17, జూన్ 2021, గురువారం

Ikaria island: దీర్ఘాయుష్షు దీవి... ఇకారియా ప్రత్యేకత ఏంటి?

ఇకారియా దీవి మ్యాప్ (image credit - Google Maps)
ఇకారియా దీవి మ్యాప్ (image credit - Google Maps)

Ikaria island: దీర్ఘాయుష్షు దీవి... ఇకారియా ప్రత్యేకత ఏంటి?

ఆ దీవికి వెళ్తే చనిపోరా? శవాల్ని కూడా అక్కడికి తీసుకెళ్తే బతికేస్తాయా? ఇకారియాలో దాగిన లైఫ్ మిస్టరీ ఏంటి? కేన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలు కూడా అక్కడ ఎలా నయమైపోతున్నాయి? ఆయుష్షును పెంచుతున్న ఆద్భుతమైన దీవి విశేషాలు తెలుసుకుందాం. మన పురాణాల్లో సంజీవని మొక్క గురించి ప్రస్తావన ఉంటుంది. ఆ దీవి సంజీవని లాంటిదే. మంచాన పడి... రోజులు లెక్కపెట్టుకుంటున్న వాళ్లను కూడా... లేచి తిరిగేలా చేస్తోంది. వందేళ్లు వచ్చినా... ఎనర్జీ లెవెల్స్ తగ్గట్లేదు అక్కడి వాళ్లకు. కాన్సర్... ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న భయంకర వ్యాధి. ఎన్ని మందులు వాడినా, కోట్లు ఖర్చుపెట్టినా నయమవుతుందన్నగ్యారెంటీ లేదు. ఇలాంటి వ్యాధి కూడా... ఇకారియాకు వెళ్లగానే... మాయమవుతోంది. ఎందుకో తెలియాలంటే... మనం ఓ పెద్దాయన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి.

ఆరోగ్యమే మహా భాగ్యం కదా. ఈ విషయాన్ని వంటబట్టించుకున్నారు ఇకారియా జనం. ఉరుకులు-పరుగులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారు. అపర కుభేరుల కన్నా సంతోషంగా బతుకుతున్నారు. రోగాల బారిన పడకుండా... ఆనందంగా రోజులు వెళ్లదీస్తున్నారు. మనం వాళ్లలా జీవించలేకపోయినా... కనీసం వాళ్ల నుంచీ కొన్నైనా మంచి విషయాలు గ్రహిస్తే... ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఎస్... ఆనందంగా బతకడానికి మనకో దీవి కావాలి. అదే... ఇకారియా. గ్రీస్‌లో ఉంది. చుట్టూ సముద్రంతో... ఎప్పుడు చూసినా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండలు, గుట్టలతో పచ్చదనం పరచుకున్న ఈ ద్వీపం... గట్టిగా మన హైదరాబాద్ అంత కూడా ఉండదు. నివసించే జనం పది వేల మంది కంటే తక్కువే. అక్కడి ద్రాక్ష తోటలు, పండే పంటలు, వండే వంటలు... అన్నీ... అత్యంత స్వచ్ఛంగా, కాలుష్యానికి దూరంగా ఉంటాయి. టూరిజం పరంగా ఆ దీవి అత్యంత క్లీన్‌గా గ్రీన్‌గా ఉంటుంది. ద్రాక్ష తోటలకు తోడు... పచ్చిక మైదానాలు, చిట్టడవులు, తీర ప్రాంతాలూ... అన్నీ కలగలిసి... ఆ దీవిని భూలోక అద్భుతంగా మార్చేశాయి.

ఈ చిన్న దీవి ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందుకు కారణం ఇక్కడి పర్యాటక ప్రదేశాలో, వాతావరణ మార్పులో కాదు. ఈ ద్వీపంలో ఓ అద్భుతం జరుగుతోంది. అది మామూలు జనాన్నే కాదు... డాక్టర్లను, పరిశోధకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇకారియా జనం మృత్యువును జయిస్తున్నారు. చావు అంచుల దాకా వెళ్లిన వాళ్లు కూడా... అత్యంత ఆరోగ్యంగా మారిపోతున్నారు. మంచానికి పరిమితమైన వాళ్లు కూడా ఎంచక్కా లేచి... పరుగులు పెడుతున్నారు. ఇక్కడి వాళ్లకు రోగాల మాటే లేదు. కాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలు కూడా ఇక్కడకు వెళ్లగానే నయమైపోతున్నాయి.

సాధారణంగా అమెరికన్లు ఎక్కువ కాలం జీవిస్తారు. అక్కడి వైద్య సదుపాయాలూ, టెక్నాలజీ వాళ్లను ఎక్కువకాలం జీవించేలా చేస్తున్నాయి. అలాంటిది ఇకారియాలో జనం... అమెరికన్ల కంటే పదేళ్లు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఐతే, వీళ్లకు డాక్టర్ల అవసరమే రావట్లేదు.

