2, జులై 2021, శుక్రవారం

Machu Picchu: భూమిపై పవిత్ర ప్రదేశం అదేనా? అక్కడ దేవతలు తిరిగేవాళ్లా? 300 ఏళ్లు ఎలా మాయమైంది? అదృశ్య నగరం!

 

మచ్చు పిచ్చు నగరం (image credit - wikipedia)

అదో అద్భుత నగరం. ఎన్నో రహస్యాల స్థావరం. ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో, ఎందుకు వదిలేశారో, ఏం జరిగిందో... ఎవరికీ తెలీదు. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొంది... ప్రపంచ ఆధునిక వింతల్లో ఒకటిగా నిలిచిన మచ్చు-పిచ్చు విశేషాలు తెలుసుకుందాం.

మనం ఓ ఇల్లు కట్టాలంటేనే చుక్కలు కనిపిస్తాయి. అలాంటిది... ఎక్కడో పర్వతాలపై... చక్కగా చదును చేసి... ఓ అద్భుతమైన నగరాన్ని నిర్మించడమంటే మాటలా? అసలు అక్కడికి వెళ్తే.... ఆ సిటీని నిర్మించింది మనుషులేనా అన్న డౌట్ రాక మానదు. చుట్టూ ఆకాశాన్ని అంటినట్టుండే పర్వతాలు.... వాటి మధ్య గంభీరంగా ప్రవహించే నది.... ఆ ప్రదేశం మధ్యలో పర్వతాలపై ఓ నగరం... చరిత్రకారులకు ఎన్నో ప్రశ్నల్ని మిగిల్చి... ఆధునిక మానవాళిని... అంతుబట్టని రహస్యాలతో ఆకర్షిస్తున్న మరో ప్రపంచం. అదే దక్షిణ అమెరికా.... పెరూలోని ఎత్తైన ఆండీస్ పర్వతాల(Andes Mountains)పై ఉన్న మచ్చుపిచ్చు నగరం.

మచ్చు పిచ్చు నగరం (image credit - wikipedia)



దట్టమైన అమెజాన్ అడవి (Amazon Forest)లో ఆండిస్ ప్లేట్‌కు మధ్యలో ఉరుబంబా నది (Urubamba River) ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదికి దాదాపు 8వేల అడుగుల ఎత్తున పర్వతాలపై నగరాన్ని నిర్మించిందెవరు? ఇక్కడే నిర్మించడానికి కారణమేంటి?

ఏ శత్రుదేశాల యుద్ధాల నుంచో రక్షించుకునేందుకు దీన్ని నిర్మించలేదు. ఎందుకంటే ఈ నగరంలో ఎక్కడా కోట గోడలు, యుద్ధ సామగ్రి వంటివి లేవు. వాటికి బదులుగా... ఇక్కడ చిన్న చిన్న ఫౌంటేన్లు, నీటి ప్రవాహాలున్నాయి. అరుదైన ఆలయాలు, వింతైన రాతి ఆకారాలున్నాయి.

ఈ నగరంలో ఎక్కడా శిల్పాలు, శిలా శాసనాల వంటివి కనిపించవు. ఇక్కడి భారీ రాతి కట్టడాలు, ఓ పద్ధతి ప్రకారం చెక్కినట్లుండే టెర్రస్‌లు మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తాయి.

2వేల 450 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సిటీ... ఓ మిస్టరీ, చారిత్రక అద్భుతం. ఎటు చూసినా గ్రీనరీ, చుట్టూ మంచు కురుస్తూ ఉంటే... అక్కడి నుంచీ విశాల వినీల ఆకాశాన్ని చూడటం ఓ మాటలకందని అనుభూతి.

మచ్చుపిచ్చు అంటే... పాత పర్వతం అని అర్థం. ఇక్కడ చిన్నాపెద్దా... 200 దాకా నిర్మాణాలుంటాయి. దేనికదే విడివిడిగా ఉండేవే. కొన్ని చూడ్డానికి ఇళ్లలా... మరికొన్ని ఆలయాల్లా కనిపిస్తాయి. ఎక్కడ చూసినా... నీటి ప్రవాహాలు దర్శనమిస్తాయి. పైకి ఎక్కడమే కష్టంగా ఉండే ఈ పర్వతాలపై... వీటన్నింటినీ ఎవరు కట్టారు? ఎందుకు?

