బంగారం చరిత్ర తెలుసుకుందాం. (File Image) |
Gold Mining: బంగారం అరుదైనది, అందమైనది, విలువైనది. ఈ ప్రపంచంలో పసిడి నచ్చనిదెవరికి? అందరికీ ఇష్టమే. ప్రతి ఒక్కరి ఇంట్లో... ఎంతో కొంత బంగారం నగల రూపంలో ఉంటుంది. భారతీయులమైన మనకు కనకం ఓ సెంటిమెంట్ కూడా. ఐతే... అసలీ స్వర్ణం ఎలా పుట్టింది? భూమిలోకి ఎక్కడి నుంచీ వచ్చింది? మన ఇంట్లోనే బంగారాన్ని తయారుచెయ్యొచ్చా? ఇలాంటి ఆసక్తికర విశేషాల్ని తెలుసుకుందాం.
బంగారానికి ఉన్న చరిత్ర అంతా ఇంతా కాదు. ప్రపంచ నాగరికతలకూ, స్వర్ణానికీ విడదీయలేని సంబంధం ఉంది. మేలిమి బంగారం కోసం... శతాబ్దాలుగా ఎన్నో ప్రయోగాలు జరిగాయి. పసిడి వల్ల అమరత్వం సిద్ధిస్తుందనే సిద్ధాంతాలూ (Alchemy) వున్నాయి. మనందరి జీవితాలతో ఎప్పుడోకప్పుడు ముడిపడిపోయే బంగారు లోకంలోకి వెళ్దొద్దాం.
బంగారం........ భూమిలోని పైపై పొరల్లో దొరికే విలువైన ఖనిజాల్లో ఒకటి. ఈజిఫ్టు, చైనా, హరప్పా, సింధు నాగరికతల్లో స్వర్ణం వాడకంపై ఆధారాలున్నాయి.
ఈజిఫ్టులో 6 వేల ఏళ్ల కిందటి నుంచే... కనకంను వాడినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి రాజులు... ఉత్తర నైలూ నది, ఎర్ర సముద్రం, నుబియాన్ ఎడారి ప్రాంతాల నుంచీ పసిడి (Egypt Gold)ని తెప్పించినట్లు తేలింది. ఐతే... అప్పట్లో వస్తు మారకానికి బార్లీని మాధ్యమంగా వాడేవాళ్లు. క్రీస్తుపూర్వం 7వ శతాబ్దం నుంచీ... బంగారు నాణేలను చెలామణీలోకి తెచ్చినట్లు ఆధారాలున్నాయి.
స్వర్ణాన్ని ఎక్కువగా ఉపయోగించిన ఈజిఫ్టులో... ఫారో (Pharaoh) రాజులు చనిపోయేటప్పుడు... వాళ్లు వాడిన బంగారు వస్తువుల్ని కూడా ఉంచి, సమాధి చేసేవాళ్లు. ఫారో రాజు టుటన్‌ఖమన్ (Tutankhamun) సమాధిని 1922లో కనిపెట్టిన పరిశోధకులు ఆశ్చర్యపోయారు. సమాధి గదిలో కుప్పలుగా కనిపించిన బంగారు వస్తువులు ఆశ్చర్యపరిచాయి.
18వ శతాబ్దంలో కాలిఫోర్నియాలో బంగారం వేట జోరుగా సాగింది. 1848లో కాలిఫోర్నియాలోని సాక్రామెంటోలో... ఓ రంపపు మిల్లు ఓనర్‌కి తొలిసారి భూమిలో ముడి బంగారం దొరికింది. అంతే... నాలుగేళ్లు గడిచేసరికి... పెద్ద ఎత్తున వేట మొదలైంది. 1854లో ప్రపంచంలోనే అతి పెద్ద స్వర్ణ ముద్దను... కాలిఫోర్నియాలోని కార్సన్ హిల్ దగ్గర కనిపెట్టారు. దాని బరువు 88 కేజీలు. ఇప్పటి లెక్కల ప్రకారం దాని విలువ 42 కోట్ల రూపాయలు. ఒక్క 18వ శతాబ్దంలోనే దాదాపు 4వేల టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేశారు. అంటే... 40 లక్షల కేజీలు. ఇప్పటి లెక్కల ప్రకారం దాని విలువ (రూ.19244000000000) 19లక్షల 24వేల 400 కోట్ల రూపాయలు. కాలిఫోర్నియాలో గోల్డ్ దొరికే ప్రదేశాలన్నింటినీ కలిపి... మదర్ లోడ్ పేరుతో పిలుస్తున్నారు.
