మడగాస్కర్ |
అదో అద్భుత దీవి. కోట్ల సంవత్సరాల కిందట భారత దేశం నుంచీ విడిపోయింది. ఆఫ్రికా ఖండం ఆగ్నేయ భాగాన్ని చేరింది. అక్కడే ఉండిపోయింది. భూమిపై ఎక్కడా లేని చిత్రమైన వాతావరణం, విచిత్రమైన జీవరాసులతో ఆకట్టుకుంటోంది. అదే మడగాస్కర్ దీవి. ఆ దీవి విశేషాలు, ఎందుకు అక్కడ వైవిధ్యభరిత వాతావరణం ఏర్పడిందో తెలుసుకుందాం.
సాధారణంగా దీవుల్లో... చెట్లు, పుట్టలూ తప్ప... ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండవు. మడగాస్కర్ మాత్రం అలాంటిది కాదు. పశ్చిమ భారతదేశంలోని భౌగోళిక లక్షణాలు... మడగాస్కర్‌లో కనిపిస్తాయి. ప్రపంచంలో మరెక్కడా చూడని ప్రాణికోటి అక్కడుంది. అందుకే అది చాలా హాలీవుడ్ సినిమాలకు షూటింగ్ స్పాట్ అయ్యింది.
విశాల మైదానాలు, దట్టమైన అడవులు, ఎడారులు, అగ్ని పర్వతాలు, రహస్య నదులు, జలపాతాలు, సముద్ర తీరాలు, ఆకాశమంత చెట్లు, అరుదైన జంతుజాలం, మరో ప్రపంచాన్ని తలపించే పర్యావరణం, ఇలాంటి అరవిరిసిన ప్రకృతి అందాల నెలవు మడగాస్కర్.
హిందూ మహాసముద్రంలో ఇదో అద్భుత ద్వీప దేశం. ఆఫ్రికా ఖండానికి ఆగ్నేయ తీరంలో ఉంది. ప్రపంచంలో ఇది నాలుగో పెద్ద దీవి. అందుకే... ప్రపంచంలోని జంతుజాలంలో 5 శాతం ఇందులో ఉన్నాయి. ఈ వైవిధ్యమే ఈ దీవికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
ఈ దీవి ఆవిర్భావం ఓ ప్రకృతి వింత. ఎప్పుడో... 9 కోట్ల సంవత్సరాల కిందట... భారత ద్వీపకల్పం నుంచీ మడగాస్కర్ విడిపోయింది. అది హిందు మహా సముద్రంలో కొట్టుకుపోయి... ఆఫ్రికా ఆగ్నేయ తీరాన్ని చేరింది. కోట్ల సంవత్సరాలు మిగతా ప్రపంచంతో సంబంధం లేకపోవడంతో... ఈ దీవిలో ప్రత్యేక జీవులు పుట్టుకొచ్చాయి. అరుదైన వృక్ష జాతులు పెరిగాయి. అందుకే ఇక్కడ కనిపించే 90 శాతం జీవులు... ప్రపంచంలో మరెక్కడా కనిపించవు.
చరిత్ర:
మిగతా ప్రపంచంలాగే... ఇక్కడా రాచరిక పాలనలు కొనసాగాయి. క్రమంగా... ప్రాచీన హిందువులు............ తూర్పున మలేసియా ద్వీపకల్పం మొదలు... జావా, సుమత్రా దీవుల నుంచి... మడగాస్కర్ వరకు తమ వ్యాపారాన్ని విస్తరించారు. ఓ దేశంగా అవతరించిన ఈ దీవి... 1960లో ఫ్రాన్స్ నుంచీ స్వాతంత్ర్యం పొందింది. ఇక అప్పటి నుంచీ... తన ప్రత్యేకతను చాటుకుంటూ... అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. 2.7 కోట్ల మందికి ఆవాసం కల్పిస్తోంది.
