ఈ రోజుల్లో బంగాళాదుంపలు లేని ఇల్లు దాదాపు ఉండదు. కూరల్లో, బజ్జీలలో, చిప్స్ లాగా ఇలా ఎన్నో రకాలుగా ఆలూని వండుకోవచ్చు. అలాంటి ఈ దుంపలను ఒకప్పుడు విషంలా చూసేవారు. ఆలూ చరిత్ర తెలుసుకుందాం.
బంగాళాదుంపలు పుట్టింది దక్షిణ అమెరికాలో. వీటిలో 4000 రకాలు ఉన్నాయి. ఇవి ఎల్లో, రెడ్, బ్లూ, బ్లాక్ ఇలా చాలా రంగుల్లో ఉన్నాయి. అంతేకాదు.. వీటిలో చిన్న దుంపలు బఠాణీ గింజ సైజులో ఉంటాయి. పెద్ద దుంపలను మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ప్రపంచ దేశాల ప్రజలు.. బియ్యం, గోధుమలు, మొక్కజొన్నతోపాటూ.. దుంపలను ఎక్కువగా తింటున్నారు.
క్రీస్తుపూర్వం 3వేల సంవత్సరాల కాలంలో దక్షిణ అమెరికాలోని పెరూ ప్రాంతంలో 'ఇన్కా ఇండియన్లు' నివసించేవారు. వారే తొలిసారి బంగాళాదుంపలను పండించారని చెబుతారు. క్రీస్తు శకం 1537లో స్పెయిన్ దేశస్థుల ద్వారా ఈ దుంపలు యూరప్ దేశాలకు చేరాయి. ఐతే.. మొదట్లో యూరోపియన్లు దుంపలు తింటే చనిపోతారని అనుకునేవారు. వాటిని విషంలా చూసేవారు.
జర్మనీ రాజు ఫ్రెడెరిక్ విలియం ఈ దుంపల గురించి ఆరా తీశారు. అప్పుడు ఈ దుంపల్లో ఉండే పోషకాల గురించి తెలుసుకున్నారు. వాటిని పండించమని ఆదేశించారు. అలా యూరప్‌లో దుంపల వాడకం పెరిగింది. ఆ తర్వాత ఈ దుంపలు.. 1621లో ఉత్తర అమెరికాకీ, 1719లో ఇంగ్లాండుకీ పరిచయం అయ్యాయి. వీటిని 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు భారత్‌కి పరిచయం చేశారు.
బంగాళాదుంపలో 80 శాతం నీరే ఉంటుంది. ఇంకా ప్రోటీన్, సోడియం, పొటాషియం, ఫైబర్, నియాసిన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సీ ఉంటాయి. ఒక అమెరికన్ ఏడాదికి 54 కేజీల దుంపల్ని తింటుంటే, ఒక జర్మన్ సంవత్సరానికి 65 కేజీల దుంపలు లాగిస్తున్నారు. అదే ఒక ఇండియన్ ఏడాదికి 33 కేజీల దుంపలే తింటున్నారు. ప్రపంచంలో బంగాళాదుంపల్ని ఎక్కువగా పండిస్తున్న దేశాల్లో చైనా, భారత్, రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ టాప్‌లో ఉన్నాయి.