శ్రీలంక |
Srilanka: చాలా సందర్భాల్లో ఇండియా మ్యాప్‌లో శ్రీలంక కూడా ఉంటుంది. కన్నీటి బొట్టులా కనిపించే ఈ దేశం... LTTE దాడుల నుంచీ విముక్తి పొంది... అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. చాలామందికి తెలియని విషయమేంటంటే... శ్రీలంకలో ఎన్నో టూరిస్టు స్పాట్‌లున్నాయి. కొన్నైతే... హిమాలయాల్ని తలపిస్తాయి. అందుకే శ్రీలంక సంగతులు, విశేషాలూ ఓసారి తెలుసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధాలయాలతో ఆకట్టుకుంటున్న శ్రీలంకలో పర్యటించేందుకు... ఓ ట్రైన్ జర్నీ ఎన్నో మధురానుభూతుల్ని మిగుల్చుతోంది. నిజమైన శ్రీలంకను చూసేందుకు అది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. అదెలాగో తెలుసుకుందాం.
శ్రీలంకను చూడటమంటే... దాదాపు మన దేశాన్ని చూడటం లాంటిదే. ఇండియాలో కనిపించే సంస్కృతులు, పాటించే విధానాలూ... ఇక్కడా కనిపిస్తాయి. ఐతే... ఎంతో కొంత వైవిధ్యం ఉంటుంది. అదే... ఈ దేశాన్ని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలబెడుతోంది. LTTE యుద్ధం 2009లో ముగియడంతో... శ్రీలంకలో ఇప్పుడు ప్రశాంత వాతావరణమే కనిపిస్తోంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ దేశం అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. 2015లో ప్రజాస్వామ్య దేశంగా మారాక... కొత్త అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేనను జనం... ఓట్లు వేసి ఎన్నుకున్నారు. ప్రస్తుతం గోటబయ రాజపక్స (Gotabaya Rajapaksa) అధ్యక్షుడిగా ఉన్నారు.
సిలోన్ అని ముద్దుగా పిలుచుకునే ఈ ద్వీపం... పర్యాటకులకు నిజంగా స్వర్గధామమే. దీన్ని చూసేందుకు ట్రైన్‌ను మించిన బెస్ట్ ఆప్షన్ లేదు. పర్యాటక ప్రాంతాలతోపాటూ... నిజమైన శ్రీలంక జనం జీవిత చిత్రాల్ని చూడాలంటే... రైలు బండి ఎక్కాల్సిందే. రాజధాని కొలంబో ఫోర్ట్ స్టేషన్ (Fort railway station) నుంచీ ఈ జర్నీ మొదలవుతుంది.
మన కరెన్సీతో పోల్చితే... శ్రీలంక రూపాయి కరెన్సీ విలువ తక్కువ. మన దగ్గర వెయ్యి రూపాయలు... అక్కడ 2వేల 666వందలతో సమానం. సో, ఈ జర్నీ చీప్ అండ్ బెస్ట్ అనుకోవచ్చు. కొలంబో నుంచీ రైలు... 9 గంటలపాటూ.... 270 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది రంబుక్కానా, కాండీ, పట్టిపోలా మీదుగా ఎల్లాకి వెళ్తుంది. లంకలో బ్రిటిషర్స్ వేసిన మొదటి రైల్వే లైన్ ఇది. దీన్ని మెయిన్ లైన్ అని పిలుస్తారు.
ట్రైన్ 54 కిలోమీటర్లు వెళ్లగానే... అంబక్కూసా వస్తుంది. 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఊరు అది. ఆ ఊరుకి వెళ్లే దారిలో కలానీ నదిని దాటే దృశ్యం చూడచక్కగా ఉంటుంది. శ్రీలంకలోని పొడవైన నదుల్లో ఇదీ ఒకటి. ఈ జర్నీ జనరల్ టికెట్ రేటు... మన కరెన్సీలో 120 రూపాయలు. ఫస్ట్ క్లాస్ అయితే... 650 రూపాయలు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న రైల్లో ప్రయాణించడాన్ని గర్వంగా ఫీలవుతారు లంకేయులు. బస్సులో కంటే... రైలు జర్నీనే ఎక్కువగా ఇష్టపడతారు.
