మన ఇళ్ల దగ్గర మీరు గమనించే ఉంటారు, ఆవులు, గేదెల వంటివి ఆహారం నెమరు వేస్తూ ఉంటాయి. అవి అలా ఎందుకు చేస్తాయో, నెమరు వేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఆది కడుపులోకి వెళ్లిపోతుంది. దాన్ని మనం మళ్లీ పైకి తీసుకురాలేం. అలా తీసుకొస్తే, వామ్టింగ్ అయిపోతుంది. కానీ ఆవులు, గేదెలు, ఎద్దుల వంటి వాటి విషయంలో ఇది భిన్నంగా జరుగుతుంది. అవి తిన్న ఆహారాన్ని మళ్లీ తిరిగి నోటిలోకి తెచ్చుకోగలవు. అలా తెచ్చుకొని, బాగా నములుతాయి. దాన్నే మనం నెమరువేస్తున్నాయి అంటాం. దీనికి ప్రత్యేక కారణం ఉంది.
మనం మనకు కావాల్సిన ఆహారాన్ని ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాం. తద్వారా ఎప్పుడు ఎంత కావాలంటే అంత తింటాం. కానీ పశువులు అలా స్టాక్ పెట్టుకోలేవు కదా.. అందుకే ప్రకృతి వాటికి ప్రత్యేక ఏర్పాటు ఇచ్చింది. అవి తమ పొట్టలోని జీర్ణాశయంలో ఆహారాన్ని స్టాక్ పెట్టుకుంటాయి. ఎలా అంటే.. వాటి జీర్ణాశయంలో 4 గదులు ఉంటాయి. అక్కడ స్టాక్ ఉంచుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వడానికి 3 రోజులు పడుతుంది.
పశువులు పొలానికి వెళ్లినప్పుడు గడ్డి, ఇతర మేతను నమలకుండా డైరెక్టుగా మింగేస్తాయి. ఆ ఆహారం వాటి జీర్ణాశయంలోని మొదటి గది అయిన ర్యూమన్ (rumen)లోకి వెళ్తుంది. అక్కడ మెత్తగా అయ్యి, కొంతవరకూ జీర్ణమవుతుంది. జీర్ణం కాని ఆహారాన్ని పశువులు తిరిగి నోట్లోకి తెచ్చుకుంటాయి. దాన్ని బాగా నములుతాయి. మెత్తగా అయ్యేలా చేస్తాయి. అదే నెమరువెయ్యడం అంటే.
నెమరు వేసిన తర్వాత మెత్తబడిన ఆహారం, జీర్ణాశయంలోని రెండో గది అయిన రెటిక్యులమ్ (reticulum)లోకి వెళ్తుంది. ఆ తర్వాత మూడో గది అయిన ఒమేసమ్ (omasum)లోకి వెళ్తుంది. చివరిగా నాలుగో గది అయిన అబోమేసమ్ (abomesum)లోకి వెళ్తుంది. ఆ తర్వాత పూర్తిగా జీర్ణమవుతుంది. ఇలా పశువులకు ప్రకృతి.. ప్రత్యేక ప్రక్రియను ఇచ్చింది.