మన చుట్టుపక్కల ఎవరైనా క్రేకర్స్ కాల్చితే.. ఆ శబ్దాలు మనకు తీవ్రంగా వినిపిస్తాయి. అలాగే ఎక్కడో కిలోమీటర్ల అవతల ట్రైన్ కూత పెడితే.. అది కూడా మనకు వినిపిస్తుంది. ఇలా రకరకాల ధ్వనులను మనం వింటూ ఉంటాం. మరి అంతరిక్షంలో సూర్యుడిపై క్షణక్షణం భారీ పేలుళ్లు జరుగుతూ ఉంటాయి. ఆ శబ్దాలు మనకు ఎందుకు వినిపించవు?
మన సౌర కుటుంబంలో సూర్యుడు కేంద్రం. మన భూమి, ప్రాణికోటి మనుగడకు సూర్యుడే ఆధారం. సూర్యుడిలో ప్రధానంగా ఉండేది రెండే వాయువులు. ఒకటి హైడ్రోజన్, రెండు హీలియం. హైడ్రోజన్ సుమారు 75 శాతం ఉండగా.. మిగతాది హీలియం ఉంటుంది. కేంద్రక సంలీన చర్య వల్ల, ప్రతి సెకనుకూ సుమారు 60 వేల టన్నుల హైడ్రోజన్ పరమాణువులు, హీలియం పరమాణువులుగా మారుతాయి. ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంత సూత్రమైన E = mc2 ప్రకారం, 60వేల టన్నుల హైడ్రోజన్.. హీలియంగా మారినప్పుడు, దాదాపు 420 టన్నుల ద్రవ్యరాశి, శక్తిగా మారుతుంది. దాన్నే మనం సోలార్ పవర్‌గా చెబుతాం. మరి ఒక్క సెకన్‌లోనే అంత ఎనర్జీ వస్తే, ఎంత పెద్ద పేలుళ్లు జరిగివుండాలి? మరి మనకు ఆ శబ్దాలు ఎందుకు వినిపించవు?
సూర్య గోళం ఏడు లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంటుంది. సూర్యుడిలో 10 లక్షల భూములు పట్టగలవు. ఐతే.. సూర్యుడిలో కేంద్రక సంలీన చర్య.. పై భాగంలో జరగదు. అంతర్భాగంలో 2లక్షల కిలోమీటర్లలోపే జరుగుతుంది. ఆ తర్వాత పుట్టే ఎనర్జీ లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, ఉపరితలానికి చేరుతుంది. అది చాలా వేడిగా.. ఉడుకుతూ ఉంటుంది. అక్కడ వేడి దాదాపు 5,600 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంత వేడి ఎనర్జీ ఉందంటే.. లోపల ఎంత పెద్ద పేలుళ్లు జరుగుతాయో ఊహకందదు. భూమి బద్ధలైనట్లుగా భారీ శబ్దాలు వస్తుంటాయి. వాటిని వినడం మనవల్ల కాదు.
లక్కీగా సూర్యుడి పేలుళ్ల శబ్దాలు భూమి వరకూ రావు. ఎందుకంటే సూర్యుడు మనకు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అంతరిక్షం అంతా శూన్యమే. శూన్యంలో కాంతి ప్రసరిస్తుంది గానీ, శబ్దం ప్రయాణించలేదు. అందువల్ల సూర్యుడి శబ్దాలు శూన్యంలో ప్రయాణించి, మన భూమికి రాలేవు. అందుకే అంతరిక్షంలో వ్యోమగాములు గట్టిగా అరిచినా, పక్కనే ఉన్నవాళ్లకు కూడా వినిపించదు.