9, ఆగస్టు 2021, సోమవారం

Video: భలే ఉంది కదా... దీన్ని ముట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

కొక్కా (image credit - twitter)

Viral Video: సోషల్ మీడియా అద్భుతమైనది. కొత్త విషయాలు, ఆసక్తికరమైన సంగతులు తెలుసుకోవాలి అనుకునేవారికి సోషల్ మీడియాను మించినది ఉండదేమో. ఐతే... అదే సోషల్ మీడియాలో అసత్యాలు కూడా చాలా ఉంటాయనుకోండి. సరే... మనం అసలు టాపిక్‌కి వద్దాం. ఆ జంతువు పేరు కొక్కా (quokka). పలకడం కష్టమే. చిన్న తోకతో... పిల్లి అంత సైజులోనే ఉంటుంది. ఆస్ట్రేలియాలో కంగారూలు, వల్లబీలతోపాటూ... ఈ జంతువులూ ఉంటాయి. కానీ ఇవి అంతగా కనిపించవు. ఇవి శాఖాహార (herbivorous) జీవులు. రాత్రిపూట (nocturnal) తిరిగేవి. అందువల్ల పగటి వేళ ఈ జంతువులు అరుదుగా కనిపిస్తాయి.

తాజాగా ఓ కొక్కా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ మహిళ... జూలోని కొక్కాకు బొప్పాయి ముక్క లాంటిది ఇచ్చింది. ఆ ముక్కను తింటూ కొక్కా ఎంతో ఆనందపడింది. తన జీవితంలో ఇదే అత్యంత సంతోషకరమైన సమయం అన్నంత ఆనందం దాని ముఖంలో కనిపిస్తోంది. అలా అది తింటూ... ఓ సందర్భంలో... ఆ మహిళకు థాంక్స్ చెబుతూ... ఆమెను టచ్ చెయ్యబోయింది. కానీ ఆ మహిళ కాస్త వెనక్కి జరిగింది. మొత్తంగా కొక్కాను ఆమె అస్సలు ముట్టుకోలేదు.

నిజానికి అంత కలివిడిగా ఉండే జంతువును ఎవరైనా అలా ముట్టుకొని... నిమురుతారు. కానీ ఆమె టచ్ చెయ్యకపోవడానికి ప్రత్యేక కారణం ఉంది. ఈ కొక్కాలను ముట్టుకున్నా... వీటికి ఆహారం పెట్టినా ఆస్ట్రేలియాలో ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ రూ.8వేల నుంచి రూ.5 లక్షల దాకా ఉంటుంది. అక్కడి అధికారులు జాలిపడి వదిలేయరు. కచ్చితంగా ఫైన్ వేసేస్తారు. అందుకే అక్కడ ఎవ్వరూ కొక్కాల జోలికి వెళ్లరు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి.



పశ్చిమ ఆస్ట్రేలియాలో ఓ చిన్న ప్రాంతంలోనే ఈ జంతువులు జీవిస్తున్నాయి. ఇవి అంతరించే జంతువుల జాబితాలో చేరాయి. అందువల్ల వీటిని రక్షించే విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం రాజీ పడట్లేదు.



ఈ వీడియోలో చూడండి... ఈ అమ్మాయి కొక్కాను ముట్టుకోవడమే కాదు... ఆహారం కూడా పెట్టగలదు. ఎందుకంటే... ఆమె ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ ఉద్యోగి.



మన దేశంలో కూడా చాలా జంతువులు, పక్షులు అంతరించే దశలో ఉన్నాయి. పునుగు పిల్లి, మూషిక జింకల వంటివి చూద్దామన్నా కనిపించట్లేదు. అలాంటి వాటిని రక్షించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు నెటిజన్లు. 

8, ఆగస్టు 2021, ఆదివారం

B House: అరుదైన ఇల్లు... ఇండియాలో అలాంటిది అది ఒక్కటే..!

Symbolic Image - Not real one

B House: ఇండియాలో 140 కోట్ల ఉంది జనాభా. కోట్ల ఇళ్లు ఉన్నాయి. కానీ ఆ ఇల్లు ప్రత్యేకమైనది. అది ఏ ప్రధాని ఇల్లో, రాష్ట్రపతి భవనమో కాదు. ఓ సాదాసీదా ఇల్లు. మరెందుకు అది ప్రత్యేకమైనదో చూద్దాం.

