అరుదైన దృశ్యాలు లభిస్తాయి.

హబుల్ తనపాటికి తాను ఈ దృశ్యాన్ని చూపించేసింది. కానీ ఇప్పుడు అసలు పని వ్యోమగాములకు మొదలైంది. ఇక ఆ కొట్టుకునే మూడు గెలాక్సీలను పరిశోధిస్తూ... ఆ యుద్ధంలో ఏం జరుగుతుందో పరిశీలించే పని రోదశీ శాస్త్రవేత్తలది. ఇలాటివి గమనించేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ రెడీ చేస్తున్నారు. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుంది.

31, జులై 2021, శనివారం

Digital Art: అతని ఊహలు అనంతం... ఆ డిజిటల్ ఆర్ట్ అద్భుతం

Digital Art: ఈ రోజుల్లో డిజిటల్ ఆర్ట్‌కి ఆదరణ బాగా పెరుగుతోంది. ఎంతో మంది టాలెంటెడ్ డిజిటల్ ఆర్టిస్టులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. (image credit - instagram - zakeazy)
 
ఫ్రాన్స్‌కి చెందిన డిజిటల్ ఆర్టిస్ట్ జాక్ ఈజీ (zakeazy)... మిగతా కళాకారులలా కాకుండా కాస్త భిన్నమైన ఆర్టును చూపిస్తున్నాడు. (image credit - instagram - zakeazy)

రకరకాల ఫొటోలను మిక్స్ చేసి... సర్రియల్ ఇమేజెస్ సృష్టిస్తున్నాడు. నిజమేనేమో అనిపించేలా ఉంటున్నాయి అవి. (image credit - instagram - zakeazy)

జాక్ తన డిజిటల్ ఆర్టులో... జంతువులు, భవనాలు, ప్రకృతిని మిక్స్ చేస్తున్నాడు. అందువల్ల అవి సహజమైనవిలా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి. (image credit - instagram - zakeazy)

ఫాంటసీ ఆర్ట్ తయారుచెయ్యాలంటే చాలా కష్టం. ఆ స్థాయిలో ఊహించడం సవాలే. జాక్ ఈజీ మాత్రం ఎంతో ఈజీగా ఇది చేసి చూపిస్తున్నాడు. (image credit - instagram - zakeazy)

జాక్ ఫొటోలన్నీ మనల్ని మరో ప్రపంచానికి తీసుకుపోతాయి. అందులో భవనాలు, ప్రకృతి వల్ల అది మనం ఇదివరకు చూసినదానిలాగానే ఉంటుంది కానీ కొత్తగా అనిపిస్తుది. (image credit - instagram - zakeazy)

తాజ్ మహల్, ఈఫిల్ టవర్ వంటి ప్రపంచంలోని చారిత్రక, ప్రముఖ కట్టడాలను తన ఆర్టులో మిళితం చేశాడు జాక్. తద్వారా అవి మ్యాజికల్ వరల్డ్‌లో ఉంటే ఎలా ఉంటుందో కళ్లకు చూపిస్తున్నాడు. (image credit - instagram - zakeazy)

"నేను కళను ప్రేమిస్తాను. క్రియేషన్ అంటే ఇష్టం. ఆర్కిటెక్చర్ అంటే ప్రాణం" అని జాక్ వివరించాడు. (image credit - instagram - zakeazy)

"నేను పిల్లాడిగా ఉన్నప్పుడు మా నాన్న నాకు ఇది నేర్పారు. నాన్నతో కలిసి నేను కూడా ఊహాతీతమైనవి గీయడం ప్రారంభించాను" అని తన కథ చెప్పాడు. (image credit - instagram - zakeazy)

పదేళ్ల కిందట ఫొటోషాప్ నేర్చుకున్న జాక్... గ్రాఫిక్ డిజైనర్ అయ్యాడు. అలా నేర్చుకున్న అనుభవంతో... 2019లో డిజిటల్ ఆర్టిస్టుగా మారాడు. (image credit - instagram - zakeazy)

డిజిటల్ ఆర్ట్ అనేది ఊహల్లోంచీ రావాలి కాబట్టి... టెన్షన్లతో అది సాధ్యం కాదు. అందుకే జాక్... ఒక్కో ఫొటోకీ నెలల టైమ్ తీసుకుంటాడు. (image credit - instagram - zakeazy)

రెండున్నరేళ్లుగా జాక్ సృష్టించినవి 55 ఫొటోలు మాత్రమే. దీన్ని బట్టీ అర్థం చేసుకోవచ్చు... డిజిటల్ ఆర్ట్ అనేది ఎంత ఓపికతో వేయాల్సి ఉంటుందో. (image credit - instagram - zakeazy)

ఆర్టిస్టులు ఎంత కష్టపడినా... దాన్ని ప్రజలు చూసి మెచ్చుకున్నప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోతారు. జాక్ విషయంలోనూ అదే జరుగుతోంది. (image credit - instagram - zakeazy)

చాలా మంది అతని ఆర్ట్ చూసి ప్రశంసల జల్లు కురిపిస్తారు. అది ఫెయిరీ ల్యాండ్ లాగా ఉందని కొందరు, అపోకలిప్టిక్ వరల్డ్‌లా ఉందని మరికొందరు.. ఇలా రకరకాలుగా అభివర్ణిస్తుంటారు. (image credit - instagram - zakeazy)

జాక్ ఆర్టులో కొంత మిస్టరీ కూడా ఉంటుంది. ఎక్కడ ఏ జంతువులు ఉన్నాయో మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా అంచనాలకు మించి ఆర్ట్ ఉంటుంది. (image credit - instagram - zakeazy)

ప్రకృతిని చూస్తూ పెరిగిన జాక్... అదే ప్రకృతిని ప్రేరణగా తీసుకున్నాడు. అందుకే అతని డిజిటల్ ఆర్టులో నేచర్ అడుగడుగునా కనిపిస్తుంది. (image credit - instagram - zakeazy)

జాక్ చాలా దేశాలు తిరుగుతూ ఉన్నాడు. అక్కడి కల్చర్, స్టైల్, అక్కడి ప్రజల జీవన విధానం... అవన్నీ చూసి... వాటిని తన డిజిటల్ ఆర్టులో మిక్స్ చేస్తున్నాడు. (image credit - instagram - zakeazy)

ఇలా తెరవెనక ఎంతో కృషి చేస్తున్నాడు కాబట్టే... జాక్ డిజిటల్ ప్రపంచం అత్యద్భుతంగా కనిపిస్తోంది. (image credit - instagram - zakeazy)

జాక్ ఊహా ప్రపంచం. (image credit - instagram - zakeazy)

30, జులై 2021, శుక్రవారం

The Boiling River: ఉడికే నది.. అందులో పడితే మరణమే!

 

ఉడికే నది (image credit - Youtube - https://youtu.be/v6rlwobnkLk)

The Boiling River: నరకంలో వైతరిణి నది ఉంటుందంటారు. అలాంటి నది భూమిపైనే ఉంది. వింత రహస్య నదిగా గుర్తింపు పొందింది. అది ఎందుకు ఉడుకుతూ ఉంటుంది. ఎందుకు వేడిగా ఉంటుంది. దాని విశేషాలు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత వేడి నది ఏదంటే అదే. దానికి ఓ పేరంటూ లేదు. సింపుల్‌గా ఉడికే నది అంటున్నారు. ఎందుకంటే... అది ఎప్పుడూ కుతకుతా ఉడుకుతూనే ఉంటుంది. సంవత్సరంలో 365 రోజులూ వేడి సెగలు కక్కుతూనే ఉంటుంది. జనరల్‌గా ఏ నది దగ్గరకైనా మనం వెళ్తే... ఆ నీటిపై నుంచి... చల్లటి గాలులు పలకరిస్తాయి. ఆ నది దగ్గరకు వెళ్తే మాత్రం ఉక్కపోతే. వేడి గాలులు, వేడి నీటి ఆవిరి మనల్ని టచ్ చేస్తుంది. ఇంతకీ అది ఎక్కడుందంటే... దక్షిణ అమెరికాలోని... పెరూ దేశంలో. అత్యంత దట్టమైన అమెజాన్ అడవి (Amazon Rain Forest)లో... ఆ నది రహస్యంగా ఉంది. బయటకు పెద్దగా కనిపించదు.

ఈ నది ఒకటి ఉందని పూర్వీకులు చెప్పుకునే వారు. కానీ ఎక్కడుందో మ్యాప్ పాయింటింగ్ ఉండేది కాదు. దీని కోసం చాలా మంది వెతికారు. అమెజాన్‌లో వెతుకులాట అంటే... ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఆ అడవి ఎంత మంచిదో... అంత ప్రమాదకరమైనది కూడా. కానీ వెతికారు. కనిపెట్టారు. ప్రపంచానికి చూపించారు కొందరు ఔత్సాహికులు. ఆండ్రెస్ రుజో (Andrés Ruzo)... ఈ నదిని పరిశోధిస్తున్నాడు. ఇప్పుడు అతను భూగర్భ సైంటిస్ట్. అతను దాన్ని తన టీమ్‌తో కలిసి ప్రపంచానికి చూపించాడు. ఈ నది నిజంగా ఉందా... ఉంటే ఎక్కడుంది... అసలు ఎందుకు ఉడుకుతూ ఉంటుంది... ఇలా ఎన్నో ప్రశ్నలు రుజోకి నిద్ర లేకుండా చేశాయి. అతని ప్రయత్నం ఫలించింది. ఈ సందర్భంగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నది పైకి ఉడుకుతున్నట్లు కనిపించదు. చూడటానికి ప్రశాంతంగా ఉంటుంది. లోపల మాత్రం ఉడుకుతూ ఉంటుంది. నది ప్రారంభంలో నీటి ప్రవాహం చిన్నగానే ఉంది... రాన్రానూ అది పెద్దగా ఉందని రుజో చెప్పాడు. నదిలో వేడి అన్ని చోట్లా ఒకేలా లేదని తెలిపాడు. నది ప్రారంభంలో నీటి వేడి 91 డిగ్రీల సెల్సియస్ (195 డిగ్రీల ఫారన్‌హీట్) ఉందని రోజో టీమ్ తేల్చింది. అక్కడ ఆ నీటితో గ్రీన్ టీ తాగొచ్చు. లేదా... గుడ్డు ఉడకబెట్టుకొని తినవచ్చు. అంత వేడి ఉన్నాయి. ఓ చోట అతను తన చేతిని నది నీటిలోకి పెట్టాడు. జస్ట్ అర సెకండ్‌లో తీసేశాడు. కానీ ఆ క్షణ కాలంలోనే అతని చెయ్యి కాలింది. ధర్డ్ డిగ్రీ గాయాలయ్యాయి. అందులో పడితే చావు తప్పదని అతను అంటున్నాడు.



నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్‌ప్లోరర్ అయిన రుజో... దీనిపై జియోఫిజిక్స్‌లో PhD చేస్తున్నాడు. ఈ నదిలో మనుషులు, జంతువులు, పక్షులు, ఇతర జీవరాశులు ఏవి పడినా... చనిపోవడం ఖాయమని రుజో తెలిపాడు. ఇంతకీ ఆ నీరు ఎందుకు వేడిగా ఉంది అంటే... దాని వెనక ఏ మంత్రమూ లేదు. సైన్సే ఉంది. ఆ నీరు భూమి లోపలి నుంచి పైకి వస్తోందట. దీన్నే జియోథెర్మల్ హీటింగ్ (Geothermal Heating) అంటారు. ఈ నీరు వంద శాతం సహజమైనది. కాలుష్యం లేనిదని ఈ టీమ్ తేల్చింది.

స్థానికులకు కొందరికి ఈ నది తెలుసు. వాళ్లు దీన్ని పవిత్ర నదిగా భావిస్తారు. ఈ నీటిని వాడితే రోగాలు నయం అవుతాయని వారి నమ్మకం. ప్రకృతి వింతల్లో ఈ నది కూడా ఒకటిగా ఉంది. దీన్ని పరిరక్షించుకోవాలని రుజో టీమ్ కోరుతోంది.