మచ్చు-పిచ్చు గురించి చారిత్రక ఆధారాలేవీ లేవు. ఏ కవులూ, చరిత్రకారులూ దీన్ని వర్ణించలేదు. ఏ పురాతన గ్రంథాల్లోనూ దీని ప్రస్థావన లేదు. అంతెందుకు... ఇక్కడి ఏ రాయిపైనా ఎలాంటి రాతలూ ఉండవు. నిర్మాణాలు మాత్రం అత్యద్భుతంగా కనిపిస్తూ... పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి. ఇంత చక్కటి నగరాన్ని... ఇంతెత్తున... ఎందుకు ఏర్పాటు చేసుకున్నారన్నది ప్రపంచానికే మిస్టరీ.

ముఖ్యంగా మచ్చుపిచ్చులో అత్యంత ఎత్తున ఓ రాతి స్థూపం లాంటి ఆకారం ఉంటుంది. అక్కడకు వెళ్లి చూస్తే... మరో ప్రపంచంలో అడుగుపెట్టిన ఫీల్ కలుగుతుంది. ఆ స్థూపం ఎందుకుంది? ఆ ఆకారానికి అర్థమేంటి? ప్రస్తుతానికి ఇదో అంతుబట్టని రహస్యం.




మచ్చు-పిచ్చుకు సంబంధించి నమ్మలేని కొన్ని నిజాలున్నాయి. మచ్చు-పిచ్చును కళ్లారా చూస్తే... దాని చరిత్ర తెలుసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. అంతలా ఆ నిర్మాణాలు... ఆసక్తి రేపుతాయి. అమెరికా సహా ఎన్నో దేశాల పరిశోధకులు... వందేళ్లుగా రహస్యాల్ని ఛేదిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.

మచ్చు-పిచ్చును ఎవరు నిర్మించారు? వందేళ్లుగా ఇదో మిస్టరీ. 14వ శతాబ్దంలో ఇన్కా జాతి (Incas) చక్రవర్తులు... పెరూను పరిపాలించారు. వాళ్లే మచ్చు-పిచ్చును నిర్మించి ఉంటారనే అంచనాలున్నాయి. ఎందుకంటే... మచ్చు-పిచ్చు లాంటి నిర్మాణాలు పెరూలో చాలాచోట్ల ఉన్నాయి. పొడవాటి మెట్లు, కాలువలు, రాతి ఆకారాల వంటివి... మచ్చు-పిచ్చును పోలి ఉంటాయి. ఐతే... అవేవీ... మచ్చు-పిచ్చు అంత అద్భుతంగా మాత్రం ఉండవు. మచ్చు-పిచ్చులో లాగే... పెరూలోని నిర్మాణాల్లో ఎక్కడా ఇనుమును వాడలేదు. చక్రాలతో పనిలేకుండానే  నిర్మించారు. ఏ శిలలపైనా రాతల్ని రాయలేదు.

ఇన్కాన్ల చరిత్రను అప్పటి పోమా అనే రచయిత... తన గ్రంథాల్లో రాశాడు. నగరాల్ని ఎలా నిర్మించేవాళ్లో ఆయన బొమ్మల రూపంలో రాశాడు. ఆ ఆధారాల్ని బట్టి... ఇన్కాన్లు... రకరకాల జాతుల్ని ఏకం చేసుకుంటూ... దక్షిణ అమెరికా పశ్చిమాన.... దాదాపు 4వేల కిలోమీటర్ల పరిధిలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. దీన్నే కుస్కో (cusco city of peru) అని పిలిచేవాళ్లు.

ఇన్కాన్లు... పెద్ద పెద్ద కొండల్ని కూడా చెక్కుతూ... వ్యవసాయం చేసేవాళ్లు. చక్రవర్తికి తిరుగులేని అధికారాలుండేవి. ఆయన మాట శిలా శాసనంగా అమలయ్యేది. అందువల్ల పరిపాలనలో ఎలాంటి వివాదాలూ ఉండేవి కావు. చిత్రమైన విషయమేంటంటే... ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సంపాదించుకున్న ఇన్కాన్లు... పరిపాలన సాగించింది కేవలం వందేళ్లే.

15వ శతాబ్దంలో... స్పెయిన్ చక్రవర్తులు... కుస్కోపై వరుస దండయాత్రలు చేశారు. ఆ యుద్ధాల్లో కుస్కో ఛిన్నాభిన్నమైంది. ఆర్థికంగా పతనమైంది. కరువుకాటకాలకు, ఆకలి బాధలు తోడై... కుస్కో కకావికలమైంది. అదే సమయంలో... వచ్చిన మసూచి (Smallpox)... కుస్కో ప్రజల పాలిట శాపమైంది. 1572లో కుస్కో... స్పెయిన్ చక్రవర్తుల వశమైంది.

