25, జూన్ 2021, శుక్రవారం

Cherrapunji: చెట్ల వేర్లతో వంతెనలు.. వింత కథల జలపాతాలు.. ప్రకృతి వేసిన కాన్వాస్.. చినుకుల చిరపుంజి

చినుకుల చిరపుంజి (Image credit - Twitter - Utpal Jha)

 Cherrapunji: మన దగ్గర వర్షం పడితే... వార్త. అక్కడ పడకపోతే వార్త. అదే మేఘాలయలోని చిరపుంజి. ప్రపంచంలోనే అత్యధిక వర్షం కురిసే రెండో ప్రాంతం. అక్కడ ఎక్కువ వాన ఎందుకు కురుస్తోంది? స్థానికుల జీవనశైలి ఎలా ఉంటుంది? అక్కడ చూడదగ్గ పర్యాటక ప్రదేశాలేంటి? ఇలాంటి విశేషాల్ని తెలుసుకుందాం. నేలపై పచ్చటి తివాచీ పరచినట్లు ఉండే అడవులు. ఆకాశంలో వెండి మబ్బులు, అంతలోనే... చిటపట చినుకుల సవ్వళ్లు. ఎన్నో ప్రత్యేకతల ప్రాంతం చిరపుంజి. అవేంటో, అక్కడి భౌగోళిక పర్యావరణం ఎలా ఉంటుందో చూద్దాం.

వర్షం... ప్రకృతిని పులకింపజేసే అద్భుత వరం. మానసిక ఉల్లాసం కలిగించే... మనోహర దృశ్యకావ్యం. రాన్రానూ ఈ వానే కరవైపోతోంది. మన తెలుగు రాష్ట్రాలు తనివితీరా తడిసి ముద్దై ఎన్నేళ్లైందో! చిరపుంజి మాత్రం ప్రత్యేకం. ప్రకృతి అంతా తరలివచ్చి ఇక్కడే ఉండిపోయిందా అన్నట్లు కనిపిస్తుంది. పచ్చటి లోయలు, ఎత్తైన జలపాతాలతో కనువిందు చేస్తుంది. రోజూ మేఘాల చిరు జల్లులు పలుకరిస్తాయి. అక్కడి వాళ్లు ఎంత అదృష్టవంతులో కదా.

చిరపుంజి... మేఘాలయ.... తూర్పు ఖాశీ హిల్స్ జిల్లాలో ఓ పట్టణం. భూమిపై అతి తేమగా ఉండే రెండో ప్రదేశం ఇది. ఇక్కడ సంవత్సరమంతా వానలు పడుతూనే ఉంటాయి. జూన్, జులై, ఆగస్టులో మాత్రం... భారీ వర్షాలు కురుస్తాయి. ఈ టైమ్‌లో ఇక్కడి అందాల్ని చూసితీరాల్సిందే. ప్రకృతి కాన్వాస్‌పై... అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి.

ఇక్కడ వానాకాలం మొత్తంలో... సుమారు 12 వందల సెంటీమీటర్ల వర్షం నమోదవుతుంది. ఈ వర్షాన్ని మిల్లీమీటర్లలో కాకుండా... మీటర్లలో కొలుస్తారు. ఇంతలా వానలు పడటానికి కారణం... ఈ పట్టణం... సముద్ర మట్టానికి దాదాపు 5వేల అడుగుల ఎత్తులో ఉండటమే. ఎప్పుడూ చల్లగా ఉండే హైదరాబాద్ ఎత్తు 1,656 అడుగులు. తరచుగా వాన పడే అరకులోయ ఎత్తు 3వేల అడుగులు. వీటన్నింటికంటే ఎత్తులో ఉండటం వల్ల... చిరపుంజిలో... కార్బన్ డై ఆక్సైడ్ తక్కువగా ఉంటోంది. దానికి తోడు... బంగాళాఖాతం నుంచీ వీచే గాలులు... ఇక్కడి ఖాశీ కొండల్ని తాకి... వాతావరణాన్ని చల్లబరచి... భారీ వర్షాలు పడేలా చేస్తున్నాయి.

మన తెలుగు రాష్ట్రాల్లో నైరుతీ రుతుపవనాల టైమ్‌లో ఎక్కువ వాన పడుతుంది కదా. చిరపుంజిలో... నైరుతీ రుతుపవనాలు వచ్చినప్పుడే... ఈశాన్య రుతుపవనాలు కూడా వస్తాయి. ఒకే టైమ్‌లో ఉరుములు, మెరుపులతో కుండపోత వానలు కురిసేలా చేస్తాయి. శీతాకాలం రాగానే... బ్రహ్మపుత్ర నది లోయ నుంచీ... ప్రయాణించే గాలుల వల్ల వానలు పడతాయి.

చిరపుంజిలో... 1860, 61 సంవత్సరాల్లో... అత్యధిక వానలు పడ్డాయి. 1960లో ఏడాది కాలంలో 2వేల 298 సెంటీ మీటర్లు, 1861లో ఒక నెలలో 930 సెంటీమీటర్ల వాన పడింది. ఇవి రెండూ గిన్నిస్‌బుక్‌లో చేరాయి. భూతాపం కారణంగా... ఈ రికార్డులు ఇప్పట్లో బద్ధలయ్యే అవకాశాలు కనిపించట్లేదు. చిత్రమేంటంటే... ఇంతలా వాన పడే పట్టణంలో కూడా... కొన్ని ప్రాంతాలు పూర్తిగా ఎండాకాలంలా ఉంటాయి. అక్కడ వాన చాలా తక్కువగా కురుస్తుంది. ఐతే... నేల మాత్రం తేమగానే ఉంటుంది. ఇందుకు కారణం రుతుపవనాలే.