Kabukicho Robot Restaurant: ఆ రెస్టారెంట్‌లో రోబోలు ప్రేమిస్తాయి

జపాన్ లోని రోబో రెస్టారెంట్ (image credit - Twitter)

Kabukicho Robot Restaurant: జపాన్ ప్రజలకు ఓ అలవాటు ఉంది. అమ్మాయిలలా కనిపించే రోబోలను వారు బాగా ఇష్టపడతారు. కొందరైతే అలాంటి రోబోలను ప్రేమించి, పెళ్లి కూడా చేసుకుంటారు. ప్రజల్లో ఉన్న ఈ ఆలోచనను క్యాష్ చేసుకుంటూ... అమ్మాయిల ఆకారంలో కనిపించే భారీ రోబోలతో ఓ రెస్టారెంట్ జపాన్‌లో ఉంది. మీరు జపాన్‌ రాజధాని దగ్గర్లోని కాబుకిచో (Kabukicho) జిల్లాకి వెళ్తే... అక్కడ ఈ రోబో రెస్టారెంట్ ఉంటుంది. మగవాళ్లకు ఇది చాలా ఇష్టమైన రెస్టారెంట్. చుట్టూ రకరకాల షాపులతో రద్దీగా ఉండే ఏరియాలో ఉంటుంది. రోబో రెస్టారెంట్ లోపలికి వెళ్తుంటే... రంగురంగుల నియోన్ లైట్లు వెలుగుతూ... కలర్స్ విరజిమ్ముతాయి. ఇక్కడ రోబోలు స్వయంగా ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాయి. ఆడతాయి, పాడతాయి. సెల్ఫీలు తీసుకోనిస్తాయి. ఇక్కడి రోబోలకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉంది. అందువల్ల లోపలికి ఎంటరైన వారిలో మగవాళ్లకు ఇవి కనెక్ట్ అవుతాయి. హాయ్ డియర్ అంటూ లవ్లీగా మాట్లాడతాయి. ప్రేమికురాలిలా ప్రేమ కురిపిస్తాయి. 



ఈ రోబోలు కస్టమర్లకు ఎంతలా నచ్చుతాయంటే... ఓ దశలో వాటినే పెళ్లి చేసుకోవాలి అనిపించేంతలా నచ్చుతాయి. వాటి అందం, ఆకారం, మాట తీరు, కలుపుగోలు తనం... ఇవన్నీ మగవారిని కట్టిపడేస్తాయి. మెరుపులు, కాంతులు, ఫ్లాష్ లైట్ల జిగేల్స్ మధ్య డిన్నర్ అదిరిపోతుంది. ఈ రెస్టారెంట్ చాలా పెద్దది. లోపల చాలా మంది సిబ్బంది ఉంటారు. వారు కూడా ఎట్రాక్టివ్‌గానే ఉంటారు. వారికి తోడు బికినీ డాన్సర్లు ఉంటారు. కానీ వాళ్లను డామినేట్ చేస్తాయి రోబోలు. అంత ఆకర్షణీయంగా అవి కనిపిస్తాయి. జపాన్ డాన్స్ అయిన పారాపారా స్టెప్పులను ఈ రోబోలు వేస్తాయి. ఇవ హావభావాలు పలికిస్తాయి. నవ్వుతాయి. బాధను వ్యక్తం చేస్తాయి. కవ్విస్తాయి. కరుణ చూపిస్తాయి. ఇలా వచ్చిన కస్టమర్లతో అనుబంధాన్ని పెంచుకోవడమే వీటి లక్ష్యం. ఇళ్లలో, ఆఫీసుల్లో ఇలాంటి ఆప్యాయతలు, అనురాగాలూ లభించని వారు... ఈ రెస్టారెంట్‌కి వచ్చి... తమ కష్టాలను రోబోలతో చెప్పుకుంటారు. కొందరైతే... తమ టెన్షన్లను తగ్గించుకోవడానికి కాస్తంత రిలీఫ్ కోసం ఇక్కడికి వస్తారు.



ఇక్కడ రోజూ 3 గంటల పాటూ ప్రత్యేక షో ఉంటుంది. అందులో రోబోలు వన్ బై వన్ లైన్‌లో ప్రదర్శన ఇస్తూ వెళ్తాయి. కస్టమర్లు వాటిని అలా చూస్తూ ఉండిపోతారు. ఆ షో టైమే తెలియనివ్వదు. ఆ 3 గంటలూ వేరే ప్రపంచంలో ఉన్న ఫీల్ కలుగుతుంది. 



ఈ రెస్టారెంట్‌కి వెళ్లాలంటే... ముందుగా షింజుకు స్టేషన్ (Shinjuku Railway Station)కి వెళ్లాల్సి ఉంటుంది. రోబో షో మొదలయ్యే అరగంట ముందే రెస్టారెంట్‌కి చేరుకోవాల్సి ఉంటుంది. సన్ గ్లాసెస్, పెద్ద విగ్స్ పెట్టుకున్నవారిని లోపలికి అనుమతించరు. 



పేరుకి ఇది రోబో రెస్టారెంట్ అయినా... లోపల భోజనం లాంటివి వడ్డించరు. పాప్‌కార్న్, బీర్‌తోపాటూ... మూడు రకాల డిన్నర్ ఐటెమ్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఆ ఫుడ్ కంటే రోబోల హంగామాయే అందరికీ నచ్చుతుంది. కాబుకిచో జిల్లాలో ఇలాంటి చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. కానీ... ప్రేమించే రోబోలు ఉన్న రెస్టారెంట్ ఇదే!

25, జులై 2021, ఆదివారం

Bhangarh Fort: ఆ కోటలోకి వెళ్తే, అంతే సంగతులా? రత్నవతిని ప్రేమించిన మంత్రగాడెవరు? దెయ్యాల కోట!

 

భాన్‌గఢ్‌ కోట (Image credit - Wikipedia)

ఏ రాజుల కోటకైనా వెళ్తే... అక్కడి చారిత్రక కట్టడాల్ని ఆనందంగా చూస్తాం. అదే ఆ కోటకు వెళ్తే మాత్రం క్షణక్షణం భయపడుతూ చూడాల్సిందే. ఇక చీకటి పడుతుందంటే... ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సిందే. హర్రర్ సినిమాల్లో కూడా కనిపించనంత టెన్షన్ అక్కడ ఉంటుంది. ప్రాణాలతో బయటపడితే చాలనే ఆలోచన కలుగుతుంది. ఎందుకు? అంతలా భయపెట్టే పరిస్థితి అక్కడ ఏముంది? దెయ్యాల కోటగా చెప్పుకుంటున్న రాజస్థాన్‌లోని భాన్‌గఢ్‌ విశేషాలు ఇవి.

మీకు హర్రర్ సినిమాలన్నా... సస్పెన్స్ థ్రిల్లర్‌ స్టోరీలన్నా ఇష్టమైతే... మీకు కచ్చితంగా నచ్చే ప్లేస్ భాన్‌గఢ్ కోట. అక్కడికి వెళ్లేవాళ్లు ఎన్నో కథలు వింటారు. వెళ్లొచ్చాక... ఎన్నో కథలు చెబుతారు. ఈ రోజుల్లో... చేతిలో మొబైల్ ఉండటం ఎంత కామనో... ఆ కోటలో తిరుగుతూ టెన్షన్ పడటమూ అంతే కామన్.

రాజస్థాన్‌లోని జైపూర్ తెలుసుగా. అక్కడికి వెళ్లి... ఎవరైనా స్థానికులతో... "భాన్‌గఢ్ కోటకు వెళ్తున్నా" అని చెప్పండి. పైనుంచీ పిడుగు పడినట్లు అదిరి పడతారు వాళ్లు. మీవైపు ఒకింత అనుమానంతో చూస్తారు. మీకేదో చెప్పాలన్న ఆతృత వాళ్లలో ఉంటుంది. అలా ఎందుకో ముందు ముందు మీకే తెలుస్తుంది.

జైపూర్ నుంచీ 83 కిలోమీటర్ల దూరంలోని అల్వార్ జిల్లాలో ఉంది భాన్‌గఢ్ పట్టణం. అక్కడకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉంది. ప్రైవేట్ వెహికిల్స్ కూడా ఉంటాయి. రెండు గంటల ప్రయాణం... అడుగడుగునా ఆహ్లాదం కలిగిస్తుంది. చుట్టూ చెట్లూ-చేమలతో... ఆరావళీ పర్వత శ్రేణుల మధ్య సాఫీగా సాగిపోతుంది ఈ పయనం.

భాన్‌గఢ్ పట్టణాన్ని చేరగానే... రెండు కిలోమీటర్ల దూరంలోని ఎత్తైన కొండపై అత్యద్భుతంగా కనిపిస్తుంది భాన్‌గఢ్ కోట. చారిత్రక వారసత్వ సంపదకూ, అలనాటి రాజఠీవీకి నిలువెత్తు నిదర్శనంలా ఉంటుందా కోట. అందులో ప్రతీదీ సుందర కళాఖండమే. ముఖ్యంగా అత్యంత ఎత్తులో ఉన్న రాయల్ ప్యాలెస్... రాచరికపు వైభవాన్ని చాటిచెబుతూ ఉంటుంది. ఇంత మంచి కోటను రాజస్థాన్ ప్రజలు మాత్రం భూత్ బంగళా, దెయ్యాల కోట అంటుంటారు. ఈ కోట దగ్గరే కాదు... భాన్‌గఢ్ పట్టణంలో కూడా జనం పెద్దగా నివసించరు. ఇందుకు బలమైన కారణాలున్నాయి.

భాన్‌గఢ్‌ కోట (Image credit - Wikipedia)

అల్వార్-జైపూర్ నగరాల మధ్య ఉన్న సరిస్కా టైగర్ పార్కును ఆనుకొని ఉంటుంది భాన్‌గఢ్ పట్టణం. ఎత్తైన కొండల మధ్య నిర్మించిన అందమైన పట్టణమిది. నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర దీని సొంతం. ఇక్కడ పెద్ద పెద్ద కట్టడాలు, బురుజులు, హవేలీలూ.... చారిత్రక ఆనవాళ్లుగా దర్శనమిస్తాయి. రెండు మార్గాల్లో కోట దగ్గరకు వెళ్లేందుకు వీలుంది. కోట లోపల పచ్చిక బయళ్లు, సెలయేర్లూ, తోటలూ, ప్రాచీన ఆలయాలూ... అడుగడుగునా విశేషాలే. ఇంత చక్కగా ఉన్నా... ఈ పట్టణంలో జనం అస్సలు కనిపించరు. ఎందుకు లేరని టూరిస్టులు ఎవరైనా అడిగితే... రకరకాల దెయ్యాల కథలు చెబుతారు అక్కడి వాళ్లు.

కోట ప్రాంగణంలో సోమేశ్వర ఆలయం, గోపీనాథ్, కేశవరాయ్, మంగళదేవి, హనుమాన్, గణేశ్ ఆలయాలున్నాయి. శతాబ్దాల కిందటి నిర్మాణ శైలినీ, అప్పటి కళా చాతుర్యాన్నీ ఇవి చాటిచెబుతాయి. చిత్రమేంటంటే... ఈ భారీ సౌధంలో ఎక్కడా... ఒక్క విగ్రహం కూడా కనిపించదు. ఆలయాలు ఉన్నా... వాటి నిర్మాణాల్లో ఎక్కడా విగ్రహాల రూపురేఖలు ఉండవు. వందల ఏళ్ల నాటి మర్రిచెట్లు ఈ కోటలో మరో ప్రధాన ఆకర్షణ. చిన్న చిన్న జలపాతాల్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ పర్యాటకులకు ఆనందాన్ని పంచేవే. 







Sariska National Park:
భాన్‌గఢ్ కోటకు దగ్గర్లో చూడదగ్గ ప్రాంతాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సరిస్కా నేషనల్ టైగర్ పార్కు (sariska national park) కచ్చితంగా చూడాల్సిందే. కోట నుంచీ 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పార్కు. ఇందులో సఫారీ మరచిపోలేని అనుభూతుల్ని మిగుల్చుతుంది. ఇక్కడ ఎలాంటి కంచెలూ అడ్డులేకుండా కళ్లముందే కదులుతూ వెళ్లే వన్యమృగాల్ని చూడొచ్చు. అవి వేటాడే దృశ్యాల్ని చూస్తే... ఎంతో థ్రిల్‌గా ఉంటుందంటారు టూరిస్టులు. ఈ పార్కులో కనిపించే పక్షులు కూడా చాలా అరుదైనవి. అంతా బాగానే ఉన్నా... కోట విషయమే ఆందోళన కలిగించే అంశం. ఇక్కడికి వెళ్లే టూరిస్టులంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఎవరైనా సరే.... సూర్యాస్తమయం కాకముందే... కోట, భాన్‌గఢ్ పట్టణం నుంచీ తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది. పొరపాటున కూడా చీకటి పడుతున్నప్పుడు, రాత్రిళ్లు అక్కడ ఉండకూడదు.





