31, మార్చి 2024, ఆదివారం

Wonders of the World - ప్రపంచ వింతలు - 1

 


ఈ ప్రపంచమే ఒక వింత. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో. అలాంటి కొన్ని ఇప్పుడు చెప్పుకుందాం.


మనిషి శరీరంలో ఎన్ని అణువులు ఉంటాయి? 70 కేజీల వ్యక్తి శరీరంలో 7 ఆక్టీలియన్ అణువులు ఉంటాయి. అంటే 7 పక్కన 27 జీరోలు.

7,000,000,000,000,000,000,000,000,000


150ml వైన్ తయారుచెయ్యడానికి కేజీ 130 గ్రాముల ద్రాక్షపండ్లు అవసరం. అందుకే వైన్ ధర ఎక్కువగా ఉంటుంది.


సీతాకోకచిలుకలు ఈ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ అంటార్కిటికాలో లేవు.


ఫేమస్ పెయింటర్ పాబ్లో పికాసో పుట్టినప్పుడు ఏడవలేదు, కదల్లేదు. కనీసం ఊపిరి కూడా తీసుకోలేదు. చనిపోయాడనుకొని నర్సు పక్కన పెట్టింది. ఆ సమయంలో పికాసో తల్లి బంధువైన ఓ డాక్టర్ వచ్చి, సిగరెట్ పొగను పికాసో ముఖంపై ఊదాడు. దాంతో ఒక్కసారిగా కదిలిన పికాసో, ఊపిరి తీసుకొని, ఎడవడం మొదలుపెట్టాడు.


పాయిజన్ ఏరో అనే కప్ప శరీరంలో ఒకేసారి 2200 మందిని చంపగల విషం ఉంటుంది. ఈ కప్పలు దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి.

Poison arrow frog


గోల్డెన్ టార్టాయిస్ బీటిల్, ఊసరవెల్లిలా రంగులు మార్చగలదు. ఇది ఆకులు తింటూ బతుకుతుంది.


యాపిల్స్‌లో 7500 రకాలున్నాయి. ఈ చెట్టు గులాబీ జాతికి చెందినది.


వంకాయల్లో నికోటినిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సిగరెట్లు, చుట్టలో ఉండే నికోటిన్ లాగానే ఉంటుంది. కానీ ఇది మన శరీరానికి అంతగా హాని చెయ్యదు. 1 సిగరెట్‌లో ఎంత నికోటిన్ ఉంటుందో, అంత నికోటిన్ 9 కేజీల వంకాయల్లో ఉంటుంది.


30, మార్చి 2024, శనివారం

Why do monkeys still exist? - కోతులు ఇంకా ఎందుకు ఉన్నాయి?

 


కోతి నుంచి మనిషి వచ్చాడన్నది సైన్స్ చెబుతున్న మాట. మరైతే.. కోతులు ఇంకా ఎందుకున్నాయి? అవి ఉండకూడదు కదా అనే ప్రశ్న చాలా మందికి ఉంది. దీనిపై సైంటిస్టులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 450 కోట్ల సంవత్సరాల కిందట భూమి ఏర్పడిన తర్వాత.. వందల కోట్ల సంవత్సరాలు భూమిపై ఏ జీవమూ లేదు. భూమి చల్లబడిన తర్వాత.. Pangaea అనే భారీ సముద్రం ఏర్పడింది. ఆ సమయంలో ఖండాలన్నీ కలిసి, ఒకటే ఖండంగా ఉండేవి. ఆ భారీ సముద్రం నుంచే వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములు ఆవిర్భవించాయి. క్రమంగా అవే రూపాంతరం చెందుతూ.. కోట్ల సంవత్సరాల్లో రకరకాల సముద్ర జీవులుగా మారాయి. ఈ సమయంలోనే ఏక ఖండం కాస్తా, వేర్వేరు ఖండాలుగా విడిపోయింది.


సముద్రంలోని కొన్ని రకాల జీవులు.. నేలపైకి రావడం ప్రారంభించాయి. ఇది జీవ పరిణామక్రమంలో మరో ముందడుగు అయ్యింది. నేలపైకి వచ్చిన జీవులు ఈత కొట్టలేవు కాబట్టి.. భూమిపై బతికేందుకు వీలుగా వాటికి కాళ్లు వచ్చాయి. మరికొన్ని జీవులు.. ఆకాశంలో ఎగిరేందుకు ప్రయత్నించాయి. వాటికి రెక్కలొచ్చాయి. ఇలా కోట్ల సంవత్సరాలు గడిచే కొద్దీ.. మనుగడ కోసం పోరాటం చేసే జీవులకు... అందుకు తగినట్లుగా మార్పులు వస్తున్నాయి. దీన్నే శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ జీవ పరిణామ క్రమ సిద్ధాంతం అంటారు.


కోతి నుంచి మనిషి రావడం అనేది కూడా ఒక్క రోజులో జరిగింది కాదు. చెట్లు ఎక్కుతూ, కొమ్మలు పట్టుకొని, అక్కడి పండ్లను తింటూ బతికే కోతుల్లో కొన్ని కొత్త జాతులు ఆవిర్భవించాయి. చింపాజీలు, ఒరంగుటాన్లు, గొరిల్లాల వంటివి అలా వచ్చినవే. ఆ తర్వాత వాటి నుంచి వచ్చిన జాతే మనిషి జాతి. కొత్తగా వచ్చే ప్రతి జాతీ.. దాని ముందు జాతి కంటే అన్ని రకాలుగా మెరుగుగా ఉంటుంది. అంతే తప్ప, అది ముందు జాతిని అంతం చెయ్యదు. అందువల్లే కోతులు ఇప్పటికీ ఉన్నాయి. ఇది జీవుల పరిణామ క్రమంలో జరిగే సహజ ప్రక్రియ. భవిష్యత్తులో మనిషిని మించిన జీవులు రావనే గ్యారెంటీ లేదు.


సృష్టిలో మరో ధర్మం కూడా ఉంది. ఏ జీవులైతే.. ప్రకృతిలో పరిస్థితులను తట్టుకొని నిలబడతాయో.. అవి మనుగడ సాగించగలుగుతాయి. తట్టుకోలేని జీవులు అంతరించిపోతాయి. డోడో పక్షి, టాస్మేనియా టైగర్, ఆఫ్రికా మమ్మోత్ ఏనుగులు, డైనోసార్లు వంటి చాలా జీవులు ఇలాగే అంతరించిపోయాయి.


29, మార్చి 2024, శుక్రవారం

Are Peanuts better than egg? - గుడ్డు కంటే పల్లీలే గొప్పవా?

 


మనలో చాలా మంది ప్రోటీన్ కోసం గుడ్లు తింటారు. ఐతే.. గుడ్ల కంటే వేరుశనగలు బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. పల్లీలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కేజీ మాంసంలో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో, అన్ని ప్రోటీన్స్ వేరుశనగల్లోనూ ఉంటాయి. అలాగే కోడిగుడ్డు బరువుకి సమానమైన పల్లీలలో.. కోడిగుడ్డులో కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి. అందువల్ల ప్రోటీన్ కావాలనుకునేవారు, పల్లీలు తినడం బెటరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


మన దేశంలో వేరుశనగల కంటే.. వాటి నుంచి తీసే నూనె, డాల్డాను ఎక్కువగా వాడుతున్నారు. ఐతే.. పల్లీలు తినడానికి మాత్రమే కాదు.. వాటితో ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. సబ్బులు, నైట్రోగ్లిజరిన్, వార్నిష్, కలర్స్, పురుగుమందుల తయారీలో వీటిని వాడుతున్నారు. వేరుశనగల్లోని ప్రోటీన్‌తో దారాలు కూడా తయారుచేస్తున్నారు. వీటి తొక్కలతో సెల్యులోజ్‌ని చేస్తున్నారు. ఈ సెల్యులోజ్‌ని పేపర్, ప్లాస్టిక్, బోర్డుల తయారీకి వాడుతారు.


శరీరానికి కావాల్సిన శక్తి, ప్రొటీన్‌, పాస్ఫరస్‌, థెయామీన్‌, నియాసిన్‌ అనే పోషకాలు పల్లీల్లో ఉంటాయి. ఎ, బి, సి, ఇ సహా 13 రకాల విటమిన్లూ, ఐరన్‌, కాల్షియం, జింక్‌, బోరాన్‌.. వంటి 26 రకాల కీలక ఖనిజాలూ ఈ పప్పుల్లో ఉంటాయి. అలాగే గుండెకు మేలు చేసే మోనో అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు కూడా ఈ గింజల్లో లభిస్తాయి. 


స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీ, క్యారెట్, బీట్‌రూట్ కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు పల్లీలలో ఉంటాయి. వేరుశనగలు క్యాన్సర్‌ను అడ్డుకోగలవు. అలాగే ముసలితనం త్వరగా రాకుండా చెయ్యగలవు. పిల్లల ఎదుగుదలకు ఇవి చాలా అవసరం. ఇలా పల్లీలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా, వీటిలో 70 శాతం ఉండే శాచురేటెడ్, 15 శాతం ఉండే పాలి అన్‌శాచురేటెడ్ కొవ్వులు.. పెద్దవారికి కీడు చేస్తాయి. అందువల్ల రోజూ ఓ గుప్పెడు పల్లీలు తింటే ఆరోగ్యానికి మంచిదనీ, అంతకంటే ఎక్కువ తింటే అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.


28, మార్చి 2024, గురువారం

Why mosquitoes bite pregnant women more? - దోమలు ఎందుకు గర్భిణులను ఎక్కువగా కుడతాయి?

 


ప్రపంచంలో దోమలు అన్ని దేశాల్లో ఉన్నాయి. రిపోర్టుల ప్రకారం.. అంటార్కిటికా, ఐస్‌లాండ్‌లో మాత్రమే దోమలు లేవు. మైనస్ ఉష్ణోగ్రతల వల్లే అక్కడ దోమలు లేవని తెలుస్తోంది. ఐతే.. దోమలు ఎవర్ని ఎక్కువగా కుడతాయి? వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం.


దోమలు చెమట పట్టిన వారిని ఎక్కువగా కుడతాయి. ఎందుకంటే.. చెమటలో ఉండే అమ్మోనియా, లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్ అంటే దోమలకు ఇష్టం. అందువల్ల దోమలు కుట్టకూడదంటే, చెమట పట్టకుండా చూసుకోవాలి. అలాగే దోమలకు కార్బన్ డై ఆక్సైడ్ అంటే ఇష్టం. ఎవరైతే ఎక్కువగా శ్వాస తీసుకుంటూ ఉంటారో, వారు ఎక్కువగా కార్బన్ డై ఆక్సై్డ్ వదులుతారు. అలాంటి వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. అధిక బరువు ఉన్నవారు, గర్భిణులు ఎక్కువగా కార్బన్ డై ఆక్సైడ్ రిలీజ్ చేస్తారు. అలాగే గర్భిణులకు చెమట కూడా ఎక్కువగా పడుతుంది. అందువల్ల వారిపై దోమలు 21 శాతం ఎక్కువగా దాడిచేస్తాయని పరిశోధనల్లో తేలింది.


దోమలు డార్క్ కలర్ డ్రెస్సులకు ఎట్రాక్ట్ అవుతాయి. ఎవరైతే రెడ్, బ్లాక్, నేవీ బ్లూ కలర్ డ్రెస్సులు వేసుకుంటారో, దోమలు వారిని ముందుగా కుడతాయి. అందువల్ల దోమలకు దొరకకూడదంటే, లైట్ కలర్ డ్రెస్సులు వేసుకోవాలి.


