13, ఏప్రిల్ 2024, శనివారం

Why do we fall asleep while reading? - చదివేటప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది?


స్కూల్లో అయినా, లైబ్రరీలో అయినా.. ఎక్కడైనా సరే.. చదివేటప్పుడు చాలా మందికి నిద్ర వస్తుంది. ఎంత ప్రయత్నించినా అది ఆగదు. బుక్ ఓపెన్ చెయ్యగానే నిద్ర మొదలవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి సొల్యూషన్ ఏంటి? తెలుసుకుందాం.


ఎవరైతే ప్రశాంతంగా కూర్చొని, సైలెంటుగా చదువుతూ ఉంటారో, వారికి బుక్ ఓపెన్ చేసిన పావు గంట తర్వాత నుంచి నిద్ర రావడం మొదలవుతుంది. దీనికి కారణం.. చదివేటప్పుడు వారి శరీర కదలికలు తగ్గిపోతాయి. కళ్లు, బ్రెయిన్, చేతులు మాత్రమే పనిచేస్తుంటాయి. అందువల్ల శరీరంలోని కండరాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. అప్పుడు కండరాల్లోని కణాల్లో దహనచర్య (Combustion) కూడా తగ్గిపోతుంది. అందువల్ల లాక్టిక్ యాసిడ్ తయారవుతుంది. ఈ యాసిడ్.. ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది. ఈ కారణంగా.. రక్తంలో ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. అందువల్ల శరీరానికి ఆక్సిజన్ తక్కువగా ఉండే రక్తం సప్లై అవుతూ ఉంటుంది.


శరీరానికి కావాల్సిన మొత్తం ఆక్సిజన్‌లో దాదాపు 20 శాతం ఆక్సిజన్ బ్రెయిన్ తీసుకుంటుంది. ఐతే.. లాక్టిక్ యాసిడ్ వల్ల.. బ్రెయిన్‌కి వెళ్లే రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. దాంతో బ్రెయిన్ యాక్టివ్‌గా పని చెయ్యలేదు. అప్పుడే నిద్ర రావడం మొదలవుతుంది. ఇలా కంటిన్యూగా బ్రెయిన్‌కి ఆక్సిజన్ తక్కువగా వస్తున్నంతసేపూ.. బ్రెయిన్ మొద్దుబారినట్లుగానే ఉంటుంది. అందుకే చదివేటప్పుడు నిద్ర మొదలైతే, ఆగదు.


చదివేటప్పుడు నిద్ర రాకూడదంటే ఏం చెయ్యాలో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. చదివేటప్పుడు ఒకే యాంగిల్‌లో ఉండకుండా.. తరచుగా అటూ ఇటూ కదులుతూ ఉండాలి. అలాగే.. పావుగంటకోసారి బ్రేక్ ఇచ్చి.. ఓ నాలుగడుగులు వేసి.. మళ్లీ వచ్చి కూర్చొని చదువుకోవాలి. అంటే.. బాడీకి రెస్ట్ ఇవ్వకుండా చూసుకోవాలి. అప్పుడు ఎంతసేపు చదివినా, నిద్ర రాదు.


ఇది చదువుకే కాదు.. ఆఫీసుల్లో డెస్క్ వర్క్ చేసేవారికీ వర్తిస్తుంది. ఎక్కువసేపు కూర్చొని పని చేస్తూ ఉంటే, నిద్రవస్తుంది. అందువల్ల వారు కూడా మధ్యమధ్యలో పనికి బ్రేక్ ఇచ్చి.. శరీరం, కండరాలూ యాక్టివ్‌గా ఉండేలా చూసుకుంటే.. నిద్రకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.