చిత్ర విచిత్రాలు:
నమ్మశక్యం కాని విషయమేంటంటే... ఈ కోటలో ఎప్పుడూ ఏదో ఒక చిత్రమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. వాతావరణం ఉన్నట్టుండి మారిపోతూ ఉంటుంది. రాత్రివేళల్లో ఏవేవో అరుపులూ, ఏడుపులూ వినిపిస్తుంటాయట. ఆ అరుపులు దెయ్యాలవే అని రాజస్థానీల నమ్మకం. అందుకే ఆసియాలోనే ఇది అత్యంత భయంకరమైన దెయ్యాల కోట అన్న ప్రచారం వందల ఏళ్లుగా జరుగుతోంది. కోట ప్రారంభంలో ఉండే నాట్య కళాకారిణుల ప్రాంగణం, పక్కనే ఉన్న జవహరి బజార్‌ ఏరియాలో ఎవరెవరో నడుస్తున్న శబ్దాలు, గజ్జెల చప్పుడు తాము విన్నామని అప్పుడప్పుడూ పర్యాటకులు చెబుతుంటారు.

రాత్రైతే ఈ పట్టణంలోకి చుట్టుపక్కల అడవుల్లోని జంతువులు వస్తుంటాయి. పైగా ఇక్కడ కరెంటు కూడా ఉండదు. వీటికి తోడు ఇక్కడ దెయ్యాల కథలపై విపరీతంగా దుమారం రేగడంతో... భారత పురావస్తు శాఖ రంగంలోకి దిగింది. సందర్శకుల రక్షణను దృష్టిలో పెట్టుకొని భాన్‌గఢ్ పర్యటనపై ఆంక్షలు విధించింది. ఎవరైనా సరే... ఉదయం ఆరు నుంచీ సాయంత్రం ఆరు వరకే... భాన్‌గఢ్ పట్టణంలో ఉండొచ్చు. సూర్యాస్తమయం కాగానే... పట్టణంలోకి వెళ్లే రూట్ల గేట్లను మూసేస్తారు. ఇదే విషయాన్ని వివరిస్తూ... ఇక్కడో నోటీస్ బోర్డు కూడా ఉంటుంది.

సాహసమే ఊపిరిగా బతికే కొంతమంది... రాత్రివేళ ఈ కోటలోకి వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. అలా వెళ్లేవాళ్లు... ఇక జీవితంలో తిరిగి రారని అంతా అంటుంటారు. పురావస్తు శాఖ నిబంధనల వల్ల ప్రస్తుతం ఎవరూ రాత్రివేళ ఈ కోటలోకి వెళ్లే ఛాన్స్ లేదు. అందువల్ల భాన్‌గఢ్ అందాలు చూడాలంటే... ఉదయం వేళల్లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.


కోట చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. అక్కడక్కడా శిథిలమైపోతున్నా... చూడ్డానికి పటిష్టంగానే ఉంటుంది. మరి ఈ దెయ్యాల గోలేంటి? ఎందుకు జనం భయపడుతున్నారు? రాత్రివేళ ఆ కోటలోకి వెళ్తే ఏమవుతుంది? చరిత్రలో ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

సహజంగానే ఇలాంటి పురాతన కట్టడాలపై నిశీధి నీడలు పడుతూనే ఉంటాయి. భాన్‌గఢ్‌ కూడా అందుకు అతీతమేమీ కాదు. కాకపోతే... ఈ కోటకు మాత్రమే పరిమితమైన కొన్ని చారిత్రక కథలున్నాయి. వాటి ప్రభావమే ఈ దెయ్యాల టెన్షన్. భాన్‌గఢ్ పట్టణాన్ని 1613లో నిర్మించారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ సర్వసేనాని మాన్‌సింగ్..... తన తమ్ముడైన మాధోసింగ్ కోసం ఈ కోటను కట్టించాడు. నాలుగు శతాబ్దాల కిందట ఈ కోట అత్యద్భుతంగా ఉండేది. అడుగడుగునా రాజఠీవీని ప్రదర్శిస్తూ... పాలకుల కీర్తి ప్రతిష్టల్ని నలుదిశలా చాటేది. మరి అలాంటి కోట... ఇప్పుడు దెయ్యాల కోటగా ఎందుకు మారిందన్నదానిపై ప్రధానంగా రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి.

పూర్వం ఈ కోట ప్రాంతంలో బాబా బాలక్ నాథ్ అనే సాధువు ఉండేవాడు. తాను తపస్సు చేసుకునేచోట కోటను నిర్మిస్తామనడం ఆయనకు నచ్చలేదు. అక్కడ కట్టే ఏ నిర్మాణమూ... తన ఇంటికంటే ఎత్తుగా ఉండకూడదని షరతు పెట్టాడు. ఏ భవనం నీడైనా తన ఇంటిపై పడితే... పట్టణం మొత్తానికీ గ్రహణం పడుతుందని శపించాడు. ఈ విషయాన్ని పాలకులు తేలిగ్గా తీసుకున్నారు. సాధువు ఇంటి చుట్టూ కూడా కోటను నిర్మించారు. ఫలితంగా శాపం అమలైంది. జనం లేనిపోని రోగాల బారిన పడ్డారు. ఊరు వల్లకాడైంది. అలా చనిపోయిన వాళ్లంతా దెయ్యాలయ్యారు. అందుకే ఈ కోట దెయ్యాలకు ఆవాసంగా మారిందన్నది ఓ నమ్మకం.

ఇక్కడ మరో రకమైన కథ కూడా ప్రచారంలో ఉంది. చేతబడి చేసే ఓ మంత్రగాడు... భాన్‌గఢ్ యువరాణి రత్నవతిని ప్రేమించాడు. 18 ఏళ్ల ఆమె... ఓ రోజు సెంటు బాటిల్ కొనేందుకు తన చెలికత్తెలతో షాపింగ్‌కి వెళ్లింది. అదిచూసిన మంత్రగాడు... తనే వ్యాపారిలా మారిపోయాడు. ఓ ఖరీదైన సెంటును ఆమెకు ఇచ్చి, ప్రేమ ఒలకబోశాడు. రత్నవతి చాలా తెలివైంది. అతను నిజమైన వ్యాపారి కాదని గ్రహించింది. వెంటనే అతన్ని సైనికులు బంధించారు. ఆమెను ప్రేమిస్తున్నట్లు మంత్రగాడు చెప్పడంతో రాజుగారికి కోపం వచ్చింది. బతికి ఉండగానే అతన్ని సమాధి చేయించాడు. చనిపోయేముందు మంత్రగాడు శపించాడు. తన చావుతో భాన్‌గఢ్ పట్టణం సర్వనాశనం అవుతుందన్నాడు. ఆ తర్వాత ఉత్తరాది నుంచీ వచ్చిన మొఘల్ చక్రవర్తులు... భాన్‌గఢ్‌పై దండెత్తారు. అప్పటి యుద్ధంలో యువరాణితోపాటూ... ఇక్కడ ఉండే పది వేల మంది జనం చనిపోయారు. వాళ్లంతా దెయ్యాలై, కోటలో తిరుగుతున్నారన్నది స్థానికుల విశ్వాసం.

దెయ్యాల భయంతో... భాన్‌గఢ్ జనం ఊరొదిలి వెళ్లిపోయారు. అందువల్ల శతాబ్దాలుగా ఈ పట్టణం మౌనంగా ఉండిపోయింది. 50 ఏళ్ల కిందటి వరకూ... ఈ కోట దగ్గరకు ఎవ్వరూ వెళ్లేవాళ్లే కాదు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోటపై దృష్టిసారించాయి. దీన్ని చక్కటి పర్యాటక కేంద్రంగా మార్చాలనుకున్నాయి. కాకపోతే... ఈ దెయ్యాల సెంటిమెంట్... అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఇక్కడ ఆత్మలు తిరుగుతున్నాయన్న భయం ఆధునిక అభివృద్ధి ఫలాల నుంచీ ఈ కోటను వెనక్కి నెట్టేస్తోంది. దీనిపై ఇప్పటికే చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి. భాన్‌గఢ్ పేరుతో ఏడేళ్ల కిందట ఓ చిన్న సినిమా వచ్చింది. ఆ హర్రర్ సినిమాలో పగటి పూట దృశ్యాల్ని ఈ కోటలోనే షూట్ చేశారు.





ప్రాచుర్యంలో ఎన్ని కథలున్నా... భాన్‌గఢ్‌లో దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరికితీరాలి. మరి ఎవరైనా ఆ దిశగా ప్రయత్నించారా? దెయ్యాలు లేవని గానీ, ఉన్నాయని గానీ నిరూపించారా? అసలు దెయ్యాలు ఉన్నాయి అనేందుకు ఏవైనా బలమైన సాక్ష్యాలున్నాయా? ఆ దిశగా ఓసారి విశ్లేషిద్దాం.

సాధారణంగా ఏదైనా పాజిటివ్ రెన్పాన్స్‌తో అందరి నోళ్లలో నానుతూ ఉంటుంది. ఈ కోట మాత్రం నెగెటివ్ రెన్సాన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ కోటను చూసేందుకు వచ్చే వాళ్లలో ఎక్కువ మంది... ఇది దెయ్యాల కోట అన్న ఉద్దేశంతోనే వచ్చామంటుంటారు.

ఈ కోటకు నాలుగు రకాల వాళ్లు వస్తుంటారు. పర్యాటకులు, పారానార్మల్ పరిశోధకులూ, చరిత్రకారులూ, స్థానికులు. వీళ్లలో పర్యాటకులూ, దెయ్యాల వేటగాళ్లు చెప్పే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. సందర్శకుల్లో కొంత మంది తాము దెయ్యాల్ని చూశామని చెబుతుంటారు. మరికొంతమందైతే... కోటలోని ఏ చీకటి దృశ్యాన్నో షూట్ చేసి... అదిగో అక్కడ దెయ్యం ఉంది అంటుంటారు. ఇక తుంటరోళ్లైతే... వాళ్లే దెయ్యాల్లా అరిచి, ఆ రికార్డుల్ని దెయ్యాల అరుపులుగా చెబుతుంటారు. ఇలాంటి సంఘటనలు కొన్ని వందల్లో ఉన్నాయి. ఒక్కదాన్నీ నిజమని నిరూపించే వీలు లేదు. పారానార్మల్ పరిశోధకులు కూడా అంతే. దెయ్యాల అరుపుల్ని రికార్డు చేసినట్లు చెబుతుంటారు. అవి స్పష్టంగా మాత్రం ఉండవు. నిజ నిర్ధారణ ముందు తేలిపోతాయి. ఫలితంగా ఇదో మిస్టరీగా మారింది.





దెయ్యాలు ఉన్నాయి అనేందుకు కొన్ని సంఘటనల్ని స్థానికులు ఉదాహరణలుగా చెబుతుంటారు. ఓసారి ఇద్దరు కుర్రాళ్లు... రాత్రివేళ రహస్యంగా ఈ కోటలోకి వెళ్లారట. వాళ్లు తిరిగి రాలేదు. రెండ్రోజుల తర్వాత వాళ్ల స్నేహితులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో... ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్లు ఏమయ్యారన్నది మిస్టరీగా మారింది. ఒకవేళ చనిపోయి ఉంటే... డెడ్‌బాడీలైనా దొరకాలిగా. అలాంటి ఆనవాళ్లేవీ లభించలేదు. పోనీ జంతువులేమైనా చంపి తినేశాయా అంటే... కనీసం రక్తపు మరకల ఆనవాళ్లు కూడా లేవట. ఇది ఎప్పుడు జరిగిందో కచ్చితంగా చెప్పట్లేదు ఎవరూ.

మరో ఘటనలో ముగ్గురు యువకులు టార్చిలైట్లతో కోటలోకి వెళ్లగా... వాళ్లలో ఒకడు... ఓ ఎండిపోయిన బావిలో పడ్డాడు. గాయాలపాలైన అతన్ని రాత్రివేళ కారులో తీసుకెళ్తుండగా... ఆ కారుకి యాక్సిడెంట్ అయ్యింది. అందులోని ముగ్గురూ చనిపోయారు. దెయ్యాలు వాళ్లను వెంటాడి, చంపాయన్నది స్థానికుల నమ్మకం. ఇది కూడా నిజంగా జరిగిందా అంటే ఆధారాలు లేవు. ఇలాంటి ఘటనల ప్రచారం మాత్రం తీవ్ర భయభ్రాంతులు కలిగిస్తోంది.