ఇన్కా చక్రవర్తుల్లో చివరివాడైన పచ్చక్యూటీ (pachacuti)... 35 ఏళ్లపాటూ పరిపాలించాడు. ఆ కాలంలో ఆయన... విల్కబాంబ (vilcabamba) అనే ఓ నగరాన్ని ఎత్తైన పర్వతాల మధ్యలో నిర్మించాడు. అక్కడి నుంచే పరిపాలన సాగించాడు. కుస్కో పూర్తిగా స్పెయిన్ చక్రవర్తుల వశమైన తర్వాత... విల్కబాంబ నగరం ఒకటుందన్న సంగతి అందరూ మర్చిపోయారు. అలా ఇది చరిత్రలో అదృశ్యమైంది.

350 ఏళ్ల తర్వాత విల్కబాంబ మళ్లీ వెలుగులోకి వచ్చింది. 1911లో అమెరికా పరిశోధకుడు హిరమ్ బింగమ్... ఓ నగరాన్ని గుర్తించాడు. జులై 24న పర్వతాలపైకి ఎక్కి... అక్కడి నిర్మాణాలను ఫొటోలు తీశాడు. అలా దాని గురించి ప్రపంచానికి తెలిసింది. ఆ నగరాన్ని ఆయన మచ్చు-పిచ్చు అని పిలిచాడు. అప్పటి నుంచీ మచ్చు-పిచ్చు ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. ఐతే... తను కనుక్కున్నది విల్కబాంబ అని ఆయనకు తెలీదు.

బింగమ్ టీమ్... అక్కడ పురావస్తు పరిశోధనలు జరపగా... ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. మచ్చు-పిచ్చు దగ్గర కనిపించిన పుర్రెల్లో... 80 శాతం బాలికలవే. ఒక రకంగా ఆ నగరం... బాలికల శవాల దిబ్బలా అనిపించింది వాళ్లకు. ఆ బాలికలను చంపిందెవరు? ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతగ్గా... ఓ విషయం తెలిసింది. ఇన్కా చక్రవర్తులు... బాలికల్ని బానిసలుగా చేసుకునేవాళ్లు. 8 ఏళ్ల వయసులోనే వాళ్లను తమ సేవకులుగా మార్చుకునేవాళ్లు.

1913లో రిలీజైన ఓ పుస్తకం కొత్త విషయం చెప్పింది. స్పెయిన్ చక్రవర్తులు... ఇన్కాన్ల అన్ని ఆలయాల్నీ నాశనం చేశారు. మచ్చు-పిచ్చును మాత్రం టచ్ చేయలేదు. దాని గురించి వాళ్లకు తెలియలేదా? లేక... తెలిసి కూడా దాని జోలికి రాలేదా? అన్న ప్రశ్నలకు ఆన్సర్ దొరకలేదు.


మచ్చు పిచ్చు నగరం (image credit - wikipedia)



మచ్చు-పిచ్చుకి సంబంధించి... భయంకరమైన విషయం ఒకటుంది. ఎన్నో మిస్టరీల కలయిక మచ్చు-పిచ్చు. వాటికి సమాధానాలు వెతికేందుకు వందేళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఇంతకీ మచ్చు-పిచ్చు ఎలాంటి ప్రదేశం? సైనిక స్థావరమా? లేక... ప్రార్థనా కేంద్రమా? పురావస్తు పరిశోధకులకు తెలిసిన భయంకరమైన విషయమేంటి?

మచ్చు-పిచ్చును ఎందుకు నిర్మించారన్నది ఇప్పటికీ తేలని విషయమే. ఐతే... కొన్ని అంచనాలు మాత్రం ఉన్నాయి. మచ్చు-పిచ్చులో చాలా ఆలయాల వంటి నిర్మాణాలున్నాయి. వాటిలో 3 కిటికీల గది ఆలయం, సూర్య ఆలయం, ఇంటి వతానా రాతి స్థూప ఆలయం (inti watana) ప్రసిద్ధి చెందాయి. ఇన్కాన్లు.... సూర్యుడు, నదులు, పర్వతాల్ని దేవతలుగా భావించేవాళ్లు. దేవతల్ని సంతృప్తి పరిచేందుకు వాళ్లు... ఆడపిల్లల్ని బలి ఇచ్చేవాళ్లు. అందువల్ల తమకు అద్భుతమైన శక్తులు వస్తాయని నమ్మేవాళ్లు. ఇన్కాన్ల చివరి రాజైన పచ్చక్యూటీ... వందల మంది ఆడ పిల్లల్ని బలి ఇచ్చినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే అక్కడ ఆడపిల్లల పుర్రెలే ఎక్కువగా కనిపించాయని నమ్ముతున్నారు.



