9, ఆగస్టు 2021, సోమవారం

Video: భలే ఉంది కదా... దీన్ని ముట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

కొక్కా (image credit - twitter)

Viral Video: సోషల్ మీడియా అద్భుతమైనది. కొత్త విషయాలు, ఆసక్తికరమైన సంగతులు తెలుసుకోవాలి అనుకునేవారికి సోషల్ మీడియాను మించినది ఉండదేమో. ఐతే... అదే సోషల్ మీడియాలో అసత్యాలు కూడా చాలా ఉంటాయనుకోండి. సరే... మనం అసలు టాపిక్‌కి వద్దాం. ఆ జంతువు పేరు కొక్కా (quokka). పలకడం కష్టమే. చిన్న తోకతో... పిల్లి అంత సైజులోనే ఉంటుంది. ఆస్ట్రేలియాలో కంగారూలు, వల్లబీలతోపాటూ... ఈ జంతువులూ ఉంటాయి. కానీ ఇవి అంతగా కనిపించవు. ఇవి శాఖాహార (herbivorous) జీవులు. రాత్రిపూట (nocturnal) తిరిగేవి. అందువల్ల పగటి వేళ ఈ జంతువులు అరుదుగా కనిపిస్తాయి.

తాజాగా ఓ కొక్కా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ మహిళ... జూలోని కొక్కాకు బొప్పాయి ముక్క లాంటిది ఇచ్చింది. ఆ ముక్కను తింటూ కొక్కా ఎంతో ఆనందపడింది. తన జీవితంలో ఇదే అత్యంత సంతోషకరమైన సమయం అన్నంత ఆనందం దాని ముఖంలో కనిపిస్తోంది. అలా అది తింటూ... ఓ సందర్భంలో... ఆ మహిళకు థాంక్స్ చెబుతూ... ఆమెను టచ్ చెయ్యబోయింది. కానీ ఆ మహిళ కాస్త వెనక్కి జరిగింది. మొత్తంగా కొక్కాను ఆమె అస్సలు ముట్టుకోలేదు.

నిజానికి అంత కలివిడిగా ఉండే జంతువును ఎవరైనా అలా ముట్టుకొని... నిమురుతారు. కానీ ఆమె టచ్ చెయ్యకపోవడానికి ప్రత్యేక కారణం ఉంది. ఈ కొక్కాలను ముట్టుకున్నా... వీటికి ఆహారం పెట్టినా ఆస్ట్రేలియాలో ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ రూ.8వేల నుంచి రూ.5 లక్షల దాకా ఉంటుంది. అక్కడి అధికారులు జాలిపడి వదిలేయరు. కచ్చితంగా ఫైన్ వేసేస్తారు. అందుకే అక్కడ ఎవ్వరూ కొక్కాల జోలికి వెళ్లరు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి.



పశ్చిమ ఆస్ట్రేలియాలో ఓ చిన్న ప్రాంతంలోనే ఈ జంతువులు జీవిస్తున్నాయి. ఇవి అంతరించే జంతువుల జాబితాలో చేరాయి. అందువల్ల వీటిని రక్షించే విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం రాజీ పడట్లేదు.



ఈ వీడియోలో చూడండి... ఈ అమ్మాయి కొక్కాను ముట్టుకోవడమే కాదు... ఆహారం కూడా పెట్టగలదు. ఎందుకంటే... ఆమె ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ ఉద్యోగి.



మన దేశంలో కూడా చాలా జంతువులు, పక్షులు అంతరించే దశలో ఉన్నాయి. పునుగు పిల్లి, మూషిక జింకల వంటివి చూద్దామన్నా కనిపించట్లేదు. అలాంటి వాటిని రక్షించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు నెటిజన్లు.