25, జులై 2021, ఆదివారం

Bhangarh Fort: ఆ కోటలోకి వెళ్తే, అంతే సంగతులా? రత్నవతిని ప్రేమించిన మంత్రగాడెవరు? దెయ్యాల కోట!

 

భాన్‌గఢ్‌ కోట (Image credit - Wikipedia)

ఏ రాజుల కోటకైనా వెళ్తే... అక్కడి చారిత్రక కట్టడాల్ని ఆనందంగా చూస్తాం. అదే ఆ కోటకు వెళ్తే మాత్రం క్షణక్షణం భయపడుతూ చూడాల్సిందే. ఇక చీకటి పడుతుందంటే... ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సిందే. హర్రర్ సినిమాల్లో కూడా కనిపించనంత టెన్షన్ అక్కడ ఉంటుంది. ప్రాణాలతో బయటపడితే చాలనే ఆలోచన కలుగుతుంది. ఎందుకు? అంతలా భయపెట్టే పరిస్థితి అక్కడ ఏముంది? దెయ్యాల కోటగా చెప్పుకుంటున్న రాజస్థాన్‌లోని భాన్‌గఢ్‌ విశేషాలు ఇవి.

మీకు హర్రర్ సినిమాలన్నా... సస్పెన్స్ థ్రిల్లర్‌ స్టోరీలన్నా ఇష్టమైతే... మీకు కచ్చితంగా నచ్చే ప్లేస్ భాన్‌గఢ్ కోట. అక్కడికి వెళ్లేవాళ్లు ఎన్నో కథలు వింటారు. వెళ్లొచ్చాక... ఎన్నో కథలు చెబుతారు. ఈ రోజుల్లో... చేతిలో మొబైల్ ఉండటం ఎంత కామనో... ఆ కోటలో తిరుగుతూ టెన్షన్ పడటమూ అంతే కామన్.

రాజస్థాన్‌లోని జైపూర్ తెలుసుగా. అక్కడికి వెళ్లి... ఎవరైనా స్థానికులతో... "భాన్‌గఢ్ కోటకు వెళ్తున్నా" అని చెప్పండి. పైనుంచీ పిడుగు పడినట్లు అదిరి పడతారు వాళ్లు. మీవైపు ఒకింత అనుమానంతో చూస్తారు. మీకేదో చెప్పాలన్న ఆతృత వాళ్లలో ఉంటుంది. అలా ఎందుకో ముందు ముందు మీకే తెలుస్తుంది.

జైపూర్ నుంచీ 83 కిలోమీటర్ల దూరంలోని అల్వార్ జిల్లాలో ఉంది భాన్‌గఢ్ పట్టణం. అక్కడకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉంది. ప్రైవేట్ వెహికిల్స్ కూడా ఉంటాయి. రెండు గంటల ప్రయాణం... అడుగడుగునా ఆహ్లాదం కలిగిస్తుంది. చుట్టూ చెట్లూ-చేమలతో... ఆరావళీ పర్వత శ్రేణుల మధ్య సాఫీగా సాగిపోతుంది ఈ పయనం.

భాన్‌గఢ్ పట్టణాన్ని చేరగానే... రెండు కిలోమీటర్ల దూరంలోని ఎత్తైన కొండపై అత్యద్భుతంగా కనిపిస్తుంది భాన్‌గఢ్ కోట. చారిత్రక వారసత్వ సంపదకూ, అలనాటి రాజఠీవీకి నిలువెత్తు నిదర్శనంలా ఉంటుందా కోట. అందులో ప్రతీదీ సుందర కళాఖండమే. ముఖ్యంగా అత్యంత ఎత్తులో ఉన్న రాయల్ ప్యాలెస్... రాచరికపు వైభవాన్ని చాటిచెబుతూ ఉంటుంది. ఇంత మంచి కోటను రాజస్థాన్ ప్రజలు మాత్రం భూత్ బంగళా, దెయ్యాల కోట అంటుంటారు. ఈ కోట దగ్గరే కాదు... భాన్‌గఢ్ పట్టణంలో కూడా జనం పెద్దగా నివసించరు. ఇందుకు బలమైన కారణాలున్నాయి.