మద్యం తాగేవారిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఎందుకంటే, మద్యం తాగాక వారికి ఎక్కువగా చెమట పడుతుంది. అందువల్ల మద్యానికి దూరంగా ఉంటే, దోమల నుంచి కూడా తప్పించుకోవచ్చు. బ్లడ్ గ్రూప్‌లలో O బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఏ, బీ గ్రూపుల వారిపై తక్కువగా దాడి చేస్తాయి. చర్మంపై గాయాలు, కురుపులూ ఉంటే.. అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది. అలాంటి చోటికి దోమలు ఎక్కువగా వెళ్తాయి. అందువల్ల గాయాలను త్వరగా తగ్గించుకోవాలి.


మొత్తంగా సాయంత్రం వేళ స్నానం చేసి, లైట్ కలర్ డ్రెస్ వేసుకొని, చెమట పట్టకుండా చూసుకునేవారిపై దోమల దాడి తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.


27, మార్చి 2024, బుధవారం

Why didn't Moon fall on the ground? చందమామ ఎందుకు భూమిపై పడట్లేదు?

 


మనం ఒక రాయిని పైకి ఎగరేస్తే.. అది మళ్లీ భూమిపై పడుతుంది. కారణం భూమికి ఉండే గురుత్వాకర్షణ బలం. కానీ చందమామ మాత్రం.. భూమి చుట్టూ తిరుగుతుందే తప్ప.. భూమిపై పడట్లేదు. ఇలా ఎందుకు అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. కారణం తెలుసుకుందాం.


భూమికి ఉండే గ్రావిటీ పవర్ వల్లే.. చందమామ భూమి చుట్టూ తిరుగుతుంది. ఐతే.. ఈ గురుత్వాకర్షణ బలం.. వస్తువు ఎంత దూరంలో ఉంది, ఎంత బరువుతో ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దగ్గరగా ఉండే వస్తువులను భూమి బలంగా తనవైపు లాక్కుంటుంది. దూరంగా ఉండే వస్తువులపై గ్రావిటీ పవర్ తక్కువగా ఉంటుంది. చందమామ భూమికి 

3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల.. దానిపై గ్రావిటీ పవర్ తక్కువగా ఉంది. అలాగని పూర్తిగా గ్రావిటీ లేకుండా పోలేదు. అందువల్ల చందమామ భూమికి దూరంగా ఉన్నా.. పూర్తిగా వెళ్లిపోకుండా.. భూమి చుట్టూ తిరుగుతూ ఉంది.


చందమామ భూమిపై పడకుండా ఉండటానికి కారణం.. దాని పరిభ్రమణ వేగమే. భూమిపై ఉన్న వస్తువు.. భూమి గ్రావిటీ నుంచి తప్పించుకోవాలంటే అది సెకండ్‌కి 11 కిలోమీటర్లకు పైగా వేగం (Orbital velocity)తో వెళ్లాలి. మీరు ఒక రాయిని ఈ వేగంతో ఆకాశంలోకి విసిరితే.. ఆ రాయి.. కంటిన్యూగా అదే వేగంతో వెళ్తే.. అది భూమిపై పడదు. అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది. అలాగే చందమామ కూడా భూమి చుట్టూ సెకండ్‌కి 1 కిలోమీటర్ కంటే ఎక్కువ వేగంతో తిరుగుతోంది. చందమామపై భూమి గ్రావిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల.. అది సెకండ్‌కి 1 కిలోమీటర్ వేగంతో భూమి చుట్టూ తిరిగినా చాలు, అది భూమిపై పడదు. అలా కాకుండా చందమామ తిరగడం ఆగినా, వేగం తగ్గినా.. అది భూమిపై పడగలదు.


మనం ఒక బొంగరాన్ని తిప్పినప్పుడు.. అది వేగంగా తిరిగినంతసేపూ.. తిరుగుతూనే ఉంటుంది. వేగం తగ్గినా, తిరగడం ఆగినా.. అది పడిపోతుంది. ఇలాగే మనం ఒక బకెట్‌కి తాడు కట్టి.. దాన్ని మన చుట్టూ గుండ్రంగా తిప్పుతూ ఉంటే.. అలా తిప్పినంతసేపూ ఆ బకెట్... కింద పడదు. వేగం తగ్గించినా, తిప్పడం ఆపినా, ఆ బకెట్ భూమిపై పడిపోతుంది. ఇదే ఫార్ములా చందమామకూ వర్తిస్తుంది.


450 కోట్ల సంవత్సరాల కిందట చందమామ ఏర్పడినప్పుడు అది భూమికి 27 కిలోమీటర్ల దూరంలోనే ఉండేదని శాస్త్రవేత్తల అంచనా. ఐతే.. చందమామ క్రమంగా భూమికి దూరంగా వెళ్తోంది. ఇప్పుడు కూడా సంవత్సరానికి 3.78 సెంటీమీటర్లు భూమికి దూరం వెళ్తోంది. అంటే.. భవిష్యత్తులో చందమామ.. మరింత దూరంగా వెళ్లిపోతుంది అనుకోవచ్చు.


ఒకవేళ చందమామ భూమివైపు రావడం మొదలుపెడితే.. భూమికి 18,470 కిలోమీటర్ల దగ్గరకు రాగానే పేలిపోతుంది. ఈ దూరాన్ని రోచ్ లిమిట్ అంటారు. ఈ లిమిట్ దాటి ఏది లోపలికి వచ్చినా పేలిపోతుంది. అందుకే ఉల్కలు, తోకచుక్కల వంటివి.. రోచ్ లిమిట్ లోకి రాగానే ముక్కలవుతాయి. చందమామ కూడా అలా వచ్చి, ముక్కలైతే.. ఆ రాళ్లు అగ్ని గోళాల్లా భూమిపై పడతాయి. దాంతో భూమిపై నగరాలన్నీ నాశనం అవుతాయి. జీవులన్నీ చనిపోతాయి. భూభ్రమణంలో కూడా మార్పులొస్తాయి. భూమి తిరిగే వేగం తగ్గిపోతుంది. భూతాపం బాగా పెరిగిపోతుంది. అలలు 30 వేల అడుగుల ఎత్తుకు లేస్తాయి. రోజూ 10 సునామీలు వస్తాయి. చివరకు యుగాంతం వస్తుంది. లక్కీగా అలా జరిగే ప్రమాదం లేదు. చందమామ భూమిపై పడే ఛాన్స్ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.



25, మార్చి 2024, సోమవారం

Why and how oxygen is collected? - ఆక్సిజన్‌ను ఎందుకు, ఎలా సేకరిస్తారు?

 


గాలిలో మనకు కావాల్సినంత ఆక్సిజన్ ఉంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్‌ని సేకరించి, సిలిండర్లలో స్టోర్ చెయ్యాల్సి ఉంటుంది. ఆస్పత్రుల్లో పేషెంట్ల కోసం, సముద్రాల్లో డైవర్ల కోసం, పర్వతాలు ఎక్కేవారి కోసం, అంతరిక్షంలోకి వెళ్లే ఆస్ట్రోనాట్ల కోసం, రాకెట్లలో ఫ్యూయల్ కోసం ఇలా చాలా అవసరాల కోసం ఆక్సిజన్‌ను సేకరిస్తారు. ఇందుకు రెండు ప్రత్యేక ప్రక్రియలు ఉన్నాయి.


జనరల్‌గా గాలిలో 21 శాతం ఆక్సిజన్‌, 78 శాతం నైట్రోజన్‌, ఒక శాతం ఇతర వాయువులు ఉంటాయి. గాలిలో ఆక్సిజన్‌ అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని తొలిసారిగా లెవోషియర్‌, ప్రీస్ట్‌లీ అనే సైంటిస్టులు కనిపెట్టారు. రంగు, రుచి, వాసన లేని ఈ గ్యాస్.. భూమి పొరల్లో మెటల్ ఆక్సైడ్‌ (Metal oxide) రూపంలో 50 శాతం దాకా ఉంది. ఈ ఆక్సిజన్ వాయువుని చల్లబరిస్తే, మైనస్‌ 185 డిగ్రీల సెంటిగ్రేడు దగ్గర లైట్ బ్లూ కలర్ లిక్విడ్‌లా మారుతుంది. అలాగే మైనస్‌ 219 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు చల్లబరిస్తే, ఇది ఐస్ లాగా ఘనపదార్థంగా మారుతుంది.


ల్యాబ్‌లో పొటాషియం క్లోరేట్‌ (Potassium chlorate), మాంగనీస్‌ డై ఆక్సైడ్‌ (Manganese dioxide)ని కలిపి వేడి చేస్తే, ఆక్సిజన్‌ గ్యాస్ తయారవుతుంది. అలాగే గాలి నుంచి కూడా ఫ్రాక్షనల్ డిస్టిల్లేషన్ (Fractional Destillation) విధానంలో ఆక్సిజన్‌ని సేకరించవచ్చు. ఇందుకోసం గాలిపై ఒత్తిడిని 200 రెట్లు పెంచి, సన్నని కన్నం ద్వారా, ఒక రూంలోకి పంపిస్తారు. రూంలోకి వెళ్లాక ఒత్తిడి ఒక్కసారిగా పోతుంది. దాంతో గాలి, లిక్విడ్ లాగా మారుతుంది. ఆ తర్వాత ఆ లిక్విడ్ నుంచి నైట్రోజన్‌ గ్యాస్‌ని వేరు చేస్తారు. దాంతో ఆక్సిజన్‌ లిక్విడ్ రూపంలో లభిస్తుంది. దీన్ని గ్యాస్ లాగా మార్చి సిలిండర్లలో నింపుతారు. ఇలా ఈ భూమిపై సమస్త జీవ రాశికీ ప్రాణ వాయువుగా చెప్పుకునే ఆక్సిజన్ గ్యాస్‌ని ప్రత్యేక పద్ధతుల్లో రెండు రకాలుగా సేకరిస్తారు.


24, మార్చి 2024, ఆదివారం

Why walk in the morning? - ఉదయం వేళ ఎందుకు నడవాలి?

 


కొంతమంది ఉదయం వేళ వాకింగ్ చేస్తారు. కొంతమంది సాయంత్రం వేళ చేస్తారు. ఆరోగ్య నిపుణులు మాత్రం సాయంత్రం కంటే మార్నింగ్ వాకే బెటర్ అంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం.


రాత్రివేళ మనం నిద్రపోయినప్పుడు విశ్రాంతి లభిస్తుంది. ఈ సమయంలో మన శరీరంలోని అన్ని అవయవాలూ రెస్ట్ తీసుకుంటాయి. మార్నింగ్ లేచాక కూడా చేతులు, కాళ్లు సహా చాలా అవయవాలు అలాగే ఉంటాయి. వాటిని యాక్టివ్ చేసేందుకు వాకింగ్ సరైనది అని నిపుణులు తేల్చారు.


ఉదయం వేళ నడిచే సమయంలో.. బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తద్వారా గుండె నుంచి శరీర భాగాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఫలితంగా అన్ని అవయవాలూ ఆక్సిజన్ పొందుతూ ఆరోగ్యంగా ఉంటాయి. నడక గుండెకు చాలా మంచిదని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు.. నడక వల్ల చెమట పడుతుంది. దాంతో చర్మ కణాలు క్లీన్ అవుతాయి. మృత కణాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా చర్మంపై ముడతలు తగ్గి, యంగ్ లుక్‌తో కనిపిస్తాం. 


రాత్రివేళ వాహనాల రాకపోకలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఉదయాన్నే వాతావరణంలో వాయు కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాకింగ్ చేస్తే, ఆక్సిజన్ బాగా లభిస్తుంది. అదే సాయంత్రం వేళైతే.. వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈవెనింగ్ కంటే మార్నింగ్ వాకే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.



23, మార్చి 2024, శనివారం

Meaning of Rose Flowers - 9 గులాబీలు ఇస్తే అర్థమేంటి?

 


మనందరికీ గులాబీలు నచ్చుతాయి. చాలా అందమైన, ఆకర్షణీయమైన ఈ పూలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ప్రేమను వ్యక్తం చెయ్యడానికి రోజాలనే ఎంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే సంప్రదాయం ఉంది.


రోజా పూలలో ఒక్కో రంగుకీ ఒక్కో అర్థం ఉంది. లవ్ ప్రపోజల్ కోసం రెడ్ కలర్ రోజాను ఇస్తారు. ఎవరికైనా థాంక్స్ చెప్పేటప్పుడు పింక్ కలర్ రోజాను ఇస్తారు. స్నేహాన్ని వ్యక్తం చెయ్యడానికి ఎల్లో కలర్ రోజా ఉంది. ఎవరైనా మీకు ఆరెంజ్ కలర్ గులాబీని ఇస్తే, దాని అర్థం వారు మీతో సంతోషంగా ఉన్నారని. అలాగే.. గొడవలు మానేసి, శాంతిగా ఉందాం అని చెప్పేందుకు వైట్ రోజాను ఇస్తారు. ఎవరికైనా ఫేర్‌వెల్ చెప్పేటప్పుడు కూడా వైట్ రోజ్ ఇస్తారు. ఇంకా.. ఎవరైనా మిస్టరీగా అనిపిస్తే, వారికి బ్లూ రోజాలను ఇస్తారు. మనం బలంగా ఉన్నాం, మనకు తిరుగులేదు అని చెప్పేందుకు గ్రీన్ రోజాలను ఇస్తారు. 


రోజాల కలర్స్ మాత్రమే కాదు.. నంబర్‌కి కూడా అర్థాలున్నాయి. ఒక అమ్మాయికి ఒక రోజా పువ్వు ఇస్తే, దాని అర్థం, తొలిచూపులోనే నిన్ను ప్రేమించాను అని. అదే 9 గులాబీలు ఇస్తే, మనిద్దరం జీవితాంతం కలిసి ఉందామని అర్థం. అదే 15 రోజాలు ఇస్తే, నీ నుంచి దూరం అవుతున్నందుకు క్షమించు అని అర్థమట. లవర్స్ లేదా పార్ట్‌నర్స్ బ్రేకప్ సమయంలో ఇలా 15 రోజాలు ఇచ్చుకుంటారు.


ప్రపంచంలో ఎన్నో రకాల పూలు ఉండగా.. రోజాలనే ఎందుకు ఇస్తారు అనే ప్రశ్న మనకు రావచ్చు. ఎందుకంటే.. రోజా పూలంటేనే మానవ సంబంధాలు, స్వచ్ఛతకు ప్రతీక. మన జీవితంలోని స్నేహం, ప్రేమ, శాంతి, ఐకమత్యం ఇలా ప్రతీ ఫీలింగ్‌నీ వ్యక్తం చెయ్యడానికి రకరకాల రంగుల్లో రోజాలు ఉన్నాయి. ఐతే, ఎన్ని రంగులు ఉన్నా, రెడ్ రోజాలు అన్నింటికంటే గొప్పవిగా భావిస్తారు. ఎందుకంటే రెడ్ రోజాలు.. అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి, వాటిని చూడగానే పాజిటివ్ ఫీల్ కలిగిస్తాయి. ఇవి హృదయాన్ని టచ్ చేస్తాయి. మానవ సంబంధాలను బలపరుస్తాయి. అందుకే ప్రేమను వ్యక్తం చెయ్యడానికి రెడ్ రోజాలనే ఇస్తారు.


22, మార్చి 2024, శుక్రవారం

Are eggs vegetarian? - కోడిగుడ్లు శాకాహారమా?

 


కోడి మాంసాహారం అయినప్పుడు, కోడిగుడ్డు శాకాహారం ఎలా అవుతుంది? అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. కానీ డాక్టర్లేమో.. కోడిగుడ్డు శాకాహారం అనీ, రోజూ ఒక గుడ్డు తినాలని సూచిస్తుంటారు. దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలుసుకుందాం.


కోడిగుడ్లలో ప్రధానంగా 2 రకాలున్నాయి. 1.నాటుకోడి గుడ్లు. 2.ఫారంకోడి గుడ్లు. నాటుకోడి గుడ్లు సహజమైనవి. అంటే.. ఈ గుడ్లు ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా వస్తాయి. అంతేకాదు.. వీటిని కోడిపెట్ట పొదిగితే, కోడిపిల్లలు కూడా వస్తాయి. అందువల్ల నాటుకోడి గుడ్లు అసలైన, నిజమైన కోడిగుడ్లు కింద లెక్క.


ఫారంకోడి గుడ్లు కృత్రిమమైనవి. ఈ గుడ్లను జెనెటిక్ ఇంజినీరింగ్ పద్ధతిలో.. జన్యుపరమైన మార్పులు చేసి, కోడి గర్భం నుంచే గుడ్లు వచ్చేలా చేస్తారు. కానీ ఈ గుడ్లను పొదిగితే కోడిపిల్లలు రావు. ఎందుకంటే, ఈ గుడ్లలో ఫలదీకరణం చెందిన అండం ఉండదు. అంటే.. ఈ గుడ్లను పెట్టే కోళ్లకు, కృత్రిమ పద్ధతిలో శుక్రద్రవాన్ని ఇంజెక్ట్‌ చేస్తారు. ఇందులో కోడిపుంజు ప్రమేయం ఉండదు. అందువల్ల ఫారం కోడి గుడ్లలో జీవం ఉండదు.


ఫారం కోడి గుడ్లలో తెల్లసొన, పసుపు సొనతో ఉన్న ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అందుకే వీటిని శాకాహారం అంటారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తారు? నాటుకోడి గుడ్లనే పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చెయ్యవచ్చుగా? అనే మరో ప్రశ్న మనకు రావచ్చు. నాటుకోడి గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అదే ఫారంకోడి గుడ్లను చల్లటి వాతావరణంలో ఎక్కువ కాలం నిల్వ ఉంచినా పాడవ్వవు. అంటే.. ఫ్రిజ్‌లో 3 నుంచి 5 వారాలు ఉంచినా బాగానే ఉంటాయి. అదే ఫ్రీజర్‌లో ఉంచితే, సంవత్సరం వరకూ పాడవకుండా ఉంటాయి.


21, మార్చి 2024, గురువారం

Does a person die if a crow scratches head? - కాకి తలపై గీరితే చనిపోతారా?

 


కాకులు మన ఇళ్ల దగ్గరే జీవిస్తాయి. ఎక్కువగా కొబ్బరి చెట్లపై గూళ్లు కట్టుకుంటాయి. మనం తినే చాలా రకాల ఆహారాలను కాకులు తింటాయి. మన పురాణాల్లో కాకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అంతేకాదు.. కాకులు చాలా తెలివైనవి. క్రమశిక్షణ పాటిస్తాయి. ఒక కాకికి ఆహారం దొరికితే, అది మిగతా కాకులనూ పిలుస్తుంది. అలాగే ఒకటి చనిపోతే, మిగతా కాకులన్నీ బాధ వ్యక్తం చేస్తాయి. అందుకే కాకుల పట్ల మనం పాజిటివ్ ఫీలింగ్స్‌తో ఉంటాం. అయితే.. ఒక్కోసారి కాకులు మనపై దాడి చేస్తాయి. ఎందుకో తెలుసుకుందాం.


సాధారణంగా కాకులు మనపై దాడి చెయ్యవు. కాకుల గూళ్లలో పిల్లలు ఉన్నప్పుడు, ఆ చెట్లకు దగ్గరగా ఎవరైనా వెళ్తే, కాకులు దాడి చేస్తాయి. అలాగే.. పిల్లల్లో ఏదైనా మిస్సింగ్ అయితే కూడా.. కాకులు ఆగ్రహంతో అటుగా వచ్చే వారిపై దాడి చేస్తాయి. ఇలా దాడి చేసేటప్పుడు అవి వేగంగా వచ్చి.. కాలి గోళ్లతో తలపై గీరుతూ ఎగురుతాయి. మరి ఇలా గీరితే చనిపోతారనే ప్రచారం ఉంది. నిజానికి అది మూఢనమ్మకం మాత్రమే.


ఈ మూఢనమ్మకం రావడానికి కారణం.. పేదరికం. పూర్వం కాకులు దాడి చేసినప్పుడు సరైన వైద్య సదుపాయాలు ఉండేవి కావు. ఐతే.. కాకులు రకరకాల ఆహారాలను కాలి గోళ్లతో చీల్చుతూ తింటాయి. కుళ్లిపోయిన వాటినీ, చనిపోయిన జీవుల మాంసాన్నీ కాళ్లతో పీక్కుతింటాయి. అందువల్ల వాటి గోళ్లలో రకరకాల వైరస్, బ్యాక్టీరియా ఉంటాయి. అవి కాళ్లతో తలపై గీరినప్పుడు, గాయం అయితే.. ఆ వైరస్, బ్యాక్టీరియా, ఆ గాయం ద్వారా శరీరంలోకి వెళ్లగలవు. అలాంటి సందర్భంలో.. జబ్బులు వచ్చి, చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే కాకి గీరితే, చనిపోతారనే మూఢనమ్మకం వచ్చింది.


ఈ రోజుల్లో వైద్య సదుపాయాలు చాలా డెవలప్ అయ్యాయి. కాకి గీరినప్పుడు షాంపూతో తల స్నానం చేస్తే సరిపోతుంది. అలాగే కాకి దాడి చేస్తున్నప్పుడు.. ఓ కర్రను తల కంటే పైకి పట్టుకుంటే.. కర్ర కారణంగా కాకి దగ్గరకు రాదు. అలా కాకుల దాడి నుంచి తప్పించుకోవచ్చు.


Why is the noise of airplanes less at night? - విమానాల శబ్దం రాత్రివేళ ఎందుకు తక్కువగా వినిపిస్తుంది?

 


మనందరం ఆకాశంలో వెళ్లే విమానాలను తరచూ చూస్తూనే ఉంటాం. విమాన వేగం కంటే, ధ్వని వేగం తక్కువ కాబట్టి, ఫ్లైట్ కొంత ముందుకు వెళ్లాక, దాని సౌండ్ మనకు వినిపిస్తుంది. విమానం గాలిని చీల్చుతూ వెళ్లడం వల్ల ఈ ధ్వని ఉత్పత్తి అవుతుంది. అలాగే విమాన ఇంజిన్ల శబ్దం కూడా ఈ ధ్వనిలో ఉంటుంది. ఐతే.. పగటివేళ విమానం వెళ్లినప్పుడు వినిపించేంత శబ్దం, రాత్రివేళ ఎందుకు వినిపించదు? తెలుసుకుందాం.


పగటివేళ రకరకాల ధ్వనులు వస్తూ ఉంటాయి. అయినా ఆకాశంలో విమానం వెళ్తే, శబ్దం బాగా వినిపిస్తుంది, రాత్రివేళ వేరే శబ్దాలు లేకపోయినా, విమాన ధ్వని చాలా తక్కువగా వినిపిస్తుంది. దీనికి కారణం గాలిలో ధ్వని ప్రయాణించే విధానమే. గాలి వేగం, బరువును బట్టి, శబ్ద తరంగాల ప్రయాణం ఆధారపడి ఉంటుంది. రాత్రివేళ కంటే, పగటి పూట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు, గాలి వేగం తక్కువగా ఉంటుంది. గాలి వేగం తక్కువగా ఉన్నప్పుడు శబ్ద తరంగాలు మనల్ని పూర్తిగా చేరలేవు.


గాలి బరువును పరిశీలిస్తే, పగటివేళ ఉష్ణోగ్రత కారణంగా గాలి బరువు తక్కువగా ఉంటుంది. అలాగే రాత్రివేళ గాలి బరువు ఎక్కువగా ఉంటుంది. గాలి బరువు తక్కువగా ఉన్నప్పుడు.. ధ్వని ఎక్కువ దూరం వినిపించగలదు. అందుకే పగటివేళ విమాన శబ్దం మనకు బాగా వినిపిస్తుంది. రాత్రివేళ చల్లదనం వల్ల గాలి బరువెక్కుతుంది. బరువైన గాలిలో శబ్ద తరంగాలు ఎక్కువ దూరం వెళ్లలేవు. అందుకే మనకు రాత్రివేళ విమాన శబ్దం తక్కువగా వినిపిస్తుంది.


పగటివేళ ధ్వనికి తీవ్రత (sound intensity) ఎక్కువగా ఉంటుంది. అందువల్ల విమాన శబ్దం మనకు స్పష్టంగా వినిపిస్తుంది. రాత్రివేళ ధ్వని తీవ్రత సరిగా ఉండదు. ఈ లక్షణం వల్ల కూడా రాత్రివేళ విమాన శబ్దం తక్కువగా వినిపిస్తుంది.


20, మార్చి 2024, బుధవారం

What is humidity? - తేమ అంటే ఏంటి?

 




మనందరం వాతావరణంలో తేమ శాతం పెరిగిందనీ, తగ్గిందనీ వచ్చే వార్తలు వింటుంటాం. అప్పుడు మనకు చాలా డౌట్స్ వస్తాయి. అసలు ఈ తేమ అంటే ఏంటి? నీటినే మనం తేమ అంటున్నామా? అనే ప్రశ్నలు కలుగుతాయి. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


నిజానికి నీటి మరో రూపమే తేమ. ఈ నీరు.. వేడెక్కినప్పుడు గ్యాస్ లాగా మారుతుంది. దాన్నే మనం నీటి ఆవిరి అంటాం. దాన్నే తేమ అని కూడా అంటాం. ఈ తేమ మనకు కనిపించదు. ఎందుకంటే.. నీటి అణువులు చాలా చిన్నగా ఉంటాయి. నీరు, గ్యాస్‌గా మారినప్పుడు ఈ అణువుల మధ్య దూరం పెరుగుతుంది. అదే అణువులు.. తిరిగి దగ్గరైనప్పుడు.. నీటి రూపంలోకి మారతాయి. అప్పుడు మనం వాటిని చూడగలం. ఒక నీటి చుక్కలో 1.5 సెక్స్టిలియన్ అణువులు ఉంటాయి. ఒక సెక్స్టిలియన్ అంటే.. ఈ నంబర్‌కి 1 పక్కన 21 జీరోలు ఉంటాయి. ఈ లెక్కన 1.5 సెక్స్టిలియన్ అణువులంటే ఎంత ఎక్కువో అంచనాకు అందదు.


మనకు కనిపించే మేఘాలన్నీ నీరే. సూర్యుడి ఉష్ణోగ్రత వల్ల.. నీరు వేడెక్కి.. ఆవిరిగా మారాక.. ఆ అణువులు.. విడివిడిగా అయిపోతూ.. వాతావరణంలో స్వేచ్ఛగా ఉంటాయి. వేడి తగ్గుతున్నప్పుడు.. అవే అణువులు దగ్గరవుతూ.. ఆకాశంలో మేఘాల రూపంలో ఉంటాయి. వేడి మరింత తగ్గే కొద్దీ.. మేఘాల్లో నీటి అణువుల మధ్య దూరం బాగా తగ్గిపోతుంది. అప్పుడు అణువులన్నీ దగ్గరవుతుంటే.. వాటికి నీటి రూపం వస్తుంది. నీరుగా మారగానే.. భూమ్యాకర్షణ వల్ల ఆ నీరు... భూమిపై పడుతుంది. దాన్నే మనం వర్షం అంటున్నాం.


వాతావరణంలో నీటి ఆవిరి.. అదే.. తేమ ఎక్కువగా ఉంటే.. ఆ సమయంలో.. ఎండ పడకుండా మేఘాలు సూర్యుడికి అడ్డుగా వస్తే.. క్రమంగా వాతావరణంలో వేడి తగ్గుతుంది. ఫలితంగా నీటి ఆవిరి మేఘాలతో కలుస్తుంది. దాంతో మేఘాల రూపంలో ఉన్న అణువులు.. మరింత దగ్గరకు చేరి పూర్తి స్థాయి నీరుగా మారుతాయి. అందువల్ల వర్షం పడుతుంది.


వాతావరణ అధికారులు.. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది అని చెబితే.. అప్పుడు వర్షం పడే అవకాశాలు ఉంటాయని మనం అనుకోవచ్చు. అదే సమయంలో ఆకాశంలో దట్టమైన మేఘాలు కూడా ఉండాలి. అప్పుడే వాన పడగలదు. గాలిలో తేమ 80 శాతానికి పైగా ఉంటే చిరుజల్లులు కురుస్తాయి. 90 శాతానికి పైగా ఉంటే, ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. 100 శాతానికి చేరినప్పుడు భారీ వర్షం పడుతుంది. ఇలా తేమ శాతం పెరిగేకొద్దీ.. మనకు వర్షం, చల్లదనం పెరుగుతాయి. 


వాతావరణంలో తేమ ఎంత శాతం ఉంది అనేది.. ఉష్ణోగ్రతతోపాటూ.. గాలి వల్ల కూడా డిసైడ్ అవుతుంది. గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు.. గాలిలో తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. గాలి వేగం తక్కువగా ఉన్నప్పుడు తేమ కూడా తక్కువగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, గాలిలో తేమ 30 శాతం నుంచి 70 శాతం మధ్య ఉండాలి. 30 శాతం కంటే తక్కువ ఉన్నా, 70 శాతం కంటే ఎక్కువ ఉన్నా.. రకరకాల అనారోగ్యాలు రాగలవు. ఇలా గాలిలో తేమ.. వాతావరణ అంచనాల్లో కీలక అంశంగా ఉంటుంది.



Does eating fish prevent diabetes? - చేపలు తింటే డయాబెటిస్ రాదా?


ఇండియాలో కోట్ల మందికి డయాబెటిస్ ఉంది. రోజురోజుకూ ఈ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. డయాబెటిస్.. 90 శాతం వరకూ.. జన్యువుల కారణంగా.. వంశపారంపర్యంగా వస్తుంది. అంటే వంశంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే.. వారి వారసులకు కూడా ఏదో ఒక వయసులో అది వస్తుంది. కారణం డయాబెటిస్ జీన్.. వారి DNAలో డామినెంట్ జీన్‌గా ఉండటమే. అలాంటి వారు ఏం తిన్నా, తినకపోయినా, డయాబెటిస్ మాత్రం వస్తుంది. ఐతే, సాధారణంగా. చేపలు తింటే, డయాబెటిస్ రాదా అన్నది తెలుసుకుందాం.


ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకూ జరిగిన చాలా పరిశోధనల్లో.. మాంసం బదులు చేపలు తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశాలు బాగా తగ్గుతున్నాయి. రోజూ చేపలు తినడం వల్ల డయాబెటిస్‌ని దూరంగా ఉంచవచ్చని.. లండన్‌లోని వలెన్సియా యూనివర్సిటీ నిపుణులు తేల్చారు. వయస్సు 55 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న 945 మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించారు. 


చేపలు తిన్న వారిలో డయాబెటిస్‌ సాధారణ స్థితిలో ఉంటోంది. అంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్ సాధారణ స్థితిలో ఉంటోంది. అదే సమయంలో, మాంసం తిన్న వారిలో షుగర్ లెవెల్స్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. తద్వారా చేపలు తినడం వల్ల డయాబెటీస్‌ కంట్రోల్‌‌లో ఉంటోందని తేల్చారు. అలాగే చేపలు తినడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు.


హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. వారానికి ఒకసారి చేపలు తింటే.. అలాంటి వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం 40 శాతం తక్కువగా ఉంటోంది. ఎందుకంటే.. చేపల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్.. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోకుండా చేస్తున్నాయి. ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి అయితే, డయాబెటిస్ సమస్య ఉండదు. అందువల్ల డయాబెటిస్ రాకుండా ఉండాలన్నా, ఆల్రెడీ ఉన్న డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలన్నా చేపలు తినాలని నిపుణులు చెబుతున్నారు.

 


16, మార్చి 2024, శనివారం

Why flame always goes up? ఎందుకు మంట ఎప్పుడూ పైకి లేస్తుంది?

 


భూమికి ఆకర్షణ శక్తి ఉండటం వల్ల, ఏదైనా వస్తువు మన చేతి నుంచి జారితే, అది భూమిపైనే పడుతుంది గానీ ఆకాశం వైపు వెళ్లదు. నీరు కూడా భూమివైపే పడుతుంది తప్ప.. పైకి వెళ్లదు. కానీ మంట మాత్రం పైకే వెళ్తుంది. భూమిపై ఎక్కడ ఎలాంటి మంట వచ్చినా, అది పైకే ఎగసిపడుతుంది తప్ప, భూమివైపు వెళ్లదు. ఇందుకు కారణం తెలుసుకుందాం.


మంట పైకి వెళ్లడానికి ప్రధాన కారణం గాలి. మంట మండేటప్పుడు, తన చుట్టూ ఉన్న గాలిని వేడెక్కిస్తుంది. దాంతో ఆ గాలి బరువు తగ్గుతుంది. తేలికైన గాలిపై భూమ్యాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో ఆ గాలి.. భూమి నుంచి దూరంగా పైకి వెళ్తుంది. అలా ఆ గాలి వెళ్లగానే.. ఆ ప్రదేశంలోకి బరువైన గాలి వచ్చి చేరుతుంది. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. 


పైకి వెళ్లే గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. బరువైన గాలి వేగం తక్కువగా ఉంటుంది. మంటచుట్టూ ఉండే గాలి.. పైకి వెళ్తున్నప్పుడు.. దాని కారణంగా.. మంట కూడా పైకే వెళ్తుంది. అందుకే మంట ఎప్పుడూ పైకే వెళ్తుంది.


పెద్దల సమక్షంలో, విద్యార్థులు ఓ చిన్న ప్రయోగంతో దీన్ని చేసి చూడవచ్చు. ఓ కొవ్వొత్తిని వెలిగించినప్పుడు, మంట పైకి వెళ్తుంది. ఆ కొవ్వొత్తిని పక్కకు వంచినా, కిందకు వంచినా, ఎటు వంచినా, మంట మాత్రం వంగకుండా, పైకే వెళ్తుండటాన్ని గమనించవచ్చు. మరో విషయం.. దేనికైనా నీడ ఉంటుంది గానీ, మంటకు ఉండదు. అందువల్ల కొవ్వొత్తి, దాన్ని పట్టుకున్నవారి నీడ కనిపిస్తుంది కానీ, మంట నీడ కనిపించదు. అందుకే వెలుతురు ఉన్న చోట, చీకటి ఉండదు అంటారు.


15, మార్చి 2024, శుక్రవారం

Quit smoking? use cabbage! స్మోకింగ్ మానేయాలా? ఐతే, క్యాబేజీ వాడండి!


స్మోకింగ్ ఈజ్ ఇన్జూరియస్ టు హెల్త్ అని తెలిసి, చాలా మంది పొగతాగడం తగ్గించారు. ఇప్పటికీ కొంతమంది స్మోక్ చేస్తున్నారు. ఆ అలవాటు నుంచి బయటపడాలంటే.. క్యాబేజీ తినడం మేలు. ఇది తెలియగానే,.. క్యాబేజీకీ, స్మోకింగ్‌కీ సంబంధమేంటి? అనే ప్రశ్న మనకు వస్తుంది. అదేంటో తెలుసుకుందాం.


క్యాబేజీ గురించి చెప్పుకుంటే.. ఇది గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ఆకు కూర. దీన్ని కూరల్లో, సలాడ్లలో, ఫ్రైలలో ఇలా రకరకాలుగా వాడుతున్నాం. కొంతమంది పచ్చి క్యాబేజీని తింటారు. అలా తినకూడదు. ఎందుకంటే క్యాబేజీ ఆకులపై కంటికి కనిపించని, టేప్ వార్మ్ (Tapeworm) అనే పురుగు ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఉంటే, కడుపులోకి వెళ్లి, అక్కడి నుంచి బ్రెయిన్ లోకి వెళ్లి.. బ్రెయిన్‌ని తింటూ, 25 మీటర్ల పొడవు పెరుగుతూ, ప్రాణం తియ్యగలదు. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి, ఈ పురుగును చూడొచ్చు.


క్యాన్సర్‌ని అడ్డుకునే శక్తి క్యాబేజీకి ఉంది. అలాగే ఈ ఆకుకూరను తరచూ తింటూ ఉంటే, అధిక బరువును తగ్గించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇదే విధంగా.. స్మోకింగ్ చేసేవారు.. రెగ్యులర్‌గా క్యాబేజీని తీసుకుంటే, వారిలో పొగ తాగే అలవాటు క్రమంగా తగ్గుతుంది. ఎందుకంటే పొగాకులో ఉండే నికోటిన్ అనే పదార్థం, క్యాబేజీలో చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల క్యాబేజీ తిన్నవారికి.. పొగతాగాలి అని త్వరగా అనిపించదు, అని పరిశోధనలు చెబుతున్నాయి.


ఈ నికోటిన్ అనేది ఓ రకమైన మత్తు పదార్థం. ఇది శరీరంలోకి వెళ్లాక, బ్రెయిన్ నుంచి శరీరానికి సంకేతాలు వేగంగా వెళ్లేలా చేస్తుంది. అంటే.. వ్యక్తులు టెంపరరీగా యాక్టివ్ అయ్యేలా ఇది చేస్తుంది. ఐతే.. ఇది క్రమంగా వారి ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా దెబ్బతీస్తుంది. అందుకే స్మోకింగ్ చెయ్యొద్దు అంటారు. క్యాబేజీలో ఉండే నికోటిన్ చాలా తక్కువ శాతం కాబట్టి.. దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంతగా కనిపించవు. ఐతే.. క్యాబేజీ తినేవారు పూర్తిగా స్మోకింగ్ మానేస్తారని చెప్పలేం. స్మోకింగ్ మానేయాలని బలంగా డిసైడ్ అయితే, అప్పుడు క్యాబేజీ అవసరం లేకుండానే మానేయగలరు.


14, మార్చి 2024, గురువారం

Does the Sun contain vitamin D? - సూర్యుడిలో డి విటమిన్ ఉంటుందా?


 సూర్యుడిలో డి విటమిన్ ఉంటుందా? అంటే.. ఉంటుంది కదా.. సూర్యుడి నుంచే D విటమిన్ వస్తుంది కదా.. అని మనం అనుకుంటాం. నిజమేంటంటే.. D విటమిన్ సూర్యుడి నుంచి రాదు. అది మనలో నుంచే వస్తుంది. ఎలాగో తెలుసుకుందాం.


ఫస్ట్ మనం డి విటమిన్ అంటే ఏంటో చూడాలి. ఎందుకంటే ఇది సింగిల్‌ది కాదు. కొన్ని కెమికల్స్‌ని కలిపి మనం డి విటమిన్ అని పిలుస్తున్నాం. విటమిన్ డి1, డి2, డి3, డి4, డి5 అనే ఐదు రకాల భిన్నమైన కెమికల్స్ అన్నింటినీ కలిపి డి విటమిన్ అని పిలుస్తారు.


మనం చెప్పుకున్న 5 కెమికల్స్‌లో D3 అనేది చాలా ముఖ్యమైనది. మనం ఎండలో తిరిగినప్పుడు మన బాడీలో తయారయ్యేది ఇదే. అఫ్‌కోర్స్ క్షీరదాల బాడీలో కూడా ఇది తయారవుతుంది. D3ని సైంటిఫిక్‌గా కోలికాల్సిఫెరాల్‌ అని అంటారు.

Cholecalciferol


మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. దాన్ని LDL కొలెస్ట్రాల్ అంటారు. ఇది మన చర్మంలో కూడా ఉంటుంది. మనం ఎండలో తిరిగినప్పుడు.. LDL కొలెస్ట్రాల్ నుంచి విటమిన్ D3 తయారవుతుంది. సూర్యుడిలోని అతినీలలోహిత కాంతి, మన చర్మంపై పడినప్పుడు విటమిన్ D3 తయారవుతుంది.

(Ultraviolet light)


మనం ఉదయం లేదా సాయంత్రం వేళ ఎండలో తిరిగితేనే, విటమిన్ D తయారవుతుందా? మధ్యాహ్నం వేళ తిరిగితే తయారవ్వదా? అనే డౌట్ కూడా మనకు ఉంటుంది. నిజానికి ఉదయం, సాయంత్రం కంటే.. మధ్యాహ్నం వేళ ఎండలో తిరిగితే.. ఎక్కువ విటమిన్ D తయారవుతుంది. ఎందుకంటే.. మధ్యాహ్నం సమయంలోనే సూర్యుడి నుంచి అతి నీలలోహిత కిరణాలు ఎక్కువగా వస్తాయి. కానీ ఆ ఎండను మనం తట్టుకోలేం. అందుకే డాక్టర్లు ఉదయం, సాయంత్రం వేళ వాకింగ్ చెయ్యమంటారు. ఆ వేడిలో కూడా మన బాడీలో డి విటమిన్ తయారవుతుంది.


విటమిన్ డి మనకు చాలా అవసరం. ఇది మన ఎముకల్ని గట్టిగా ఉంచుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. డిప్రెషన్ తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది. అన్నింటికీ మించి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి. ఈ రోజుల్లో ఇండియన్స్‌లో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని తగ్గించుకుంటే, ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.


13, మార్చి 2024, బుధవారం

Where does sand come from? - ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది?

 


సముద్ర తీరాల్లో, నదుల ఒడ్డున, ఎడారుల్లో భారీగా ఇసుక ఉంటుంది? ప్రపంచ వ్యాప్తంగా భవనాల నిర్మాణంలో ఎంత ఇసుక వాడుతున్నా, ఇంకా చాలా శాండ్ మిగిలే ఉంటోంది. ఎందుకంటే.. మనం వాడుతున్న దాని కంటే, ఎక్కువ ఇసుక సహజసిద్ధంగా ఉత్పత్తి అవుతోంది. అసలు ఈ ఇసుక ఎలా తయారవుతోందో తెలుసుకుందాం.


ఇసుక అనేది అతి చిన్న రాళ్ల సమూహం. ఈ రాళ్లు 2 మిల్లీమీటర్ల కంటే చిన్న సైజులో ఉంటాయి. ఈ ఇసుక మన చుట్టూ ఉండే కొండల నుంచే వస్తుంది. ఎలా అంటే.. ఈ కొండల్లో ఉండే పెద్ద రాళ్లు.. లక్షల సంవత్సరాలు అయ్యే కొద్దీ.. గాలి, వాన, మంచు, వడగళ్ల కారణంగా.. అరిగిపోతూ ఉంటాయి. ఇలా అరిగే సమయంలో ఈ రాళ్లలోని ఐరన్, సిలికాన్, అల్యూమినియం వంటి ఖనిజాలు వేటికవే విడిపోతాయి. 


విడిపోయిన ఖనిజాల్లో.. కొన్ని బంకమట్టిగా మారతాయి. మరికొన్ని ఇసుక, స్లిట్‌గా మారతాయి. వేల సంవత్సరాలు గడిచేకొద్దీ.. ఇవన్నీ గురుత్వాకర్షణ వల్ల దగ్గరవుతాయి. ఇలా ఏర్పడిన కొత్త పదార్థాన్ని లోమ్ అంటారు. ఈ లోమ్.. వర్షాలు, వరదల వల్ల కొట్టుకుపోతూ.. నదుల్లోకి చేరుతుంది. అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్తుంది. సముద్ర గర్భంలో ఒక పొరలాగా ఏర్పడుతుంది.


వేల సంవత్సరాలు గడిచేకొద్దీ.. లోమ్ లోని బంకమట్టి, స్లిట్ గట్టిపడుతూ.. సముద్ర గర్భానికి అతుక్కుపోతాయి. ఇసుక రేణువులు మాత్రం లోమ్ నుంచి విడిపోతాయి. ఇవి నీటి కదలికలను బట్టీ కదులుతాయి. అలలు వీటిని సముద్ర తీరానికి చేరుస్తాయి. ఇలా సంవత్సరాలు గడిచేకొద్దీ.. తీరంలో ఇసుక పెరుగుతూ ఉంటుంది. ఇలా కొండలపై ఉండే బండరాళ్లు.. ఇసుకగా మారేందుకు లక్షల సంవత్సరాలు పడుతుంది.


ఎడారుల్లో ఇసుక ఉండటానికి ప్రధాన కారణం కూడా సముద్రమే. ఇప్పుడు ఎడారులుగా ఉన్న ప్రాంతాలన్నీ.. ఒకప్పుడు సముద్రాలే. వాటిలో భారీగా ఇసుక ఉండేది. లక్షల సంవత్సరాల్లో నీరు ఎండిపోయిన తర్వాత.. మిగిలిపోయిన ఇసుకే.. ఎడారిగా కనిపిస్తోంది. 


12, మార్చి 2024, మంగళవారం

How to produce electricity from waste? - చెత్త నుంచి కరెంటును ఎలా ఉత్పత్తి చేస్తారు?

 


కరెంటును చాలా మార్గాల ద్వారా ఉత్పత్తి చేస్తారు. నీటి నుంచి, సూర్యరశ్మి నుంచి, గాలి నుంచి, సముద్ర అలల నుంచి.. ఇలా చాలా మార్గాలున్నాయి. చెత్త నుంచి కూడా కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు. ఇది విదేశాల్లో ఎక్కువగా జరుగుతోంది. మన దేశంలో దీనిపై పెద్దగా ప్రచారం జరగట్లేదు. అందువల్ల ఇండియాలో చాలా చెత్త వృథా అవుతోంది. 


మనం పారేసే చెత్త, నిజానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగివుంటుంది. చెత్తను సేకరించి, సద్వినియోగం చేసే కార్యక్రమాన్ని ఘన వ్యర్థ పదార్థాల కార్యక్రమం అంటాం. అదే సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్. ఈ రోజుల్లో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇండియా కూడా దీనిపై నానాటికీ ఫోకస్ పెంచుతోంది.


సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో చెత్తను 4 భాగాలుగా విభజిస్తారు. అవి 1.పేపర్. ఇందులో పేపర్లు, బుక్స్, అట్టపెట్టెలు, ప్యాకింగ్ మెటీరియల్ వంటివి ఉంటాయి. 2వది గ్లాస్. ఇందులో రకరకాల సీసాలు, మద్యం బాటిళ్లు, గాజు గ్లాసులు, గాజు అద్దాలు వంటివి ఉంటాయి. 3వది ఆర్గానిక్. ఇందులో తడి చెత్త ఉంటుంది. అంటే కూరగాయల చెత్త, పండ్ల చెత్త, టీ పొడి, ఆహార పదార్థాలు, నాన్ వెజ్ ఐటెమ్స్, కొబ్బరి పీచు, ఎండిన ఆకులు, కలప వస్తువుల వంటి, త్వరగా పాడైపోయేవి ఉంటాయి. ఇక 4వది ప్లాస్టిక్. ఇందులో ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ సంబంధిత అన్ని వస్తువులూ వస్తాయి.


సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో సేకరించే చెత్తను ఏదో ఒక రకంగా తిరిగి ఉపయోగించుకునేలా రీసైక్లింగ్ చేస్తారు. దీని వల్ల ప్రభుత్వాలకు భారీగా మనీ వస్తుంది. అలాగే పర్యావరణానికీ మేలు జరుగుతుంది. ఈ చెత్త పదార్థాలన్నీ నిజానికి సేంద్రియ రసాయనాలే. వీటిలో చాలా శక్తి దాగి ఉంటుంది. వీటిని మండించినప్పుడు భారీగా ఉష్ణశక్తి విడుదల అవుతుంది. దాన్ని కరెంటుగా మార్చుతారు.


మనం చెత్తగా భావించే ఈ చెత్తను, చైనా లాంటి దేశాలు, ప్రపంచ దేశాల నుంచి చాలా చవకగా కొంటూ.. దాన్ని రీసైక్లింగ్ చేసి.. రోజూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. భారత కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారిస్తోంది. దేశవ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కార్యక్రమం రోజురోజుకూ విస్తరిస్తోంది.



11, మార్చి 2024, సోమవారం

How Palm Creases form? - చేతి గీతలు ఎలా ఏర్పడతాయి?

 


మన శరీరంలో అరచేతులు ప్రత్యేకమైనవి. వీటిపై గీతలు ఉంటాయి. వాటిపై ఆధారపడి ఏకంగా హస్తసాముద్రిక శాస్త్రం కూడా ఉంది. ఈ గీతల ఆధారంగా కొంతమంది మన భవిష్యత్తును చెబుతుంటారు. ఐతే, వారు చెప్పే దానికి శాస్త్రీయ ఆధారాలు లేవన్నది హేతువాదుల వాదన. ఇంతకీ ఈ గీతలు ఎందుకు ఏర్పడతాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.


తల్లి గర్భంలో శిశువు తయారయ్యే సమయంలో ఈ గీతలు ఏర్పడతాయి. ఎందుకంటే.. అరచేతులకు ముడుచుకునే స్వభావం ఉంటుంది. గర్భంలో చేతులు తయారయ్యే సమయంలో శిశువు.. తన అర చేతులను ఎలా మడిస్తే, అలా గీతలు ఏర్పడతాయి. అందుకే ఈ గీతలు అందరికీ ఒకేలా కనిపించవు. మనం మన అరచేతులను మడిచి చూస్తే.. ఎక్కడ అరచెయ్యి వంగుతుంతో, అక్కడ ఆ గీతలు  స్పష్టంగా కనిపిస్తాయి. 


అరచేతిలో ముడుచుకునే కీళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ ఎముకలకు తగినట్లుగా చర్మం ఏర్పడుతుంది. కీళ్లను మడిచేటప్పుడు.. చర్మం కూడా మడతపడుతుంది. ఆ సమయంలో గీతలు ఉన్న చోట చర్మం లోపలికి వెళ్తుంది. ఇలా జరగడానికి కారణం నార కణాలు. వీటిని ఇంగ్లీష్‌లో ఫైబ్రోస్ టిష్యూ (fibrous tissue) అంటాం. చేతులను ముడిచేటప్పుడు ఈ నార కణాలు.. చర్మాన్ని గుంజి, లోపలికి లాగుతాయి. ఇవి ఏయే ప్రాంతాల్లో లోపలికి లాగుతాయో, ఆ ప్రాంతాల్లో అరచేతి రేఖలు ఏర్పడతాయి. 


నిజానికి అరచేతిలో ఏ గీతలూ ఉండవు. అరచేతిని మడిచినప్పుడు, చర్మం ముడుచుకోవడం వల్ల అక్కడ గీతల్లా కనిపిస్తాయి. దీని వెనక నార కణాలు పనిచేస్తూ ఉంటాయి. అవే లేకపోతే.. అరచేతి చర్మం పనితీరు సరిగా ఉండుదు. అందువల్ల ఈ గీతలు ఎంత ఎక్కువగా ఉంటే, అంత మంచిది అనుకోవచ్చు.


10, మార్చి 2024, ఆదివారం

Why do milk curdle? పాలు ఎందుకు విరుగుతాయి?

 


ఎండాకాలంలో పాలు తరచుగా విరిగిపోతూ ఉంటాయి. వాటిని ఫ్రిజ్‌లోని ఫ్రీజర్‌లో ఉంచినా, స్టవ్‌పై కాచినప్పుడు విరిగిపోవడం చూస్తుంటాం. ఒక్కోసారి రసగుల్ల లాంటివి తయారుచెయ్యడానికి పాలలో నిమ్మరసం వెయ్యగానే విరిగిపోవడం చూస్తాం. ఇలా ఎందుకు జరుగుతుంది?


దీని వెనక సైంటిఫిక్ కారణం ఉంది. పాలలో నీరు, ప్రోటీన్లతోపాటూ.. ఫ్యాట్, షుగర్ ఉంటాయి. వీటిలో ప్రోటీన్ అణువులు.. పాలలో తేలుతూ స్వేచ్ఛగా ఉంటాయి. ఇవి ఒకదానికి ఒకటి కలవకుండా దేనికదే విడివిడిగా ఉంటాయి. అలాగే ఫ్యాట్ కూడా పాలలో తేలుతుంది. ఐతే.. పాలలో Ph ఫ్యాక్టర్ సరిగ్గా ఉన్నప్పుడే ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి. ఈ PH ఫ్యాక్టర్ దెబ్బతిన్నా లేక మార్పు వచ్చినా.. పాలలోని ప్రోటీన్ అణువుల తీరు మారిపోతుంది.


పాలలో PH కారకం స్థాయి తగ్గినప్పుడు అది యాసిడ్‌గా మారుతుంది. PH ఫ్యాక్టర్ తగ్గడంతో.. ప్రోటీన్ అణువులు స్వేచ్ఛగా ఉండలేవు. అవి ఒకదానికొకటి కలుస్తూ.. గడ్డలుగా ఏర్పడతాయి. ఫలితంగా పాలలో నీరు, ప్రోటీన్ విడిపోతాయి. దీన్నే మనం పాలు విరగడం అంటాం. పాలలో వేడి పెరిగేకొద్దీ, అవి మరింత త్వరగా విరిగిపోతాయి. 


నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్‌‌ని పాలలో కలిపినప్పుడు, PH ఫ్యాక్టర్ తగ్గిపోతుంది. దాంతో పాలు విరిగిపోతాయి. ఇదే విధంగా పాలలో పెరుగును వేసినప్పుడు కూడా.. గంటలు గడిచేకొద్దీ.. PH కారకం తగ్గిపోయి.. యాసిడ్ పెరిగి.. పాలు, పెరుగుగా మారతాయి. ఐతే.. ఇంకా ఎక్కువసేపు అలాగే ఉంచితే.. PH ఫ్యాక్టర్ మరింత తగ్గిపోయి.. యాసిడ్ పెరిగిపోయి, కమ్మటి పెరుగు కూడా పుల్లగా అయిపోతుంది. 


కాలం గడిచే కొద్దీ పాలలో PH స్థాయి క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే మనం ఎండాకాలంలో పాలను ఫ్రిజ్‌లో ఉంచినా, వాటిలో PH తగ్గిపోయి, విరిగిపోతాయి.


How much water we need to make a pair of blue jeans? - ఒక్క జీన్స్ ప్యాంట్స్ తయారీకి 6000 లీటర్ల నీరు కావాలా?

 


ఎవరైతే కొత్త బట్టలు తక్కువగా కొంటారో వారు ఈ భూమికి ఎక్కువ మేలు చేస్తున్నట్లు లెక్క. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. టెక్స్‌టైల్ కంపెనీలు.. ఒక జీన్స్ పాంట్స్ తయారీకి 1500 నుంచి 2900 గ్యాలన్ల నీటిని ఉపయోగిస్తాయి. లీటర్లలో చెప్పాలంటే ఒక జీన్స్ ప్యాంట్స్ తయారీకి 6వేల నుంచి 11వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది.


కంపెనీలు వాడే నీటిలో 33 శాతం నీటిని పత్తి పంట కోసం వాడుతాయి. మిగతా నీటిని... పత్తి నుంచి దారం తయారు చేసి, దాన్ని కడిగి, జీన్స్ ప్యాంట్స్ తయారీకి ఉపయోగిస్తాయి. ఇలా రకరకాల దశల కోసం వందల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఈ నీటిలో చాలావరకు కాలుష్యం అవుతుంది.


జీన్స్ ప్యాంట్స్ మాత్రమే కాదు.. అన్ని రకాల బట్టల తయారీలో నీటి వాడకం ఎక్కువే. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా నీరు కాలుష్యం అవుతోంది. అంతేకాదు.. పత్తితోనే కాకుండా.. పాలియస్టర్‌తో కూడా బట్టలు తయారుచేస్తారు. పాలియస్టర్‌ని ప్లాస్టిక్ ఫైబర్స్‌తో తయారుచేస్తారు. మనం పాలియస్టర్ బట్టలను ఉతికినప్పుడు.. మైక్రోఫైబర్స్.. నీటిలో కలిసి.. చివరకు అవి సముద్రంలో చేరి.. కాలుష్యాన్ని పెంచుతున్నాయి.


పత్తి పంట కోసం ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడుతున్నారు. ఈ విధంగా కూడా భూమి కాలుష్యం అవుతోంది. అందువల్ల మనం అవసరమైనంతవరకే కొత్త బట్టలు కొనుక్కోవాలి. వీలైనంతవరకూ పాత బట్టలనే మళ్లీ మళ్లీ వాడాలి. తద్వారా భూమికి తక్కువ హాని చేసినట్లవుతుంది.


9, మార్చి 2024, శనివారం

Why Yellow colour not good for Kitchen? వంటగదిలో పసుపు రంగు ఉండకూడదా?

 


మన ఇంట్లో ఏ గదికి ఏ కలర్ పెయింట్ ఉండాలో మనమే డిసైడ్ చేసుకుంటాం. మనకు నచ్చే కలర్స్ వేయించుకుంటాం. అదే వాస్తు నిపుణులను అడిగితే, వారు వాస్తు శాస్త్రం ఆధారంగా సలహాలు ఇస్తారు. ఐతే.. సైంటిఫిక్ కోణంలో చూస్తే, వంటగదిలో పసుపు రంగు ఉండకూడదు. అది పెయింటే కాదు.. వస్తువులు కూడా ఎల్లో కలర్‌లో ఉండకూడదు. అందుకే మార్కెట్‌లో లభించే కిచెన్ ఐటెమ్స్ జనరల్‌గా పసుపు రంగులో ఉండవు.


కిచెన్‌లో పసుపు రంగు ఉంటే.. అక్కడికి బొద్దింకలు వస్తాయి. సాధారణంగా బొద్దింకలు చీకటి ప్రదేశాల్లో ఉంటాయి. అవి పసుపు రంగును చూడలేువు. వాటి కళ్లకు ఎల్లో కలర్‌ని చూసే సామర్థ్యం లేదు. అందువల్ల పసుపు రంగు వాటికి నలుపు రంగులా కనిపిస్తుంది. అందువల్ల అది చీకటి ప్రదేశం అని భావించి, ఎల్లో కలర్ ఉన్న చోటికి బొద్దింకలు ఎక్కువగా వస్తాయి. అందువల్ల కిచెన్‌లో ఆ కలర్ లేకుండా చూసుకోవాలి. 


మీకు కిచెన్‌లో బొద్దింకల సమస్య ఎక్కువగా ఉంటే.. మీరు చిన్న చిట్కాలతో వాటిని బయటకు పంపవచ్చు. వాటికి నీరు దొరకకుండా చేస్తే, వారంలో పూర్తిగా బొద్దింకలు వెళ్లిపోతాయి. లేదంటే పలావు ఆకులను పొడిలా చేసి, బొద్దింకలు తిరిగేచోట చల్లాలి. బిర్యానీ ఆకుల వాసన వాటికి అస్సలు నచ్చదు. అందువల్ల అవి చావకుండానే, వెళ్లిపోతాయి. ఇలా వాటిని చంపకుండానే, ఇంటి నుంచి బయటకు పంపవచ్చు.



8, మార్చి 2024, శుక్రవారం

Why some grapes has no seeds? కొన్ని ద్రాక్ష పండ్లలో గింజలు ఎందుకు ఉండవు?


కొబ్బరికాయ, పైనాపిల్‌లో గింజలుండవు. స్ట్రాబెర్రీలో గింజలు బయటివైపు ఉంటాయి. అరటి, ఫిగ్స్‌లో గింజలు ఉన్నా, మనం వాటిని తినడానికి ఇబ్బంది ఉండదు. ఐతే.. ద్రాక్షపండ్లు, బొప్పాయి, పుచ్చకాయ, యాపిల్ వంటి వాటిలో గింజలు ఉంటే, ఆ గింజలను తొలగించి తినడం ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ రోజుల్లో గింజలు లేని విధంగా పండ్లను పండిస్తున్నారు.


గింజలతో వచ్చే పండ్లు సహజసిద్ధమైనవి. కానీ మనం సీడ్‌లెస్ ఫ్రూట్సే ఎక్కువగా కొంటున్నాం. అందువల్ల రైతులు కూడా అలాంటి పంటలే పండిస్తున్నారు. ఇందుకోసం వారు క్లోనింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. అదేంటో తెలుసుకుందాం.


సాధారణంగా విత్తనాలను నేలలో పాతితే, మొక్కలు వస్తాయని మనకు తెలుసు. కానీ రైతులు, తీగలు లేదా చెట్ల కొమ్మలను నేలలో పాతి, మొక్కలు వచ్చేలా చేస్తున్నారు. ఈ పద్ధతిని 'క్లోనింగ్‌' అంటారు.


క్లోనింగ్‌ అంటే సహజమైన పద్ధతిలో కాకుండా.. కృత్రిమంగా ప్రాణులను సృష్టించడం. ఇలాంటి ప్రాణుల్లో జన్యుపరంగా కొన్ని మార్పులు చేస్తారు. తద్వారా ప్రాణి ఎలా ఉండాలని కోరుకుంటారో, అలా ఉండేలా చేస్తారు. మొక్కల విషయంలోనూ ఇలాగే చేస్తారు. అందువల్ల క్లోనింగ్ ప్రక్రియ ద్వారా పెరిగే చెట్లు, తీగలు.. గింజలు లేని ద్రాక్ష, పుచ్చకాయ, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్లను ఇస్తున్నాయి.


క్లోనింగ్ ఎలా చేస్తారు అన్నది గమనిస్తే, సహజ సిద్ధమైన చెట్టు లదా తీగ నుంచి ఒక చిన్న కొమ్మ లేదా తీగను కట్ చేసి, దాన్ని, ఆ చెట్టు వేర్లను ఉత్పత్తి చేసే హార్మోన్లలో ముంచుతారు. తర్వాత తడి మట్టిలో ఉంచుతారు. కొన్ని రోజుల తర్వాత ఆ కొమ్మకు భూమిలో వేర్లు, భూమి పైన ఆకులు వస్తాయి. గింజతో పనిలేకుండా వచ్చిన ఈ మొక్కకు వచ్చే పండ్లు కూడా, గింజలు లేకుండా వస్తాయి. 


ఎంత కృత్రిమంగా పెంచినా, ఒక్కోసారి క్లోనింగ్ మొక్కల పండ్లలో కూడా గింజలు వస్తాయి. కానీ వాటికి బలం ఉండదు. అందువల్ల అవి పెద్దగా పెరగలేవు, గట్టిగా అవ్వవు. చివరకు అవి పండు గుజ్జులో కలిసిపోతాయి. 


ఇంతకీ సహజ సిద్ధమైన, గింజలు ఉండే పండ్లు తింటే మంచిదా లేక, సీడ్‌లెస్ పండ్లు తిన్నా పర్వాలేదా? అనే ప్రశ్నకు కచ్చితమైన ఆన్సర్ లేదు. కొంతమంది నిపుణులు గింజలు ఉండేవి తింటేనే మంచిదనీ, వాటిలోనే ఎక్కువ ఫైబర్ ఉంటుంది అంటుంటే.. మరికొందరు గింజలు లేనివి తిన్నా పర్వాలేదని అంటున్నారు. అన్ని రకాల పండ్లూ ఆరోగ్యానికి మంచివే అంటున్నారు. అలాగే మరికొందరు.. సీడ్‌లెస్‌వి తినొద్దనీ, అవి సహజంగా వచ్చినవి కావని అంటున్నారు. ఇలా ఈ ప్రశ్నపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. 


7, మార్చి 2024, గురువారం

Can water clear the effect of Alcohol? - మద్యం మత్తు నీళ్లతో వదులుతుందా?

 


మద్యం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలా మంది తాగుతుంటారు. దానివల్ల వారికి మత్తు వచ్చి, మైండ్ సరిగా పనిచెయ్యదు. ఎంత మత్తు ఎక్కింది? వదిలేందుకు ఎంత టైమ్ పడుతుంది అనేది వారు ఎంత తాగారు? ఏం తాగారు? అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఐతే.. త్వరగా మత్తు వదిలిపోవాలంటే.. నీటితో వీలవుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


మద్యంలో చాలా వరకు నీరే ఉంటుంది. కొద్దిగా ఇథైల్‌ ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ ఎంత శాతం ఉంది అనే దాన్ని బట్టీ, ఆయా పానీయాల మత్తు తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఐతే.. ఇథైల్‌ ఆల్కహాల్ స్వయంగా మత్తు కలిగించలేదు. 


సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు.. ముందుగా జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత ఆహారం, రక్తంలో కలుస్తుంది. మద్యం విషయంలో ఇలా జరగదు. దీన్ని తాగినప్పుడు, జీర్ణం అవ్వాల్సిన పని లేకుండానే, కాసేపటికే రక్తంలో కలుస్తుంది.


రక్తంలో కలిసిన వెంటనే మద్యం.. శరీరంలోని కణ జాలాల్లోకి చాలా వేగంగా వెళ్తుంది. ఆ తర్వాత అది అసిటాల్డిహైడుగా మారుతుంది. ఇది చెడు వాసన కలిగివుంటుంది. అందుకే, మద్యం తాగిన వారి నుంచి చెడు వాసన వస్తూ ఉంటుంది. ఈ అసిటాల్డిహైడ్.. బ్రెయిన్ లోకి కూడా వెళ్తుంది. మెదడు కణాల్లో ఉన్న అమైనో యాసిడ్‌తో కలుస్తుంది. అప్పుడు బ్రెయిన్‌కి మత్తు వస్తుంది. (acetaldehyde)


అసిటాల్డిహైడ్ నీటిలో కరుగుతుంది. అందువల్ల, మద్యం తాగిన వారి మత్తు వదిలించేందుకు.. నిపుణుల పర్యవేక్షణలో, ముఖంపై నీరు చల్లవచ్చు. మత్తు మరీ ఎక్కువగా ఉంటే, నిపుణుల పర్యవేక్షణలో, ఓ బకెట్ నీళ్లు తెచ్చి, కుమ్మరించవచ్చు. దాంతో బట్టలు తడుస్తాయి. ఆ తడి చాలాసేపు ఉంటుంది. తడివల్ల.. చర్మ కణాల్లోని అసిటాల్డిహైడ్ నీటిలో కరుగుతుంది. దాంతో కొంత మత్తు వదిలిపోతుంది. అలాగే.. శరీరంలో వేడి కూడా తగ్గడం వల్ల, మత్తు ప్రభావం మరింత తగ్గుతుంది. 

Note: Alcohol is injurious to health


6, మార్చి 2024, బుధవారం

How insects fly in running Train?- కదులుతున్న రైల్లో పురుగులు ఎలా ఎగరగలుగుతున్నాయి?

 


జనరల్‌గా మనందరికీ బస్సులో జర్నీ కంటే, రైలు ప్రయాణం నచ్చుతుంది. ఎందుకంటే.. బస్సులు సిటీల్లో వెళ్తుంటాయి. రైళ్లు మాత్రం పచ్చిక బయళ్లు, కొండలు, ప్రకృతిలో వెళ్తుంటాయి. కిటికీ పక్కన కూర్చొని, అలా చూస్తుంటే, చెట్లు, ఇళ్లు, పొలాలూ అన్నీ వెనక్కి పారిపోతున్నట్లు కనిపిస్తాయి. ఆ ప్రయాణం కొంత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఐతే.. మీరెప్పుడైనా కదిలే రైల్లో ఈగలు, దోమలు, లైట్ పురుగులు ఎలా ఎగరగలుగుతున్నాయో ఆలోచించారా?


దోమలు, ఈగలతో పోల్చితే రైలు వేగం చాలా ఎక్కువ. కానీ ట్రైన్‌లో పురుగులు స్వేచ్ఛగా ఎగురుతాయి. అంటే, రైలు వేగంతో సమానంగా అవి ఎగురుతున్నట్లే. ఇది ఎలా సాధ్యం?


దీనికి కారణం స్థిరమైన వేగంతో ఉండే గాలి. అంటే.. రైలులో లేదా కారులో లేదా విమానంలో అన్ని డోర్లూ మూసివేశాక.. అవి వేగంగా వెళ్తున్నప్పుడు.. వాటిలోపలి గాలికి కూడా అదే స్థిరమైన వేగం ఉంటుంది. గాలి మాత్రమే కాదు.. లోపలున్న మనుషులు, వస్తువులు, పురుగులకు కూడా అదే వేగం ఉంటుంది. అందువల్ల అవి ఈగలు, దోమలూ స్వేచ్ఛగా ఎగరగలుగుతాయి.


రైలులో ఉన్నవారికి.. ఈగలు... రైలు వేగంతో ఎగురుతునట్లు అనిపించదు. అవి మామూలు వేగంతో ఎగురుతున్నట్లే అనిపిస్తుంది. కానీ బయటి నుంచి చూసేవారికి ఈ తేడా తెలుస్తుంది. కదిలే రైలును ఎవరైనా బయటి నుంచి చూస్తే.. వారు... రైలుతోపాటూ.. లోపలి మనుషులు, వస్తువులు, కీటకాలు కూడా అదే వేగంతో వెళ్తున్న అనుభూతిని పొందగలరు.


ఒక బంతి ద్వారా కూడా ఈ ప్రయోగం చేసి చూడవచ్చు. బయట ఎక్కడైనా బంతిని ఎగరేస్తే, అది తిరిగి మన చేతిలో పడుతుంది. ఇదే విధంగా కదిలే రైలులో చేస్తే.. బంతి గాలిలోకి ఎగిరి, తిరిగి వెనక్కి వచ్చేసరికి.. రైలు కొంత ముందుకి వెళ్తుంది కాబట్టి.. ఆ బంతి.. చేతిలో పడకుండా, వెనక్కి పడాలి. కానీ అలా జరగదు. అది చేతిలోనే పడుతుంది. ఎందుకంటే.. ఆ బంతి కూడా.. రైలు వేగంతో ముందుకి వెళ్తుంది కాబట్టే.


ఇదంతా డోర్లు మూసివేసినప్పుడు మాత్రమే. డోర్స్ ఓపెన్ చేస్తే, బయటి గాలి లోపలికి వస్తుంది. దాంతో లోపలున్న గాలి స్థిరమైన వేగంలో మార్పులొస్తాయి. అందువల్ల పురుగులు స్థిరమైన వేగంతో ఎగరలేవు. ఎగరేసిన బంతి కూడా, తిరిగి స్థిరంగా చేతిలో పడే అవకాశాలు తక్కువ.


5, మార్చి 2024, మంగళవారం

How does a diamond shine? - బొగ్గు నుంచి వచ్చే వజ్రం ఎలా మెరుస్తుంది?


వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అంటారు.. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటారు.. ఎందుకంటే డైమండ్ అత్యంత కఠినమైనది. ఐతే, ఈ వజ్రం బొగ్గు నుంచి వస్తుంది. బొగ్గు కఠినంగా ఉండదు. మరి డైమండ్ ఎందుకు ఉంటుంది? అసలు నల్లటి బొగ్గు నుంచి తెల్లటి వజ్రం ఎలా వస్తుంది? దానికి ఆ మెరుపులు ఎలా వస్తాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు డైమండ్స్ చుట్టూ ఉంటాయి.


బొగ్గు మూడు రూపాల్లో ఉంటుంది. సాధారణ బొగ్గు, గ్రాఫైట్, డైమండ్. సాధారణ బొగ్గు, గ్రాఫైట్ చూడటానికి నల్లగానే ఉంటాయి. రెండూ కఠినంగా ఉండవు. మరి వజ్రాలు ఎందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి? దీని వెనక బలమైన కారణం ఉంది.

 

సైంటిస్టుల ప్రకారం.. లక్షల సంవత్సరాల కిందట భూమి చల్లబడిన తర్వాత.. శిలాద్రవం భూమిలోపలి పొరల్లో వుండిపోయింది. కాలక్రమంలో ఉష్ణోగ్రత, ఇతర ఖనిజాల ఒత్తిడి వల్ల.. బొగ్గు మూలకాలు ఒకదానికొకటి అత్యంత దగ్గరకు చేరి, స్పటిక ఆకారాల్లోకి మారాయి. అవి స్వచ్ఛమైన కార్బన్ స్పటికలు. అవే వజ్రాలు. అలా అవి మారడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది.


వజ్రాలు గట్టిగా, కఠినంగా ఎలా మారుతున్నాయి అన్నదానికి మనం స్పాంజీని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్పాంజీని నొక్కితే.. చిన్నగా అవుతుంది. ఇంకా నొక్కితే మరింత చిన్నగా అవుతుంది. అలా నొక్కుతూ పోతే.. అది చిన్నగా అవుతూ, అవుతూ.. బాగా కుచించుకుపోతుంది. ఇక చిన్నగా అవ్వలేనంతగా నొక్కితే, అప్పుడు అది గట్టిగా అవుతుంది. ఇక దాన్ని నొక్కడానికి వీలవ్వదు. కొన్ని లక్షల సంవత్సరాలు ఇలా నొక్కుతూనే ఉంటే, మెత్తని స్పాంజీ కాస్తా.. గట్టి రాయిలా అయిపోతుంది. వజ్రం విషయంలోనూ ఇదే జరుగుతోంది. 


ఇక వజ్రానికి మెరుపు ఎలా వస్తుందంటే.. సాధారణంగా కార్బన్ స్పటికలకు మెరుపు అంతగా ఉండదు. వజ్రాల తయారీ నిపుణులు.. భూమిలో దొరికిన వజ్రాన్ని రెండుగా కోస్తారు. ఆ రెండు ముక్కలనూ.. రెండు వజ్రాల లాగా సానపడతారు. ఆ సమయంలో వజ్రాలకు కోణాలను ఏర్పరుస్తారు. కాంతి ఈ కోణాలపై పడినప్పుడు.. బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా వేర్వేరు కోణాల దగ్గర కాంతి ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ.. ఒక కోణం కాంతి, మరో కోణంపై ప్రసరిస్తూ, కోణాలన్నీ మెరుస్తూ, వజ్రం మెరుస్తున్నట్లు కనిపిస్తుంది.  


4, మార్చి 2024, సోమవారం

Does the wind leave the earth? - భూమిని వదిలి గాలి వెళ్లిపోతుందా?

 


గాలి లేని భూమిని ఊహించగలమా? కష్టం.. ఈ భూమిపై జీవం ఉండటానికి ప్రధాన కారణం గాలి. మనందరికీ ప్రతీ క్షణం గాలి కావాలి. మరి ఈ గాలి.. భూమిని వదిలి వెళ్లిపోతుందా? అలాంటి అవకాశం ఉందా?


భూమిపై వేడి, రాత్రిళ్లు అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది. మేఘాలు కూడా ఆకాశంలోకి వెళ్తాయి. మరి గాలి ఎందుకు వెళ్లదు? ఎందుకంటే గాలి బరువుగా ఉంటుంది కాబట్టే. జనరల్‌గా మనం గాలికి బరువు ఉండదు అనుకుంటాం. నిజానికి గాలికి కూడా బరువు ఉంటుంది. భూమి ఉపరితలంపై ఒక క్యూబిక్ మీటర్ ప్రదేశంలో గాలి బరువు 1కేజీ 300 గ్రాములు ఉంటుంది. అంటే మన దగ్గర ఒక క్యూబిక్ మీటర్ అట్టపెట్టె ఉంటే.. అది ఖాళీగా ఉన్నా, అందులో గాలికి బరువు ఉన్నట్లే. ఐతే.. ఈ గాలి అన్ని ప్రదేశాల్లో ఒకే బరువుతో ఉండదు. అంటే.. భూమి ఉపరితలంపై ఎక్కువ బరువు, ఆకాశంలోకి వెళ్లే కొద్దీ తక్కువ బరువుతో ఉంటుంది.


ప్రత్యేక కారణాల వల్ల.. ఎక్కువ బరువు ఉన్న గాలి.. తక్కువ బరువు ఉన్న గాలి వైపు వెళ్తుంది. అందువల్ల మనకు తరచూ గాలి కదులుతున్న, వీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా గాలి కదలడం వల్లే మనకు సుడిగాలులు, తుఫాన్ల వంటివి వస్తుంటాయి. 


భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి, బరువైన వాటిని తనవైపు లాక్కుంటుంది. గాలి బరువు కంటే, భూమి బరువు ఎక్కువ. అందువల్ల గాలిని నిరంతరం గురుత్వాకర్షణ శక్తి లాగుతూనే ఉంటుంది. ఈ కారణంగానే గాలి భూమితోనే ఉంటోంది. భూమికి గ్రావిటీ పవర్ లేకపోతే, గాలి ఎప్పుడో విశ్వంలోకి వెళ్లిపోయేది. భూమి భూమిలా ఉన్నంతకాలం, గ్రావిటీ పవర్ తగ్గనంతకాలం గాలి ఉంటుంది.


ఇంతకీ ఈ గాలి ఎంతవరకూ ఉందో తెలుసా? భూమి ఉపరితలం నుంచి సుమారు 30 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉంది. ఈ గాలిలో బరువైన గాలి.. మొదటి 10 కిలోమీటర్లలోనే ఉంది. అంటే, మొత్తం గాలిలో 75 శాతం గాలి.. 10 కిలోమీటర్ల ఎత్తులోనే ఉంది. మిగతా 20 కిలోమీటర్ల ఎత్తులో 25 శాతం గాలి ఉంది. 


చందమామపై ఎయిర్ ఎందుకు లేదు అనేది మరో ప్రశ్న. చందమామపై ఉండే గ్రావిటీ.. గాలిని లాక్కునేంత బలంగా లేదు. అందువల్ల అక్కడ గాలి లేదు. 


3, మార్చి 2024, ఆదివారం

Why we cannot hear sounds of Sun - సూర్యుడి పేలుళ్ల శబ్దాలు మనకు ఎందుకు వినిపించవు?

 


మన చుట్టుపక్కల ఎవరైనా క్రేకర్స్ కాల్చితే.. ఆ శబ్దాలు మనకు తీవ్రంగా వినిపిస్తాయి. అలాగే ఎక్కడో కిలోమీటర్ల అవతల ట్రైన్ కూత పెడితే.. అది కూడా మనకు వినిపిస్తుంది. ఇలా రకరకాల ధ్వనులను మనం వింటూ ఉంటాం. మరి అంతరిక్షంలో సూర్యుడిపై క్షణక్షణం భారీ పేలుళ్లు జరుగుతూ ఉంటాయి. ఆ శబ్దాలు మనకు ఎందుకు వినిపించవు?


మన సౌర కుటుంబంలో సూర్యుడు కేంద్రం. మన భూమి, ప్రాణికోటి మనుగడకు సూర్యుడే ఆధారం. సూర్యుడిలో ప్రధానంగా ఉండేది రెండే వాయువులు. ఒకటి హైడ్రోజన్, రెండు హీలియం. హైడ్రోజన్ సుమారు 75 శాతం ఉండగా.. మిగతాది హీలియం ఉంటుంది. కేంద్రక సంలీన చర్య వల్ల, ప్రతి సెకనుకూ సుమారు 60 వేల టన్నుల హైడ్రోజన్‌ పరమాణువులు, హీలియం పరమాణువులుగా మారుతాయి. ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంత సూత్రమైన E = mc2 ప్రకారం, 60వేల టన్నుల హైడ్రోజన్.. హీలియంగా మారినప్పుడు, దాదాపు 420 టన్నుల ద్రవ్యరాశి, శక్తిగా మారుతుంది. దాన్నే మనం సోలార్ పవర్‌గా చెబుతాం. మరి ఒక్క సెకన్‌లోనే అంత ఎనర్జీ వస్తే, ఎంత పెద్ద పేలుళ్లు జరిగివుండాలి? మరి మనకు ఆ శబ్దాలు ఎందుకు వినిపించవు?


సూర్య గోళం ఏడు లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంటుంది. సూర్యుడిలో 10 లక్షల భూములు పట్టగలవు. ఐతే.. సూర్యుడిలో కేంద్రక సంలీన చర్య.. పై భాగంలో జరగదు. అంతర్భాగంలో 2లక్షల కిలోమీటర్లలోపే జరుగుతుంది. ఆ తర్వాత పుట్టే ఎనర్జీ లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, ఉపరితలానికి చేరుతుంది. అది చాలా వేడిగా.. ఉడుకుతూ ఉంటుంది. అక్కడ వేడి దాదాపు 5,600 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంత వేడి ఎనర్జీ ఉందంటే.. లోపల ఎంత పెద్ద పేలుళ్లు జరుగుతాయో ఊహకందదు. భూమి బద్ధలైనట్లుగా భారీ శబ్దాలు వస్తుంటాయి. వాటిని వినడం మనవల్ల కాదు. 


లక్కీగా సూర్యుడి పేలుళ్ల శబ్దాలు భూమి వరకూ రావు. ఎందుకంటే సూర్యుడు మనకు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అంతరిక్షం అంతా శూన్యమే. శూన్యంలో కాంతి ప్రసరిస్తుంది గానీ, శబ్దం ప్రయాణించలేదు. అందువల్ల సూర్యుడి శబ్దాలు శూన్యంలో ప్రయాణించి, మన భూమికి రాలేవు. అందుకే అంతరిక్షంలో వ్యోమగాములు గట్టిగా అరిచినా, పక్కనే ఉన్నవాళ్లకు కూడా వినిపించదు.