16, జులై 2021, శుక్రవారం

Mystic Temples: ఆ విగ్రహం అలకపాన్పు ఎక్కిందా? ఆ గుళ్లోకి వెళ్తే చనిపోతారా? ఆలయాలు - రహస్యాలు!

ఆలయాలు - రహస్యాలు!


మన దేశం ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనంత... పురాతన వారసత్వ సంపద మన సొంతం. చాలా ఆలయాల చరిత్ర, విశిష్టతల గురించి మనందరికీ ఎంతో కొంత తెలుసు. ఐతే... ఇప్పటికీ కొన్ని టెంపుల్స్‌లో అంతుపట్టని రహస్యాలు చాలా ఉన్నాయి. అవేంటో, ఎందుకో తెలుసుకుందాం.

మనందరం... కంచి నుంచీ... కాశ్మీర్ వరకూ... ఎన్నో ఆలయాలకు వెళ్తుంటాం. దైవ దర్శనం తర్వాత... కాసేపు అక్కడే ఉండి... ప్రసాదం స్వీకరించి... తిరిగి వెళ్లిపోతాం. ఐతే... ఆ టెంపుల్స్ వెనక చాలా రహస్యాలుంటాయి. ఆ మిస్టరీలు ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ ప్రపంచంలో... మనది భక్తి-భావ ప్రపత్తుల దేశం. 64 కోట్ల దేవుళ్లు, దేవతలు నడయాడే పవిత్ర భూమి. అందుకే... ప్రతీ వీధిలో ఓ గుడి ఉంటుంది. ఐతే... అన్ని గుళ్లూ ఒకేలా ఉండవు. కొన్ని వైవిధ్యంగా, ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్నింటి చరిత్ర నమ్మశక్యం కాదు కూడా. అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది వాటి విశేషాలు తెలుసుకుంటే. ఇంకొన్ని గుళ్లైతే... వాటిలో జరిగే ఆచారాలు, సంప్రదాయాల్ని చూసి ముక్కున వేలేసుకుంటాం. ఇవన్నీ ఒక ఎత్తైతే... 2వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న... పురాతన ఆలయాల ప్రాసస్థ్యం అంతా ఇంతా కాదు.

Mahendipur Balaji Temple, Rajasthan:
"దెయ్యాలూ, భూతాలూ, పిశాచాలూ, చేతబడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చెయ్యాలి" అని రాజస్థాన్ జనాన్ని అడిగితే... వాళ్లు చెప్పే సమాధానం... మహేందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్లమని. దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్. రోజూ వేల మంది భక్తులు అక్కడకు వెళ్తుంటారు. వాళ్లు చూపించే భక్తి... భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు. ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరైతే... గొలుసులతో కట్టేసుకుని... తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇదంతా ఎందుకంటే... తమను దెయ్యాలు వదిలిపోవాలి అంటారు. పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు. అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచీ వెళ్లిపోయేటప్పుడు... వెనక్కి తిరిగి చూడకూడదట. అలా చూస్తే... దెయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట. ఇది నిజమా, కాదా అంటే... ఎవరి నమ్మకాలు వాళ్లవి.

 

కొడుంగల్లూర్ భగవతీ ఆలయం (image credit - Wikipedia)

Kodungallur Bhagavathy Temple, Kerala:
సాధారణంగా మనం దేవుణ్ని కీర్తిస్తాం. అదే ఈ టెంపుల్‌కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కొడుంగల్లూర్ భగవతీ ఆలయం ప్రత్యేకత ఇది. ఏటా ఇక్కడ 7 రోజులపాటూ ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైమ్‌లో భక్తులు...  కత్తులతో ఎంటరవుతారు. తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా కారుతుంది. అలాగే గుళ్లోకి వెళ్తారు. భద్రకాళీ అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్ల దండకమే కాదు... భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు. అక్కడితో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ... గుడిపైకి రాళ్లు విసురుతారు. ఏటా రాళ్లతో కొడుతుండటం వల్ల ఆలయం దెబ్బతింటోంది. ఇక్కడ పూజా-కైంకర్యాలు, కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు. 7 రోజుల ఉత్సవాల తర్వాత... వారం పాటూ ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైమ్‌లో... రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు.

