ఉడికే నది (image credit - Youtube - https://youtu.be/v6rlwobnkLk) |
The Boiling River: నరకంలో వైతరిణి నది ఉంటుందంటారు. అలాంటి నది భూమిపైనే ఉంది. వింత రహస్య నదిగా గుర్తింపు పొందింది. అది ఎందుకు ఉడుకుతూ ఉంటుంది. ఎందుకు వేడిగా ఉంటుంది. దాని విశేషాలు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత వేడి నది ఏదంటే అదే. దానికి ఓ పేరంటూ లేదు. సింపుల్‌గా ఉడికే నది అంటున్నారు. ఎందుకంటే... అది ఎప్పుడూ కుతకుతా ఉడుకుతూనే ఉంటుంది. సంవత్సరంలో 365 రోజులూ వేడి సెగలు కక్కుతూనే ఉంటుంది. జనరల్‌గా ఏ నది దగ్గరకైనా మనం వెళ్తే... ఆ నీటిపై నుంచి... చల్లటి గాలులు పలకరిస్తాయి. ఆ నది దగ్గరకు వెళ్తే మాత్రం ఉక్కపోతే. వేడి గాలులు, వేడి నీటి ఆవిరి మనల్ని టచ్ చేస్తుంది. ఇంతకీ అది ఎక్కడుందంటే... దక్షిణ అమెరికాలోని... పెరూ దేశంలో. అత్యంత దట్టమైన అమెజాన్ అడవి (Amazon Rain Forest)లో... ఆ నది రహస్యంగా ఉంది. బయటకు పెద్దగా కనిపించదు.
ఈ నది ఒకటి ఉందని పూర్వీకులు చెప్పుకునే వారు. కానీ ఎక్కడుందో మ్యాప్ పాయింటింగ్ ఉండేది కాదు. దీని కోసం చాలా మంది వెతికారు. అమెజాన్‌లో వెతుకులాట అంటే... ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఆ అడవి ఎంత మంచిదో... అంత ప్రమాదకరమైనది కూడా. కానీ వెతికారు. కనిపెట్టారు. ప్రపంచానికి చూపించారు కొందరు ఔత్సాహికులు. ఆండ్రెస్ రుజో (Andrés Ruzo)... ఈ నదిని పరిశోధిస్తున్నాడు. ఇప్పుడు అతను భూగర్భ సైంటిస్ట్. అతను దాన్ని తన టీమ్‌తో కలిసి ప్రపంచానికి చూపించాడు. ఈ నది నిజంగా ఉందా... ఉంటే ఎక్కడుంది... అసలు ఎందుకు ఉడుకుతూ ఉంటుంది... ఇలా ఎన్నో ప్రశ్నలు రుజోకి నిద్ర లేకుండా చేశాయి. అతని ప్రయత్నం ఫలించింది. ఈ సందర్భంగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ నది పైకి ఉడుకుతున్నట్లు కనిపించదు. చూడటానికి ప్రశాంతంగా ఉంటుంది. లోపల మాత్రం ఉడుకుతూ ఉంటుంది. నది ప్రారంభంలో నీటి ప్రవాహం చిన్నగానే ఉంది... రాన్రానూ అది పెద్దగా ఉందని రుజో చెప్పాడు. నదిలో వేడి అన్ని చోట్లా ఒకేలా లేదని తెలిపాడు. నది ప్రారంభంలో నీటి వేడి 91 డిగ్రీల సెల్సియస్ (195 డిగ్రీల ఫారన్‌హీట్) ఉందని రోజో టీమ్ తేల్చింది. అక్కడ ఆ నీటితో గ్రీన్ టీ తాగొచ్చు. లేదా... గుడ్డు ఉడకబెట్టుకొని తినవచ్చు. అంత వేడి ఉన్నాయి. ఓ చోట అతను తన చేతిని నది నీటిలోకి పెట్టాడు. జస్ట్ అర సెకండ్‌లో తీసేశాడు. కానీ ఆ క్షణ కాలంలోనే అతని చెయ్యి కాలింది. ధర్డ్ డిగ్రీ గాయాలయ్యాయి. అందులో పడితే చావు తప్పదని అతను అంటున్నాడు.
నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్‌ప్లోరర్ అయిన రుజో... దీనిపై జియోఫిజిక్స్‌లో PhD చేస్తున్నాడు. ఈ నదిలో మనుషులు, జంతువులు, పక్షులు, ఇతర జీవరాశులు ఏవి పడినా... చనిపోవడం ఖాయమని రుజో తెలిపాడు. ఇంతకీ ఆ నీరు ఎందుకు వేడిగా ఉంది అంటే... దాని వెనక ఏ మంత్రమూ లేదు. సైన్సే ఉంది. ఆ నీరు భూమి లోపలి నుంచి పైకి వస్తోందట. దీన్నే జియోథెర్మల్ హీటింగ్ (Geothermal Heating) అంటారు. ఈ నీరు వంద శాతం సహజమైనది. కాలుష్యం లేనిదని ఈ టీమ్ తేల్చింది.
స్థానికులకు కొందరికి ఈ నది తెలుసు. వాళ్లు దీన్ని పవిత్ర నదిగా భావిస్తారు. ఈ నీటిని వాడితే రోగాలు నయం అవుతాయని వారి నమ్మకం. ప్రకృతి వింతల్లో ఈ నది కూడా ఒకటిగా ఉంది. దీన్ని పరిరక్షించుకోవాలని రుజో టీమ్ కోరుతోంది.