శ్రీలంక సంపన్న దేశం కాకపోవడంతో... ఇండియాలాగే... ఇక్కడ కూడా... చదివిన చదువుకి తగిన ఉద్యోగాలు లేవు. ఏళ్లుగా వ్యవసాయమే ఇక్కడ ప్రధాన జీవనాధారం. ఈ దేశంలోని 21 శాతం పిల్లలకు సరైన పౌష్టికాహారం లేదు. సంపన్నులు, పేదల మధ్య గ్యాప్... ఎక్కువే. అందుకే... థర్డ్ క్లాస్ జర్నీ ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ట్రైన్‌లో గంటన్నర ప్రయాణించాక రంబుక్కానా స్టేషన్ వస్తుంది. ఇదో పర్యాటక ప్రాంతం.
ఇక్కడి పిన్నవాలా ఏనుగుల రక్షణ కేంద్రం (pinnawala elephant orphanage) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కేంద్రం నిర్వాహకులు రైలు ప్రమాదాల్లో దెబ్బతిన్న ఏనుగులు, అడవిలో గాయపడిన గజరాజులకు ఇక్కడ ప్రత్యేక ట్రీట్‌మెంట్ చేస్తారు. మాయో ఓయో నదిలో... ఏనుగులకు రోజూ స్నానం చేయిస్తారు. ఇలా చేస్తే అనారోగ్యంతో ఉన్న ఏనుగులకు వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు.
ప్రస్తుతం ఈ కేంద్రంలో 96 ఏనుగులున్నాయి. వీటిని దగ్గరగా చూసే పర్యాటకులకు పరమానందమే. గున్న ఏనుగులకు పాలు ఇచ్చి ఖుషీ అవుతారు. ప్రతీ పిల్ల ఏనుగూ... రోజుకు 7 లీటర్ల పాలు తాగుతుంది.
రంబుక్కానా స్టేషన్ దాటాక... ఈ ట్రైన్.... పల్లెలు, పట్టణాలు, కొండలు, సొరంగాల్లోంచీ వెళ్తుంది.
శ్రీలంకలో వజ్రాల పరిశ్రమ డెవలప్ అవుతోంది. ఇక్కడి స్వర్ణ కార్మికులు... వజ్రాల్ని సానపెట్టి... ఆభరణాలు తయారుచేస్తారు. టూరిస్టులకు ఇదో ప్రత్యేక అనుభవం. ఒక్కో కార్మికుడూ... నెలకు మన కరెన్సీలో అయితే... 15వేలు సంపాదిస్తాడు. అదే లంక కరెన్సీలో చెప్పాలంటే... 40 వేల రూపాయలతో సమానం.
రైలు మూడున్నర గంటల్లో... 130 కిలోమీటర్లు ప్రయాణించి... కాండీని చేరుతుంది. సింగళీయుల చారిత్రక రాజధాని ఈ కాండీ. ఎత్తైన ప్రదేశం కావడంతో... ఇక్కడి వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది.
శ్రీలంక జాతీయ పుష్పం... బ్లూ వాటర్ లిల్లీని ఇక్కడ అమ్ముతూ ఉంటారు. బుద్ధ భగవానుడికి దీన్ని సమర్పిస్తారు. ఇక్కడి శ్రీ దలదా మాలిగావా బౌద్ధాలయం (dalada maligawa buddha pujawa) స్థానికంగా ఫేమస్. ఈ క్షేత్రంలో బుద్ధుడి దంతాన్ని పదిలపరిచారు. ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ రోజూ 90 నిమిషాలపాటూ జరిగే పూజను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు.
