22, ఏప్రిల్ 2024, సోమవారం

How is glass made from sand? - ఇసుకతో గాజును ఎలా తయారు చేస్తారు?

 


ఇసుకతో గాజును తయారుచేస్తారని చాలా మందికి తెలుసు. కానీ ఎలా అన్నది తెలియకపోవచ్చు. ఎక్కడో సముద్రాలు, నదుల దగ్గర దొరికే ఇసుకతో.. అందమైన, పారదర్శకమైన గ్లాస్ ఎలా తయారవుతుంది? ఆ ప్రక్రియ తెలుసుకుందాం.


గ్లాస్ తయారీకోసం ముందుగా మెత్తని ఇసుకను సేకరిస్తారు. తర్వాత దానికి సోడియం కార్బొనేట్‌ని కలుపుతారు. ఈ మిశ్రమాన్ని పెద్ద యంత్రాల ద్వారా మెత్తని పొడిలా చేస్తారు. ఆ తర్వాత ఈ పొడిని దాదాపు 1700 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ వేడి చేస్తారు. ఈ వేడి ఎంత ఎక్కువంటే.. అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ షటిల్.. తిరిగి భూ వాతావరణంలోకి వచ్చేటప్పుడు దాదాపు ఇదే వేడి దాని షీల్డ్‌కి తగులుతుంది. ఇసుకను గాజులా మార్చేందుకు అంతలా వేడి చెయ్యాల్సి ఉంటుంది.


వేడి కారణంగా.. ఇసుక, సోడియం కార్బొనేట్ కలిసి.. బాగా మరిగిపోయి, బుడగలు వస్తూ.. మెత్తని, జిగురులాంటి పదార్థంలా మారుతుంది. బెల్లంని వేడి చేసినప్పుడు అది ఎలా జిగురులా మారుతుందో, అలా ఈ పదార్థం కూడా మారుతుంది. అలా మారిన తర్వాత దాన్ని 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ చల్లబరుస్తారు.


1000 డిగ్రీలకు చల్లారిన తర్వాత, ఈ మిశ్రమంలో మాంగనీస్ డై ఆక్సైడ్ కలుపుతారు. ఇది ఎందుకంటే.. ఇసుక మిశ్రమం తెల్లగా ఉండదు. ఇందులో కొన్ని మలినాలు ఉంటాయి. అవి పోయేందుకు మాంగనీస్ డై ఆక్సైడ్ కలపగానే.. ఆటోమేటిక్‌గా మలినాలు పోయి.. పారదర్శకమైన, స్వచ్ఛమైన గాజు పదార్థం తయారవుతుంది.


ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ తయారవ్వగానే.. ఆ మిశ్రమంలో.. మెటల్ ఆక్సైడ్‌లను కలుపుతారు. తద్వారా గ్లాస్‌లు రకరకాల రంగుల్లోకి మారతాయి. ఆ తర్వాత చల్లారుతున్న దశలో మెషిన్ల సాయంతో రకరకాల సైజుల్లో గ్లాస్ లను తయారుచేస్తారు. ఆ తర్వాత వాటికి షైనింగ్ ఇవ్వడం, కావాల్సిన షేప్ లోకి మార్చడం జరుగుతుంది. ఇలా ఇసుక నుంచి గ్లాస్ తయారీ చాలా కష్టమైన, ప్రమాదకరమైన పని. ఈ రోజుల్లో ఈ పనిని మెషిన్లతోపాటూ, సంప్రదాయ పద్ధతుల్లో కూడా చేస్తున్నారు.