ఇక్కడ దెయ్యాలున్నట్లు ఒక్కటంటే ఒక్కటీ సరైన ఆధారం లేదు. జనం చూపించే వీడియోలు కూడా స్పష్టంగా లేవు. మొబైళ్లతో తీసిన వీడియోలు కూడా దెయ్యాల ఉనికిని చూపించట్లేదు. గ్రాఫిక్స్‌తో మార్ఫింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కానీ... జనంలో మాత్రం నమ్మకం బలంగా ఉంది. సైన్స్‌ని నమ్మే పరిశోధకులు చెబుతున్నదొకటే... ఈ కోటలో ఎలాంటి దెయ్యాలూ లేవు. ఉన్నదల్లా పావురాలు, గబ్బిలాలు మాత్రమే. వాటి అరుపులు, కూలిపోయేలా కనిపించే కోట గోడలే కాస్త భయం కలిగిస్తాయని చెబుతున్నారు.

రాత్రివేళ ఆరావళి నుంచీ వచ్చే జంతువుల అరుపుల్ని... దెయ్యాల అరుపులుగా జనం భ్రమపడుతున్నారని హేతువాదులు అంటున్నారు. ఓ మంచి పురాతన కట్టడాన్ని... దెయ్యాల కోటగా పిలుస్తూ... దాని ప్రాసస్థ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఒకింత బాధపడుతున్నారు. సాధారణంగా ఏ కోటనైనా ఎలా చూడాలో రూట్ మ్యాప్ ఉంటుంది. ఇది ప్రేతాల కోటగా చెబుతుండటంతో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పెద్దగా దృష్టి పెట్టట్లేదు. అందువల్ల ఇక్కడ ఎలాంటి గైడ్లూ ఉండరు. కనీస సదుపాయాలూ లేవు. దీనికి తోడూ తరచుగా కోతులూ, అప్పుడప్పుడూ చిరుతపులులూ, హైనాలూ కోటవైపు వస్తుంటాయి.

పర్యాటక ప్రేమికులకూ, పారానార్మల్ పరిశోధకులకూ, చరిత్రకారులకూ, సినీ పరిశ్రమకూ... భాన్‌గఢ్ కోట ఎన్నో విశేషాల్ని చెబుతోంది. ఎన్నెన్నో కథలు వినిపిస్తోంది. అక్కడికి వెళ్లొచ్చేవాళ్లంతా... మరపురాని అనుభూతిని పొందుతుంటారు. జీవితంలో ఒక్కసారైనా వెళ్లి తీరాల్సిందే అని చెబుతుంటారు. ప్రభుత్వాలు దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కనీస సదుపాయాలూ, కరెంటు సరఫరా కల్పిస్తే... కచ్చితంగా దెయ్యాల గోల పోతుంది. పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. చారిత్రక కట్టడాన్ని సంరక్షించినట్లూ అవుతుంది.


17, జులై 2021, శనివారం

Srilanka: బీచ్‌లు, సఫారీలు, బౌద్ధ క్షేత్రాలు, తేయాకు తోటలు... యుద్ధం విడిచి శాంతి గీతం ఆలపిస్తోందా?... శ్రీలంక

శ్రీలంక

Srilanka: చాలా సందర్భాల్లో ఇండియా మ్యాప్‌లో శ్రీలంక కూడా ఉంటుంది. కన్నీటి బొట్టులా కనిపించే ఈ దేశం... LTTE దాడుల నుంచీ విముక్తి పొంది... అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. చాలామందికి తెలియని విషయమేంటంటే... శ్రీలంకలో ఎన్నో టూరిస్టు స్పాట్‌లున్నాయి. కొన్నైతే... హిమాలయాల్ని తలపిస్తాయి. అందుకే శ్రీలంక సంగతులు, విశేషాలూ ఓసారి తెలుసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధాలయాలతో ఆకట్టుకుంటున్న శ్రీలంకలో పర్యటించేందుకు... ఓ ట్రైన్ జర్నీ ఎన్నో మధురానుభూతుల్ని మిగుల్చుతోంది. నిజమైన శ్రీలంకను చూసేందుకు అది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. అదెలాగో తెలుసుకుందాం.

శ్రీలంకను చూడటమంటే... దాదాపు మన దేశాన్ని చూడటం లాంటిదే. ఇండియాలో కనిపించే సంస్కృతులు, పాటించే విధానాలూ... ఇక్కడా కనిపిస్తాయి. ఐతే... ఎంతో కొంత వైవిధ్యం ఉంటుంది. అదే... ఈ దేశాన్ని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలబెడుతోంది. LTTE యుద్ధం 2009లో ముగియడంతో... శ్రీలంకలో ఇప్పుడు ప్రశాంత వాతావరణమే కనిపిస్తోంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ దేశం అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. 2015లో ప్రజాస్వామ్య దేశంగా మారాక... కొత్త అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేనను జనం... ఓట్లు వేసి ఎన్నుకున్నారు. ప్రస్తుతం గోటబయ రాజపక్స (Gotabaya Rajapaksa) అధ్యక్షుడిగా ఉన్నారు.





సిలోన్ అని ముద్దుగా పిలుచుకునే ఈ ద్వీపం... పర్యాటకులకు నిజంగా స్వర్గధామమే. దీన్ని చూసేందుకు ట్రైన్‌ను మించిన బెస్ట్ ఆప్షన్ లేదు. పర్యాటక ప్రాంతాలతోపాటూ... నిజమైన శ్రీలంక జనం జీవిత చిత్రాల్ని చూడాలంటే... రైలు బండి ఎక్కాల్సిందే. రాజధాని కొలంబో ఫోర్ట్ స్టేషన్ (Fort railway station) నుంచీ ఈ జర్నీ మొదలవుతుంది.

మన కరెన్సీతో పోల్చితే... శ్రీలంక రూపాయి కరెన్సీ విలువ తక్కువ. మన దగ్గర వెయ్యి రూపాయలు... అక్కడ 2వేల 666వందలతో సమానం. సో, ఈ జర్నీ చీప్‌ అండ్ బెస్ట్ అనుకోవచ్చు. కొలంబో నుంచీ రైలు... 9 గంటలపాటూ.... 270 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది రంబుక్కానా, కాండీ, పట్టిపోలా మీదుగా ఎల్లాకి వెళ్తుంది. లంకలో బ్రిటిషర్స్ వేసిన మొదటి రైల్వే లైన్ ఇది. దీన్ని మెయిన్ లైన్ అని పిలుస్తారు.

ట్రైన్ 54 కిలోమీటర్లు వెళ్లగానే... అంబక్కూసా వస్తుంది. 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఊరు అది. ఆ ఊరుకి వెళ్లే దారిలో కలానీ నదిని దాటే దృశ్యం చూడచక్కగా ఉంటుంది. శ్రీలంకలోని పొడవైన నదుల్లో ఇదీ ఒకటి. ఈ జర్నీ జనరల్ టికెట్ రేటు... మన కరెన్సీలో 120 రూపాయలు. ఫస్ట్ క్లాస్ అయితే... 650 రూపాయలు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న రైల్లో ప్రయాణించడాన్ని గర్వంగా ఫీలవుతారు లంకేయులు. బస్సులో కంటే... రైలు జర్నీనే ఎక్కువగా ఇష్టపడతారు.

శ్రీలంక సంపన్న దేశం కాకపోవడంతో... ఇండియాలాగే... ఇక్కడ కూడా... చదివిన చదువుకి తగిన ఉద్యోగాలు లేవు. ఏళ్లుగా వ్యవసాయమే ఇక్కడ ప్రధాన జీవనాధారం. ఈ దేశంలోని 21 శాతం పిల్లలకు సరైన పౌష్టికాహారం లేదు. సంపన్నులు, పేదల మధ్య గ్యాప్... ఎక్కువే. అందుకే... థర్డ్ క్లాస్‌ జర్నీ ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ట్రైన్‌లో గంటన్నర ప్రయాణించాక రంబుక్కానా స్టేషన్ వస్తుంది. ఇదో పర్యాటక ప్రాంతం.

ఇక్కడి పిన్నవాలా ఏనుగుల రక్షణ కేంద్రం (pinnawala elephant orphanage) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కేంద్రం నిర్వాహకులు రైలు ప్రమాదాల్లో దెబ్బతిన్న ఏనుగులు, అడవిలో గాయపడిన గజరాజులకు ఇక్కడ ప్రత్యేక ట్రీట్‌మెంట్ చేస్తారు. మాయో ఓయో నదిలో... ఏనుగులకు రోజూ స్నానం చేయిస్తారు. ఇలా చేస్తే అనారోగ్యంతో ఉన్న ఏనుగులకు వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు.

ప్రస్తుతం ఈ కేంద్రంలో 96 ఏనుగులున్నాయి. వీటిని దగ్గరగా చూసే పర్యాటకులకు పరమానందమే. గున్న ఏనుగులకు పాలు ఇచ్చి ఖుషీ అవుతారు. ప్రతీ పిల్ల ఏనుగూ... రోజుకు 7 లీటర్ల పాలు తాగుతుంది.

రంబుక్కానా స్టేషన్ దాటాక... ఈ ట్రైన్.... పల్లెలు, పట్టణాలు, కొండలు, సొరంగాల్లోంచీ వెళ్తుంది.

శ్రీలంకలో వజ్రాల పరిశ్రమ డెవలప్ అవుతోంది. ఇక్కడి స్వర్ణ కార్మికులు... వజ్రాల్ని సానపెట్టి... ఆభరణాలు తయారుచేస్తారు. టూరిస్టులకు ఇదో ప్రత్యేక అనుభవం. ఒక్కో కార్మికుడూ... నెలకు మన కరెన్సీలో అయితే... 15వేలు సంపాదిస్తాడు. అదే లంక కరెన్సీలో చెప్పాలంటే... 40 వేల రూపాయలతో సమానం.

రైలు మూడున్నర గంటల్లో... 130 కిలోమీటర్లు ప్రయాణించి... కాండీని చేరుతుంది. సింగళీయుల చారిత్రక రాజధాని ఈ కాండీ. ఎత్తైన ప్రదేశం కావడంతో... ఇక్కడి వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది.

శ్రీలంక జాతీయ పుష్పం... బ్లూ వాటర్ లిల్లీని ఇక్కడ అమ్ముతూ ఉంటారు. బుద్ధ భగవానుడికి దీన్ని సమర్పిస్తారు. ఇక్కడి శ్రీ దలదా మాలిగావా బౌద్ధాలయం (dalada maligawa buddha pujawa) స్థానికంగా ఫేమస్. ఈ క్షేత్రంలో బుద్ధుడి దంతాన్ని పదిలపరిచారు. ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ రోజూ 90 నిమిషాలపాటూ జరిగే పూజను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు.

పర్యాటకులు... బుద్ధుడి ప్రతి రూపానికి బదులు బంగారు పూతతో ఉన్న పగోడాను మాత్రమే ఈ ఆలయంలో చూడగలరు. ఇందులోనే బుద్ధుడి దంతాన్ని భద్రపరిచారు. ఈ ఆలయం వల్ల... కాండీ... యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరింది. నృత్య రీతులకు కూడా కాండీ గుర్తింపుపొందింది. ఒకప్పుడు కాండీ రాజులకు అనారోగ్యం వచ్చినప్పుడు... నర్తకీమణులు... నృత్యాలు చేసేవాళ్లు. 1932 నుంచీ ఆ నృత్యాల్ని ఇక్కడ పర్యాటకుల కోసం ప్రదర్శిస్తున్నారు.


శ్రీలంక అనగానే... అదో చిన్న ద్వీపం. గొప్పగా చెప్పుకునేంత విషయాలేవీ ఉండవు అక్కడ. అనుకుంటారు చాలా మంది. నిజమేంటంటే... తేయాకు ఎగుమతికి ఆ దేశం ఫేమస్. ఇంకా చాలా విశేషాలున్నాయి. రైల్లో వెళ్తూ... ఆ సంగతులు తెలుసుకుందాం.

ఎత్తైన కొండల్లోంచీ రైలు వెళ్తుంటే... ఆ దృశ్యం నయనమనోహరం. మెయిన్ లైన్ రైల్వే మార్గం... మరింత పైకి వెళ్తూ ఉంటుంది.

శ్రీలంకలోని ప్రధాన వ్యాపారాల్లో టెక్స్‌టైల్ బిజినెస్ ఒకటి. దీనిపై ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇండియాలో లాగానే... ఇక్కడ కూడా నేత కార్మికులకు నెలకు వచ్చే వేతనం 4వేల రూపాయలే. ఈ దేశ కరెన్సీలో చెప్పాలంటే... 10 వేలతో సమానం.