భాన్‌గఢ్‌ కోట (Image credit - Wikipedia)

అల్వార్-జైపూర్ నగరాల మధ్య ఉన్న సరిస్కా టైగర్ పార్కును ఆనుకొని ఉంటుంది భాన్‌గఢ్ పట్టణం. ఎత్తైన కొండల మధ్య నిర్మించిన అందమైన పట్టణమిది. నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర దీని సొంతం. ఇక్కడ పెద్ద పెద్ద కట్టడాలు, బురుజులు, హవేలీలూ.... చారిత్రక ఆనవాళ్లుగా దర్శనమిస్తాయి. రెండు మార్గాల్లో కోట దగ్గరకు వెళ్లేందుకు వీలుంది. కోట లోపల పచ్చిక బయళ్లు, సెలయేర్లూ, తోటలూ, ప్రాచీన ఆలయాలూ... అడుగడుగునా విశేషాలే. ఇంత చక్కగా ఉన్నా... ఈ పట్టణంలో జనం అస్సలు కనిపించరు. ఎందుకు లేరని టూరిస్టులు ఎవరైనా అడిగితే... రకరకాల దెయ్యాల కథలు చెబుతారు అక్కడి వాళ్లు.

కోట ప్రాంగణంలో సోమేశ్వర ఆలయం, గోపీనాథ్, కేశవరాయ్, మంగళదేవి, హనుమాన్, గణేశ్ ఆలయాలున్నాయి. శతాబ్దాల కిందటి నిర్మాణ శైలినీ, అప్పటి కళా చాతుర్యాన్నీ ఇవి చాటిచెబుతాయి. చిత్రమేంటంటే... ఈ భారీ సౌధంలో ఎక్కడా... ఒక్క విగ్రహం కూడా కనిపించదు. ఆలయాలు ఉన్నా... వాటి నిర్మాణాల్లో ఎక్కడా విగ్రహాల రూపురేఖలు ఉండవు. వందల ఏళ్ల నాటి మర్రిచెట్లు ఈ కోటలో మరో ప్రధాన ఆకర్షణ. చిన్న చిన్న జలపాతాల్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ పర్యాటకులకు ఆనందాన్ని పంచేవే. 







Sariska National Park:
భాన్‌గఢ్ కోటకు దగ్గర్లో చూడదగ్గ ప్రాంతాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సరిస్కా నేషనల్ టైగర్ పార్కు (sariska national park) కచ్చితంగా చూడాల్సిందే. కోట నుంచీ 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పార్కు. ఇందులో సఫారీ మరచిపోలేని అనుభూతుల్ని మిగుల్చుతుంది. ఇక్కడ ఎలాంటి కంచెలూ అడ్డులేకుండా కళ్లముందే కదులుతూ వెళ్లే వన్యమృగాల్ని చూడొచ్చు. అవి వేటాడే దృశ్యాల్ని చూస్తే... ఎంతో థ్రిల్‌గా ఉంటుందంటారు టూరిస్టులు. ఈ పార్కులో కనిపించే పక్షులు కూడా చాలా అరుదైనవి. అంతా బాగానే ఉన్నా... కోట విషయమే ఆందోళన కలిగించే అంశం. ఇక్కడికి వెళ్లే టూరిస్టులంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఎవరైనా సరే.... సూర్యాస్తమయం కాకముందే... కోట, భాన్‌గఢ్ పట్టణం నుంచీ తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది. పొరపాటున కూడా చీకటి పడుతున్నప్పుడు, రాత్రిళ్లు అక్కడ ఉండకూడదు.