ఇన్కాన్లకు మరో లక్షణం కూడా ఉంది. చనిపోయిన వారిని వాళ్లు మమ్మీలుగా మార్చేవాళ్లు. వాళ్లను దేవతలుగా పూజించేవాళ్లు. పచ్చక్యూటీ 1472లో చనిపోగా... అతన్ని కూడా మమ్మీగా మార్చేశారు. ఇప్పటికీ... పెరూలో జరిగే ఉత్సవాల్లో... మమ్మీలను ఊరేగించే ఆచారం ఉంది.

500 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న మచ్చు-పిచ్చును... వాతావరణమే దెబ్బతీస్తోంది. ఇక్కడ ఏటా అక్టోబర్ నుంచీ ఏప్రిల్ వరకూ... భారీ వర్షాలు కురుస్తాయి. ఫలితంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి.

ఒకప్పుడు పర్యాటకులు మచ్చు-పిచ్చును చేరాలంటే... 4 రోజులు పట్టేది. ఇప్పుడు ట్రైన్, బస్సు రూట్ల ద్వారా 4 గంటల్లోనే చేరగలుగుతున్నారు. మచ్చు-పిచ్చులో అన్నింటి కంటే ఎత్తులో ఉండే... ఇంటి వతానా శిలా స్థూప ఆలయం ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. కారణం... ఈ స్థూపం... చుట్టూ నాలుగు దిక్కుల్లో ఉన్న ఎత్తైన పర్వత శిఖరాగ్రాలతో లింక్ అవుతున్నట్లుగా ఉంటుంది. నలుగురు శక్తిమంతమైన దేవతల మధ్య... నదీమ తల్లి ప్రవాహం సాగుతుండగా... అక్కడ నిర్మించిన మచ్చు-పిచ్చును అత్యంత పవిత్రమైనదిగా భావించేవాళ్లు ఇన్కాన్లు.

ఇది ప్రార్థనా ప్రదేశమా, లేక సైనిక స్థావరమా అన్నది ఇప్పటికీ మిస్టరీయే. తాజాగా పరిశోధనల ప్రకారం... కొత్త విషయాలు తెలిశాయి. ఇన్కాన్ల చివరి రాజైన పచ్చక్యూటీ ప్రత్యేక ఆసక్తితో మచ్చు-పిచ్చూను నిర్మించుకున్నాడు. ప్రశాంతత, దైవత్వానికి చిహ్నంగా ఈ నగరాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఐతే... పచ్చక్యూటీ చనిపోయిన తర్వాత... ఈ నగరంలో జనం... మసూచి సోకి చనిపోయి ఉంటారని ఓ అంచనా.

మచు పిచ్చును ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది యునెస్కో. 2007లో వరల్డ్ న్యూ సెవెన్ వండర్స్‌లో ఇది కూడా ప్లేస్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌లలో ఇదీ ఒకటి. ఇక్కడ టూరిస్ట్ ప్యాకేజీలు, హోటల్, ప్రయాణ ఖర్చులు చాలా తక్కువగా ఉండటంతో... ఎక్కువ మంది పర్యాటకులు దీన్ని చూసేందుకు వెళ్తున్నారు.

రోబో సినిమాలో... కిలీమంజారో సాంగ్ షూటింగ్ ఇక్కడే జరిగింది. ఐతే... మన కేంద్ర ప్రభుత్వం కోరితే తప్ప... ఇక్కడ షూటింగ్ జరిపేందుకు అనుమతి ఇవ్వలేదు పెరూ ప్రభుత్వం. అంతలా... ఈ నగరాన్ని కాపాడుతున్నారు అధికారులు.



మచ్చు-పిచ్చును నిర్మించడానికి కారణాలు ఏవైనా కావచ్చు. బట్... అదో అద్భుతమైన చారిత్రక నగరం. ఆధునిక ప్రపంచానికి సరికొత్త అనుభూతులను మిగిల్చే... వింత ప్రదేశం. రకరకాల రహస్యాలే ఆ నగరానికి ప్రత్యేక ఆకర్షణలు. అవే... పర్యాటకులు తరలివచ్చేలా చేస్తున్నాయి.