కొండలపై నుంచీ తేయాకును కొలంబోకి తరలించేందుకు బ్రిటీష్ వాళ్లు ఈ రైల్వే లైన్ వేశారు. ప్రస్తుతం 2వేల 2వందల చదరపు కిలోమీటర్ల భూభాగంలో తేయాకును సాగు చేస్తున్నారు. చాలా మందికి ఇది ఉపాధి కల్పిస్తోంది. ఇక్కడి తేయాకు కార్మికులు లంక కరెన్సీలో రోజుకు 250 రూపాయల దాకా సంపాదిస్తున్నారు. కార్మికులు సేకరించిన తేయాకును హల్ఫా టీ ఫ్యాక్టరీకి తరలిస్తారు. ఇక్కడ ఆకుల్ని ప్రాసెస్ చేసి... చిన్న, లేత ఆకుల్ని నాణ్యమైనవిగా గుర్తిస్తారు. ఆకు పెద్దదైతే... రెండో రకం కింద లెక్క. ఈ ఫ్యాక్టరీలో వంద మంది దాకా వర్కర్లు పనిచేస్తున్నారు. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. టీని ఎక్కువగా ఎగుమతి చేసే దేశాల్లో శ్రీలంక కూడా ఉంది.

ట్రైన్ నానూ-ఓయా స్టేషన్‌కు చేరుతుంది. లంకలో ట్రైన్‌..... స్టేషన్‌కి రాగానే... డ్రైవర్‌కి ఓ టోకెన్ ఇవ్వడం పరిపాటి. తద్వారా నెక్ట్స్ స్టేషన్‌కి వెళ్లేందుకు ఆ డ్రైవర్‌కి అనుమతి ఇచ్చినట్లవుతుంది. పైగా... టోకెన్ ఇవ్వడం ద్వారా... ఆ మార్గంలో ఎలాంటి ఇబ్బందులూ లేవని చెప్పినట్లే. బ్రిటీష్ కాలంలో... నానూ-ఓయాలో హార్స్ రేసులు జరిగేవి. ప్రస్తుతం అవి లేవు. ఐతే... అప్పటి గోల్ఫ్ క్లబ్ మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది.

కొండలూ, కోనల్లోంచీ ప్రయాణిస్తూ... ట్రైన్... పట్టిపోలను చేరుతుంది. 1891 మీటర్ల ఎత్తులో... కూల్‌గా ఉంటుంది ఈ స్టేషన్. ఇక్కడ అత్యంత ఎత్తైన ప్రాంతం 1898 మీటర్లపైన ఉంటుంది. మంచు కురుస్తూ ఆహ్లాదం కలిగిస్తుంది. బ్రాడ్ గేజ్ రైల్వే అత్యంత ఎత్తులో ఉన్న ప్రదేశం ఇదే. ఈ కారణంగా ఇది గిన్నిస్ బుక్‌లో చేరింది. కొలంబో నుంచీ 224 కిలోమీటర్ల దూరంలో ఉందీ ప్రదేశం. ఈ ఏరియాలో ప్రకృతిసిద్ధ స్పాలు ఉంటాయి. మసాజ్ చేయించుకునేవారికి ఇదో విరామ కేంద్రం. తాము చేసే మసాజ్.... శరీరంలో 107 భాగాలపై ప్రభావం చూపిస్తుందని, చాలా ఎనర్జీ వస్తుందనీ చెబుతుంటారు థెరపిస్టులు.

ట్రైన్ జర్నీ చివరి స్టేషన్ ఎల్లాకు చేరుతుంది. ఈ మెయిన్ లైన్ రైల్వేను యునెస్కో... హెరిటేజ్ రైల్వే లైన్‌గా గుర్తించింది. 9 గంటల్లో టూరిస్టులు... మరో ప్రపంచాన్ని చూసేందుకు ఈ లైన్ చక్కగా ఉపయోగపడుతుంది.


ట్రైన్ జర్నీతోపాటూ శ్రీలంకలో టాప్ 5 టూరిస్ట్ స్పాట్‌లు తప్పకచూడాలి. ప్రపంచానికి తెలియని ఎన్నో అద్భుత ప్రదేశాల్ని తనలో దాచుకుంది శ్రీలంక. బౌద్ధ ఆరామాలు, బ్రిటీష్ సంస్కృతి, ఫారెస్ట్ సఫారీ ఇలా... ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. వాటిలో టాప్ 5లో ఉన్న టూరిస్ట్ ప్లేస్‌లను ఇప్పుడు తెలుసుకుందాం.





Yala National Park:
చుట్టూ అడవి... అందులో జంతువుల్ని దగ్గర నుంచీ చూడటం... లైఫ్‌లో మర్చిపోలేని థ్రిల్. ఆ అనుభూతి కలిగించేందుకు శ్రీలంకలో చాలా నేషనల్ పార్కులున్నాయి. వాటిలో యాలా సఫారీ ప్రత్యేకమైనది. ఇది ఆఫ్రికా... కెన్యాలో లాంటి బెస్ట్ సఫారీ కాకపోయినా... ఇందులో కూడా ఏనుగులు, చిరుతలూ, జింకలూ, ఇతరత్రా ప్రాణులు కనిపిస్తాయి. యాలా సఫారీకి ఓ రోజంతా కేటాయించాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే... అన్ని ఎక్కువ జంతువుల్ని చూసే వీలు కలుగుతుంది.





Dambulla Cave Temple:
దంబుల్లాలో... బౌద్ధ గుహాలయాలు ప్రాచీనమైనవి. పక్కపక్కనే ఉండే 5 గుహల్లో రంగురంగుల రాతి విగ్రహాలు ఆకట్టుకుంటాయి. వాటిలో ఒకటి... 2 వేల ఏళ్ల నాటిది. 5 గుహల్లో... పెద్ద గుహలో... నిటారుగా ఉన్న 16 విగ్రహాలుండగా... మరో 40 వాలినట్లుగా ఉన్నాయి. బుద్ధుడి జీవిత కథను చెబుతూ... రకరకాల భంగిమల్లో ఈ ప్రతిమలున్నాయి. ఈ గుహల సీలింగ్స్‌పై రకరకాల పెయింటింగ్స్ ఉంటాయి. శతాబ్దాలుగా అవి వెలిసిపోకుండా ఉండటం విశేషం. బయటి వాతావరణం వేడిగా ఉన్నా... గుహల లోపల మాత్రం చల్లగా ఉంటుంది. ప్రశాంత తత్వం, భక్తిభావం వెల్లివిరుస్తుంది.





Sigiriya Rock Fortress:
సిగిరియా రాతి కోట. నిజానికి ఇదో అగ్నిపర్వత లావా వల్ల ఏర్పడిన కొండ. ఐదో శతాబ్దంలో అప్పటి రాజు దీన్ని కోటలా మలిచాడు. దీనిపై సైనిక బలగాల్ని మోహరించాడు. ఈ కోట రాతి గోడలపై... పెయింటింగ్స్ ఆకట్టుకుంటాయి. మెట్ల మార్గంలో పైకి వెళ్లడం కష్టంగా అనిపించినా... పైకి వెళ్లాక అద్భుతంలా అనిపిస్తుంది. ఇక్కడి రాతిపై చెక్కిన భారీ సింహపు విగ్రహం ప్రస్తుతం లేకపోయినా... దాని పంజాలను బట్టీ... అది ఎంత పెద్దగా ఉండేదో ఊహించుకోవచ్చు.





Ancient City of Polonnaruwa:
పొలొన్నరువా... ఇదో ప్రాచీన బౌద్ధ నగరం. ప్రస్తుతం శిథిలమై... అలనాటి బౌద్ధ ప్రాసస్థ్యాన్ని చాటిచెబుతోంది. ఇప్పటి రాజధాని కొలంబో అయినా... వెయ్యేళ్ల కిందట... పొలొన్నరువాయే... రాజధాని. అప్పటి రాజు ఒకటో విజయబాహు... ఈ నగరాన్ని అద్భుతంగా మలిచాడు. ఒక్కసారి ఈ నగరంలోకి వెళ్లి చూస్తే.... అప్పట్లో ఇది ఎంత గొప్పగా ఉండేదో అర్థమవుతుంది. దీన్ని పరిరక్షించే ఉద్దేశంతో... యునెస్కో... ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.





Bentota Turtle Sanctuary:
శ్రీలంకలో తాబేళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2004లో సునామీ తాకిడికి... చాలా తాబేళ్లు చనిపోయాయి. అప్పటి నుంచీ... తాబేళ్ల సంరక్షణకు చాలా కేంద్రాలు వెలిశాయి. వాటిలో బెంటోటా టర్టిల్ శాంక్చురీ గురించి చెప్పుకోవాల్సిందే. శ్రీలంక నైరుతీ సముద్ర తీరాన... ఈ సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ తాబేళ్లను పెంచడమే కాదు. వాటి గుడ్లను కూడా సేకరిస్తారు. స్థానికులు తాబేళ్ల గుడ్లను రెస్టారెంట్లలో అమ్మనివ్వకుండా... వాటిని వీళ్లే కొంటారు. అవి పిల్లలయ్యేలా చేస్తారు. అలా... పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతోంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు కూడా విరాళాలు ఇస్తూ, వాలంటీర్లుగా పనిచేస్తూ.... తాబేళ్ల సంఖ్యను పెంచేందుకు సాయపడుతున్నారు.

మనకు చాలా దగ్గర్లో ఎన్నో పర్యాటక ప్రదేశాలతో ఆకట్టుకుంటోంది శ్రీలంక. పైగా... అక్కడ కరెన్సీ విలువ కూడా తక్కువ కావడంతో... ఎక్కువ ఖర్చుపెట్టకుండానే... ఎన్నో ప్రదేశాల్ని చూసి రావచ్చు. అందుకే భారతీయులకు ఇదో హాట్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారుతోంది.

16, జులై 2021, శుక్రవారం

Mystic Temples: ఆ విగ్రహం అలకపాన్పు ఎక్కిందా? ఆ గుళ్లోకి వెళ్తే చనిపోతారా? ఆలయాలు - రహస్యాలు!

ఆలయాలు - రహస్యాలు!


మన దేశం ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనంత... పురాతన వారసత్వ సంపద మన సొంతం. చాలా ఆలయాల చరిత్ర, విశిష్టతల గురించి మనందరికీ ఎంతో కొంత తెలుసు. ఐతే... ఇప్పటికీ కొన్ని టెంపుల్స్‌లో అంతుపట్టని రహస్యాలు చాలా ఉన్నాయి. అవేంటో, ఎందుకో తెలుసుకుందాం.

మనందరం... కంచి నుంచీ... కాశ్మీర్ వరకూ... ఎన్నో ఆలయాలకు వెళ్తుంటాం. దైవ దర్శనం తర్వాత... కాసేపు అక్కడే ఉండి... ప్రసాదం స్వీకరించి... తిరిగి వెళ్లిపోతాం. ఐతే... ఆ టెంపుల్స్ వెనక చాలా రహస్యాలుంటాయి. ఆ మిస్టరీలు ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ ప్రపంచంలో... మనది భక్తి-భావ ప్రపత్తుల దేశం. 64 కోట్ల దేవుళ్లు, దేవతలు నడయాడే పవిత్ర భూమి. అందుకే... ప్రతీ వీధిలో ఓ గుడి ఉంటుంది. ఐతే... అన్ని గుళ్లూ ఒకేలా ఉండవు. కొన్ని వైవిధ్యంగా, ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్నింటి చరిత్ర నమ్మశక్యం కాదు కూడా. అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది వాటి విశేషాలు తెలుసుకుంటే. ఇంకొన్ని గుళ్లైతే... వాటిలో జరిగే ఆచారాలు, సంప్రదాయాల్ని చూసి ముక్కున వేలేసుకుంటాం. ఇవన్నీ ఒక ఎత్తైతే... 2వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న... పురాతన ఆలయాల ప్రాసస్థ్యం అంతా ఇంతా కాదు.

Mahendipur Balaji Temple, Rajasthan:
"దెయ్యాలూ, భూతాలూ, పిశాచాలూ, చేతబడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చెయ్యాలి" అని రాజస్థాన్ జనాన్ని అడిగితే... వాళ్లు చెప్పే సమాధానం... మహేందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్లమని. దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్. రోజూ వేల మంది భక్తులు అక్కడకు వెళ్తుంటారు. వాళ్లు చూపించే భక్తి... భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు. ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరైతే... గొలుసులతో కట్టేసుకుని... తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇదంతా ఎందుకంటే... తమను దెయ్యాలు వదిలిపోవాలి అంటారు. పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు. అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచీ వెళ్లిపోయేటప్పుడు... వెనక్కి తిరిగి చూడకూడదట. అలా చూస్తే... దెయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట. ఇది నిజమా, కాదా అంటే... ఎవరి నమ్మకాలు వాళ్లవి.