చిత్ర విచిత్రాలు:
నమ్మశక్యం కాని విషయమేంటంటే... ఈ కోటలో ఎప్పుడూ ఏదో ఒక చిత్రమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. వాతావరణం ఉన్నట్టుండి మారిపోతూ ఉంటుంది. రాత్రివేళల్లో ఏవేవో అరుపులూ, ఏడుపులూ వినిపిస్తుంటాయట. ఆ అరుపులు దెయ్యాలవే అని రాజస్థానీల నమ్మకం. అందుకే ఆసియాలోనే ఇది అత్యంత భయంకరమైన దెయ్యాల కోట అన్న ప్రచారం వందల ఏళ్లుగా జరుగుతోంది. కోట ప్రారంభంలో ఉండే నాట్య కళాకారిణుల ప్రాంగణం, పక్కనే ఉన్న జవహరి బజార్‌ ఏరియాలో ఎవరెవరో నడుస్తున్న శబ్దాలు, గజ్జెల చప్పుడు తాము విన్నామని అప్పుడప్పుడూ పర్యాటకులు చెబుతుంటారు.

రాత్రైతే ఈ పట్టణంలోకి చుట్టుపక్కల అడవుల్లోని జంతువులు వస్తుంటాయి. పైగా ఇక్కడ కరెంటు కూడా ఉండదు. వీటికి తోడు ఇక్కడ దెయ్యాల కథలపై విపరీతంగా దుమారం రేగడంతో... భారత పురావస్తు శాఖ రంగంలోకి దిగింది. సందర్శకుల రక్షణను దృష్టిలో పెట్టుకొని భాన్‌గఢ్ పర్యటనపై ఆంక్షలు విధించింది. ఎవరైనా సరే... ఉదయం ఆరు నుంచీ సాయంత్రం ఆరు వరకే... భాన్‌గఢ్ పట్టణంలో ఉండొచ్చు. సూర్యాస్తమయం కాగానే... పట్టణంలోకి వెళ్లే రూట్ల గేట్లను మూసేస్తారు. ఇదే విషయాన్ని వివరిస్తూ... ఇక్కడో నోటీస్ బోర్డు కూడా ఉంటుంది.

సాహసమే ఊపిరిగా బతికే కొంతమంది... రాత్రివేళ ఈ కోటలోకి వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. అలా వెళ్లేవాళ్లు... ఇక జీవితంలో తిరిగి రారని అంతా అంటుంటారు. పురావస్తు శాఖ నిబంధనల వల్ల ప్రస్తుతం ఎవరూ రాత్రివేళ ఈ కోటలోకి వెళ్లే ఛాన్స్ లేదు. అందువల్ల భాన్‌గఢ్ అందాలు చూడాలంటే... ఉదయం వేళల్లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.


కోట చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. అక్కడక్కడా శిథిలమైపోతున్నా... చూడ్డానికి పటిష్టంగానే ఉంటుంది. మరి ఈ దెయ్యాల గోలేంటి? ఎందుకు జనం భయపడుతున్నారు? రాత్రివేళ ఆ కోటలోకి వెళ్తే ఏమవుతుంది? చరిత్రలో ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

సహజంగానే ఇలాంటి పురాతన కట్టడాలపై నిశీధి నీడలు పడుతూనే ఉంటాయి. భాన్‌గఢ్‌ కూడా అందుకు అతీతమేమీ కాదు. కాకపోతే... ఈ కోటకు మాత్రమే పరిమితమైన కొన్ని చారిత్రక కథలున్నాయి. వాటి ప్రభావమే ఈ దెయ్యాల టెన్షన్. భాన్‌గఢ్ పట్టణాన్ని 1613లో నిర్మించారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ సర్వసేనాని మాన్‌సింగ్..... తన తమ్ముడైన మాధోసింగ్ కోసం ఈ కోటను కట్టించాడు. నాలుగు శతాబ్దాల కిందట ఈ కోట అత్యద్భుతంగా ఉండేది. అడుగడుగునా రాజఠీవీని ప్రదర్శిస్తూ... పాలకుల కీర్తి ప్రతిష్టల్ని నలుదిశలా చాటేది. మరి అలాంటి కోట... ఇప్పుడు దెయ్యాల కోటగా ఎందుకు మారిందన్నదానిపై ప్రధానంగా రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి.