భారత్-బంగ్లాదేశ్ మధ్య... సరిహద్దు అనగానే చెక్ పోస్టులు, కంచెలు, రెండు దేశాల ఆర్మీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఓ ఇల్లు సరిగ్గా సరిహద్దులో ఉంది. ఆ ఇంటి మధ్య నుంచే బోర్డర్ గీత వెళ్లింది. అందువల్ల ఆ ఇంటి వరకూ... ఫెన్సింగ్ లేదు. అంటే 385 గజాల స్థలానికి కంచె లేదు. ఆ స్థలమే ఆ ఇల్లు. ఆ ఇంటికి ఒకవైపు భారత్, మరోవైపు బంగ్లాదేశ్ ఉంది. అందువల్ల ఆ ఇంట్లో రెండు దేశాల వారూ ఉంటారు. వారి మధ్య ఏ గొడవలూ ఉండవు. పూర్తి స్నేహపూర్వకంగా ఉంటారు. అసలు వాళ్లకు బోర్డర్ ఆలోచనే ఉండదు. కానీ ఆ ఇల్లు సగం ఇండియాది, సగం బంగ్లాదేశ్‌ది.

భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న సరిహద్దులో ఈ ఇల్లు ఉన్న ప్రదేశాన్ని జీరో లైన్ అంటారు. ఆ ఇంటికి రెండు వైపులా... సరిహద్దు అంతా ఫెన్సింగ్‌తో ఉంటుంది. ఇంట్లోంచీ ఓ గీత లాంటిది వెళ్లినట్లుగా గుర్తు ఉంటుంది. ఆ గుర్తే సరిహద్దు. ఈ ఇల్లు... బెంగాల్‌లోని హరి పుకుర్ (Hari pukur)లో సరిహద్దులో ఉంది. ఈ ఇంట్లో గోడకు... ఓవైపు ఇండియా అనీ, మరోవైపు బంగ్లాదేశ్ అని రాసి ఉంటుంది. 

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఇల్లు (Image credit - ANI)

ఇంట్లో ఉన్నవారు... కలిసి పండుగలు చేసుకుంటారు. కలిసిమెలిసి ఉంటారు. కానీ వాళ్లను చూసినప్పుడు ఎవరు భారతీయులో, ఎవరు బంగ్లాదేశీయులో ఈజీగా గుర్తుపట్టేయవచ్చు. ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతతే ఉంటుంది. ఈ సరిహద్దు టెన్షన్లు ఉండవు. కానీ ఇంటి బయట మాత్రం మిగతా సరిహద్దులో లాగే... సెక్యూరిటీ ఉంటుంది. ఆ ఇంటిని కూడా రెండు దేశాల ఆర్మీ గమనిస్తూనే ఉంటుంది. ఇండియావైపున బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గమనిస్తూ ఉంటుంది. బంగ్లాదేశ్ వైపున బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ (Border Guards Bangladesh (BGB)) సైన్యం ఉంటుంది.

ఇండియా-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అలా ఉండదు. చాలా వరకూ ప్రశాంత వాతావరణమే ఉంటుంది. అందువల్ల ఆ ఇంటి చుట్టుపక్కల రెండు దేశాల సైన్యమూ రోజూ లాగే కలుసుకుంటూ... ప్రశాంతంగా ఉంటారు.

"ఆ ఇంటికి ఫెన్స్ లేదని మేం ఎప్పుడూ ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఇండియాతో ఎప్పుడూ మాకు సత్సంబంధాలే ఉన్నాయి" అని 2019లో BGB మేజర్ నయీమ్ కమాండర్ ANIకి తెలిపారు.

"చెప్పాలంటే... ఇక్కడ ఆలయాలు, మసీదుల దగ్గర ఎలాంటి సరిహద్దు రేఖలూ లేవు. అలాగని ప్రజలు ఫ్రీగా తిరిగే అవకాశమూ లేదు. ఇక్కడ 24 గంటలూ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి... ప్రజలు కూడా కొన్ని రూల్స్ పాటించాలి. బంగ్లాదేశీయులు, భారతీయులూ కలిసి నమాజు చేసుకోవడానికి ప్రత్యేక మసీదు ఉంది. అక్కడ ఏదైనా పండుగ, వేడుకలు జరపాలి అనుకుంటే... రెండు దేశాల భద్రతా దళాలు ముందుగానే మాట్లాడుకుంటాయి" అని BSF కమాండర్ బీఎస్ నేగీ... ANIకి తెలిపారు.