ఉత్తర అమెరికాలో లోతైన బంగారం గని ఎక్కడుందో తెలుసా? కెనడాలోని క్విబెగ్ నగరం (Quebec)లో. భూ ఉపరితలం నుంచీ 4 కిలోమీటర్ల లోపలికి తవ్వేశారు. లోపల 350 టన్నుల (3,50,000 కేజీల) గోల్డ్ ఉంటుందని లెక్కలేశారు. అమెరికాలో 2021 నాటికి 8,133.5 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. అంటే 8,133,500 కేజీల బంగారం. దాని విలువ ప్రస్తుతం (రూ.39130268500000) రూ.39 లక్షల కోట్లకు పైనే. ప్రపంచంలో ఇంకెక్కడా ఇంత స్వర్ణం లేదు. అమెరికా.... కెంటకీలోని... ఫోర్ట్ నాక్స్ (Fort Knox)లో.... పెద్ద మొత్తంలో బంగారం నిల్వలున్నాయి. లక్షా 9వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫోర్ట్ నాక్స్‌లో... ఎక్కడ చూసినా ఆర్మీ నిఘా ఉంటుంది. ఫోర్ట్ నాక్స్‌తోపాటూ... అమెరికా మొత్తం కలిపితే... దాదాపు 9వేల మెట్రిక్ టన్నుల బంగారం ఉందని అంచనా.
దక్షిణాఫ్రికాలో బంగారం నిల్వల్ని కనుక్కోక ముందువరకూ.... ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో కనకం కోసం వేటాడారు. కాలిఫోర్నియా గోల్డ్ రష్, విక్టోరియా గోల్డ్ రష్, క్లోండికే గోల్డ్ రష్ ఇలాంటివే.
బంగారానికి ఉన్న భౌతిక లక్షణాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మీకు తెలుసా... 28 గ్రాముల బంగారాన్ని 300 చదరపు అడుగుల పల్చని రేకులాగా సాగదీయవచ్చు. మన జుట్టు కంటే సన్నగా తయారవ్వగలదు. 28 గ్రాముల బంగారంతో... 80 కిలోమీటర్ల పొడవున్న తీగను తయారుచెయ్యవచ్చు.
గోల్డ్ రసాయనిక నామం... Au. లాటిన్ భాషలో "ఆరం" అంటారు. అంటే మెరుపు అని అర్థం. బంగారం అద్భుతమైన హీట్ కండక్టర్. అందుకే దీన్ని ఎలక్ట్రికల్ వస్తువుల తయారీలో వాడతారు.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా. ఏడాదికి 350 టన్నులకు పైగా ఉత్పత్తి చేస్తోంది. చైనా తర్వాతి స్థానంలో రష్యా ఉంది. దాదాపు 330 టన్నులు ఉత్పత్తి చేస్తోంది. రష్యా తర్వాతి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా... 325 టన్నులకు పైగా ఉత్పత్తి చేస్తోంది.
బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడే భారత దేశంలో హరప్పా, మహెంజోదారో నాగరికతా కాలం నుంచే బంగారాన్ని వాడినట్లు ఆధారాలున్నాయి. గుప్తులు, చోళులు, విజయనగర రాజులు, టిప్పు సుల్తాన్, బ్రిటీష్ పాలకులు... స్వర్ణం కోసం భూమిని జల్లెడ పట్టారు. ప్రస్తుతం దేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్‌లో బంగారం దొరుకుతోంది. ఆమధ్య రాజస్థాన్‌లో కూడా నిల్వలు ఉన్నట్లు తెలిసినా... ఎంత అన్నది అంచనాకి రాలేదు. కర్ణాటకలో 180 లక్షల టన్నులు ఉండగా... ఏపీలో 70 లక్షల టన్నులున్నట్లు తేలింది. ఇప్పటివరకూ కర్ణాటకలో దాదాపు వెయ్యి టన్నుల బంగారాన్ని వెలికితీశారు.
బంగారాన్ని భూమి నుంచి ఎలా వెలికితీస్తారు?:
మనకు మంచి నీళ్లు కావాలంటే... బావి నుంచో, పంపు నుంచో తీసుకోవచ్చు. అదే బంగారం కావాలంటే... భూమిని జల్లెడ పట్టాల్సిందే. ఒక్క గ్రాము పసిడి కావాలన్నా కొన్ని గంటలపాటూ రిస్క్ చెయ్యాల్సిందే. అసలు భూమిలో గోల్డ్ ఎక్కడుందో ఎలా కనిపెడతారు? దాన్ని ఎలా వెలికి తీస్తారు? మనం కూడా స్వర్ణాన్ని సేకరించవచ్చా?
ప్రపంచంలో బంగారం గనుల సంఖ్య తగ్గిపోతున్నా... ఉత్పత్తి మాత్రం పెరుగుతోంది. కారణం... టెక్నాలజీ పరంగా, పారిశ్రామికంగా వస్తున్న మార్పులే. ప్రస్తుతం హైడ్రోమెటలర్జీ ప్రక్రియ... బంగారం వెలికితీతకు ఎక్కువగా ఉపయోగపడుతోంది. (hydrometallurgy)
శుద్ధమైన బంగారం మెత్తగా ఉంటుంది. దాన్ని 24 కేరట్ల ప్యూర్ గోల్డ్‌గా పిలుస్తున్నాం. ఐతే... ప్యూర్ గోల్డ్‌తో నగలను తయారుచెయ్యలేం. పసిడి గట్టిదనం కోసం రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి లోహాల్ని కలుపుతారు. అందుకే నగల బంగారాన్ని 22 కేరట్ల గోల్డ్‌గా పిలుస్తారు. ఇతర లోహాలు ఎంత శాతం కలిశాయన్న దాని ఆధారంగా బంగారం స్వచ్ఛత 22 కేరట్లు, 18 కేరట్లు, 14 కేరట్లు అంతకంటే తక్కువ కేరట్లకు తగ్గిపోతుంది. మనం అప్పుడప్పుడూ వింటుంటాం... 916 KDM బంగారు నగలు స్వచ్ఛమైనవి అని. ఈ తరహా నగల కోసం బంగారంలో కాడ్మియం (cadmium) కలుపుతారు. కాడ్మియం అనేది చర్మానికి హాని చేసే మూలకం. ఐతే... నగల తయారీలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల... ఇలాంటి నగలు... చర్మానికి హాని చెయ్యవు.
భూమి పైపొరల్లో ఉండే సహజసిద్ధ బంగారాన్ని భూమిలోంచీ వెలికి తియ్యడానికి ఇదివరకు రెండు పద్ధతులు పాటించేవాళ్లు. ఒకటి పాన్నింగ్ (panning). రెండోది స్లూయిసింగ్ (sluicing). పాన్నింగ్ ద్వారా... నదీ ప్రవాహాల్లో, ఇసుకలో, గులకరాళ్ల మట్టిలో దాగిన బంగారాన్ని బయటకు తీస్తారు. శతాబ్దాలుగా ఈ విధానం కొనసాగుతోంది. ఇతర రాళ్లు, ఖనిజాల కంటే... బంగారం బరువైనది కావడంతో... నీటితో మట్టిని పాన్నింగ్ చేసేటప్పుడు... బంగారం అడుగు భాగంలో ఉండిపోతుంది. రాళ్లు, వ్యర్థాలు... నీటితో బయటకు వెళ్లిపోతాయి.