పూర్వం ఈ కోట ప్రాంతంలో బాబా బాలక్ నాథ్ అనే సాధువు ఉండేవాడు. తాను తపస్సు చేసుకునేచోట కోటను నిర్మిస్తామనడం ఆయనకు నచ్చలేదు. అక్కడ కట్టే ఏ నిర్మాణమూ... తన ఇంటికంటే ఎత్తుగా ఉండకూడదని షరతు పెట్టాడు. ఏ భవనం నీడైనా తన ఇంటిపై పడితే... పట్టణం మొత్తానికీ గ్రహణం పడుతుందని శపించాడు. ఈ విషయాన్ని పాలకులు తేలిగ్గా తీసుకున్నారు. సాధువు ఇంటి చుట్టూ కూడా కోటను నిర్మించారు. ఫలితంగా శాపం అమలైంది. జనం లేనిపోని రోగాల బారిన పడ్డారు. ఊరు వల్లకాడైంది. అలా చనిపోయిన వాళ్లంతా దెయ్యాలయ్యారు. అందుకే ఈ కోట దెయ్యాలకు ఆవాసంగా మారిందన్నది ఓ నమ్మకం.

ఇక్కడ మరో రకమైన కథ కూడా ప్రచారంలో ఉంది. చేతబడి చేసే ఓ మంత్రగాడు... భాన్‌గఢ్ యువరాణి రత్నవతిని ప్రేమించాడు. 18 ఏళ్ల ఆమె... ఓ రోజు సెంటు బాటిల్ కొనేందుకు తన చెలికత్తెలతో షాపింగ్‌కి వెళ్లింది. అదిచూసిన మంత్రగాడు... తనే వ్యాపారిలా మారిపోయాడు. ఓ ఖరీదైన సెంటును ఆమెకు ఇచ్చి, ప్రేమ ఒలకబోశాడు. రత్నవతి చాలా తెలివైంది. అతను నిజమైన వ్యాపారి కాదని గ్రహించింది. వెంటనే అతన్ని సైనికులు బంధించారు. ఆమెను ప్రేమిస్తున్నట్లు మంత్రగాడు చెప్పడంతో రాజుగారికి కోపం వచ్చింది. బతికి ఉండగానే అతన్ని సమాధి చేయించాడు. చనిపోయేముందు మంత్రగాడు శపించాడు. తన చావుతో భాన్‌గఢ్ పట్టణం సర్వనాశనం అవుతుందన్నాడు. ఆ తర్వాత ఉత్తరాది నుంచీ వచ్చిన మొఘల్ చక్రవర్తులు... భాన్‌గఢ్‌పై దండెత్తారు. అప్పటి యుద్ధంలో యువరాణితోపాటూ... ఇక్కడ ఉండే పది వేల మంది జనం చనిపోయారు. వాళ్లంతా దెయ్యాలై, కోటలో తిరుగుతున్నారన్నది స్థానికుల విశ్వాసం.