ఈ దీవిలో యూత్ తోపాటూ... ముసలివాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. మూడొంతుల మంది 90 ఏళ్లకు మించినవాళ్లే. అంత ఏజ్ వచ్చినా... ఇక్కడి బామ్మలు, తాతలూ... యంగ్ అండ్ ఎనర్జిటిక్ లుక్‌తో కనిపిస్తారు. వీళ్లకు అలసట, ఆయాసం వంటివి రావా? అన్న డౌట్ కలిగిస్తారు. అందుకే ఈ దీవిని దీర్ఘాయుష్షు దీవి అంటున్నారు.

ప్రపంచంలో ఇలాంటి ప్రాంతాలు మరో మూడు వున్నాయి. అక్కడ కూడా జనం కాస్త ఎక్కువ కాలమే జీవిస్తున్నారు. ఇలాంటి వాటిని ఇప్పుడు "బ్లూ జోన్" అని పిలుస్తున్నారు. ఈ బ్లూ జోన్స్‌లో ఎక్కువమందిని ఆకట్టుకుంటున్నది ఇకారియాయే.

ఆ పెద్దాయన జీవితంలో ఏం జరిగింది?
కాలచక్రాన్ని వెనక్కి తిప్పి... మనం ఓ 80 ఏళ్లు బ్యాక్‌కి వెళ్దాం. అది 1943వ సంవత్సరం. గ్రీస్‌లో భీకరయుద్ధం జరుగుతోంది. యువ సైనికుడైన స్టామటిస్... ప్రాణాలకు తెగించి యుద్ధంలో దూసుకెళ్లాడు. స్టామటిస్‌ను దురదృష్టం వెంటాడింది. బాంబు దాడిలో అతని చెయ్యి వంకర పోయింది. ట్రీట్‌మెంట్ కోసం అతన్ని అమెరికాకు పంపారు. అమెరికాలో ఎవరో కక్షకట్టి స్టామటిస్‌పై కాల్పులు జరిపారు. చిన్న గాయాలతో తప్పించుకున్న స్టామటిస్... టర్కీకి పారిపోయాడు. ఐతే... అక్కడ ఉండలేక... ఓ నౌకలో బయలుదేరి... న్యూయార్క్ వెళ్లాడు. న్యూయార్క్‌లో ఉద్యోగం వెతుక్కున్న స్టామటిస్... అక్కడే స్థిరపడ్డాడు. ఓ గ్రీక్-అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు ముగ్గురు పిల్లలు.

1976లో జరిగిందో ఘటన. ఉన్నట్టుండి స్టామటిస్ ఊపిరి తీసుకోలేకపోయాడు. ఆఫీస్‌లో మెట్లు ఎక్కలేకపోయాడు. డాక్టర్లు ఎక్స్ రే తీశారు. ఆయనకు ఊపిరితిత్తుల కాన్సర్ ఉందని చెప్పారు. మొత్తం 9 మంది డాక్టర్లు రకరకాల ట్రీట్‌మెంట్లు చేశారు. చివరకు స్టామటిస్ మహా అయితే మరో 9 నెలలకు మించి బతకడు అని తేల్చేశారు. అప్పుడాయన వయసు అరవై ఏళ్లు. చనిపోతానని తెలిశాక... స్టామటిస్ న్యూయార్క్‌లో తన సమాధి కోసం స్థలం కొనుక్కోవాలనుకున్నాడు. ఐతే... అప్పటికే అక్కడి ప్లాట్ల రేట్లు ఎంతలా పెరిగిపోయాయంటే... ఆరడుగుల స్థలాన్ని కూడా కొనుక్కోలేకపోయాడు. అప్పుడే స్టామటిస్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన సొంతూరైన ఇకారియాకు వెళ్లిపోవాలనుకున్నాడు. తన పూర్వీకుల సమాధుల పక్కనే తన సమాధి కూడా ఉండాలని కోరుకున్నాడు. భార్యతో కలిసి ఇకారియా వచ్చేశాడు. ద్రాక్ష తోటల పక్కనే రెండెకరాల స్థలంలో ఓ ఇంటిని కొన్నాడు. ఆయన జీవితం మంచానికే పరిమితమైంది.