బంగారం వెలికితీతలో రెండో విధానం స్లూయిసింగ్. ఇది కూడా పురాతన కాలం నుంచీ వాడుకలో ఉన్న పద్ధతే. ఇందులో స్లూయిస్ బాక్సు నుంచీ నీటిని కిందికి మళ్లిస్తారు. అందువల్ల... రాళ్లు, మట్టి వంటివి... నీటితోపాటూ కొట్టుకుపోతాయి. ముడి బంగారం... స్లూయిస్ బాక్సులో ఉండిపోతుంది. దాన్ని సేకరించి... ప్రాసెస్ చేస్తారు. పాన్నింగ్‌తో పోల్చితే... ఇది కాస్త తేలికైన విధానం.
డ్రెడ్జింగ్ (dredging) అనేది మరో ప్రక్రియ. ఈ విధానంలో పడవకు స్లూయిస్ బాక్సుని సెట్ చేసి... నది నీటిలో తేలేలా చేస్తారు. స్లూయిస్ బాక్స్ ద్వారా... వ్యర్థాల నుంచీ బంగారాన్ని వేరుచేస్తారు. దీనివల్ల నది మధ్యలో ఉన్న స్వర్ణాన్ని కూడా... సేకరించేందుకు వీలవుతుంది.
బంగారాన్ని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చెయ్యడానికి... డ్రెడ్జింగ్‌లో భారీ యంత్రాల్ని వాడుతున్నారు. నదుల్లో ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు... గ్రావెల్ స్క్రీనింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసి... ప్రాసెస్ చేస్తున్నారు.
ఇప్పటివరకు మనం తెలుసుకున్నవి... చిన్న చిన్న రజనులా ఉన్న బంగారాన్ని వెలికితీసే పద్ధతులు. భారీ రాళ్లలో, గనుల్లో ఉన్న బంగారాన్ని వెలికి తియ్యడానికి ఈ పద్ధతులు సరిపోవు. ఇందుకోసం ఉపయోగపడే ప్రక్రియ హార్డ్ రాక్ మైనింగ్ (hard rock gold mining). ప్రపంచంలో ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నది ఈ పద్ధతిలోనే.
హార్డ్ రాక్ విధానంలో గనుల్లో తవ్వి... సొరంగాల ద్వారా... ముడి ఖనిజాల్ని బయటకు తీస్తారు. ఇలాంటి లోతైన గని... దక్షిణ అమెరికాలో ఉంది. భూమికి 12వేల 800 అడుగుల లోతువరకూ తవ్వేశారు. అంత లోతుగా వెళ్లినప్పుడు... వీపరీతమైన వేడి ఉంటుంది. గాలి కూడా పీల్చలేం. అందుకే వర్కర్లకు ఇబ్బంది కలగకుండా... ఎయిర్ కండీషనింగ్, ఆక్సిజన్ అందించే వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఇలాంటి వ్యవస్థను తెచ్చిన మొదటి గని... దక్షిణాఫ్రికా... జొహన్నెస్‌బర్గ్‌లోని రాబిన్‌సన్ డీప్ (robinson deep gold mine). ఇప్పుడు కాదు గానీ... అప్పట్లో... ఈ గని ప్రపంచంలోనే అతి లోతైన గని. స్పాట్
చాలా సందర్భాల్లో... వేరే ఖనిజాల కోసం తవ్వితే... వాటితోపాటూ బంగారం కూడా దొరుకుతోంది. ఎక్కువగా... రాగి గనుల్లో ఇది ఉంటోంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ స్వర్ణాన్ని ఉత్పత్తి చేసిన గని ఇండొనేసియా... పపువాలోని గ్రాస్‌బెర్గ్ మైన్ (grasberg mine). నిజానికి ఇది బంగారం కోసం తవ్విన గని కాదు. ఇందులో పసిడి కంటే రాగి నిల్వలే ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజుల్లో సోడియంలో... బంగారం ఉప ఉత్పత్తి అవుతోంది.