Stambheshwar Mahadev Temple, Gujarat:
అప్పుడప్పుడూ మాయమై... తిరిగి కనిపించే టెంపుల్‌కి వెళ్లాలనుకుంటున్నారా? ఐతే... గుజరాత్.. వడోదరలోని స్తంభలేశ్వర్ మహదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి. అరేబియా సముద్ర తీర జలాల్లో ఉందీ గుడి. ఇక్కడి ఈశ్వరుడు... ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చేవాళ్లను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం. సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం. పెద్ద అలలు వస్తున్నప్పుడు... ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వత తిరిగి కనిపిస్తుంది. ఈ ప్రత్యేకతే ఈ గుడిని ఫేమస్ టెంపుల్‌గా మార్చేసింది.

Tirumala Temple:
మన తెలుగువారి తిరుమల టెంపుల్‌ కూడా ప్రత్యేకమైనదే. పూజలు, భక్తజన సందోహం ఇవన్నీ ఒక ఎత్తు. కేశ సంపద మరో ఎత్తు. రోజూ ఈ ఆలయంలో 60 వేల మంది దాకా తలనీలాల రూపంలో మొక్కు చెల్లిస్తున్నారు. అందువల్ల ఏటా వందల టన్నుల కొద్దీ జుట్టు పోగవుతోంది. దీన్ని ఈ-వేలంలో అమ్మితే... TTDకి 300 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. తిరుమలలో హుండీ ఆదాయం తర్వాత... ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే. టీటీడీ నుంచీ... ఈ జుట్టు విదేశాలకు వెళ్తోంది. ఎక్కువగా అమెరికా, ఇటలీ, చైనాకు ఎక్స్‌పోర్ట్ అవుతోంది. అక్కడి విగ్గుల కంపెనీలు ఈ హెయిర్‌తో విగ్స్ తయారుచేస్తున్నాయి. చైనాలో విగ్స్‌తోపాటూ... ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా జుట్టును వాడుతున్నారు. మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేశాల్ని... బాలీవుడ్ స్టార్స్ కోసం విగ్స్ తయారుచేస్తున్నారు.
పుష్కర్ లోని బ్రహ్మ ఆలయం (image credit - Rajasthan)

Brahma Temple, Pushkar, Rajasthan:
హిందూ పురాణాల ప్రకారం... త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు... ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయం. అదే... రాజస్థాన్‌... పుష్కర్ లోని బ్రహ్మ ఆలయం. క్రీస్తు శకం పద్నాలుగో శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఔరంగజేబు... మన దేశాన్ని పాలించిన సమయంలో... చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా పుష్కర్‌లో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఐతే... బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబు అనుచరులెవరూ దాన్ని టచ్ చెయ్యకపోవడం విశేషం. పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు... భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన... వెండి నాణేలు అమర్చారు. ఈ టెంపుల్, దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందన్నది భక్తుల మాట.

మన దేశంలో ఏ పర్యాటక ప్రాంతానికి వెళ్లినా... అక్కడ తప్పనిసరిగా ఆలయాలుంటాయి. కొన్ని సందర్భాల్లో... ఆలయాల వల్లే... పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. అలాంటి ఆలయాల విశేషాల్ని తెలుసుకుందాం.

Rat Temple, Rajasthan:
రాజస్థాన్‌... బికనూర్‌కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ చిత్రమైన గుడి. అదే... దేష్నాక్‌లోని కార్నీ మాత టెంపుల్. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే... ఎలుకల్ని పూజిస్తారు. దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్నీ మాతను... ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడి భక్తజనం. అందుకే ఈ ఆలయంలో... ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. భక్తులు వాటికి పాలు, ఇతర ప్రసాదాలు పెడతారు. బికనూర్ పర్యటనకు వెళ్లే టూరిస్టులు... తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే... ఎలుకలకు పూజ చెయ్యడమన్నది అరుదైన విషయం. చాలా మంది వాటిని వీడియోలు తీసుకుంటారు. పాలచుట్టూ... రౌండ్‌గా మూగి... రాట్స్.... మిల్క్ తాగుతుంటే... ఆ దృశ్యాల్ని మొబైల్ కెమెరాల్లో బంధిస్తారు.

