12, జులై 2021, సోమవారం

Time Travel: భూత, భవిష్యత్ కాలాలకు వెళ్లగలమా? ఫ్యూచర్‌లో పుట్టిన వాళ్లు మన మధ్య ఉన్నారా?

భూత, భవిష్యత్ కాలాలకు వెళ్లగలమా?

నడక నుంచీ మొదలైన మన ప్రయాణం... సూపర్ సోనిక్ వేగంతో సాగుతోంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీతో అప్‌డేట్, అప్‌గ్రేడ్ అవుతున్నాం. ఐతే... చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలకు తీరని కోరిక ఒకటుంది. అదే టైమ్ ట్రావెల్. ఆదిత్య 369 సినిమాలోలాగా... భూత, భవిష్యత్‌ కాలాల్లోకి ఎలా వెళ్లాలి.... అని సైంటిస్టులు బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు. మరి టైమ్ ట్రావెల్ సాధ్యమేనా? ఎవరైనా అలా వెళ్లి వచ్చారా? తెలుసుకుందాం.

సైన్స్ ఫిక్షన్లు, చందమామ కథలూ... మనందరికీ ఇష్టమే. ఎందుకంటే అవి మనల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఆ ఊహాలోకంలోకి నిజంగానే వెళ్లగలిగితే... అద్భుతమే. ప్రపంచంలో కొంతమంది.... తాము టైమ్ ట్రావెల్ చేశామని అంటున్నారు. అదెలా సాధ్యమో, వాళ్లు చెబుతున్న విశేషాలేంటో ఓసారి చూద్దాం.

కాలం... అంతులేని అద్భుతాల్ని ఒడిసిపట్టే గాలం. యుగయుగాల దిగంతాల్ని తనలో దాచుకునే సమాహారం. క్షణక్షణం అమూల్యం. గతం ఘనం. వర్తమానం వాస్తవం. భవిష్యత్తు అనూహ్యం. కాల గమనంలో కరిగిపోనిదేది? కాల ప్రవాహంలో కొట్టుకుపోనిదేంటి? అశాశ్వత అనంత లోకాలకు దృశ్యరూప కాంతులద్దే... అదృశ్యశక్తిపుంజమే.... కాలమా?

టైమ్ ట్రావెల్ చేయడాన్ని సినిమాల్లో చూశాం. గ్రాఫిక్స్ మాయాజాలంతో అద్భుతంగా ఉంటాయి ఆ సినిమాల్లో దృశ్యాలు. ఐతే... ఈ ప్రపంచంలో కొంతమంది తాము టైమ్ ట్రావెల్ చేశామంటున్నారు. అందుకు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు. అవన్నీ నిజాలలాగే అనిపించినా... నమ్మడం మన వల్ల కాదు.

చార్లొట్టే మోబెర్లీ, ఎలియానోర్ జోర్డాయిన్ (Image Credit : Twitter)

Charlotte Anne Moberly and Jourdain: చార్లొట్టే మోబెర్లీ, ఎలియానోర్ జోర్డాయిన్. వీళ్లిద్దరూ 1901లో ఫ్రాన్స్‌లోని పెటిట్ ట్రియానన్ ప్యాలెస్‌కు వెళ్లారు. నిజానికి ఆ ప్యాలెస్‌లో ఎవరూ నివసించట్లేదు. వీళ్లిద్దరికీ మాత్రం అక్కడి గార్డెన్‌లో మరో ఇద్దరు కనిపించారు. ఆ ఇద్దరూ... అచ్చం వీళ్లలాగే ఉన్నారట. షాకైన వీళ్లు... "యాన్ ఎడ్వెంచర్" బుక్‌లో ఈ సంఘటనను వివరించారు. ప్రపంచం ఆశ్చర్యపోయింది. 

పెటిట్ ట్రియానన్ ప్యాలెస్‌ (Image Credit : Twitter)


గార్డెన్‌లో కనిపించిన ఇద్దరూ... 18వ శతాబ్దానికి చెందిన వాళ్లనీ... ప్రస్తుతం దెయ్యాల్లా తిరుగుతున్నారనీ బుక్‌లో రాశారు. ఐతే... 18వ శతాబ్దంలో బతికివున్న వాళ్లిద్దరూ... టైమ్ ట్రావెల్ చేసి... 19వ శతాబ్దంలోకి వచ్చారా? ఇదంతా నిజమేనా? అన్న అనుమానాలకు సమాధానం దొరకలేదు.

ది సర్కస్‌ సినిమాలో సీన్ (Image Credit : Youtube)


Charlie Chaplin's time traveler: 1928లో రిలీజైన చార్లీ చాప్లిన్ సినిమా "ది సర్కస్‌"పై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ఈ సినిమాలోని ఈ సీన్‌లో... ఎవరో ముసలామె... రోడ్డుపై వెళ్తూ... సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఆ కాలంలో సెల్‌ఫోన్లు లేవు కాబట్టి... ఆమె టైమ్ ట్రావెల్ చేసి... గతంలోకి వెళ్లిందా అన్న డౌట్ వచ్చింది. ఆమె ఎవరన్నది తెలియలేదు. దీన్ని చాలా మంది రకరకాలుగా విశ్లేషించారు. ఓ నమ్మదగిన విశ్లేషణ ప్రకారం... ఆ కాలంలో కొత్తగా కనిపెట్టిన చెవిటి మిషన్‌ను ఆమె ఉపయోగిస్తూ ఉండొచ్చని అంచనా కొచ్చారు. టైమ్ ట్రావెలింగ్‌ను నమ్మేవాళ్లు చెవిటి మిషన్ వాదనను ఒప్పుకోలేదు. ఇప్పటికీ ఇది మిస్టరీగానే ఉంది.

టైమ్ ట్రావెల్ చేశాడా (Image Credit : Twitter)


Time Travel Hipster: ఈ ఫొటో చూశారా. 1941 నాటిది. ఇందులో ఓ వ్యక్తి... మిగతా వాళ్లకంటే భిన్నంగా ఉన్నాడు కదా. వాళ్లంతా అప్పటి డ్రెస్ కోడ్‌లో ఉంటే... ఈ ఒక్కడు మాత్రం మోడ్రన్ డ్రెస్‌లో స్పెషల్ సన్ గ్లాసెస్‌తో కనిపిస్తున్నాడు. బ్రిటీష్ కొలంబియాలో ఓ బ్రిడ్జి రీ-ఓపెనింగ్‌కి ఇలా వచ్చాడు. ఇతను 21వ శతాబ్దానికి చెందిన వాడనీ... టైమ్ ట్రావెల్ చేసి... వందేళ్లు వెనక్కి వెళ్లాడని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే... ఆ కాలంలో ఇలాంటి స్టైల్ డ్రెస్సులు లేవు. ఈ ఫొటో నిజమైనదా? మార్ఫింగ్ చేసినదా? అన్న అనుమానాలున్నాయి. నిజమే అయితే... అతనెవరు? గతంలోకి ఎలా వెళ్లగలిగాడన్న ప్రశ్నలకు సమాధానం లేదు.

రుడాల్ఫ్ ఫెంజ్ (Image Credit : Twitter)


Rudolph-Fentz: 1951లో జరిగిందో విచిత్ర ఘటన. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఓ కుర్రాణ్ని కారు ఢీ కొట్టింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. అతని డ్రెస్ జేబుల్లో చెక్ చేసిన స్థానికులు షాకయ్యారు. ఎందుకంటే... అతను 1876కి చెందిన రుడాల్ఫ్ ఫెంజ్. అతని దగ్గరున్న ఛార్జీల బిల్లులు, ఇతరత్రా అన్నీ 1876నే చూపిస్తున్నాయి.

న్యూయార్క్ యాక్సిడెంట్ (ఫొటోలో ఉన్నది రుడాల్ఫ్ ఫెంజ్) (Image Credit : Twitter)


1876లో రుడాల్ఫ్ మిస్సింగ్ అయ్యాడు. అతని కోసం చాలా మంది వెతికారు కూడా. అలాంటి వ్యక్తి... 1951లో కనిపించి, యాక్సిడెంట్‌లో చనిపోవడం షాకింగ్ విషయమే.. అంటే అతను... టైమ్ ట్రావెల్ చేసినట్లే. ఇక్కడ అంతుబట్టని విషయమేంటంటే... 1876లో మిస్సింగైనప్పుడు అతను ముసలివాడు. 1951లో అతను 20 ఏళ్ల యువకుడిలా ఉన్నాడు. ఇదెలా సాధ్యమైందన్నది మిస్టరీగా మిగిలిపోయింది.

ఆండ్రూ కార్ల్‌సిన్‌ (Image Credit : Twitter)


Andrew Carlssin: 44 ఏళ్ల ఆండ్రూ కార్ల్‌సిన్‌ ది మరో షాకింగ్ కేసు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అక్రమాలకు పాల్పడుతున్నాడని... 2003లో ఇతన్ని న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతను 50 వేల రూపాయలతో షేర్లు కొన్నాడు. వాటిని అమ్ముతూ, మళ్లీ కొంటూ.... ఇలా రెండు వారాల్లోనే 2వేల 275 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడ్డాడంటూ ఇతన్ని అరెస్టు చేశారు. ఇంటరాగేషన్‌లో ఒక్కసారీ ట్రేడింగ్‌లో ఫెయిలవ్వకుండా... ఎలా సక్సెస్ అయ్యావని ప్రశ్నించారు. మతిపోయే సమాధానం చెప్పాడు. తాను ఇప్పటివాణ్ని కాదనీ... ఫ్యూచర్‌కి చెందిన వాణ్ని అని చెప్పాడు. 2256లో తాను పుట్టానని వివరించాడు. టైమ్ ట్రావెల్ చేసి... వెనక్కి వచ్చానని తెలిపాడు. షాకవ్వడం అధికారుల వంతైంది. ఇదే ఓ మిస్టరీ అయితే... ఓ సందర్భంలో బెయిల్ విషయమై ఇతన్ని కోర్టుకు తీసుకెళ్తుండగా... మధ్యలోనే మిస్సయ్యాడు. మళ్లీ కనిపించలేదు.

హకాన్ నార్డిక్విస్ట్ (Image Credit : Twitter)


Hakan Nordkvist: హకాన్ నార్డిక్విస్ట్ కథ మరో రకం. ఇతను 2006 నుంచీ 2046లోకి వెళ్లిపోయాడంట. అదెలా అంటే... కిచెన్‌లో సింక్ బాగుచేస్తూ... అక్కడి ఓ గొట్టంలో దూరాడు. అలా ముందుకి వెళ్లి చూస్తే... ఫ్యూచర్‌ కనిపించిందట. అక్కడ తనలాగే ఉన్న 72 ఏళ్ల వ్యక్తిని కలిశాడు. అతనితో ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఇద్దరి చేతులపైనా ఒకే రకమైన టాటూ ఉండటం వల్ల... తనను తానే కలుసుకున్నానని అంటున్నాడు హకాన్. తన మాటలు ఎవరూ నమ్మకపోయినా... నిజమేంటో తనకు తెలుసంటున్నాడు.

నోవా (Image Credit : Twitter)


Noah Time Travel: అమెరికాలో ఇది మరో ఆశ్చరకర విషయం. 20 ఏళ్ల ఈ కుర్రాడి పేరు నోవా. 2030 నుంచీ 2018కి వచ్చేశాడట. తిరిగి భవిష్యత్తులోకి ఎలా వెళ్లాలో తెలియట్లేదు అన్నాడు. అంతేకాదు... ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అవుతాడనీ... గూగుల్ గ్లాసెస్‌ లాగా పవర్‌ఫుల్ కంప్యూటర్లను మనం కళ్లకు తగిలించుకుంటామనీ, ఫ్యూచరంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే అనీ వివరించాడు. సోలార్ పవర్ వాడకం పెరుగుతుందన్నాడు. ఇలాంటి అంచనాలు మనమూ చెప్పగలం. ట్రంప్ రెండోసారి గెలవలేదు. నోవా మాటల్లో నిజమెంత అన్నది తేలలేదు. తన ఫేస్ కూడా కనిపించకుండా చేసి, తను చెప్పేది మాత్రం నిజమన్నాడు.

ఈ సంఘటనలన్నీ తెలుసుకున్నాక, మీకేమనిపిస్తోంది? టైమ్ ట్రావెల్ సాధ్యమే అనిపిస్తోందా? టైమ్ ట్రావెల్ ఎలా చెయ్యాలన్నదానిపై రకరకాల సిద్ధాంతాలున్నాయి. కొన్ని వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకొని చెబితే... కొన్ని పూర్తిగా ఊహలతో రూపొందించినవి. ఎక్కువ మంది చెప్పేది మాత్రం టైమ్ మెషిన్ గురించే. ఆదిత్య 369 సినిమాలోలాగా... టైమ్ మెషిన్‌లో కూర్చుంటే... అదే మనల్ని గతంలోకీ, భవిష్యత్తులోకీ తీసుకుపోతుందని నమ్ముతున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఐతే... అలాంటి మెషిన్‌ను ఇప్పటివరకూ ఎవరూ తయారుచెయ్యలేకపోయారు.

టైమ్ ట్రావెల్ జరగాలంటే... ముందు మనం... కాలం ఎలా గడుస్తోందో మాట్లాడుకోవాలి. సూర్యుడు ఉదయించగానే తెల్లారిందనీ... అస్తమించగానే... ఆ రోజు ముగుస్తున్నట్లుగా మనం భావిస్తాం. 24 గంటల కాలాన్ని ఓ రోజుగా లెక్కేస్తున్నాం. భూమి మీద ఉన్నప్పుడు ఈ లెక్క కరెక్టే. అదే ఏ గురుగ్రహం (Jupiter)పైనో మనం ఉంటే... అక్కడ ఓ రోజు గడవడానికి ఎన్ని గంటలు పడుతుందో తెలుసా? 10 గంటలే.

మరి శుక్రగ్రహం (Venus)పై ఉన్నామనుకోండి. అక్కడ ఒక రోజు గడవాలంటే.. గంటలు కాదు... ఏకంగా 243 రోజులు పడుతుంది. ఎందుకంటే... ఆ గ్రహం తనచుట్టూ తాను అత్యంత నెమ్మదిగా తిరుగుతుంది. చిత్రమేంటంటే... అక్కడ ఒక రోజు గడవకముందే... ఒక సంవత్సరం పూర్తైపోతుంది. అంటే... ఆ గ్రహం తన చుట్టూ తాను ఓ భ్రమణం పూర్తి చేయకముందే... సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేస్తుందన్నమాట.

దీన్ని బట్టీ మనకు అర్థమయ్యేది ఒకటే. ఈ గంటలు, రోజులు ఇవన్నీ మనం మన భూమిని లెక్కలోకి తీసుకొని పాటిస్తున్నవే. ఒక్కసారి భూమిని దాటి మనం ఆలోచిస్తే... కాలం అన్న పదానికి అర్థమే మారిపోతుంది. గంటలు, రోజులు అన్నింటికీ అర్థాలు వేరవుతాయి.

గతంలోకి ప్రయాణించడమంటే ఏంటి? మనం నిన్నటి కాలంలోకి వెళ్తే... అంటే.. ఓ 24 గంటలు వెనక్కి వెళ్తే... గతంలోకి వెళ్లినట్లే. అదే 24 గంటలు ముందుకి వెళ్తే... భవిష్యత్తులోకి వెళ్లినట్లే. అదేమీ ఒక గదిలోంచీ, మరో గదిలోకి వెళ్లడం కాదు కదా. అందువల్ల అసలు ఎలా వెళ్లాలన్నదే మొదటి ప్రశ్న. దానికి ఆన్సర్ తెలిస్తే... ఎంత గతంలోకి వెళ్లాలో, ఎంత భవిష్యత్తులోకి వెళ్లాలో తేల్చుకోవచ్చు. కానీ... ఎలా వెళ్లాలో చెప్పడం ఏ శాస్త్రవేత్త వల్లా కాలేదు. అసలు కాలం ముందుకి వెళ్తోందా? వెనక్కి వెళ్తోందా? అన్నదే ఓ అంతుబట్టని ప్రశ్న. కాలం అన్నది ఉందా? లేదా? అన్నది కూడా బుర్రను తొలిచేసే ప్రశ్నే.

సినిమాల్లో చూపించినట్లు కాకుండా... నిజంగానే గతంలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. అదెలాగో తెలియాలంటే... ముందు... కాలం ఎలా గడుస్తోందో మనం తెలుసుకోవాలి. ఈ విశ్వం, పాలపుంతలు, నక్షత్రాలు, గ్రహాలు... అన్నీ... గతిస్తున్నది కాంతి ప్రవాహంతోనే. అసలీ కాంతే లేకపోతే... ఈ విశ్వమే లేదు. కాంతికి సమయం తోడై... కాలం గడుస్తోందన్న భావన పుట్టింది. అందువల్ల కాంతి వేగమే... భూత, భవిష్యత్, వర్తమానాన్ని సూచిస్తుంది. ఇప్పటికే ప్రవహించేసిన కాంతి గతానికి చెందినది. ప్రస్తుతం ప్రవహిస్తున్నది వర్తమానం. ఇకపై ప్రవహించబోయేది భవిష్యత్తు. అందువల్ల కాంతి కంటే వేగంగా మనం ప్రయాణించగలిగితే... టైమ్ ట్రావెల్ సాధ్యమే.

కాంతివేగం సెకనుకు 2లక్షల 99వేల 792 కిలోమీటర్లు. అంత స్పీడ్‌గా మనం ప్రయాణించాలంటే... గంటకు కోటీ 79లక్షల 87వేల 520 కిలోమీటర్లు వెళ్లాలి. సింపుల్‌గా చెప్పాలంటే... ఇప్పుడు మనం చందమామను చేరడానికి రోజున్నర టైమ్ పడుతోంది. అదే కాంతివేగంతో వెళ్తే... కన్ను మూసి తెరిచేలోపే చంద్రుడిపై ఉండొచ్చు. ఇప్పుడున్న రాకెట్లతో మనకు దగ్గర్లో ఉన్న అంగారక గ్రహాన్ని చేరడానికి 5 నెలలు పడుతుంది. అదే కాంతివేగంతో అయితే.... 3 నిమిషాల్లో మార్స్‌పైకి వెళ్లొచ్చు. మరి కాంతివేగాన్ని మనం అందుకోగలమా? అది సాధ్యమేనా?

కాలంతో ముడిపడిన సాపేక్ష సిద్ధాంతాన్ని చెప్పిన అపరమేధావి ఐన్‌స్టీన్....... ద్రవ్యరాశి గల ఏ వస్తువూ కాంతికన్నా వేగంగా వెళ్లలేదని చెప్పాడు. ఈ సిద్ధాంతం నిజమేనని వేల ప్రయోగాల్లో రుజువైంది. అందుకే ఈ సృష్టిలో కాంతిదే అత్యధిక వేగంగా ఉంది. మనం చెప్పుకుంటున్న నిన్న, నేడు, రేపు అనుకునే కాలానికీ, కాంతి వేగానికీ సాపేక్ష సంబంధం ఉంది. ఈ సృష్టిలో ప్రతీదీ కాంతి, కాలం, కొలతలతో ముడిపడివుంది. కాంతి పయనం, ప్రవాహం వల్లే... కాలం కరిగిపోతున్నట్లు కనిపిస్తుంది. కాంతి పయనానికి సమానంగా మనమూ ప్రయాణిస్తే... అప్పుడు కాల వేగం నెమ్మదిస్తుంది. అంటే... మనం ఏదైనా స్పేస్ షిప్‌లో కాంతివేగంతో ప్రయాణిస్తూ ఉంటే... ఆ టైమ్‌లో మన కాలం దాదాపు స్థిరంగా ఉంటుంది.

కాంతి కంటే వేగంగా మనం ప్రయాణిస్తే... కాలం కుచించుకుపోతుంది. అప్పుడు మనం భవిష్యత్తులోకి వెళ్లి, గతాన్ని చూడగలమన్నది కొందరు శాస్త్రవేత్తల అంచనా. దీన్ని అర్థం చేసుకునేందుకు ఓ ఉదాహరణ ఉంది. అత్యంత సుదూర విశ్వంలో ఏవైనా రెండు నక్షత్రాలు ఢీకొని పేలితే... ఆ పేలుడు కాంతి... మన కళ్లను చేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే.... ఇప్పుడు మనం అంతరిక్షంలో ఏదైనా పేలుడు కాంతిని చూస్తే... అది ఇప్పుడు కాకుండా ఎప్పుడో పేలినట్లు లెక్క. అంటే గతించిన కాలంలో జరిగిన సంఘటనను ఇప్పుడు మనం కళ్లారా చూస్తున్నామన్నమాట. అంటే మనం గతంలోకి వెళ్లినట్లే అంటున్నారు సైంటిస్టులు.

భూమిపై జరిగే సంఘటనలు కూడా కాంతి రూపంలో అంతరిక్షంలోకి వెళ్తూ ఉంటాయన్నది మరో సిద్ధాంతం. అంటే... వేల సంవత్సరాల కిందట భూమిపై జరిగిన ఘటనలు... ఇప్పటికీ రోదసిలో కాంతి రూపంలో వెళ్తూనే ఉంటాయి. వాటిని మనం కళ్లారా చూడాలంటే... కాంతికంటే వేగంగా ప్రయాణించాలి. ఆ సంఘటనలు ఎంత దూరం ప్రయాణించాయో... అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే... అవి మన కంటికి కనిపిస్తాయి. అంటే మన గతాన్ని మనం చూడగలం. కానీ... దాన్లో ఏ మార్పులూ చెయ్యలేం. ఐతే... ఈ సృష్టిలో కాంతికంటే వేగంగా ఏదీ వెళ్లలేదన్నది ఐన్‌స్టీన్ మాట. అసలు అంతవేగంతో ప్రయాణిస్తే, గామా కిరణాల వల్ల మరణం సంభవిస్తుంది. వాటిని తట్టుకునేంత శక్తి, సామర్ధ్యాలు మనకు లేవు.

స్టీఫెన్ హాకింగ్ (Image Credit : Twitter)


ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్... టైమ్ ట్రావెల్‌పై లోతైన పరిశోధన చేశారు. ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న చోట... కాలం నెమ్మదిస్తుందని అంచనా వేశారు. ఆ సిద్ధాంతం ప్రకారం... బ్లాక్ హోల్ దగ్గర్లో కాలం వేగం సగానికి తగ్గిపోతుంది. అంటే... అక్కడికి వెళ్లి ఓ 20 ఏళ్లు గడిపితే... భూమిపై అది 40 ఏళ్లతో సమానం. ఐతే... బ్లాక్‌హోల్ దగ్గరకు కాంతివేగంతో వెళ్లినా వేల సంవత్సరాలు పడుతుంది. అన్నేళ్లపాటూ స్పేస్‌షిప్‌లో ఉన్న వాళ్లు బతకడం సాధ్యం కాదు.

అసలీ కాంతితో సంబంధం లేకుండా... మనం ఈ విశ్వంలోంచీ మరో విశ్వంలోకి వెళ్లడానికి వార్మ్ హోల్స్ మార్గం చూపిస్తాయని ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌తోపాటూ చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. వార్మ్‌హోల్స్ అనేవి... అంతరిక్షంలో షార్ట్ కట్స్ లాంటివి. ఇవి ఒక విశ్వంలోని ఏ ప్రాంతం నుంచైనా మరో విశ్వంలోని మరో ప్రాంతంలోకి క్షణాల్లో వెళ్లిపోయేందుకు వీలు కల్పిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే వార్మ్‌హోల్స్ టైమ్ మెషిన్లుగా పనిచేస్తాయి. ఇవి విశ్వమంతా వ్యాపించి ఉన్నాయని ఐన్‌స్టీన్ నమ్మాడు. ఇవి ఉన్నాయా లేదా అన్నదే ఓ సమస్య అయితే... వీటిలో ప్రాణం తీసేంత ఎక్కువ రేడియేషన్ ఉంటుందన్నది మరో సమస్య. అందువల్ల వార్మ్‌హోల్‌లో ప్రయాణం ప్రస్తుతానికి ఊహ మాత్రమే.

అంతరిక్ష ప్రయోగాల్లో పోటీపడే రష్యా... విశ్వ రహస్యాల్ని ఛేదించేందుకు... ఓ ప్రాజెక్టు చేపట్టింది. అదే టెలీపోర్టేషన్ (Teleportation). దీని ప్రకారం... మనుషుల్ని కాంతి రూపంలోకి మార్చుతారు. మనిషిలోని అణువులన్నింటినీ వేరు చేసి... వాటిని విశ్వంలోని మరో ప్రాంతానికి చేర్చుతారు. అక్కడ తిరిగి ఆ అణువులన్నీ కలిసి... మానవ రూపం ఏర్పడుతుంది. నిజానికి ఇదో ప్రమాదకర ప్రాజెక్టు. టెలీపోర్టేషన్‌లో సమాచారాన్ని చేరవేస్తే తప్పులేదుగానీ... మనుషుల్ని చేరవేయాలనుకోవడం తప్పంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. చేరవేసేటప్పుడు ఏ చిన్న తేడా వచ్చినా... ప్రాణం పోయినట్లే. అణువులన్నీ తిరిగి మనిషిలా మారినా... ప్రాణం తిరిగొస్తుందన్న గ్యారెంటీ లేదు.

ఇలా కాలంతో టైమ్ ట్రావెల్‌పై చాలా సిద్ధాంతాలున్నాయి. ఒక్కటీ అమలయ్యేలా లేవు. కాంతి వేగాన్ని అందుకోవడమే అసలు సమస్య. సో... టైమ్ ట్రావెల్ అనేది... ఓ పాజిటివ్ ఐడియా మాత్రమే. అది సాధ్యమా, కాదా అన్నది ఇప్పుడే చెప్పలేం. పరిశోధనలూ, ప్రయోగాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.