పర్యాటకులు... బుద్ధుడి ప్రతి రూపానికి బదులు బంగారు పూతతో ఉన్న పగోడాను మాత్రమే ఈ ఆలయంలో చూడగలరు. ఇందులోనే బుద్ధుడి దంతాన్ని భద్రపరిచారు. ఈ ఆలయం వల్ల... కాండీ... యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరింది. నృత్య రీతులకు కూడా కాండీ గుర్తింపుపొందింది. ఒకప్పుడు కాండీ రాజులకు అనారోగ్యం వచ్చినప్పుడు... నర్తకీమణులు... నృత్యాలు చేసేవాళ్లు. 1932 నుంచీ ఆ నృత్యాల్ని ఇక్కడ పర్యాటకుల కోసం ప్రదర్శిస్తున్నారు.
శ్రీలంక అనగానే... అదో చిన్న ద్వీపం. గొప్పగా చెప్పుకునేంత విషయాలేవీ ఉండవు అక్కడ. అనుకుంటారు చాలా మంది. నిజమేంటంటే... తేయాకు ఎగుమతికి ఆ దేశం ఫేమస్. ఇంకా చాలా విశేషాలున్నాయి. రైల్లో వెళ్తూ... ఆ సంగతులు తెలుసుకుందాం.
ఎత్తైన కొండల్లోంచీ రైలు వెళ్తుంటే... ఆ దృశ్యం నయనమనోహరం. మెయిన్ లైన్ రైల్వే మార్గం... మరింత పైకి వెళ్తూ ఉంటుంది.
శ్రీలంకలోని ప్రధాన వ్యాపారాల్లో టెక్స్‌టైల్ బిజినెస్ ఒకటి. దీనిపై ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇండియాలో లాగానే... ఇక్కడ కూడా నేత కార్మికులకు నెలకు వచ్చే వేతనం 4వేల రూపాయలే. ఈ దేశ కరెన్సీలో చెప్పాలంటే... 10 వేలతో సమానం.
కొండలపై నుంచీ తేయాకును కొలంబోకి తరలించేందుకు బ్రిటీష్ వాళ్లు ఈ రైల్వే లైన్ వేశారు. ప్రస్తుతం 2వేల 2వందల చదరపు కిలోమీటర్ల భూభాగంలో తేయాకును సాగు చేస్తున్నారు. చాలా మందికి ఇది ఉపాధి కల్పిస్తోంది. ఇక్కడి తేయాకు కార్మికులు లంక కరెన్సీలో రోజుకు 250 రూపాయల దాకా సంపాదిస్తున్నారు. కార్మికులు సేకరించిన తేయాకును హల్ఫా టీ ఫ్యాక్టరీకి తరలిస్తారు. ఇక్కడ ఆకుల్ని ప్రాసెస్ చేసి... చిన్న, లేత ఆకుల్ని నాణ్యమైనవిగా గుర్తిస్తారు. ఆకు పెద్దదైతే... రెండో రకం కింద లెక్క. ఈ ఫ్యాక్టరీలో వంద మంది దాకా వర్కర్లు పనిచేస్తున్నారు. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. టీని ఎక్కువగా ఎగుమతి చేసే దేశాల్లో శ్రీలంక కూడా ఉంది.
ట్రైన్ నానూ-ఓయా స్టేషన్‌కు చేరుతుంది. లంకలో ట్రైన్..... స్టేషన్‌కి రాగానే... డ్రైవర్‌కి ఓ టోకెన్ ఇవ్వడం పరిపాటి. తద్వారా నెక్ట్స్ స్టేషన్‌కి వెళ్లేందుకు ఆ డ్రైవర్‌కి అనుమతి ఇచ్చినట్లవుతుంది. పైగా... టోకెన్ ఇవ్వడం ద్వారా... ఆ మార్గంలో ఎలాంటి ఇబ్బందులూ లేవని చెప్పినట్లే. బ్రిటీష్ కాలంలో... నానూ-ఓయాలో హార్స్ రేసులు జరిగేవి. ప్రస్తుతం అవి లేవు. ఐతే... అప్పటి గోల్ఫ్ క్లబ్ మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది.