రాళ్లలో బంగారం ఉందో లేదో తెలుసుకోవడానికి... సైనైడ్ (cyanide)ని వాడతారు. సోడియం సైనైడ్ ద్రావకంలో... రాళ్లను ముంచితే... అందులో బంగారం ఉందా? వెండి ఉందా అన్నది తేలిపోతుంది. బంగారం ఉంది అని తేలితే... ఆ రాళ్లను మిగతా రాళ్ల నుంచీ వేరు చేస్తారు. వాటిని ఖనిజాల రిఫైనరీకి పంపిస్తారు. అక్కడ వాటిని ప్రాసెస్ చేసి... 24 కేరట్ల బంగారాన్ని వెలికితీస్తారు.
1960 వరకూ... బంగారాన్ని శుద్ధి చెయ్యడానికి పాదరసం (mercury)ని వాడేవాళ్లు. ఐతే... మెర్క్యురీ ప్రమాదకరమైన ఖనిజం కావడంతో... బంగారంలో దీని వాడకాన్ని నిలిపేయాలని డిమాండ్లు వచ్చాయి. ఇప్పటికీ స్వల్ప మొత్తాల్లో మెర్క్యురీని వాడుతున్నారు. కాలిఫోర్నియాలో ప్లేసర్ మైనింగ్ (placer mining operations) కోసం... 45వేల మెట్రిక్ టన్నుల మెర్క్యురీని వాడారు. దాన్ని తిరిగి రికవరీ చెయ్యలేదు. ఆఫ్రికా లోని ఘనా లాంటి దేశాల్లో చట్ట విరుద్ధంగా పాదరసాన్ని బంగారం కోసం వాడుతున్నారు. దీన్ని ఉడికించేటప్పుడు వచ్చే ఆవిరిని పీల్చి... చాలా మంది అనారోగ్యాలపాలవుతున్నారు.
బంగారం తవ్వకాలతో నష్టాలు కూడా ఎక్కువే. అడవులు తరిగిపోతున్నాయి. మైనింగ్ భూమికి ప్రమాదకరంగా మారుతోంది. విషపూరితమైన సైనైడ్, మెర్క్యురీ వ్యర్థాల్ని అలాగే వదిలేస్తుండటంతో... చుట్టుపక్కల జనానికీ, జంతువులకూ ప్రాణహాని కలిగిస్తున్నాయి. అందుకే... బంగారం గనుల తవ్వకాల్లో స్వచ్ఛతను పాటించాలనే డిమాండ్లున్నాయి. తవ్వకాల తర్వాత... గనులను అలా వదిలెయ్యకుండా... వాటిలో ప్రమాదకర సైనైడ్, మెర్క్యురీలను క్లీన్ చెయ్యాలనే నిబంధనలొచ్చాయి.
ఇంట్లోనే బంగారం తయారీ!:
బంగారాన్ని ఇంట్లో తయారుచెయ్యవచ్చా? అన్న ప్రశ్నకు ఆన్సర్... చెయ్యొచ్చు. కాకపోతే... అది అంత తేలిక కాదు. అసలు బంగారంలో ఏయే మూలకాలుంటాయి? కనకం తయారీ కోసం ఎలాంటి పరిశోధనలు జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం.
"బంగారంలో రాగి, తగరం, సల్ఫర్, పాదరసం మూలకాలుంటాయి. వీటిని సమపాళ్లలో కలిపితేనే కనకం తయారవుతుంది. ఆ ప్రక్రియను మనమే చేస్తే... ఇంట్లోనే బంగారాన్ని తయారుచేయవచ్చు"... అనుకున్నారు పూర్వపు పరిశోధకులు. తమ ఆలోచనలకు తగినట్లుగానే... రకరకాల మూలకాల్ని కలుపుతూ, విడదీస్తూ, తగ్గిస్తూ, పెంచుతూ... (alchemy) శతాబ్దాలుగా పరిశోధించారు. ఈజిఫ్టు, మెసపటోమియా, హరప్పా, సింధు, పర్షియా, చైనా, జపాన్, కొరియా, గ్రీక్, రోమన్, మధ్యప్రాచ్య దేశాల్లో... ఈ పరిశోధనలు విస్తృతంగా జరిగాయి. ఈ క్రమంలో... రకరకాల కొత్త మూలకాల్ని కనుక్కున్నారు. అసాధారణ పదార్థాల్ని తయారుచేశారు.
పరిశోధనలు చేస్తున్న క్రమంలో... శాస్త్రవేత్తల మెదళ్లలో రెండు ఆలోచనలు బలంగా నాటుకున్నాయి. వాటిలో ఒకటి... సీసంను బంగారంగా మార్చడం. రెండోది... అమృతాన్ని తయారుచెయ్యడం. అపర మేధావి అయిన సర్ ఐజాక్ న్యూటన్ (sir isaac newton) కూడా... ఈ తరహా పరిశోధనల్ని బాగా నమ్మాడు. స్వయంగా ప్రయోగాలు చేశాడు.
ఇలాంటి పరిశోధనలు జరుగుతుండగానే... ఫిలాసఫర్స్ స్టోన్ (philosopher stone) తయారుచెయ్యాలనే కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. ఈ స్టోన్‌నే మనం తెలుగులో పరుసవేది అంటున్నాం. ఈ పరుసవేది రాయి... ఇనుమును బంగారంలా మార్చేస్తుందనే ప్రచారం బాగా జరిగింది. అంతేకాదు... ఈ రాయికి మహత్తర శక్తి ఉంటుందనీ... దీన్ని ముట్టుకుంటే... చావు దరిచేరదని నమ్మేవాళ్లు. రాన్రానూ ఈ పరిశోధనలు... ఆధ్యాత్మికవాదాన్ని సంతరించుకున్నాయి. ఊహాతీతమైన ఆలోచనలు ఎక్కువయ్యాయి. చివరకు... ఇలాంటి పరిశోధనలు చేసేవాళ్లను జనం, పాలకులూ వ్యతిరేకించడం మొదలుపెట్టారు. మొత్తానికి పరుసవేది ఆలోచనలు నెరవేరలేదు. అసలు అలాంటి రాయి లేనే లేదని తేలింది. ఐతే... హ్యారీ పోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ (Harry Potter and the Philosopher Stone) సినిమాలో మాత్రం... ఈ రాయి ఉందనీ, దీనికి అమరత్వ శక్తులున్నాయనీ చూపించారు.
ఇండియాలో ఎన్నో పరిశోధనలు:
మన దేశంలో కూడా బంగారం తయారీపై ప్రయోగాలు జరిగాయి. సింధు నాగరికతా కాలం నుంచే బంగారం వాడకముంది. యోగి వేమన కూడా బంగారం తయారీకి ప్రయత్నించాడనే ప్రచారం ఉంది. చాలా మంది రాజులు... స్వర్ణం తయారీ విద్యను ప్రోత్సహించారు. ప్రపంచంలో ఎక్కువ బంగారం కొంటున్నది మన దేశమే. ఏడాదికి 800 టన్నులకు పైగా దిగుమతి అవుతోంది. ఎక్కువగా బంగారు నగలు, గోల్డ్ కాయిన్స్, బిస్కెట్లను భారతీయులు కొంటున్నారు. మన దేశంలో కేరళీయులు ఎక్కువగా బంగారం కొంటుంటే... ఆ తర్వాతి స్థానంలో తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. తెలుగు వాళ్ల తర్వాత... తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో బంగారం వాడకం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం భూమిలో దొరుకుతున్న బంగారంలో... 50 శాతం నగలు చెయ్యడానికీ, 40 శాతం మూలధన పెట్టుబడిగా, 10 శాతం గోల్డ్ కాయిన్స్ తయారీకీ, ఇతరత్రా పారిశ్రామిక ఉత్పత్తుల తయారీకీ వాడుతున్నారు.