చావనేది చేదుమాత్ర లాంటిది. అది స్టామటిస్‌కి కూడా నచ్చలేదు. ఇకారియాకు వెళ్లిన రెండు నెలల తర్వాత... ముసలాయన లేచి నడవగలిగాడు. మరో నెల తర్వాత... ఆ ఇంటికి పక్కనే ఓ కొండపై ఉండే చర్చికి వెళ్లడం మొదలుపెట్టాడు. అటువైపు వచ్చే తన చిన్నప్పటి ఫ్రెండ్స్‌ని కలిసేవాడు. వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ అక్కడే తయారుచేసే... వైన్‌ను రోజూ రెండు మూడు గ్లాసులు తాగేసేవాడు. చచ్చేముందైనా హ్యాపీగా చావాలి అనుకునేవాడు. నెలలు గడుస్తుంటే విచిత్రాలు జరిగాయి. మామూలుగా కాన్సర్ ముదిరే కొద్దీ పేషెంట్లు మరింత నీరసంగా అయిపోతుంటారు. స్టామటిస్‌లో ఇది రివర్సైంది. ఆయన మెల్లిమెల్లిగా స్ట్రాంగ్ అవుతూ వచ్చాడు. తనలో తేడాను ఆయన గుర్తించాడు. ఓ రోజు తనే గార్డెన్‌కి వెళ్లి కూరగాయల మొక్కులు నాటాడు. పెద్దాయనకు అది ఎంతో ఆనందం కలిగించింది. ఇక అప్పటి నుంచీ... తనకు నచ్చినదల్లా చేయడం మొదలుపెట్టాడు. ఉదయాన్నే సూర్యోదయాన్ని చూసేవాడు. సముద్ర కెరటాల నుంచీ వీచే గాలిని పీల్చేవాడు. తోటలో పండే తాజా కూరగాయల్ని తినేవాడు. ఆరోగ్యం అంతకంతకూ మెరుగవుతూ వచ్చింది.

ఆరు నెలలు గడిచాయి. స్టామటిస్ మరింత ఆరోగ్యంగా మారాడు. తన పనులు తాను చేసుకోవడమే కాదు... తోట పనులు కూడా చేస్తూ చాలా హ్యాపీగా ఫీలవ్వయ్యేవాడు. ద్రాక్ష తోటల్లో పనికి వెళ్లడం మొదలుపెట్టాడు. అక్కడే లంచ్ తినేసి... హాయిగా నిద్రపోయేవాడు. సాయంత్రాల్లో పేకాట క్లబ్బుకి వెళ్లి... రాత్రి పొద్దుపోయేవరకూ ఆడేవాడు. ఇలా నెలలు కాస్తా ఏళ్లయ్యాయి. ఏకంగా 45 ఏళ్లపాటు హ్యాపీగా, ఎలాంటి రోగాలూ లేకుండా బతికాడు స్టామటిస్. కాన్సర్‌ను జయించిన ఆయన... 2013లో చనిపోయాడు. ఆయనది సాధారణ మరణం అనీ... కాన్సర్ వల్ల చనిపోలేదని వైద్య పరీక్షల్లో తేలింది.

చనిపోయేటప్పటికి స్టామటిస్ వయసెంతో తెలుసా? 102 ఏళ్లు. డాక్టర్లు చెప్పినదానికంటే 40 ఏళ్లు ఎక్కువే బతికాడు. చివరి రోజు వరకూ పనిచేస్తూనే ఉన్నాడు. ఏడాదికి 15వందల లీటర్ల వైన్‌ను ఉత్పత్తి చేశాడు. కాన్సర్ ఆయన్ని ఏమీ చెయ్యలేకపోయింది. కీమోథెరపీ సహా... ఏ టెస్టులూ జరగలేదు. కనీసం మందులు కూడా వాడలేదు. మరెలా కాన్సర్ పరారైంది? కారణం... ఇకారియా ద్వీపమేనని పరిశోధనల్లో తేలింది.

ఇకారియన్ల హెల్త్ సీక్రెట్ ఏంటి?:
స్టామటిస్ జీవితాన్ని చూశాక మనకు తెలిసేదొకటే. ఇకారియాకు వెళ్లడం వల్లే ఆయన అన్నేళ్లపాటూ హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు ఆ దీవిలో... స్టామటిస్ లాంటి వాళ్లు ఇంటికొకరు ఉన్నారు. ఏజ్ బారవుతున్నా..." సెంచరీలు కొట్టే వయస్సు మాది" అంటున్నారు. వాళ్ల హెల్త్ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందాం.

ఇకారియా జనం ఎక్కువ కాలం బతకడానికి కారణం ఏంటన్నదానిపై చాలా పరిశోధనలు జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా 12 విషయాల్ని గుర్తించారు.

1. వీళ్లు ఎక్కువసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఉదయాన్నే లేటుగా నిద్రలేస్తారు. ద్రాక్ష తోటల్లో ఆడుతూ, పాడుతూ పనిచేయడం వీళ్లకు అలవాటు. మధ్యాహ్న భోజనం కూడా ఆలస్యంగా తింటారు.

2. ఆహారం విషయంలో వీళ్లెంత జాగ్రత్తగా ఉంటున్నారో తెలుసా? గ్రీన్ టీ లాంటి హెర్బల్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడుతున్నారు. షుగర్, పిండి పదార్థాలు, మాంసం లాంటివి తీసుకునేది తక్కువే. అంతేకాదు... పురుగు మందులు, కెమికల్స్ తో పండించిన ఆహారాన్ని అస్సలు ముట్టరు. సేంద్రియ పద్ధతుల్లో పండించినవి మాత్రమే తింటున్నారు. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ జోలికి వెళ్లరు. ఆరోగ్యంపై వీళ్లకు ఎంత శ్రద్ధో కదా.

3. మనం రోజూ రాత్రిపూట పడుకోవడానికే టైమ్ సరిపోదని అనుకుంటుంటాం. వీళ్లైతే... రాత్రే కాదు... మధ్యాహ్నం కూడా కునుకుతీస్తారు. ఇలా వారంలో కనీసం మూడు రోజులైనా మధ్యాహ్నం భోజనం చేశాక హాయిగా నిద్రపోతారు వీళ్లంతా.

4. మనలాగా వీళ్లు టెన్షన్లను నెత్తిన పెట్టుకోరు. టైమ్‌తో పోటీపడి పరిగెత్తడం ఉండదు. తోటల్లో పనికి ఆలస్యంగా వచ్చినా... ఓనర్లు పెద్దగా ఫీలవ్వరు. ఓ గంట అటూ ఇటూ అయితే ఏమవుతుందిలే అంటూ లైట్ తీసుకుంటారట. అందుకే వీళ్లకు వర్క్ టెన్షన్లు లేవు.

5. వీళ్లు సోషల్ లైఫ్‌ని బాగా ఇష్టపడుతున్నారు. పార్టీలు, వేడుకలూ తెగ జరుపుకుంటారు. వాటిలో కూడా ముసలివాళ్లకు ఇచ్చే రెస్పెక్ట్ అంతా ఇంతా కాదు. సాయంత్రం వేళల్లో ఆడుతూ, పాడుతూ... లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్లు.

6. ఇక్కడ 60 ఏళ్లు దాటిన వాళ్లు కూడా సెక్స్‌లో పాల్గొంటారు. 80 శాతం మందైతే రోజూ ఆ సుఖం అనుభవిస్తున్నట్లు చెప్పారు. వీళ్లు ఆరోగ్యంగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమేనని తెలింది.

7. ఇకారియన్లు కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తారు. ఒక్కో ఇంట్లో... మూడు, నాలుగు తరాలవాళ్లుంటారు. అందువల్ల ఒంటరితనం, దిగులు, ఆందోళనలు వీళ్ల జోలికి రావు. హ్యాపీ లైఫ్‌కి ఇంతకంటే ఏం కావాలి?

8. వీళ్లు ఉండేది కొండల్లో కాబట్టి... తమ అవసరాల కోసం రోజుకి చిన్నా పెద్దా 20 కొండలైనా ఎక్కి, దిగుతారట. అందువల్ల వీళ్లకు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా వీళ్ల శరీరం ఆరోగ్యంగా, కండరాలు శక్తిమంతంగా తయారవుతున్నాయి.

9. ఇకారియన్లు వైన్ బాగా తాగుతారు. ఐతే... దాన్ని వైన్ షాపుల్లో కొనుక్కోరు. వీళ్లే సొంత తోటల నుంచీ ఉత్పత్తి చేసి... అంతా కలిసిమెలిసి తాగుతారు.

10. వీళ్లకు కాఫీ తాగే అలవాటు కూడా ఉంది. రోజుకి ఒకట్రెండు కప్పులు సిప్ చేస్తారు.

11. వీటన్నింటికీ తోడు... ఆహ్లాదకర వాతావరణం వీళ్లకు ప్లస్ పాయింట్. ద్రాక్ష తోటల నుంచీ వచ్చే స్వచ్ఛమైన గాలులు... అనారోగ్యాలు రాకుండా కాపాడుతున్నాయి.

12. ప్రకృతి అందాలు... మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ప్రపంచీకరణ ప్రభావం ఈ దీవిపై పెద్దగా లేకపోవడంతో... వీళ్లు... హాయిగా బతికేస్తున్నారు.

ఆరోగ్యమే మహా భాగ్యం కదా. ఈ విషయాన్ని వంటబట్టించుకున్నారు ఇకారియా జనం. ఉరుకులు-పరుగులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారు. అపర కుభేరుల కన్నా సంతోషంగా బతుకుతున్నారు. రోగాల బారిన పడకుండా... ఆనందంగా రోజులు వెళ్లదీస్తున్నారు. మనం వాళ్లలా జీవించలేకపోయినా... కనీసం వాళ్ల నుంచీ కొన్నైనా మంచి విషయాలు గ్రహిస్తే... ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.