ఇలా సరిహద్దులో ఇల్లు ఉండటం... ఆ ఇంట్లోంచే సరిహద్దు గీత వెళ్లడం... ఆ ఇంట్లోనే రెండు దేశాల ప్రజలూ హాయిగా నివసిస్తుండటంతో... ఇండియాలోనే ఇదో ప్రత్యేక ఇల్లుగా ఉందనుకోవచ్చు.


1, ఆగస్టు 2021, ఆదివారం

NASA: మనం ఎప్పుడూ చూడని చిత్రం... 3 గెలాక్సీల యుద్ధం

3 గెలాక్సీల యుద్ధం (Image credit: ESA/Hubble & NASA, J. Dalcanton)

NASA: మన పాలపుంత (Milkyway) గెలాక్సీలో... కొన్ని కోట్ల నక్షత్రాలున్నాయి. వాటిలో జస్ట్ 10 పర్సెంట్ నక్షత్రాల్ని మాత్రమే మనం చూస్తున్నామేమో. మన గెలాక్సీ గురించే మనకు పూర్తిగా తెలియదు. అలాంటి ఈ అనంతవిశ్వంలో ఎన్నో అద్భుతాలు జరిగిపోతున్నాయి. అలాంటి వాటిని మనకు చూపిస్తున్న హబుల్ స్పేస్ టెలిస్కోప్... మరో అత్యంత అరుదైన దృశ్యాన్ని చూపించింది. ఒకేలా ఉన్న మూడు పాలపుంతలు (3 galaxies) కొట్టేసుకుంటున్న దృశ్యాన్ని చూపించింది.

అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ - నాసా (NASA), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) కలిసి ఈ దృశ్యాన్ని అభివృద్ధి చేశాయి. ఇందులో మూడు పాల పుంతలు.. మూడు గురుత్వాకర్షణలతో కొట్టేసుకుంటున్నాయి. ఒకదాన్ని మరొకటి లాగేసుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను ఆర్ప్ 195 (arp 195) అని పిలుస్తారు. అత్యంత అసాధారణ, విచిత్రమైన గెలాక్సీల వ్యవస్థలను ఆర్ప్ 195 అని పిలుస్తారు. ఇలాంటి గెలాక్సీలు మన విశ్వంలో అక్కడక్కడా ఉన్నాయి. ఇవి ఎప్పుడూ అంతుచిక్కని విధంగా, మిస్టరీగా, ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. 

3 గెలాక్సీల యుద్ధం (Image credit: ESA/Hubble & NASA, J. Dalcanton)


హబుల్ టెలిస్కోపుతో పనిచేసే వ్యోమగాములు (Astronomers)... ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకో తెలుసా... ఆ ఒక్క సెకండ్‌లోనే హబుల్ టెలిస్కోప్ చూపించే ఏదైనా అద్భుత దృశ్యం మిస్ కావచ్చు. ప్రత్యేక కంప్యూటర్ ఆల్గారిథమ్ ద్వారా... హబుల్ శోధనలను... వ్యోమగాములు పరిశోధిస్తూ ఉంటారు. కొన్ని అరుదైన సందర్భాల్లో హబుల్ టెలిస్కోప్ నుంచి పైన కనిపించే అత్యంత అరుదైన దృశ్యాలు లభిస్తాయి.

హబుల్ తనపాటికి తాను ఈ దృశ్యాన్ని చూపించేసింది. కానీ ఇప్పుడు అసలు పని వ్యోమగాములకు మొదలైంది. ఇక ఆ కొట్టుకునే మూడు గెలాక్సీలను పరిశోధిస్తూ... ఆ యుద్ధంలో ఏం జరుగుతుందో పరిశీలించే పని రోదశీ శాస్త్రవేత్తలది. ఇలాటివి గమనించేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ రెడీ చేస్తున్నారు. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుంది.