Masayoshi Matsumoto: మసాయోషీ మాత్సుమోతో... మీరు ఎప్పుడైనా జపాన్‌కి వెళ్తే... వీలైతే... ఈ బెలూన్ ఆర్టిస్టును తప్పక కలవండి. ఎందుకంటే... ప్రపంచంలోని అరుదైన వ్యక్తుల్లో ఒకరని మీరు కలిసినట్లు అవుతుంది. ఈ సృష్టిలో బెలూన్లతో జీవులు ఉంటే... అవి ఇలాగే ఉంటాయేమో అనిపించేలా ఉంటాయి అతని బూరల బొమ్మలు. పురుగులు, పక్షులు, జంతువులు, కీటకాలు... ఇలా అదీ ఇదీ అని లేదు... ఏదైనా సరే... అతని చేతుల్లో బూరలతో బొమ్మగా మారాల్సిందే. బెలూన్లతో బొమ్మలకు అతను ప్రాణం పోస్తున్నాడు.
మన దేశంలో చాలా మంది ఒకటి చదివితే... మరొకటి అవుతారు. జపాన్‌లోనూ ఇలాంటి పరిస్థితి ఉంది. కెమికల్ ఇంజినీర్ అవ్వాలన్నది మసాయోషీ కల. కానీ... కాలం గడిచేకొద్దీ... అతనిలో దాగివున్న కళ ప్రపంచానికి తెలియడం మొదలైంది. అప్పుడర్థమైంది. తాను కెమికల్ ఇంజినీర్ అవ్వడం కంటే... బెలూన్ బొమ్మల ఆర్టిస్ట్ అవ్వడం కరెక్ట్ అని. అంతే... అప్పటి నుంచి ఇదిగో... ఇలా ఏది చూసినా... షాపుకి బెలూన్లు కొనడం... వాటితో అది తయారుచెయ్యడం. పేరెంట్స్, బంధువులు ఇచ్చే డబ్బంతా ఇలా బొమ్మలకే వాడేసేవాడు.
తన వయసులో మిగతా వాళ్లంతా కేకులు, ఐస్‌క్రీమ్‌లు కొనుక్కుంటూ... సినిమాలూ, షికార్లకు వెళ్తుంటే... మసాయోషీ మాత్రం... వాటికి దూరంగా... బెలూన్లకు దగ్గరగా బతికాడు. ఒక్కో బొమ్మనీ తయారుచేస్తుంటే... అతనికి కలుగుతున్న ఆనందం అంతా ఇంతా కాదు. అందుకే 13 ఏళ్లకే పడిపోయాడు. బెలూన్ బొమ్మలతో ప్రేమలో పడిపోయాడు. అన్నీ వదిలేసి అవే ప్రపంచంగా మార్చేసుకున్నాడు.
ప్రతి మనిషిలో... దాగివున్న ఇష్టం ఒకటి ఉంటుంది. ఆ పని చేస్తున్నప్పుడు... ఆ వ్యక్తి ఈ ప్రపంచాన్ని మర్చిపోవడం సహజం. మసాయోషీ... బొమ్మలు చేస్తున్నప్పుడు ఈ అనుభవాన్ని పొందాడు. అందుకే అవే ప్యాషన్ (passion)గా బతికేస్తున్నాడు.
జపాన్‌లోని కనాగావాలో ఉంటున్న మసాయోషీకి బెలూన్ ఆర్టిస్టుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇంతలా ఫేమస్ అవ్వడానికి 2 కారణాలు ఉన్నాయి. తను ఏ జంతువునైనా తయారుచెయ్యగలడు. అంతేకాదు... ఎంతో సింపుల్‌గా చేస్తాడు... అదే సమయంలో... ఆ జంతువులో లేదా ప్రాణిలో... అన్ని అవయవాలూ బెలూన్లతో తయారుచేయగలడు. అందుకే ఒక్క బొమ్మ చెయ్యడానికి కూడా కొన్ని గంటలపాటూ శ్రమిస్తాడు.
ఇలా చేస్తాడు:
మసాయోషీ... ఏదైనా ప్రాణిని తయారుచెయ్యాలి అనుకున్నప్పుడు... ముందుగా... దాన్ని వీలైనన్ని ఫొటోలు తీస్తాడు. తద్వారా... తన మైండ్‌లో ఓ త్రీడీ పిక్చర్ రెడీ చేసుకుంటాడు. ఆ తర్వాతే బొమ్మ తయారీ మొదలుపెడతాడు. అంతే... అదో అద్భుతం అయిపోతుంది. అందుకే అతని సృష్టి నుంచి ఏ ప్రాణీ తప్పించుకోలేకపోతోంది.
ఇక్కడ ఈ స్టోరీలో మీకు నేను చూపించినవి కొన్ని బొమ్మలు మాత్రమే. మీరు అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ (www.instagram.com/isopresso_balloon)కి వెళ్తే... మీకు అక్కడ కొన్ని వందల బొమ్మలు కనిపిస్తాయి. సరదాగా చూసి రండి... కాసేపైనా మనసుకి ఆహ్లాదం కలుగుతుంది.