 

కొడుంగల్లూర్ భగవతీ ఆలయం (image credit - Wikipedia)

Kodungallur Bhagavathy Temple, Kerala:
సాధారణంగా మనం దేవుణ్ని కీర్తిస్తాం. అదే ఈ టెంపుల్‌కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కొడుంగల్లూర్ భగవతీ ఆలయం ప్రత్యేకత ఇది. ఏటా ఇక్కడ 7 రోజులపాటూ ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైమ్‌లో భక్తులు...  కత్తులతో ఎంటరవుతారు. తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా కారుతుంది. అలాగే గుళ్లోకి వెళ్తారు. భద్రకాళీ అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్ల దండకమే కాదు... భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు. అక్కడితో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ... గుడిపైకి రాళ్లు విసురుతారు. ఏటా రాళ్లతో కొడుతుండటం వల్ల ఆలయం దెబ్బతింటోంది. ఇక్కడ పూజా-కైంకర్యాలు, కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు. 7 రోజుల ఉత్సవాల తర్వాత... వారం పాటూ ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైమ్‌లో... రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు.

Stambheshwar Mahadev Temple, Gujarat:
అప్పుడప్పుడూ మాయమై... తిరిగి కనిపించే టెంపుల్‌కి వెళ్లాలనుకుంటున్నారా? ఐతే... గుజరాత్.. వడోదరలోని స్తంభలేశ్వర్ మహదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి. అరేబియా సముద్ర తీర జలాల్లో ఉందీ గుడి. ఇక్కడి ఈశ్వరుడు... ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చేవాళ్లను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం. సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం. పెద్ద అలలు వస్తున్నప్పుడు... ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వత తిరిగి కనిపిస్తుంది. ఈ ప్రత్యేకతే ఈ గుడిని ఫేమస్ టెంపుల్‌గా మార్చేసింది.

Tirumala Temple:
మన తెలుగువారి తిరుమల టెంపుల్‌ కూడా ప్రత్యేకమైనదే. పూజలు, భక్తజన సందోహం ఇవన్నీ ఒక ఎత్తు. కేశ సంపద మరో ఎత్తు. రోజూ ఈ ఆలయంలో 60 వేల మంది దాకా తలనీలాల రూపంలో మొక్కు చెల్లిస్తున్నారు. అందువల్ల ఏటా వందల టన్నుల కొద్దీ జుట్టు పోగవుతోంది. దీన్ని ఈ-వేలంలో అమ్మితే... TTDకి 300 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. తిరుమలలో హుండీ ఆదాయం తర్వాత... ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే. టీటీడీ నుంచీ... ఈ జుట్టు విదేశాలకు వెళ్తోంది. ఎక్కువగా అమెరికా, ఇటలీ, చైనాకు ఎక్స్‌పోర్ట్ అవుతోంది. అక్కడి విగ్గుల కంపెనీలు ఈ హెయిర్‌తో విగ్స్ తయారుచేస్తున్నాయి. చైనాలో విగ్స్‌తోపాటూ... ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా జుట్టును వాడుతున్నారు. మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేశాల్ని... బాలీవుడ్ స్టార్స్ కోసం విగ్స్ తయారుచేస్తున్నారు.
పుష్కర్ లోని బ్రహ్మ ఆలయం (image credit - Rajasthan)

Brahma Temple, Pushkar, Rajasthan:
హిందూ పురాణాల ప్రకారం... త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు... ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయం. అదే... రాజస్థాన్‌... పుష్కర్ లోని బ్రహ్మ ఆలయం. క్రీస్తు శకం పద్నాలుగో శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఔరంగజేబు... మన దేశాన్ని పాలించిన సమయంలో... చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా పుష్కర్‌లో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఐతే... బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబు అనుచరులెవరూ దాన్ని టచ్ చెయ్యకపోవడం విశేషం. పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు... భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన... వెండి నాణేలు అమర్చారు. ఈ టెంపుల్, దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందన్నది భక్తుల మాట.

మన దేశంలో ఏ పర్యాటక ప్రాంతానికి వెళ్లినా... అక్కడ తప్పనిసరిగా ఆలయాలుంటాయి. కొన్ని సందర్భాల్లో... ఆలయాల వల్లే... పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. అలాంటి ఆలయాల విశేషాల్ని తెలుసుకుందాం.

Rat Temple, Rajasthan:
రాజస్థాన్‌... బికనూర్‌కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ చిత్రమైన గుడి. అదే... దేష్నాక్‌లోని కార్నీ మాత టెంపుల్. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే... ఎలుకల్ని పూజిస్తారు. దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్నీ మాతను... ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడి భక్తజనం. అందుకే ఈ ఆలయంలో... ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. భక్తులు వాటికి పాలు, ఇతర ప్రసాదాలు పెడతారు. బికనూర్ పర్యటనకు వెళ్లే టూరిస్టులు... తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే... ఎలుకలకు పూజ చెయ్యడమన్నది అరుదైన విషయం. చాలా మంది వాటిని వీడియోలు తీసుకుంటారు. పాలచుట్టూ... రౌండ్‌గా మూగి... రాట్స్.... మిల్క్ తాగుతుంటే... ఆ దృశ్యాల్ని మొబైల్ కెమెరాల్లో బంధిస్తారు.

Kal Bhairav Nath Temple, Varanasi:
ఏ గుళ్లోనైనా స్వీటో, హాటో ప్రసాదంగా పెడతారు. ఈ టెంపుల్‌లో మాత్రం... మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. పవిత్ర క్షేత్రం వారణాసిలో... శివుడి ప్రతిరూపమైన కాల భైరవనాథ్ ఆలయం ఇది. ఇక్కడ నైవేద్యం సహా... దేవుడికి సమర్పించే ప్రతీదాన్నీ... మద్యంతోనే తయారుచేస్తారు... అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు, స్వీట్ల వంటివి అమ్మడం కామన్. ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్లినా మద్యమే అమ్ముతారు.

China Kali Temple, Kolkata:
కోల్‌కతాలోని తాంగ్రాలో... చైనాటౌన్ ఉంది. దానికి ఆ పేరు రావడానికి కారణం... అక్కడ ఉండేవాళ్లలో చైనీయులే ఎక్కువ. వాళ్లు... కాళీమాతను పూజిస్తారు. అందుకే... ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అనే పేరు వచ్చింది. మనమైతే... అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోరో, స్వీటో పెడతాం కదా. చైనీయులు... నూడుల్స్, చాప్‌సుయ్ లాంటివి పెడతారు. అదే ఈ ఆలయం స్పెషాలిటీ.

Kadu Malleshwara Temple, Bangalore:
బెంగళూరులో కాడు మల్లేశ్వరస్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటోంది. 1997లో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది. దాని నోటి నుంచీ నీటి ప్రవాహం వస్తుండటం ఆశ్చర్యం కలిగించింది. మరింత తవ్వగా... ఓ నీటి కొలను కూడా బయటపడింది. అప్పటి నుంచీ... ఆలయ రూపురేఖల్ని మార్చారు. నంది నోటి నుంచీ వచ్చే నీరు... శివలింగం పై పడి... ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. ఐతే... నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచీ వస్తుందో తెలియలేదు. ఈ నీరే... ఇక్కడున్న విషభవతి నదికి జీవ జలం అని నమ్ముతారు స్థానికులు.

Hadimba Temple, Manali, Himachal Pradesh:
మంచుకురిసే మనాలీలో... ప్రత్యేక ఆలయం ఈ హడింబా టెంపుల్. 4 అంతస్థుల ఈ ఆలయం... పగోడా ఆకారంలో ఉండటమే విశేషం. ఈ చుట్టుపక్కల ఎక్కడా... ఆ మాటకొస్తే... మన దేశంలోనే ఇలాంటి ఆలయాలు అరుదు. తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడా నిర్మాణ శైలి... ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయంలో హడింబా దేవి కొలువుదీరి ఉంటుంది. రాక్షసుడైన హడింబా చెల్లెలు ఈమె. కుల్లు రాజులు... హడింబా దేవిని ఇష్టదైవంగా పూజించేవాళ్లు. ఐతే... అమ్మవారి కంటే... నిర్మాణశైలి వల్లే ఈ ఆలయం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Brihadeeswara Temple, Tamil Nadu:
అద్భుత కళా నైపుణ్యం... తమిళనాడు... తంజావూర్‌లోని... బృహదీశ్వరాలయం సొంతం. ఈ టెంపుల్‌లో ఎక్కువ భాగం... శుద్ధమైన గ్రానైట్‌తో నిర్మించారు. ఇదే సైంటిస్టులకు సవాలు విసురుతోంది. ఎందుకంటే... ఈ ఆలయానికి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకూ... గ్రానైట్ నిక్షేపాలు, ఆనవాళ్లూ లేవు. ఎప్పుడో వెయ్యేళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కడి నుంచీ గ్రానైట్ తీసుకొచ్చారు? ఎలా తెచ్చారు? అన్నది ఆశ్చర్యకరం. ముఖ్యంగా గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది. ఏ క్రేన్లూ లేకుండా.... ఆ భారీ శిలను, అంత ఎత్తుకి ఎలా చేర్చగలిగారన్నది అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది.

ఎప్పుడో శతాబ్దాల కిందట నిర్మించిన ఆలయాలు... ఇప్పటికీ సైన్స్‌కి అందని నిగూఢ రహస్యాల్ని తమలో దాచుకున్నాయి. కొన్ని ఆలయాల్లో విగ్రహాలు, కొన్ని ఆలయాల నిర్మాణ శైలి... నేటి ఆధునిక సాంకేతికతకు అంతుచిక్కని మిస్టరీలుగా మిగిలిపోయాయి. అలాంటి మరికొన్ని తెలుసుకుందాం.
బుద్ధ నీలకంఠ ఆలయంలో విష్ణుమూర్తి (image credit - wikipedia)

Buddha neelakanta kathmandu, Nepal:
ఇది బుద్ధ నీలకంఠ ఆలయం.... పేరులో బుద్ధ ఉన్నా... నిజానికి ఇది మహా విష్ణువు వెలసిన ఆలయం. బుద్ధ నీలకంఠ అంటే... పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థం. ఇది నేపాల్‌లోని ఖాట్మండ్ లోయలో ఉంది. ఈ ఆలయంలో త్రిమూర్తులలో ఒకడైన శ్రీమహావిష్ణువు... ఆదిశేషుడి పైన శయన మూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం... 5 మీటర్ల పొడవైన రాతిలో చెక్కివుంది. సహజంగా విష్ణువు శయన మూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉండే మూర్తుల్ని మనం చూస్తుంటాం. ఇక్కడ మాత్రం స్వామి... వెల్లకిలా పడుకొని, నింగివైపు చూస్తుంటాడు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే... ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది. భక్తులతోపాటూ... పరిశోధకుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం... 1957లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం... 1300 సంవత్సరాల నుంచీ నీటిలో తేలుతోంది.  ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే, పరిశోధకులు మాత్రం... సైంటిఫిక్ కారణం చెప్పలేకపోయారు.
బుల్లెట్ దేవుడు (image credit - wikipedia)

Bullet Deity, Rajasthan:
మన దేశంలో సహజంగా విగ్రహాల్నీ, ఆవుల్నీ, చెట్లనూ, వానరాల్నీ పూజించడం కామనే. బుల్లెట్‌ని దేవుడిలా భావించడం ఎక్కడైనా చూశామా. ఆ వింత గుడి... రాజస్థాన్‌లోని జోధపూర్‌లో ఉంది. ఇక్కడి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను భక్తులు పూజిస్తారు. లిక్కర్‌ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే, రోడ్డు ప్రమాదాలు జరగకుండా... దేవుడు కాపాడతాడని ఈ గ్రామస్థుల నమ్మకం. దీని వెనక ఓ నమ్మశక్యం కాని కథ ఉంది. ఈ బైక్ నడిపిన బన్నా... ఈ గుడి ఉన్న ప్లేస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పోలీసులు బైక్‌ని తీసుకెళ్లి... స్టేషన్‌లో పెట్టుకున్నారు. ఐతే... తెల్లారేసరికి... ఈ బైక్... తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్‌లో కనిపించింది. షాకైన పోలీసులు... మళ్లీ బైక్‌ని తీసుకెళ్లి... ఈసారి గొలుసులతో కట్టేశారు. అయినా అంతే... నెక్ట్స్ డే... ఈ బైక్... ప్రమాదం జరిగిన ప్లేస్‌లోనే ఉంది. ఇలా చాలాసార్లు జరగడంతో... విసుగొచ్చిన పోలీసులు... దీన్ని ఇక్కడే వదిలేశారట. జనం ఈ బైక్‌ని పూజిస్తూ... బుల్లెట్ బాబా గుడి కట్టేశారు.

Hazrat qamar ali darvesh, Maharashtra:
సైన్స్ కారణం చెప్పలేకపోయిన మరో విశేషం... ఓ బండరాయి. మహారాష్ట్ర... శివపురిలోని హజ్రత్ ఖమర్ అలీ దర్వేష్ దర్గాలో ఉంది ఆ స్టోన్. ముంబైకి 16 కిలోమీటర్ల దూరంలో... పుణె శివార్లలో ఆ దర్గా ఉంది. దానికి ఏ ప్రత్యేకతా లేదుగానీ... అక్కడున్న రాయి మాత్రం ప్రపంచ గుర్తింపు పొందింది. కారణం... దానితో ముడిపడివున్న అంతుబట్టని మిస్టరీయే. 90 కేజీల ఆ రాయిని... ఒకవైపు పట్టుకొని ఎత్తడం ఎవరివల్లా కావట్లేదు. అదే 11 మంది కలిసి... చుట్టూ మూగి... చూపుడు వేళ్లతో ఎత్తితే మాత్రం... ఈజీగా లేస్తుంది. ఇలా ఎందుకో సైంటిస్టులు చెప్పలేకపోయారు. ఓ సాధువు... ఇచ్చిన వరం వల్లే ఇలా జరుగుతోందని స్థానికుల నమ్మకం.

Nidhi Van, Uttar Pradesh:
కొన్ని కొన్ని విషయాల్ని నమ్మాలో, వద్దో కూడా అర్థం కాదు. ఇది అలాంటిదే. ఉత్తరప్రదేశ్‌లోని బృదావనంలో ఉంది నిధివనం రంగ మహల్ టెంపుల్. ఈ ఆలయంలోకి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని, రాసలీలలు ఆడతారని స్థానికుల నమ్మకం. అందుకే... సూర్యాస్తమయం తర్వాత ఈ టెంపుల్‌ని మూసేస్తారు. ఆలయ పరిసరాల్లోకి ఎవ్వర్నీ అనుమతించరు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ టెంపుల్‌లోకి వెళ్తే... వాళ్లు చనిపోతారనీ లేదంటే వాళ్లకు చూపు, మాట, వినికిడి శక్తి పోతుందని ప్రచారం జరుగుతోంది. నిధివనంలో ఉండే చెట్లు... మెలికలు తిరిగి... చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి. ఇక్కడి నేలంతా పొడిగా ఉన్నా... ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయి. వీటిని చూసిన వాళ్లకు సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటివరకూ రాత్రి వేళ టెంపుల్‌లోకి ఎవర్నీ అనుమతించలేదు. అందువల్ల... నిధివనం మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై బాలీవుడ్‌లో హర్రర్ సినిమాలు కూడా వచ్చాయి.

Jwala devi temple, Himachal Pradesh:
హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో... జ్వాలా దేవి ఆలయం ఉంది. పరమశివుడి భార్య సతీ దేవి ఆలయం ఇది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే... ఆలయ ప్రాంగణలో ఉండే జ్వాల... వందేళ్లుగా వెలుగుతూనే ఉంది. దానికి ఇంధనంగానీ, నూనె గానీ పోయకుండానే... జ్వలిస్తోంది. దీని వెనక ఓ కథ ప్రచారంలో ఉంది. సతీదేవి తండ్రి... శివుణ్ని తిరస్కరించడంతో... మనస్థాపం చెందిన సతీదేవి సూసైడ్ చేసుకుంది. శ్రీమహావిష్ణువు ఆమె దేహాన్ని 51 ముక్కలుగా చేయగా... అవి భూమిపై వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయి. సతీ దేవి నాలిక... ఇక్కడ పడి... అదే జ్వాలగా వెలుగుతోందని స్థానికుల విశ్వాసం. ఈ మిస్టరీని ఛేదించేందుకు చాలా హేతువాద సంస్థలు ప్రయత్నించి చేతులెత్తేశాయి.

Veerabhadra temple, Andhra Pradesh:
ఆంధ్రప్రదేశ్... అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వామి టెంపుల్ కూడా మిస్టరీ లిస్టులో చేరింది. అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి పెట్టింది పేరు ఈ లేపాక్షి టెంపుల్. ఐతే... ఇక్కడి వేలాడే స్తంభం ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయంలో 70 స్తంభాలున్నాయి. ప్రాంగణంలో ఉండే ఈ ఒక్కటి మాత్రం 80 శాతం గాల్లో వేలాడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీన్ని నిరూపించేందుకు చాలా మంది దీని కింద నుంచీ క్లాత్‌ని పోనిస్తున్నారు. పైన ఎలాంటి సపోర్టూ లేకుండా... భూమిని 20 శాతమే టచ్ చేస్తూ... ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా... నిలబడగలగటం... మిస్టరీగా మారింది.

ఇవే కాదు... ఇంకా చాలా ఆలయాల్లో మనకు తెలియని చరిత్ర, సైన్స్ దాగివుంది. అపార సంస్కృతి, చారిత్రక వారసత్వ సంపద మన సొంతం. ఆ ఆలయాల వైశిష్ట్యతను కాపాడటం మనందరి బాధ్యత.

13, జులై 2021, మంగళవారం

Madagascar: స్వర్గానికి బ్రాంచ్ ఆఫీస్! దేవతలకు డెస్టినేషన్! కళ్లు చెదిరే అందాల లోకం! మడగాస్కర్!

మడగాస్కర్

అదో అద్భుత దీవి. కోట్ల సంవత్సరాల కిందట భారత దేశం నుంచీ విడిపోయింది. ఆఫ్రికా ఖండం ఆగ్నేయ భాగాన్ని చేరింది. అక్కడే ఉండిపోయింది. భూమిపై ఎక్కడా లేని చిత్రమైన వాతావరణం, విచిత్రమైన జీవరాసులతో ఆకట్టుకుంటోంది. అదే మడగాస్కర్ దీవి. ఆ దీవి విశేషాలు, ఎందుకు అక్కడ వైవిధ్యభరిత వాతావరణం ఏర్పడిందో తెలుసుకుందాం.

సాధారణంగా దీవుల్లో... చెట్లు, పుట్టలూ తప్ప... ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండవు. మడగాస్కర్ మాత్రం అలాంటిది కాదు. పశ్చిమ భారతదేశంలోని భౌగోళిక లక్షణాలు... మడగాస్కర్‌లో కనిపిస్తాయి. ప్రపంచంలో మరెక్కడా చూడని ప్రాణికోటి అక్కడుంది. అందుకే అది చాలా హాలీవుడ్ సినిమాలకు షూటింగ్ స్పాట్ అయ్యింది.

విశాల మైదానాలు, దట్టమైన అడవులు, ఎడారులు, అగ్ని పర్వతాలు, రహస్య నదులు, జలపాతాలు, సముద్ర తీరాలు, ఆకాశమంత చెట్లు, అరుదైన జంతుజాలం, మరో ప్రపంచాన్ని తలపించే పర్యావరణం, ఇలాంటి అరవిరిసిన ప్రకృతి అందాల నెలవు మడగాస్కర్.

హిందూ మహాసముద్రంలో ఇదో అద్భుత ద్వీప దేశం. ఆఫ్రికా ఖండానికి ఆగ్నేయ తీరంలో ఉంది. ప్రపంచంలో ఇది నాలుగో పెద్ద దీవి. అందుకే... ప్రపంచంలోని జంతుజాలంలో 5 శాతం ఇందులో ఉన్నాయి. ఈ వైవిధ్యమే ఈ దీవికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.

ఈ దీవి ఆవిర్భావం ఓ ప్రకృతి వింత. ఎప్పుడో... 9 కోట్ల సంవత్సరాల కిందట... భారత ద్వీపకల్పం నుంచీ మడగాస్కర్ విడిపోయింది. అది హిందు మహా సముద్రంలో కొట్టుకుపోయి... ఆఫ్రికా ఆగ్నేయ తీరాన్ని చేరింది. కోట్ల సంవత్సరాలు మిగతా ప్రపంచంతో సంబంధం లేకపోవడంతో... ఈ దీవిలో ప్రత్యేక జీవులు పుట్టుకొచ్చాయి. అరుదైన వృక్ష జాతులు పెరిగాయి. అందుకే ఇక్కడ కనిపించే 90 శాతం జీవులు... ప్రపంచంలో మరెక్కడా కనిపించవు.



చరిత్ర:
మిగతా ప్రపంచంలాగే... ఇక్కడా రాచరిక పాలనలు కొనసాగాయి. క్రమంగా... ప్రాచీన హిందువులు............ తూర్పున మలేసియా ద్వీపకల్పం మొదలు... జావా, సుమత్రా దీవుల నుంచి... మడగాస్కర్ వరకు తమ వ్యాపారాన్ని విస్తరించారు. ఓ దేశంగా అవతరించిన ఈ దీవి... 1960లో ఫ్రాన్స్ నుంచీ స్వాతంత్ర్యం పొందింది. ఇక అప్పటి నుంచీ... తన ప్రత్యేకతను చాటుకుంటూ... అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. 2.7 కోట్ల మందికి ఆవాసం కల్పిస్తోంది.

ఆఫ్రికా పక్కనే ఉన్నా... ఈ దీవిలో ఆఫ్రికన్లతో పాటూ... ఆసియన్లూ ఎక్కువే. కారణం మొదటి నుంచీ ఆసియా దేశాలు చేస్తున్న వ్యాపార, వాణిజ్యాలే. తూర్పు ఆసియా దేశాల నుంచీ వచ్చిన చాలా మంది శతాబ్దాలుగా ఇక్కడ స్థిరపడిపోయారు. అందువల్ల ఈ దీవిలో... ఇండొనేసియా సంస్కృతి కనిపిస్తుంది. ఇక్కడ 18 రకాల తెగలు ఉన్నా... అందరూ ఆసియా దేశాల్లో మాట్లాడే... మలగాసీ భాష మాట్లాడతారు. ఇక్కడ భారతీయులు కూడా ఎక్కువే. వీళ్లు హిందీ, గుజరాతీ మాట్లాడతారు.

ఎన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ... మడగాస్కర్‌లో ప్రధాన వృత్తి వ్యవసాయమే. చాలా ఆఫ్రికా దేశాల్లాగే ఈ దీవి కూడా... పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. ఐతే, జనం మధ్య ఆడా, మగా తారతమ్యాలు ఉండవు. అందరూ కలిసి వ్యవసాయం చేస్తారు. కలిసిమెలిసి జీవిస్తారు. ఎలాంటి గొడవలూ లేకుండా... ప్రశాంత జీవనం సాగిస్తారు.

వ్యవసాయం అంటే... మీకో విషయం చెప్పాలి. ప్రపంచంలోని వెనీలా (vanilla) ఉత్పత్తిలో 80 శాతం వస్తున్నది ఎక్కడి నుంచో తెలుసా? మడగాస్కర్ నుంచే. మనం తినే ఐస్‌క్రీమ్‌లు, చాకొలెట్స్‌లో వెనీలా ఫ్లేవర్ ఉంటుంది. చాలా వంటలు, పెర్‌ఫ్యూమ్ పరిశ్రమల్లో దీన్ని వాడతారు. అరోమాథెరపీకి కూడా వెనీలాను ఉపయోగిస్తారు.

ప్రపంచంలో కుంకుమపువ్వు తర్వాత... అత్యంత ఖరీదైన సుగంధద్రవ్యం వెనీలాయే. కారణం ఈ చెట్ల పెంపకం రిస్కుతో కూడుకున్నది. పువ్వులు పూయడం, కాయలు రావడం, వాటిని ఆరు నెలలు ఎండబెట్టడం, వాటిలో వెనీలా పొడిని సేకరించడం ఇదంతా కష్టమైన పని. 6 కేజీల కాయలతో కేజీ వెనీలా మాత్రమే తయారవుతుంది. కేజీ 40వేల రూపాయలకు పైనే ఉంటుంది. ఈ చెట్ల పెంపకానికి మడగాస్కర్ వాతావరణం చక్కగా సెట్ అవుతోంది. అందుకే ఇక్కడ ఈ వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతోంది.

ఎన్నో భౌగోళిక ప్రత్యేకతలున్న మడగాస్కర్‌లో నవంబర్ నుంచీ ఏప్రిల్ వరకూ వానలు కురుస్తాయి. మే నుంచీ అక్టోబర్ వరకూ ఎండ దంచికొడుతుంది. హిందూ మహా సముద్రం నుంచీ వచ్చే... తేమ గాలులు... తీర్పు, దక్షిణ తీరాన్ని చల్లబరుస్తున్నాయి. అందుకే ఇక్కడ దట్టమైన అడవులున్నాయి. మిగతా దీవి మొత్తం చిన్నచిన్న అడవులు, ఎడారిని తలపిస్తాయి.

ఈ భూమిపై ఏడు ఖండాలున్నాయని మనం చదువుకున్నాం. కొంతమంది పర్యావరణ వేత్తలు... మడగాస్కర్‌ని ఎనిమిదో ఖండంగా పిలవాలని అంటున్నారు. దీనిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి దీన్ని ఎనిమిదో ఖండంగా గుర్తించకపోయినా... ఇదో జీవ వైవిధ్య ప్రాంతంగా... కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ సంస్థ గుర్తించింది. దీనివల్ల... ఈ దీవికి... ప్రత్యేక పర్యావరణ రక్షణ వ్యవస్థలున్నాయి. ఇక్కడి ప్రకృతిని కాపాడేలా... ప్రపంచ దేశాలు నిధులు ఇస్తున్నాయి.

సముద్ర తీరాలు, పచ్చిక బయళ్లు... అన్ని దీవుల్లోనూ కనిపించేవే. మరి మడగాస్కర్ అదనపు ప్రత్యేకత ఏంటి? అన్ని దీవుల్లాగే ఉంటే, మడగాస్కర్ గురించి మనం చెప్పుకోవాల్సిన పనేలేదు. అదేం విచిత్రమోగానీ... చాలా వైరుధ్యాల్ని తనలో దాచుకుంది. కొన్ని ప్రాంతాలకు వెళ్తే... వేరే గ్రహంపై ఉన్నామా అన్న ఫీల్ కలిగిస్తాయి. అలాంటి విభిన్న వాతావరణమే... మడగాస్కర్‌ను అద్భుత దీవిగా మార్చేసింది.

 



మడగాస్కర్‌లో ఎర్రమట్టితో సహజసిద్ధంగా ఏర్పడిన ముళ్లులా కనిపించే ఆకారాలు ఉన్నాయి. సింగీ రోగ్ (Tsingy Rouge) అని పిలిచే ఆ ప్రదేశాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అంకరానా పట్టణానికి దగ్గర్లో ఉంది ఈ ప్రాంతం. భారీవర్షాల వల్ల మట్టి కోసుకుపోయి, ఈ ఆకారాలు తయారయ్యాయి. వేల ఏళ్ళ కిందట ఏర్పడిన ఇవి... ఇప్పుడు కఠినమైన రాతి శిలలుగా మారిపోయాయి. రాళ్లపై ఇసుక పేరుకుపోయి... ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి. మడగాస్కర్‌కు వెళ్లిన పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే ప్రదేశం ఇది.

బాటిల్ లాంటి ఆకారంలో కనిపించే ఈ చెట్లను చూస్తే ఏమనిపిస్తోంది. డైనోసార్ల ప్రపంచం గుర్తొస్తోందా? రైట్. మడగాస్కర్‌ను మరో మెట్టెక్కించాయి ఈ బావోబాబ్ (Baobab) చెట్లు.

బావోబాబ్ చెట్లు ఈ ఒక్కదేశంలోనే కనిపిస్తాయి. వీటిని చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది ఎవరికైనా. వీటి మొదళ్ళు ఎంతో లావుగా ఉండి, ఏడెనిమిది మీటర్లు పెరిగిన తర్వాత ఒక్కసారిగా ఆ కాండం నాలుగైదు కొమ్మలుగా విడిపోయి ఆగిపోతుంది. ఆ కొమ్మలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. చివర్లలో కొన్ని ఆకులు ఉంటాయి. కాండం ఎంతో నునుపుగా ఉంటుంది. చూస్తుంటే మానవుని చెయ్యి, అయిదు వేళ్ళు విచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది.

మడగాస్కర్ దీవికి ఉత్తరాన నోసీ బే (Nosy be) ఉంది. ఈ ప్రాంతంలో అనేక చిన్న చిన్న దీవులున్నాయి. కొన్ని దీవులైతే... కొన్ని అడుగుల వెడల్పే ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ నోసీ బేకి దగ్గర్లోనే నోస్ సకాటియా (Nosy Sakatia), నోసీ టకినేలీ, నోసీ కోంబా, రష్యన్స్ బే, నోసీ ఇరంజా, రదను ద్వీపాలు, నోసీ ఫ్రాలీ, మిట్సియో ఆర్చిపెలాగో వంటివి ఉన్నాయి. అద్భుత సముద్ర తీరాలతో ఈ ప్రాంతమంతా స్వర్గంలా కనిపిస్తుంది.

నోసీ సకాటియా (Nosy Sakatia)ను ఆర్బెడ్ ద్వీపం అంటారు. ఇక్కడ నివసించేది 3వందల మందే. మీకు తెలుసా... ప్రపంచంలో అతి చిన్న ఊసరవెల్లి (chameleon) ఇక్కడే కనిపిస్తుంది. ఈ ఊసరవెల్లి ఒక సెంటీమీటరే ఉంటుంది. రాక్షస గబ్బిలాలు (bats) కూడా ఇక్కడ కనిపిస్తాయి.

నోసీ కోంబా (Nosy Comba) మరో చిన్న ద్వీపం. గుండ్రంగా ఉండి... ఆకాశం నుంచి చూస్తే సముద్రానికి బొట్టుపెట్టినట్లు కనిపిస్తుంది. ఈ ద్వీపంలో మనకు ఫ్లైయింగ్ ఫాక్స్ (Flying Fox) అని పిలిచే రాక్షస గబ్బిలాలు కూడా కనిపిస్తాయి. ఈ ద్వీపంలో ఓ అగ్నిపర్వతం ఉంది. ఇక్కడ లెమర్లు (Lemurs) ఎక్కువగా సంచరిస్తాయి.

రష్యన్ బే కూడా చిన్న ద్వీపం. ఈ దీవిలో పర్యాటకులు రెండు మూడు రోజులు ఉండటానికి వీలుగా హోటళ్ళుంటాయి. ఈ దీవిలోని ప్రకృతి రమణీయతని పూర్తిగా ఆస్వాదించొచ్చు. ఇక్కడ తెలుపు రంగులో మెరిసిపోయే ఇసుక తీరాలున్నాయి. వివిధ జాతుల పక్షులు, జలచరాలు కనిపిస్తాయి. ఈ చిన్న చిన్న దీవుల్ని చూసేందుకు పడవలో గానీ, హెలికాప్టర్‌లో గానీ వెళ్లొచ్చు.

ఇలాంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలతో హాలీవుడ్ యాక్షన్ సినిమా షూటింగ్స్‌కి బెస్ట్ స్పాట్‌గా నిలుస్తోంది మడగాస్కర్. జేమ్స్ బాండ్ సిరీస్‌లో వచ్చిన... కేసినో రాయల్ (Casino Royale)  సినిమాలో ఛేజింగ్ సీన్... ఇక్కడే షూట్ చేశారు. అదే కాదు... మడగాస్కర్ పేరుతో... హాలీవుడ్‌లో యానిమేషన్ సిరీసే ఉంది. మడగాస్కర్‌లో కనిపించే జంతువుల్నే... యానిమేషన్ బొమ్మలుగా చేశారు. ఈ సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ... ప్రపంచ ప్రేక్షకుల్ని అలరించాయి. మడగాస్కర్‌కు మరింత గుర్తింపు తెచ్చాయి. 




మడగాస్కర్ సఫారీ మజా:
ఎంత పర్యటించినా... మడగాస్కర్‌లో చూడాల్సినవి ఇంకా చాలా ఉంటాయి. అందుకే... అక్కడి ప్రభుత్వం... ఫారెస్ట్ సఫారీ (Madagascar Safari)ని అభివృద్ధి చేసింది. వెహికిల్స్‌పై అలా అలా అడవుల్లో వెళ్తుంటే... ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మాటల్లో చెప్పలేం.

మడగాస్కర్... హరితారణ్యాలకు పెట్టింది పేరు. మనం జాగ్రత్తగా చూడాలేగానీ... ఎన్నో ప్రకృతి అందాలు... అలరిస్తాయి. వెహికిల్‌లో... అడవుల్లో తిరుగుతుంటే... కలిగే మజాయే వేరు. రకరకాల జంతువులు, పక్షులు, వింత వింత చెట్లు... ఎటుచూసినా పచ్చదనం పరచుకొని... మరో లోకానికి తీసుకుపోతాయవి.

పడవల్లో కూడా ప్రయాణిస్తూ... సముద్ర అందాల్నీ, సెలయేర్ల సౌందర్యాన్నీ చూడొచ్చు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లున్నాయి మడగాస్కర్‌లో.

మడగాస్కర్ చుట్టూ సముద్ర నీరు... అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. లోపల డైవింగ్ చేసేవారికి... రంగురంగుల చేపలతోపాటూ... అరుదైన మత్య్స ప్రపంచం కనిపిస్తుంది.

ఒక్క దీవిలోనే... ఇన్ని రకాల వైవిధ్యభరిత సహజసిద్ధ ప్రకృతి ఉండటం విశేషం. ఎన్ని రోజులు తిరిగినా... ఇంకా చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు మిగిలే ఉంటాయి.

చాలా ఆఫ్రికా దేశాల్లోలా కాకుండా... మడగాస్కర్‌లో శాంతియుత వాతావరణం ఉందంటే దానికి కారణం... పీస్ కీపింగ్ వాలంటీర్లే. ఈ శాంతి సంఘాల సభ్యులు... ఇక్కడి వ్యవసాయం, విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టి... అభివృద్ధిపై జనంలో అవగాహన పెంచుతున్నాయి. పిల్లలందరికీ పౌష్టికాహారం అందేలా చేస్తున్నాయి. మడగాస్కర్ ఇవాళ ఇంత అందంగా ఉందంటే కారణం వీళ్లందరి కృషే.

ఇంత చక్కటి దీవి కూడా... ఈమధ్యకాలంలో దెబ్బతింటోంది. ప్రపంచీకరణ, మానవుల అత్యాశ. అడవుల నరికివేత, గనుల తవ్వకాలు, వన్య మృగాల వేట, కాలుష్యం, విదేశీ సంస్కృతులు... ఇలా ఎన్నో అంశాలు ఈ దీవిని ప్రమాదంలో పడేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడి మట్టిలో టైటానియం, ఐరన్, కోబాల్ట్, కాపర్, నికెల్ లాంటి ఖనిజాలుండటం ఈ దీవికి శాపమవుతోంది. వాటి కోసం సారవంతమైన భూముల్ని కూడా తవ్వేస్తున్నాయి అంతర్జాతీయ ఖనిజ పరిశ్రమలు.

ఆఫ్రికా దేశాల్లోలాగే... మడగాస్కర్‌లో కూడా 30 ఏళ్లుగా వజ్రాల వేట కొనసాగుతోంది. ఇలకాకా, సకరాహా ప్రాంతాల్లో... పెద్ద ఎత్తున డైమండ్స్ ఇండస్ట్రీ నడుస్తోంది. ఐతే... ఈ పరిశ్రమ వల్ల స్థానికులకు ఒరుగుతున్నది ఏమీ లేదు. శ్రమ దోపిడీ తప్ప... ఆకలి బాధలు తీరట్లేదు. వజ్రాల వ్యాపారులు... స్థానికులతో తవ్వకాలు జరిపిస్తున్నారు. టన్నుల కొద్దీ మట్టిని ప్రాసెస్ చేయిస్తున్నారు. చివరకు దొరికే... నవరత్నాలను... తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఫలితంగా స్థానికుల జీవితాల్లో వజ్రాల మెరుపులు కనిపించట్లేదు.

ఇండియా సహా... ప్రపంచంలో చాలా దేశాలు... కాలుష్యపు కోరల్లో ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా... మనం కాలుష్యాన్ని తగ్గించలేకపోతున్నాం. కనీసం ఇలాంటి దీవులనైనా స్వచ్ఛంగా ఉంచగలిగితే... మానసిక ప్రశాంతత కోసం ఎప్పుడైనా ఓ రౌండ్ వేసి రావడానికి... ఉపయోగపడతాయి.

ఇవీ మడగాస్కర్ విశేషాలు. మీకో విషయం చెప్పనా... మడగాస్కర్‌ను దేవతలు సృష్టించిన స్వర్గంగా స్థానికులు నమ్ముతారు. అంత గొప్ప ద్వీప దేశం అది. అందుకే టూరిస్టులు ఓ వారం పాటూ అక్కడ ఉండి వచ్చేలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారు. జీవితాంతం గుర్తుండిపోయే... ఎన్నో అనుభూతులు సొంతం చేసుకుంటున్నారు.