మీకు తెలుసా? బంగారాన్ని తినవచ్చు కూడా. చాలా స్వీట్లు, కేకులు, ఐస్‌క్రీంలపై బంగారం పూత పూస్తారు. ఈ బంగారం (edible gold) అత్యంత స్వచ్ఛమైనది. 23.5 కేరట్ల గోల్డ్‌ను ఇందుకు ఉపయోగిస్తారు. ఇంతకీ తినే పదార్థాలపై బంగారం పూత ఎందుకు? అందం కోసమా? ఆరోగ్యం కోసమా? అంటే... రెండింటికీ అనే చెప్పాలి. బంగారానికి ఉన్న అందం మరే నగకూ లేదు కదా. బ్యూటీ డెకరేషన్ కోసం బంగారు పూతను పూస్తారు. ఐతే... బంగారాన్ని తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది కూడా. పిల్లలకు బంగారాన్ని తినిపిస్తే, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పోలియో రాదు. జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరం బలంగా తయారవుతుంది. ఇలా చాలా లాభాలున్నాయి. ఇంతకీ బంగారాన్ని ఎక్కువగా తింటున్నది ఎవరో తెలుసా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబూదాబీ (abudhabi) జనం. వాళ్లు ఏటా కోట్ల కొద్దీ బంగారం రేకుల్ని తినేస్తున్నారని సర్వేలో తేలింది.
అసలీ బంగారం... ఇనుము ఇతర ఖనిజాల్లాగా... భూమిలో పుట్టింది కాదు. ఎందుకంటే... మన సౌర కుటుంబంలో భూమిపై తప్ప... ఇంకెక్కడా బంగారం ఆనవాళ్లు కనిపించలేదు. అందుకే... ఈ బంగారం... వేరే సౌర వ్యవస్థ నుంచీ భూమిని చేరిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కొన్ని కోట్ల సంవత్సరాల కిందట... రెండు నక్షత్రాలు ఢీ కొనడం వల్ల పుట్టిన అత్యంత శక్తిమంతమైన కాంతిలోంచీ పుట్టిన బంగారం... విశ్వంలో కలిసి... సుదూర తీరాలకు ప్రయాణించి... చివరకు మన భూమిపై పడిందని చెబుతున్నారు. శక్తిమంతమైన కాంతిలోంచీ దాదాపు 10 చందమామలకు సమానమైన బంగారం వెలువడి ఉంటుందనీ... దాన్లో చాలావరకూ... విశ్వంలో అన్ని దిక్కులకూ వెళ్లిపోయిందని విశ్వసిస్తున్నారు. అందువల్లే భూమి పై పొరల్లో మాత్రమే బంగారం ఉందని నమ్ముతున్నారు. బంగారం అనేది... భూమిపై మాత్రమే అరుదైన ఖనిజం కాదు... ఈ విశ్వంలోనే అరుదైనది. అమూల్యమైనది. అద్భుతమైనది.
ఇవీ బంగారానికి సంబంధించిన బంగారం లాంటి విశేషాలు. మనమంతా అరుదైనవాటిని సేకరించి, దాచుకుంటాం కదా. గోల్డ్ కూడా అలాంటిదే కాబట్టి... ఎంతో కొంత కూడబెట్టుకోవడం మంచిదే. సంతృప్తితోపాటూ... భవిష్యత్ అవసరాల్ని కూడా అది తీర్చుతుంది.