కొండలూ, కోనల్లోంచీ ప్రయాణిస్తూ... ట్రైన్... పట్టిపోలను చేరుతుంది. 1891 మీటర్ల ఎత్తులో... కూల్‌గా ఉంటుంది ఈ స్టేషన్. ఇక్కడ అత్యంత ఎత్తైన ప్రాంతం 1898 మీటర్లపైన ఉంటుంది. మంచు కురుస్తూ ఆహ్లాదం కలిగిస్తుంది. బ్రాడ్ గేజ్ రైల్వే అత్యంత ఎత్తులో ఉన్న ప్రదేశం ఇదే. ఈ కారణంగా ఇది గిన్నిస్ బుక్‌లో చేరింది. కొలంబో నుంచీ 224 కిలోమీటర్ల దూరంలో ఉందీ ప్రదేశం. ఈ ఏరియాలో ప్రకృతిసిద్ధ స్పాలు ఉంటాయి. మసాజ్ చేయించుకునేవారికి ఇదో విరామ కేంద్రం. తాము చేసే మసాజ్.... శరీరంలో 107 భాగాలపై ప్రభావం చూపిస్తుందని, చాలా ఎనర్జీ వస్తుందనీ చెబుతుంటారు థెరపిస్టులు.
ట్రైన్ జర్నీ చివరి స్టేషన్ ఎల్లాకు చేరుతుంది. ఈ మెయిన్ లైన్ రైల్వేను యునెస్కో... హెరిటేజ్ రైల్వే లైన్‌గా గుర్తించింది. 9 గంటల్లో టూరిస్టులు... మరో ప్రపంచాన్ని చూసేందుకు ఈ లైన్ చక్కగా ఉపయోగపడుతుంది.
ట్రైన్ జర్నీతోపాటూ శ్రీలంకలో టాప్ 5 టూరిస్ట్ స్పాట్‌లు తప్పకచూడాలి. ప్రపంచానికి తెలియని ఎన్నో అద్భుత ప్రదేశాల్ని తనలో దాచుకుంది శ్రీలంక. బౌద్ధ ఆరామాలు, బ్రిటీష్ సంస్కృతి, ఫారెస్ట్ సఫారీ ఇలా... ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. వాటిలో టాప్ 5లో ఉన్న టూరిస్ట్ ప్లేస్‌లను ఇప్పుడు తెలుసుకుందాం.
Yala National Park:
చుట్టూ అడవి... అందులో జంతువుల్ని దగ్గర నుంచీ చూడటం... లైఫ్‌లో మర్చిపోలేని థ్రిల్. ఆ అనుభూతి కలిగించేందుకు శ్రీలంకలో చాలా నేషనల్ పార్కులున్నాయి. వాటిలో యాలా సఫారీ ప్రత్యేకమైనది. ఇది ఆఫ్రికా... కెన్యాలో లాంటి బెస్ట్ సఫారీ కాకపోయినా... ఇందులో కూడా ఏనుగులు, చిరుతలూ, జింకలూ, ఇతరత్రా ప్రాణులు కనిపిస్తాయి. యాలా సఫారీకి ఓ రోజంతా కేటాయించాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే... అన్ని ఎక్కువ జంతువుల్ని చూసే వీలు కలుగుతుంది.
Dambulla Cave Temple:
దంబుల్లాలో... బౌద్ధ గుహాలయాలు ప్రాచీనమైనవి. పక్కపక్కనే ఉండే 5 గుహల్లో రంగురంగుల రాతి విగ్రహాలు ఆకట్టుకుంటాయి. వాటిలో ఒకటి... 2 వేల ఏళ్ల నాటిది. 5 గుహల్లో... పెద్ద గుహలో... నిటారుగా ఉన్న 16 విగ్రహాలుండగా... మరో 40 వాలినట్లుగా ఉన్నాయి. బుద్ధుడి జీవిత కథను చెబుతూ... రకరకాల భంగిమల్లో ఈ ప్రతిమలున్నాయి. ఈ గుహల సీలింగ్స్‌పై రకరకాల పెయింటింగ్స్ ఉంటాయి. శతాబ్దాలుగా అవి వెలిసిపోకుండా ఉండటం విశేషం. బయటి వాతావరణం వేడిగా ఉన్నా... గుహల లోపల మాత్రం చల్లగా ఉంటుంది. ప్రశాంత తత్వం, భక్తిభావం వెల్లివిరుస్తుంది.