Kal Bhairav Nath Temple, Varanasi:
ఏ గుళ్లోనైనా స్వీటో, హాటో ప్రసాదంగా పెడతారు. ఈ టెంపుల్‌లో మాత్రం... మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. పవిత్ర క్షేత్రం వారణాసిలో... శివుడి ప్రతిరూపమైన కాల భైరవనాథ్ ఆలయం ఇది. ఇక్కడ నైవేద్యం సహా... దేవుడికి సమర్పించే ప్రతీదాన్నీ... మద్యంతోనే తయారుచేస్తారు... అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు, స్వీట్ల వంటివి అమ్మడం కామన్. ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్లినా మద్యమే అమ్ముతారు.

China Kali Temple, Kolkata:
కోల్‌కతాలోని తాంగ్రాలో... చైనాటౌన్ ఉంది. దానికి ఆ పేరు రావడానికి కారణం... అక్కడ ఉండేవాళ్లలో చైనీయులే ఎక్కువ. వాళ్లు... కాళీమాతను పూజిస్తారు. అందుకే... ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అనే పేరు వచ్చింది. మనమైతే... అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోరో, స్వీటో పెడతాం కదా. చైనీయులు... నూడుల్స్, చాప్‌సుయ్ లాంటివి పెడతారు. అదే ఈ ఆలయం స్పెషాలిటీ.

Kadu Malleshwara Temple, Bangalore:
బెంగళూరులో కాడు మల్లేశ్వరస్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటోంది. 1997లో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది. దాని నోటి నుంచీ నీటి ప్రవాహం వస్తుండటం ఆశ్చర్యం కలిగించింది. మరింత తవ్వగా... ఓ నీటి కొలను కూడా బయటపడింది. అప్పటి నుంచీ... ఆలయ రూపురేఖల్ని మార్చారు. నంది నోటి నుంచీ వచ్చే నీరు... శివలింగం పై పడి... ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. ఐతే... నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచీ వస్తుందో తెలియలేదు. ఈ నీరే... ఇక్కడున్న విషభవతి నదికి జీవ జలం అని నమ్ముతారు స్థానికులు.

Hadimba Temple, Manali, Himachal Pradesh:
మంచుకురిసే మనాలీలో... ప్రత్యేక ఆలయం ఈ హడింబా టెంపుల్. 4 అంతస్థుల ఈ ఆలయం... పగోడా ఆకారంలో ఉండటమే విశేషం. ఈ చుట్టుపక్కల ఎక్కడా... ఆ మాటకొస్తే... మన దేశంలోనే ఇలాంటి ఆలయాలు అరుదు. తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడా నిర్మాణ శైలి... ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయంలో హడింబా దేవి కొలువుదీరి ఉంటుంది. రాక్షసుడైన హడింబా చెల్లెలు ఈమె. కుల్లు రాజులు... హడింబా దేవిని ఇష్టదైవంగా పూజించేవాళ్లు. ఐతే... అమ్మవారి కంటే... నిర్మాణశైలి వల్లే ఈ ఆలయం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Brihadeeswara Temple, Tamil Nadu:
అద్భుత కళా నైపుణ్యం... తమిళనాడు... తంజావూర్‌లోని... బృహదీశ్వరాలయం సొంతం. ఈ టెంపుల్‌లో ఎక్కువ భాగం... శుద్ధమైన గ్రానైట్‌తో నిర్మించారు. ఇదే సైంటిస్టులకు సవాలు విసురుతోంది. ఎందుకంటే... ఈ ఆలయానికి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకూ... గ్రానైట్ నిక్షేపాలు, ఆనవాళ్లూ లేవు. ఎప్పుడో వెయ్యేళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కడి నుంచీ గ్రానైట్ తీసుకొచ్చారు? ఎలా తెచ్చారు? అన్నది ఆశ్చర్యకరం. ముఖ్యంగా గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది. ఏ క్రేన్లూ లేకుండా.... ఆ భారీ శిలను, అంత ఎత్తుకి ఎలా చేర్చగలిగారన్నది అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది.

ఎప్పుడో శతాబ్దాల కిందట నిర్మించిన ఆలయాలు... ఇప్పటికీ సైన్స్‌కి అందని నిగూఢ రహస్యాల్ని తమలో దాచుకున్నాయి. కొన్ని ఆలయాల్లో విగ్రహాలు, కొన్ని ఆలయాల నిర్మాణ శైలి... నేటి ఆధునిక సాంకేతికతకు అంతుచిక్కని మిస్టరీలుగా మిగిలిపోయాయి. అలాంటి మరికొన్ని తెలుసుకుందాం.
బుద్ధ నీలకంఠ ఆలయంలో విష్ణుమూర్తి (image credit - wikipedia)

Buddha neelakanta kathmandu, Nepal:
ఇది బుద్ధ నీలకంఠ ఆలయం.... పేరులో బుద్ధ ఉన్నా... నిజానికి ఇది మహా విష్ణువు వెలసిన ఆలయం. బుద్ధ నీలకంఠ అంటే... పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థం. ఇది నేపాల్‌లోని ఖాట్మండ్ లోయలో ఉంది. ఈ ఆలయంలో త్రిమూర్తులలో ఒకడైన శ్రీమహావిష్ణువు... ఆదిశేషుడి పైన శయన మూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం... 5 మీటర్ల పొడవైన రాతిలో చెక్కివుంది. సహజంగా విష్ణువు శయన మూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉండే మూర్తుల్ని మనం చూస్తుంటాం. ఇక్కడ మాత్రం స్వామి... వెల్లకిలా పడుకొని, నింగివైపు చూస్తుంటాడు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే... ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది. భక్తులతోపాటూ... పరిశోధకుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం... 1957లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం... 1300 సంవత్సరాల నుంచీ నీటిలో తేలుతోంది.  ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే, పరిశోధకులు మాత్రం... సైంటిఫిక్ కారణం చెప్పలేకపోయారు.
బుల్లెట్ దేవుడు (image credit - wikipedia)

Bullet Deity, Rajasthan:
మన దేశంలో సహజంగా విగ్రహాల్నీ, ఆవుల్నీ, చెట్లనూ, వానరాల్నీ పూజించడం కామనే. బుల్లెట్‌ని దేవుడిలా భావించడం ఎక్కడైనా చూశామా. ఆ వింత గుడి... రాజస్థాన్‌లోని జోధపూర్‌లో ఉంది. ఇక్కడి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను భక్తులు పూజిస్తారు. లిక్కర్‌ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే, రోడ్డు ప్రమాదాలు జరగకుండా... దేవుడు కాపాడతాడని ఈ గ్రామస్థుల నమ్మకం. దీని వెనక ఓ నమ్మశక్యం కాని కథ ఉంది. ఈ బైక్ నడిపిన బన్నా... ఈ గుడి ఉన్న ప్లేస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పోలీసులు బైక్‌ని తీసుకెళ్లి... స్టేషన్‌లో పెట్టుకున్నారు. ఐతే... తెల్లారేసరికి... ఈ బైక్... తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్‌లో కనిపించింది. షాకైన పోలీసులు... మళ్లీ బైక్‌ని తీసుకెళ్లి... ఈసారి గొలుసులతో కట్టేశారు. అయినా అంతే... నెక్ట్స్ డే... ఈ బైక్... ప్రమాదం జరిగిన ప్లేస్‌లోనే ఉంది. ఇలా చాలాసార్లు జరగడంతో... విసుగొచ్చిన పోలీసులు... దీన్ని ఇక్కడే వదిలేశారట. జనం ఈ బైక్‌ని పూజిస్తూ... బుల్లెట్ బాబా గుడి కట్టేశారు.

Hazrat qamar ali darvesh, Maharashtra:
సైన్స్ కారణం చెప్పలేకపోయిన మరో విశేషం... ఓ బండరాయి. మహారాష్ట్ర... శివపురిలోని హజ్రత్ ఖమర్ అలీ దర్వేష్ దర్గాలో ఉంది ఆ స్టోన్. ముంబైకి 16 కిలోమీటర్ల దూరంలో... పుణె శివార్లలో ఆ దర్గా ఉంది. దానికి ఏ ప్రత్యేకతా లేదుగానీ... అక్కడున్న రాయి మాత్రం ప్రపంచ గుర్తింపు పొందింది. కారణం... దానితో ముడిపడివున్న అంతుబట్టని మిస్టరీయే. 90 కేజీల ఆ రాయిని... ఒకవైపు పట్టుకొని ఎత్తడం ఎవరివల్లా కావట్లేదు. అదే 11 మంది కలిసి... చుట్టూ మూగి... చూపుడు వేళ్లతో ఎత్తితే మాత్రం... ఈజీగా లేస్తుంది. ఇలా ఎందుకో సైంటిస్టులు చెప్పలేకపోయారు. ఓ సాధువు... ఇచ్చిన వరం వల్లే ఇలా జరుగుతోందని స్థానికుల నమ్మకం.

Nidhi Van, Uttar Pradesh:
కొన్ని కొన్ని విషయాల్ని నమ్మాలో, వద్దో కూడా అర్థం కాదు. ఇది అలాంటిదే. ఉత్తరప్రదేశ్‌లోని బృదావనంలో ఉంది నిధివనం రంగ మహల్ టెంపుల్. ఈ ఆలయంలోకి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని, రాసలీలలు ఆడతారని స్థానికుల నమ్మకం. అందుకే... సూర్యాస్తమయం తర్వాత ఈ టెంపుల్‌ని మూసేస్తారు. ఆలయ పరిసరాల్లోకి ఎవ్వర్నీ అనుమతించరు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ టెంపుల్‌లోకి వెళ్తే... వాళ్లు చనిపోతారనీ లేదంటే వాళ్లకు చూపు, మాట, వినికిడి శక్తి పోతుందని ప్రచారం జరుగుతోంది. నిధివనంలో ఉండే చెట్లు... మెలికలు తిరిగి... చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి. ఇక్కడి నేలంతా పొడిగా ఉన్నా... ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయి. వీటిని చూసిన వాళ్లకు సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటివరకూ రాత్రి వేళ టెంపుల్‌లోకి ఎవర్నీ అనుమతించలేదు. అందువల్ల... నిధివనం మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై బాలీవుడ్‌లో హర్రర్ సినిమాలు కూడా వచ్చాయి.

Jwala devi temple, Himachal Pradesh:
హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో... జ్వాలా దేవి ఆలయం ఉంది. పరమశివుడి భార్య సతీ దేవి ఆలయం ఇది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే... ఆలయ ప్రాంగణలో ఉండే జ్వాల... వందేళ్లుగా వెలుగుతూనే ఉంది. దానికి ఇంధనంగానీ, నూనె గానీ పోయకుండానే... జ్వలిస్తోంది. దీని వెనక ఓ కథ ప్రచారంలో ఉంది. సతీదేవి తండ్రి... శివుణ్ని తిరస్కరించడంతో... మనస్థాపం చెందిన సతీదేవి సూసైడ్ చేసుకుంది. శ్రీమహావిష్ణువు ఆమె దేహాన్ని 51 ముక్కలుగా చేయగా... అవి భూమిపై వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయి. సతీ దేవి నాలిక... ఇక్కడ పడి... అదే జ్వాలగా వెలుగుతోందని స్థానికుల విశ్వాసం. ఈ మిస్టరీని ఛేదించేందుకు చాలా హేతువాద సంస్థలు ప్రయత్నించి చేతులెత్తేశాయి.

Veerabhadra temple, Andhra Pradesh:
ఆంధ్రప్రదేశ్... అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వామి టెంపుల్ కూడా మిస్టరీ లిస్టులో చేరింది. అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి పెట్టింది పేరు ఈ లేపాక్షి టెంపుల్. ఐతే... ఇక్కడి వేలాడే స్తంభం ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయంలో 70 స్తంభాలున్నాయి. ప్రాంగణంలో ఉండే ఈ ఒక్కటి మాత్రం 80 శాతం గాల్లో వేలాడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీన్ని నిరూపించేందుకు చాలా మంది దీని కింద నుంచీ క్లాత్‌ని పోనిస్తున్నారు. పైన ఎలాంటి సపోర్టూ లేకుండా... భూమిని 20 శాతమే టచ్ చేస్తూ... ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా... నిలబడగలగటం... మిస్టరీగా మారింది.

ఇవే కాదు... ఇంకా చాలా ఆలయాల్లో మనకు తెలియని చరిత్ర, సైన్స్ దాగివుంది. అపార సంస్కృతి, చారిత్రక వారసత్వ సంపద మన సొంతం. ఆ ఆలయాల వైశిష్ట్యతను కాపాడటం మనందరి బాధ్యత.