దెయ్యాల భయంతో... భాన్‌గఢ్ జనం ఊరొదిలి వెళ్లిపోయారు. అందువల్ల శతాబ్దాలుగా ఈ పట్టణం మౌనంగా ఉండిపోయింది. 50 ఏళ్ల కిందటి వరకూ... ఈ కోట దగ్గరకు ఎవ్వరూ వెళ్లేవాళ్లే కాదు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోటపై దృష్టిసారించాయి. దీన్ని చక్కటి పర్యాటక కేంద్రంగా మార్చాలనుకున్నాయి. కాకపోతే... ఈ దెయ్యాల సెంటిమెంట్... అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఇక్కడ ఆత్మలు తిరుగుతున్నాయన్న భయం ఆధునిక అభివృద్ధి ఫలాల నుంచీ ఈ కోటను వెనక్కి నెట్టేస్తోంది. దీనిపై ఇప్పటికే చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి. భాన్‌గఢ్ పేరుతో ఏడేళ్ల కిందట ఓ చిన్న సినిమా వచ్చింది. ఆ హర్రర్ సినిమాలో పగటి పూట దృశ్యాల్ని ఈ కోటలోనే షూట్ చేశారు.





ప్రాచుర్యంలో ఎన్ని కథలున్నా... భాన్‌గఢ్‌లో దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరికితీరాలి. మరి ఎవరైనా ఆ దిశగా ప్రయత్నించారా? దెయ్యాలు లేవని గానీ, ఉన్నాయని గానీ నిరూపించారా? అసలు దెయ్యాలు ఉన్నాయి అనేందుకు ఏవైనా బలమైన సాక్ష్యాలున్నాయా? ఆ దిశగా ఓసారి విశ్లేషిద్దాం.

సాధారణంగా ఏదైనా పాజిటివ్ రెన్పాన్స్‌తో అందరి నోళ్లలో నానుతూ ఉంటుంది. ఈ కోట మాత్రం నెగెటివ్ రెన్సాన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ కోటను చూసేందుకు వచ్చే వాళ్లలో ఎక్కువ మంది... ఇది దెయ్యాల కోట అన్న ఉద్దేశంతోనే వచ్చామంటుంటారు.

ఈ కోటకు నాలుగు రకాల వాళ్లు వస్తుంటారు. పర్యాటకులు, పారానార్మల్ పరిశోధకులూ, చరిత్రకారులూ, స్థానికులు. వీళ్లలో పర్యాటకులూ, దెయ్యాల వేటగాళ్లు చెప్పే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. సందర్శకుల్లో కొంత మంది తాము దెయ్యాల్ని చూశామని చెబుతుంటారు. మరికొంతమందైతే... కోటలోని ఏ చీకటి దృశ్యాన్నో షూట్ చేసి... అదిగో అక్కడ దెయ్యం ఉంది అంటుంటారు. ఇక తుంటరోళ్లైతే... వాళ్లే దెయ్యాల్లా అరిచి, ఆ రికార్డుల్ని దెయ్యాల అరుపులుగా చెబుతుంటారు. ఇలాంటి సంఘటనలు కొన్ని వందల్లో ఉన్నాయి. ఒక్కదాన్నీ నిజమని నిరూపించే వీలు లేదు. పారానార్మల్ పరిశోధకులు కూడా అంతే. దెయ్యాల అరుపుల్ని రికార్డు చేసినట్లు చెబుతుంటారు. అవి స్పష్టంగా మాత్రం ఉండవు. నిజ నిర్ధారణ ముందు తేలిపోతాయి. ఫలితంగా ఇదో మిస్టరీగా మారింది.





దెయ్యాలు ఉన్నాయి అనేందుకు కొన్ని సంఘటనల్ని స్థానికులు ఉదాహరణలుగా చెబుతుంటారు. ఓసారి ఇద్దరు కుర్రాళ్లు... రాత్రివేళ రహస్యంగా ఈ కోటలోకి వెళ్లారట. వాళ్లు తిరిగి రాలేదు. రెండ్రోజుల తర్వాత వాళ్ల స్నేహితులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో... ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్లు ఏమయ్యారన్నది మిస్టరీగా మారింది. ఒకవేళ చనిపోయి ఉంటే... డెడ్‌బాడీలైనా దొరకాలిగా. అలాంటి ఆనవాళ్లేవీ లభించలేదు. పోనీ జంతువులేమైనా చంపి తినేశాయా అంటే... కనీసం రక్తపు మరకల ఆనవాళ్లు కూడా లేవట. ఇది ఎప్పుడు జరిగిందో కచ్చితంగా చెప్పట్లేదు ఎవరూ.

మరో ఘటనలో ముగ్గురు యువకులు టార్చిలైట్లతో కోటలోకి వెళ్లగా... వాళ్లలో ఒకడు... ఓ ఎండిపోయిన బావిలో పడ్డాడు. గాయాలపాలైన అతన్ని రాత్రివేళ కారులో తీసుకెళ్తుండగా... ఆ కారుకి యాక్సిడెంట్ అయ్యింది. అందులోని ముగ్గురూ చనిపోయారు. దెయ్యాలు వాళ్లను వెంటాడి, చంపాయన్నది స్థానికుల నమ్మకం. ఇది కూడా నిజంగా జరిగిందా అంటే ఆధారాలు లేవు. ఇలాంటి ఘటనల ప్రచారం మాత్రం తీవ్ర భయభ్రాంతులు కలిగిస్తోంది.

ఇక్కడ దెయ్యాలున్నట్లు ఒక్కటంటే ఒక్కటీ సరైన ఆధారం లేదు. జనం చూపించే వీడియోలు కూడా స్పష్టంగా లేవు. మొబైళ్లతో తీసిన వీడియోలు కూడా దెయ్యాల ఉనికిని చూపించట్లేదు. గ్రాఫిక్స్‌తో మార్ఫింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కానీ... జనంలో మాత్రం నమ్మకం బలంగా ఉంది. సైన్స్‌ని నమ్మే పరిశోధకులు చెబుతున్నదొకటే... ఈ కోటలో ఎలాంటి దెయ్యాలూ లేవు. ఉన్నదల్లా పావురాలు, గబ్బిలాలు మాత్రమే. వాటి అరుపులు, కూలిపోయేలా కనిపించే కోట గోడలే కాస్త భయం కలిగిస్తాయని చెబుతున్నారు.

రాత్రివేళ ఆరావళి నుంచీ వచ్చే జంతువుల అరుపుల్ని... దెయ్యాల అరుపులుగా జనం భ్రమపడుతున్నారని హేతువాదులు అంటున్నారు. ఓ మంచి పురాతన కట్టడాన్ని... దెయ్యాల కోటగా పిలుస్తూ... దాని ప్రాసస్థ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఒకింత బాధపడుతున్నారు. సాధారణంగా ఏ కోటనైనా ఎలా చూడాలో రూట్ మ్యాప్ ఉంటుంది. ఇది ప్రేతాల కోటగా చెబుతుండటంతో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పెద్దగా దృష్టి పెట్టట్లేదు. అందువల్ల ఇక్కడ ఎలాంటి గైడ్లూ ఉండరు. కనీస సదుపాయాలూ లేవు. దీనికి తోడూ తరచుగా కోతులూ, అప్పుడప్పుడూ చిరుతపులులూ, హైనాలూ కోటవైపు వస్తుంటాయి.

పర్యాటక ప్రేమికులకూ, పారానార్మల్ పరిశోధకులకూ, చరిత్రకారులకూ, సినీ పరిశ్రమకూ... భాన్‌గఢ్ కోట ఎన్నో విశేషాల్ని చెబుతోంది. ఎన్నెన్నో కథలు వినిపిస్తోంది. అక్కడికి వెళ్లొచ్చేవాళ్లంతా... మరపురాని అనుభూతిని పొందుతుంటారు. జీవితంలో ఒక్కసారైనా వెళ్లి తీరాల్సిందే అని చెబుతుంటారు. ప్రభుత్వాలు దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కనీస సదుపాయాలూ, కరెంటు సరఫరా కల్పిస్తే... కచ్చితంగా దెయ్యాల గోల పోతుంది. పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. చారిత్రక కట్టడాన్ని సంరక్షించినట్లూ అవుతుంది.