Sigiriya Rock Fortress:
సిగిరియా రాతి కోట. నిజానికి ఇదో అగ్నిపర్వత లావా వల్ల ఏర్పడిన కొండ. ఐదో శతాబ్దంలో అప్పటి రాజు దీన్ని కోటలా మలిచాడు. దీనిపై సైనిక బలగాల్ని మోహరించాడు. ఈ కోట రాతి గోడలపై... పెయింటింగ్స్ ఆకట్టుకుంటాయి. మెట్ల మార్గంలో పైకి వెళ్లడం కష్టంగా అనిపించినా... పైకి వెళ్లాక అద్భుతంలా అనిపిస్తుంది. ఇక్కడి రాతిపై చెక్కిన భారీ సింహపు విగ్రహం ప్రస్తుతం లేకపోయినా... దాని పంజాలను బట్టీ... అది ఎంత పెద్దగా ఉండేదో ఊహించుకోవచ్చు.
Ancient City of Polonnaruwa:
పొలొన్నరువా... ఇదో ప్రాచీన బౌద్ధ నగరం. ప్రస్తుతం శిథిలమై... అలనాటి బౌద్ధ ప్రాసస్థ్యాన్ని చాటిచెబుతోంది. ఇప్పటి రాజధాని కొలంబో అయినా... వెయ్యేళ్ల కిందట... పొలొన్నరువాయే... రాజధాని. అప్పటి రాజు ఒకటో విజయబాహు... ఈ నగరాన్ని అద్భుతంగా మలిచాడు. ఒక్కసారి ఈ నగరంలోకి వెళ్లి చూస్తే.... అప్పట్లో ఇది ఎంత గొప్పగా ఉండేదో అర్థమవుతుంది. దీన్ని పరిరక్షించే ఉద్దేశంతో... యునెస్కో... ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
Bentota Turtle Sanctuary:
శ్రీలంకలో తాబేళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2004లో సునామీ తాకిడికి... చాలా తాబేళ్లు చనిపోయాయి. అప్పటి నుంచీ... తాబేళ్ల సంరక్షణకు చాలా కేంద్రాలు వెలిశాయి. వాటిలో బెంటోటా టర్టిల్ శాంక్చురీ గురించి చెప్పుకోవాల్సిందే. శ్రీలంక నైరుతీ సముద్ర తీరాన... ఈ సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ తాబేళ్లను పెంచడమే కాదు. వాటి గుడ్లను కూడా సేకరిస్తారు. స్థానికులు తాబేళ్ల గుడ్లను రెస్టారెంట్లలో అమ్మనివ్వకుండా... వాటిని వీళ్లే కొంటారు. అవి పిల్లలయ్యేలా చేస్తారు. అలా... పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతోంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు కూడా విరాళాలు ఇస్తూ, వాలంటీర్లుగా పనిచేస్తూ.... తాబేళ్ల సంఖ్యను పెంచేందుకు సాయపడుతున్నారు.
మనకు చాలా దగ్గర్లో ఎన్నో పర్యాటక ప్రదేశాలతో ఆకట్టుకుంటోంది శ్రీలంక. పైగా... అక్కడ కరెన్సీ విలువ కూడా తక్కువ కావడంతో... ఎక్కువ ఖర్చుపెట్టకుండానే... ఎన్నో ప్రదేశాల్ని చూసి రావచ్చు. అందుకే భారతీయులకు ఇదో హాట్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారుతోంది.