1, జులై 2021, గురువారం

Atacama: అద్భుతాల అటకామా!

అటకామా ఎడారి (image credit - wikipedia)

Atacama Desert: ఈ భూమిపై అదో చిత్రమైన ప్రదేశం. ఎన్నో పరిశోధనలకు నిలయం. అంతరిక్ష అద్భుతాల్ని ఆవిష్కరించే నవ లోకం. అరుదైన పూల జాతులకు కేరాఫ్ అడ్రస్. అదే అటకామా ఎడారి. దాని ప్రత్యేకతలేంటో ఇవాళ్టి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అలాగే... 2017వ సంవత్సరంలో అక్కడ జరిగిన ఓ అద్భుతాన్ని కళ్లారా చూద్దాం.

ఎటు చూసినా ఎర్రటి మట్టి దిబ్బలు. కొండల్ని తలపించే ఇసుక తిన్నెలు. ఆకట్టుకునే ఆండీస్ పర్వతాలు. అత్యంత అరుదైన ఎడారి ప్రాణులు. సలసలా కాగే వేడి నీటి బుగ్గలు. కట్టిపడేసే అంతరిక్ష అందాలు. అక్కడ కాలు పెడితే... సుర్రున కాలుతుంది. భరించలేని ఎండ... దిమ్మ తిరిగేలా చేస్తుంది. అయినప్పటికీ... అటకామా ఎడారికి... మన ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం ఉంది. జీవ వైవిధ్య భరిత ప్రత్యేకతలతో ఆకట్టుకుంటుంది అటకామా ఎడారి.

దక్షిణ అమెరికాలో ఆండీస్ పర్వతశ్రేణికి పశ్చిమాన... సన్నటి భూభాగంలో ఉంది ఈ ఎడారి. వెయ్యి కిలోమీటర్ల పొడవున ఇది విస్తరించి ఉంది. ఇక్కడ సంవత్సరంలో ఒక్క రోజు కూడా వాన పడదు. అందుకే ప్రపంచంలో అత్యంత పొడి ప్రదేశం ఏదంటే ఆన్సర్ అటకామాయే. ఎక్కడికి వెళ్లినా వేడి వాతావరణమే. పగటి వేళల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల దాకా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం ఎడారిలో తిరిగితే... ప్రత్యక్ష నరకమే. మిగతా ఎడారులలాగే... ఇక్కడ కూడా... రాత్రి కాగానే... ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు పడిపోతుంది. విపతీరమైన చలి వేసేస్తుంది.

ఈ ఎడారి అత్యంత పురాతనమైనది. దీని వయసు 20 కోట్ల సంవత్సరాలు. కాలిఫోర్నియాలో డెత్ వ్యాలీ కంటే ఇది 50 రెట్లు ఎక్కువ పొడిగా ఉంటుంది. ఉత్తర చిలీలో విస్తరించి ఉన్న ఈ డెసెర్ట్‌లో ఎక్కువ భాగం సాల్ట్ బేసిన్‌లు, ఇసుక, లావా రాళ్ళే ఉంటాయి. అటకామాలోకి ఎంటరైతే... మరో ప్రపంచంలోకి వెళ్లినట్లే. పసిఫిక్ తీర ప్రాంతాలు, చిలీలో తప్పితే... ఇక్కడ మనుషులెవ్వరూ కనిపించరు. చెట్టూ-చేమా ఉండవు.
 
పొడి వాతావరణం వల్ల... ఇక్కడ నివసించే జంతువులు, పక్షులు చాలా తక్కువ. బల్లులు, పురుగులు, తేళ్లు మాత్రమే ఉంటాయి. ఐతే... ఆండీస్ పర్వత శ్రేణుల దగ్గర్లో ఉండే... శాన్ పెడ్రో డీ అటకామా (San Pedro de atacama) పట్టణంలో మాత్రం... కొన్ని రకాల జంతువులు, పక్షులు ఉంటాయి. ముఖ్యంగా... ఆండియన్ ఫ్లెమింగోలు (Flamingo)... పద్ధతిగా కదులుతూ... కెమెరాలకు పని పెడతాయి. వాటిని చూస్తుంటే... టైమే తెలీదు.

మలమలా మాడే ఈ ఎడారిలో... పర్యాటక ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వాటిని చూసేందుకు వచ్చే టూరిస్టులు... శాన్ పెడ్రో డీ అటకామా పట్టణంలో స్టే చేస్తారు. చిలీలోని మూడు ప్రధాన పర్యాటక కేంద్రాల్లో అటకామా ఎడారిదే టాప్ ప్లేస్. దీంతోపాటూ... శాన్ పెడ్రో డీ అటకామా పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో వేడి నీటి బుగ్గలుంటాయి (Geysers). చుచు టౌన్‌లో ఉన్న మొత్తం 80 గీజర్లను చూసేందుకు పర్యాటకులు తరలివెళ్తారు. అటకామాలో రెగ్యులర్‌గా... వోల్కనో మారథాన్‌లు జరుగుతుంటాయి. అసలే ఎండ... చుక్క నీరుండదు... అలాంటి చోట... ఇసుక దిబ్బల్లో పరుగెత్తడమంటే మాటలా. అందుకే ఈ మారథాన్‌లో గెలవడాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకుంటారు పార్టిసిపెంట్స్.



అటకామాకీ, అంగారక గ్రహానికీ ఉన్న సంబంధమేంటి?
అటకామా ఓ ఎడారి దిబ్బ. అది మనకు ఎందుకూ పనికిరాదు... అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే... అటకామాలో అపార ఖనిజ సంపద ఉంది. అంతేకాదు... అంతరిక్ష పరిశోధనలకు ఆ ఎడారిని మించిన ప్రాంతం... ఈ భూమిపైనే లేదు. ఎందుకో తెలుసుకుందాం.

అటకామాను చూసిన వాళ్లకు... అంగారక గ్రహం గుర్తురావడం సహజం. ఎందుకంటే... రెడ్ ప్లానెట్‌ లాగే... ఈ ఎడారి కూడా... ఎరుపు రంగులో కనిపిస్తుంది. పైగా... మార్స్‌పై ఎలాంటి వాతావరణం ఉందో... అటకామాలో కూడా... అదే రకమైన వాతావరణం, అలాంటి మట్టి రేణువులే ఉన్నాయి.

మార్స్ ఇతివృత్తంతో తీసే సినిమాల షూటింగ్స్‌లో ఎక్కువ శాతం అటకామా ఎడారిలోనే జరుగుతున్నాయి. "స్పేస్ ఒడిస్సీ - వోయాజ్ టు ది ప్లానెట్స్" లాంటి టీవీ సిరీస్‌లు కూడా... ఇక్కడే షూట్ చేస్తున్నారు. (Space Odyssey)

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ- నాసా (NASA)... తన ల్యాండ్ రోవర్ల (NASA rovers)ను ఇక్కడ పరీక్షిస్తోంది. ఈ నేలపై సక్సెస్‌ఫుల్‌గా నడవగలిగే రోవర్లు... చందమామ, మార్స్‌పై కూడా తిరగగలుగుతున్నాయి.

ఎత్తైన ప్రదేశంలో ఉండటం, మేఘాలు లేని ఆకాశం, పొడి గాలి, కాంతి కాలుష్యం లేకపోవడం, సిటీల నుంచీ రేడియో తరంగాల ధ్వని రాకపోవడంతో... అటకామా ఎడారి... విశ్వాన్ని శోధించేందుకు చక్కగా ఉపయోగపడుతోంది. ఇక్కడ ఏడాదికి 300 రోజులు ఆకాశం అత్యంత నిర్మలంగా ఉంటుంది. రాత్రి వేళ ఆకాశంలో కనిపించేది... అద్భుతమే. కోట్ల నక్షత్రాలతో మన పాలపుంత (Milkyway Galaxy) మిలమిలా మెరుస్తూ మాటలకందని దృశ్యరూపాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ భూమ్మీద మరెక్కడా... ఇంత చక్కగా, ఇంత స్పష్టంగా విశ్వం కనిపించదన్నది అంతరిక్ష పరిశోధకుల మాట.



నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు... ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాయి. యూరప్ దక్షిణ పరిశోధనా శాఖ ఇక్కడ రెండు భారీ రీసెర్చ్ సెంటర్లను... నిర్వహిస్తోంది. ఈ రెండు కేంద్రాల్లో భారీ టెలిస్కోపులు ఉన్నాయి. వీటిలో అల్మా (Alma Telescope) అని పిలిచే టెలిస్కోప్.. ప్రపంచంలోనే అతి పెద్దది.

ఇవి... విశ్వాన్ని నిరంతరం జల్లెడ పడుతున్నాయి. గ్రహశకలాల రాకపోకలు, గ్రహాల కదలికలు, నక్షత్ర మండలాల్ని ఇవి ప్రతీ క్షణం గమనిస్తున్నాయి. 2011లో అటకామా లార్జ్ మిల్లీమీటర్ ఎర్రే పేరుతో... మరో టెలిస్కోపును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో యూరప్, జపాన్, అమెరికా, కెనడా, చిలీ భాగస్వాములు. వీటితోపాటూ ఇక్కడ 66 రేడియో రోదసీ టెలిస్కోపులు 1999 నుంచీ పనిచేస్తున్నాయి. ఇవి నక్షత్రాల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నాయి.

పర్యావరణ పరంగా అటకామాలో పచ్చదనం లేదుగానీ... అపార ఖనిజ సంపద మాత్రం ఈ డెసెర్ట్ సొంతం. 16, 17, 18 శతాబ్దాల్లో ఇక్కడ తీర ప్రాంత నగరాలు ఏర్పడ్డాయి. ఈ భూమిలో సిల్వర్, కాపర్, గోల్డ్, సోడియం నైట్రేట్ వంటి ఖనిజ నిక్షేపాలు ఉండటం వల్ల గనుల పరిశ్రమ స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

ప్రపంచానికి సోడియం నైట్రేట్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నది ఇక్కడి నుంచే. దీనితోనే ఎరువుల్ని, పేలుడు పదార్థాల్నీ తయారుచేస్తారు. మన సెల్‌ఫోన్లు, ఇతర బ్యాటరీలకు అవసరమయ్యే ముడి పదార్థాల్ని ఎక్కువగా అందిస్తున్నది అటకామాయే.

1940లో చిలీ సాల్ట్‌పీటర్ అనే ప్రాంతంలో... సోడియం నైట్రేట్ తవ్వకాలు ఎక్కువగా జరిగాయి. ఫలితంగా ఇక్కడ తవ్వి వదిలేసిన గనులు, కార్మికులు లేని శిథిల పట్టణాలూ కనిపిస్తాయి. ఒక్క మనిషీ లేకుండా... ఖాళీగా ఉండే ఇళ్లు... పర్యాటకులకు ఆశ్చర్యం కలిగిస్తాయి.

అటకామాలో ఐదేళ్ల కిందట... ఓ గనిలో ప్రమాదం జరిగి... 33 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. వాళ్లందర్నీ ప్రాణాలతో రక్షించగలిగారు. అదే స్టోరీలైన్‌తో హాలీవుడ్ సినిమా The 33 వచ్చింది. దాన్ని అటకామాలోనే షూట్ చేశారు.

అటకామాలో మరో ప్రత్యేకత... ఇక్కడ దొరికిన మమ్మీలు. ఒకప్పుడు ఇక్కడ చించొర్రో జాతి జాలర్లు నివసించేవాళ్లు. వీళ్లు చనిపోయిన వాళ్లను మమ్మీలుగా మార్చేవాళ్లు. శవాల్ని అత్యంత భద్రంగా దాచేవాళ్లు.

ఈజిఫ్టులో కంటే... వేల సంవత్సరాల ముందు నుంచే... ఇక్కడ మమ్మీల సంస్కృతి ఉంది. ఈజిఫ్టులో కనిపించిన అతి పురాతన మమ్మీ క్రీస్తు పూర్వం 3వేల సంవత్సరాల నాటిదైతే.... అటకామాలో దొరికిన పురాతన మమ్మీ క్రీస్తుపూర్వం 7వేల 20 నాటిది.



అటకామాలో 2017 సంవత్సరం ఓ అద్భుతం జరిగింది. అదేంటో తెలుసుకుందాం.

మనం ముందే చెప్పుకున్నాం... అటకామాలో వర్షం అన్నదే పడదని. ఐతే... కొన్నేళ్లుగా అక్కడి వాతావరణంలో మార్పులొస్తున్నాయి. 2015లో వాన పడి వరదలు రాగా... 2017 మళ్లీ అలాగే జరిగింది. ఇదో శుభ పరిణామం. ఐతే... వర్షం వల్ల అక్కడో అద్భుతం జరిగింది. అటకామా ఎడారి పూల తోటలతో నిండిపోయింది. చుక్క నీరు కూడా ఉండని ఎడారిలో... కలర్‌ఫుల్ ఫ్లవర్స్ రావడం అద్భుతమనే చెప్పాలి. ప్రకృతి కరుణించడం వల్లే.. ఇది సాధ్యమైంది. మట్టి దిబ్బలా కనిపించే అటకామాలో మాయాజాలం చేసినట్లు అయ్యింది. 2018లో చిలీలో తుఫాను రాకతో... భారీ వరదలొచ్చాయి. ఏకంగా ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయేంత పరిస్థితి. వాతావరణంలో వచ్చిన మార్పు... ఆండీస్ పర్వతాలపై ప్రభావం చూపింది. అక్కడి నుంచీ వచ్చిన పొగమంచు.... ఎడారి వాతావరణాన్ని చల్లబరిచింది. ఉన్నట్టుండి... ఇక్కడ మంచు వాన పడటంతో... ఎడారి కాస్తా... పూలవనంగా మారిపోయింది. ఎటుచూసినా... రంగురంగుల పూలతో నిండిపోయింది. 

పూలతో అటకామా ఎడారి (image credit - wikipedia)

సాధారణంగా... అటకామాలో... పదేళ్లలో ఒక్కసారే ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది. గత దశాబ్దంలో సీన్ మారింది. 2015లో భారీ వర్షాలు రాగా... రెండేళ్లకే మళ్లీ కురవడం... అటకామాలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దాదాపు 200 రకాల పూల మొక్కలు అక్కడ కనిపించాయి. ఎడారిలోనే కాదు... అగ్ని పర్వతాలపై, కొండలపై, ఇసుక తిన్నెలపై... అంతటా అవి పరచుకున్నాయి. వీటిని చూసేందుకు రోజూ వేల మంది పర్యాటకులు తరలివెళ్లారు. పూల మొక్కలతోపాటూ... కొన్ని రకాల ఎడారి మొక్కలు, ఔషధ మొక్కలు కూడా కనిపించాయి. వాటిని కనిపెడుతూ... తమ కెమెరాల్లో బంధించారు పర్యాటకులు.



సాధారణంగా... ఈ ఎడారిలో పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. అవి చేసే శబ్దాలు ఎలా ఉంటాయంటే... ఈ ప్రపంచం అంతమైపోతోందా అన్న డౌట్ కలిగిస్తాయి. అలాంటి చోట... ఈ పూలు పలకరించడం పర్యావరణానికే సరికొత్త శోభ అనుకోవచ్చు. ఎప్పుడో 20 ఏళ్ల కిందట... ఇలాగే పూల మొక్కలొచ్చాయి. మళ్లీ 2017లో కనిపించాయి. ఈ వాతావరణ మార్పుల్ని పర్యావరణ వేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. కనీసం రెండేళ్లకోసారైనా వర్షాలు పడితే... అటకామాను సుందర ప్రాంతంగా మార్చేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. 2017 నవంబర్ తర్వాత అటకామా మళ్లీ ఎడారిలా మారిపోయింది.

ఇదీ అటకామా వాస్తవ చిత్రం. ప్రకృతి తలచుకుంటే ఏమైనా చేయగలదు. అందుకే... ఎడారిలో కూడా పూల వర్షం కురిసింది. పర్యాటకులకు ఆహ్లాదం... ప్రాణికోటికి ఆహారం అందించింది.