ఆఫ్రికా పక్కనే ఉన్నా... ఈ దీవిలో ఆఫ్రికన్లతో పాటూ... ఆసియన్లూ ఎక్కువే. కారణం మొదటి నుంచీ ఆసియా దేశాలు చేస్తున్న వ్యాపార, వాణిజ్యాలే. తూర్పు ఆసియా దేశాల నుంచీ వచ్చిన చాలా మంది శతాబ్దాలుగా ఇక్కడ స్థిరపడిపోయారు. అందువల్ల ఈ దీవిలో... ఇండొనేసియా సంస్కృతి కనిపిస్తుంది. ఇక్కడ 18 రకాల తెగలు ఉన్నా... అందరూ ఆసియా దేశాల్లో మాట్లాడే... మలగాసీ భాష మాట్లాడతారు. ఇక్కడ భారతీయులు కూడా ఎక్కువే. వీళ్లు హిందీ, గుజరాతీ మాట్లాడతారు.
ఎన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ... మడగాస్కర్‌లో ప్రధాన వృత్తి వ్యవసాయమే. చాలా ఆఫ్రికా దేశాల్లాగే ఈ దీవి కూడా... పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. ఐతే, జనం మధ్య ఆడా, మగా తారతమ్యాలు ఉండవు. అందరూ కలిసి వ్యవసాయం చేస్తారు. కలిసిమెలిసి జీవిస్తారు. ఎలాంటి గొడవలూ లేకుండా... ప్రశాంత జీవనం సాగిస్తారు.
వ్యవసాయం అంటే... మీకో విషయం చెప్పాలి. ప్రపంచంలోని వెనీలా (vanilla) ఉత్పత్తిలో 80 శాతం వస్తున్నది ఎక్కడి నుంచో తెలుసా? మడగాస్కర్ నుంచే. మనం తినే ఐస్‌క్రీమ్‌లు, చాకొలెట్స్‌లో వెనీలా ఫ్లేవర్ ఉంటుంది. చాలా వంటలు, పెర్‌ఫ్యూమ్ పరిశ్రమల్లో దీన్ని వాడతారు. అరోమాథెరపీకి కూడా వెనీలాను ఉపయోగిస్తారు.
ప్రపంచంలో కుంకుమపువ్వు తర్వాత... అత్యంత ఖరీదైన సుగంధద్రవ్యం వెనీలాయే. కారణం ఈ చెట్ల పెంపకం రిస్కుతో కూడుకున్నది. పువ్వులు పూయడం, కాయలు రావడం, వాటిని ఆరు నెలలు ఎండబెట్టడం, వాటిలో వెనీలా పొడిని సేకరించడం ఇదంతా కష్టమైన పని. 6 కేజీల కాయలతో కేజీ వెనీలా మాత్రమే తయారవుతుంది. కేజీ 40వేల రూపాయలకు పైనే ఉంటుంది. ఈ చెట్ల పెంపకానికి మడగాస్కర్ వాతావరణం చక్కగా సెట్ అవుతోంది. అందుకే ఇక్కడ ఈ వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఎన్నో భౌగోళిక ప్రత్యేకతలున్న మడగాస్కర్‌లో నవంబర్ నుంచీ ఏప్రిల్ వరకూ వానలు కురుస్తాయి. మే నుంచీ అక్టోబర్ వరకూ ఎండ దంచికొడుతుంది. హిందూ మహా సముద్రం నుంచీ వచ్చే... తేమ గాలులు... తీర్పు, దక్షిణ తీరాన్ని చల్లబరుస్తున్నాయి. అందుకే ఇక్కడ దట్టమైన అడవులున్నాయి. మిగతా దీవి మొత్తం చిన్నచిన్న అడవులు, ఎడారిని తలపిస్తాయి.
ఈ భూమిపై ఏడు ఖండాలున్నాయని మనం చదువుకున్నాం. కొంతమంది పర్యావరణ వేత్తలు... మడగాస్కర్‌ని ఎనిమిదో ఖండంగా పిలవాలని అంటున్నారు. దీనిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి దీన్ని ఎనిమిదో ఖండంగా గుర్తించకపోయినా... ఇదో జీవ వైవిధ్య ప్రాంతంగా... కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ సంస్థ గుర్తించింది. దీనివల్ల... ఈ దీవికి... ప్రత్యేక పర్యావరణ రక్షణ వ్యవస్థలున్నాయి. ఇక్కడి ప్రకృతిని కాపాడేలా... ప్రపంచ దేశాలు నిధులు ఇస్తున్నాయి.
సముద్ర తీరాలు, పచ్చిక బయళ్లు... అన్ని దీవుల్లోనూ కనిపించేవే. మరి మడగాస్కర్ అదనపు ప్రత్యేకత ఏంటి? అన్ని దీవుల్లాగే ఉంటే, మడగాస్కర్ గురించి మనం చెప్పుకోవాల్సిన పనేలేదు. అదేం విచిత్రమోగానీ... చాలా వైరుధ్యాల్ని తనలో దాచుకుంది. కొన్ని ప్రాంతాలకు వెళ్తే... వేరే గ్రహంపై ఉన్నామా అన్న ఫీల్ కలిగిస్తాయి. అలాంటి విభిన్న వాతావరణమే... మడగాస్కర్‌ను అద్భుత దీవిగా మార్చేసింది.
మడగాస్కర్‌లో ఎర్రమట్టితో సహజసిద్ధంగా ఏర్పడిన ముళ్లులా కనిపించే ఆకారాలు ఉన్నాయి. సింగీ రోగ్ (Tsingy Rouge) అని పిలిచే ఆ ప్రదేశాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అంకరానా పట్టణానికి దగ్గర్లో ఉంది ఈ ప్రాంతం. భారీవర్షాల వల్ల మట్టి కోసుకుపోయి, ఈ ఆకారాలు తయారయ్యాయి. వేల ఏళ్ళ కిందట ఏర్పడిన ఇవి... ఇప్పుడు కఠినమైన రాతి శిలలుగా మారిపోయాయి. రాళ్లపై ఇసుక పేరుకుపోయి... ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి. మడగాస్కర్‌కు వెళ్లిన పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే ప్రదేశం ఇది.
బాటిల్ లాంటి ఆకారంలో కనిపించే ఈ చెట్లను చూస్తే ఏమనిపిస్తోంది. డైనోసార్ల ప్రపంచం గుర్తొస్తోందా? రైట్. మడగాస్కర్‌ను మరో మెట్టెక్కించాయి ఈ బావోబాబ్ (Baobab) చెట్లు.
బావోబాబ్ చెట్లు ఈ ఒక్కదేశంలోనే కనిపిస్తాయి. వీటిని చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది ఎవరికైనా. వీటి మొదళ్ళు ఎంతో లావుగా ఉండి, ఏడెనిమిది మీటర్లు పెరిగిన తర్వాత ఒక్కసారిగా ఆ కాండం నాలుగైదు కొమ్మలుగా విడిపోయి ఆగిపోతుంది. ఆ కొమ్మలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. చివర్లలో కొన్ని ఆకులు ఉంటాయి. కాండం ఎంతో నునుపుగా ఉంటుంది. చూస్తుంటే మానవుని చెయ్యి, అయిదు వేళ్ళు విచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది.
మడగాస్కర్ దీవికి ఉత్తరాన నోసీ బే (Nosy be) ఉంది. ఈ ప్రాంతంలో అనేక చిన్న చిన్న దీవులున్నాయి. కొన్ని దీవులైతే... కొన్ని అడుగుల వెడల్పే ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ నోసీ బేకి దగ్గర్లోనే నోస్ సకాటియా (Nosy Sakatia), నోసీ టకినేలీ, నోసీ కోంబా, రష్యన్స్ బే, నోసీ ఇరంజా, రదను ద్వీపాలు, నోసీ ఫ్రాలీ, మిట్సియో ఆర్చిపెలాగో వంటివి ఉన్నాయి. అద్భుత సముద్ర తీరాలతో ఈ ప్రాంతమంతా స్వర్గంలా కనిపిస్తుంది.
నోసీ సకాటియా (Nosy Sakatia)ను ఆర్బెడ్ ద్వీపం అంటారు. ఇక్కడ నివసించేది 3వందల మందే. మీకు తెలుసా... ప్రపంచంలో అతి చిన్న ఊసరవెల్లి (chameleon) ఇక్కడే కనిపిస్తుంది. ఈ ఊసరవెల్లి ఒక సెంటీమీటరే ఉంటుంది. రాక్షస గబ్బిలాలు (bats) కూడా ఇక్కడ కనిపిస్తాయి.
నోసీ కోంబా (Nosy Comba) మరో చిన్న ద్వీపం. గుండ్రంగా ఉండి... ఆకాశం నుంచి చూస్తే సముద్రానికి బొట్టుపెట్టినట్లు కనిపిస్తుంది. ఈ ద్వీపంలో మనకు ఫ్లైయింగ్ ఫాక్స్ (Flying Fox) అని పిలిచే రాక్షస గబ్బిలాలు కూడా కనిపిస్తాయి. ఈ ద్వీపంలో ఓ అగ్నిపర్వతం ఉంది. ఇక్కడ లెమర్లు (Lemurs) ఎక్కువగా సంచరిస్తాయి.
రష్యన్ బే కూడా చిన్న ద్వీపం. ఈ దీవిలో పర్యాటకులు రెండు మూడు రోజులు ఉండటానికి వీలుగా హోటళ్ళుంటాయి. ఈ దీవిలోని ప్రకృతి రమణీయతని పూర్తిగా ఆస్వాదించొచ్చు. ఇక్కడ తెలుపు రంగులో మెరిసిపోయే ఇసుక తీరాలున్నాయి. వివిధ జాతుల పక్షులు, జలచరాలు కనిపిస్తాయి. ఈ చిన్న చిన్న దీవుల్ని చూసేందుకు పడవలో గానీ, హెలికాప్టర్‌లో గానీ వెళ్లొచ్చు.
ఇలాంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలతో హాలీవుడ్ యాక్షన్ సినిమా షూటింగ్స్‌కి బెస్ట్ స్పాట్‌గా నిలుస్తోంది మడగాస్కర్. జేమ్స్ బాండ్ సిరీస్‌లో వచ్చిన... కేసినో రాయల్ (Casino Royale) సినిమాలో ఛేజింగ్ సీన్... ఇక్కడే షూట్ చేశారు. అదే కాదు... మడగాస్కర్ పేరుతో... హాలీవుడ్‌లో యానిమేషన్ సిరీసే ఉంది. మడగాస్కర్‌లో కనిపించే జంతువుల్నే... యానిమేషన్ బొమ్మలుగా చేశారు. ఈ సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ... ప్రపంచ ప్రేక్షకుల్ని అలరించాయి. మడగాస్కర్‌కు మరింత గుర్తింపు తెచ్చాయి.
మడగాస్కర్ సఫారీ మజా:
ఎంత పర్యటించినా... మడగాస్కర్‌లో చూడాల్సినవి ఇంకా చాలా ఉంటాయి. అందుకే... అక్కడి ప్రభుత్వం... ఫారెస్ట్ సఫారీ (Madagascar Safari)ని అభివృద్ధి చేసింది. వెహికిల్స్‌పై అలా అలా అడవుల్లో వెళ్తుంటే... ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మాటల్లో చెప్పలేం.
మడగాస్కర్... హరితారణ్యాలకు పెట్టింది పేరు. మనం జాగ్రత్తగా చూడాలేగానీ... ఎన్నో ప్రకృతి అందాలు... అలరిస్తాయి. వెహికిల్‌లో... అడవుల్లో తిరుగుతుంటే... కలిగే మజాయే వేరు. రకరకాల జంతువులు, పక్షులు, వింత వింత చెట్లు... ఎటుచూసినా పచ్చదనం పరచుకొని... మరో లోకానికి తీసుకుపోతాయవి.
పడవల్లో కూడా ప్రయాణిస్తూ... సముద్ర అందాల్నీ, సెలయేర్ల సౌందర్యాన్నీ చూడొచ్చు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లున్నాయి మడగాస్కర్‌లో.
మడగాస్కర్ చుట్టూ సముద్ర నీరు... అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. లోపల డైవింగ్ చేసేవారికి... రంగురంగుల చేపలతోపాటూ... అరుదైన మత్య్స ప్రపంచం కనిపిస్తుంది.
ఒక్క దీవిలోనే... ఇన్ని రకాల వైవిధ్యభరిత సహజసిద్ధ ప్రకృతి ఉండటం విశేషం. ఎన్ని రోజులు తిరిగినా... ఇంకా చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు మిగిలే ఉంటాయి.
చాలా ఆఫ్రికా దేశాల్లోలా కాకుండా... మడగాస్కర్‌లో శాంతియుత వాతావరణం ఉందంటే దానికి కారణం... పీస్ కీపింగ్ వాలంటీర్లే. ఈ శాంతి సంఘాల సభ్యులు... ఇక్కడి వ్యవసాయం, విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టి... అభివృద్ధిపై జనంలో అవగాహన పెంచుతున్నాయి. పిల్లలందరికీ పౌష్టికాహారం అందేలా చేస్తున్నాయి. మడగాస్కర్ ఇవాళ ఇంత అందంగా ఉందంటే కారణం వీళ్లందరి కృషే.
ఇంత చక్కటి దీవి కూడా... ఈమధ్యకాలంలో దెబ్బతింటోంది. ప్రపంచీకరణ, మానవుల అత్యాశ. అడవుల నరికివేత, గనుల తవ్వకాలు, వన్య మృగాల వేట, కాలుష్యం, విదేశీ సంస్కృతులు... ఇలా ఎన్నో అంశాలు ఈ దీవిని ప్రమాదంలో పడేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడి మట్టిలో టైటానియం, ఐరన్, కోబాల్ట్, కాపర్, నికెల్ లాంటి ఖనిజాలుండటం ఈ దీవికి శాపమవుతోంది. వాటి కోసం సారవంతమైన భూముల్ని కూడా తవ్వేస్తున్నాయి అంతర్జాతీయ ఖనిజ పరిశ్రమలు.
ఆఫ్రికా దేశాల్లోలాగే... మడగాస్కర్‌లో కూడా 30 ఏళ్లుగా వజ్రాల వేట కొనసాగుతోంది. ఇలకాకా, సకరాహా ప్రాంతాల్లో... పెద్ద ఎత్తున డైమండ్స్ ఇండస్ట్రీ నడుస్తోంది. ఐతే... ఈ పరిశ్రమ వల్ల స్థానికులకు ఒరుగుతున్నది ఏమీ లేదు. శ్రమ దోపిడీ తప్ప... ఆకలి బాధలు తీరట్లేదు. వజ్రాల వ్యాపారులు... స్థానికులతో తవ్వకాలు జరిపిస్తున్నారు. టన్నుల కొద్దీ మట్టిని ప్రాసెస్ చేయిస్తున్నారు. చివరకు దొరికే... నవరత్నాలను... తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఫలితంగా స్థానికుల జీవితాల్లో వజ్రాల మెరుపులు కనిపించట్లేదు.
ఇండియా సహా... ప్రపంచంలో చాలా దేశాలు... కాలుష్యపు కోరల్లో ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా... మనం కాలుష్యాన్ని తగ్గించలేకపోతున్నాం. కనీసం ఇలాంటి దీవులనైనా స్వచ్ఛంగా ఉంచగలిగితే... మానసిక ప్రశాంతత కోసం ఎప్పుడైనా ఓ రౌండ్ వేసి రావడానికి... ఉపయోగపడతాయి.
ఇవీ మడగాస్కర్ విశేషాలు. మీకో విషయం చెప్పనా... మడగాస్కర్‌ను దేవతలు సృష్టించిన స్వర్గంగా స్థానికులు నమ్ముతారు. అంత గొప్ప ద్వీప దేశం అది. అందుకే టూరిస్టులు ఓ వారం పాటూ అక్కడ ఉండి వచ్చేలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారు. జీవితాంతం గుర్తుండిపోయే... ఎన్నో అనుభూతులు సొంతం చేసుకుంటున్నారు.