ఇంకో విషయం కూడా మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రోజూ వానలు పడుతున్నా చిరపుంజిలో తాగునీటి సమస్య ఉంది. ఒక్క క్యాన్ వాటర్ కావాలన్నా కిలోమీటర్ల దూరం వెళ్తారు జనం. భిన్నమైన వాతావరణం వల్ల... ఇక్కడి మట్టి నేలలు దెబ్బతిని నీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తమైంది. అందువల్ల మంచి నీటి కొరత ఉంది.

చిరపుంజీ వాసుల్ని ఖాసీలంటారు. వీళ్లలో మాతృవంశీయ పాలన ఉంటుంది. అంటే... పెళ్లి తర్వాత... భార్యతో కలిసి... భర్త.... ఆమె పుట్టింటికి వెళ్తాడు. జస్ట్ ఇల్లరికం అల్లుడిలా అన్నమాట. ఇక్కడ పుటిన పిల్లలు... ఇంటిపేరుగా తల్లిపేరును పెట్టుకుంటారు. ఇంకో గొప్ప విషయమేంటంటే... అక్షరాస్యతలో వీళ్లు చాలా రాష్ట్రాల కంటే ముందున్నారు. జాతీయ సగటు 60 శాతమైతే... ఇక్కడ అది 74 శాతంగా ఉంది. 
లివింగ్ రూట్ బ్రిడ్జి (Image credit - Wikipedia)

మేఘాలయలో మనం కచ్చితంగా చెప్పుకోవాల్సిన మరో అంశం... లివింగ్ రూట్ బ్రిడ్జెస్ (Living root bridge). వీళ్లు... వంతెనల కోసం కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టరు. చెట్ల వేళ్లనే వంతెనలుగా మార్చేస్తారు. ఇలా ఓ వంతెన నిర్మించడానికి 10 నుంచీ 15 ఏళ్లు పడుతుంది. ఐతే... ఈ సహజసిద్ధ వంతెనలు... కాలంతోపాటూ మరింత బలంగా తయారై... కొన్ని వందల ఏళ్లు అలాగే ఉంటాయి. ఓ వంతెనైతే... 500 ఏళ్లుగా సేవలందిస్తోంది.

ఇప్పుడంటే దేశమంతా స్వచ్ఛభారత్ నినాదం ఉంది గానీ... మేఘాలయలో... ఓ గ్రామమైతే... శతాబ్దాలుగా స్వచ్ఛతను పాటిస్తోంది. ఆ ఊరి పేరు "మాలిన్నాంగ్" (Mawlynnong). రాజధాని షిల్లాంగ్‌కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ జనం... రోజూ గంటపాటూ... ఉరంతా శుభ్రం చేస్తారు. ఎక్కడికక్కడ చెత్త బుట్టలుంటాయి. చిన్న కాగితం ముక్క కూడా ఎక్కడా కనిపించదు. పైగా... మొక్కలు, ప్రకృతి అందాలతో ఈ గ్రామం... ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామంగా గుర్తింపు పొందింది. స్థానికులు దీన్ని దేవుడి ఉద్యానవనం అని పిలుస్తారు.

చిరపుంజి గురించి చెప్పుకునేటప్పుడు... కచ్చితంగా ప్రస్తావనకు వచ్చేది మాసిన్రామ్ గ్రామం (Mawsynram). చిరపుంజికి 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడే ప్రపంచంలో అత్యధిక వర్షం కురుస్తోంది. చిరపుంజీని వెనక్కి నెట్టి... మొదటి స్థానాన్ని ఇది ఆక్రమించింది. ఎప్పుడు చూసినా చల్లగా, చినుకులతో స్వాగతం పలుకుతుంది. సంవత్సరానికి అక్కడ సగటున 11,872 మిల్లీమీటర్ల వాన పడుతోంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం... 1985లో మాసిన్రామ్‌లో 26,000 మిల్లీ మీటర్ల వాన పడింది. అంటే 1,000 అంగుళాలు. ఎండాకాలంలో కూడా చల్లటి జల్లులతో ఆకర్షించే మాసిన్రామ్.... ఎప్పుడు చూసినా మంచు తెరలతోనే కనిపిస్తుంది. ఆ హిమ సోయగాల మధ్య... ఇక్కడి ప్రకృతి అందాలు... చూపు తిప్పుకోనివ్వవు.

అడవుల్ని నరికేస్తూ ఉంటే... ఆహ్లాదం ఉండదు. ప్రకృతిని కాపాడుకుంటే... ఆ బ్యూటీయే వేరు. మేఘాలయ అంత అందంగా ఉండటానికి కారణం... వానలు మాత్రమే కాదు. అక్కడి జనం... పచ్చదనాన్ని సురక్షితంగా ఉంచడం కూడా. మరి అక్కడి జలపాతాలు, లోయల విశేషాలు తెలుసుకుందాం.

చిరపుంజిని స్థానికులు సోహ్ర అంటారు. కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల మేఘాలయ... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఎత్తుపల్లాల కొండలు, జలపాతాలు, బంగ్లాదేశ్ సరిహద్దు మైదానాలు, గిరిజన జీవన విధానం... ఇవన్నీ చిరపుంజి పర్యటనను జీవితాంతం గుర్తుండి పోయేలా చేస్తాయి.

చిరపుంజికి వెళ్లాలంటే అక్కడికి 95 కిలోమీటర్ల దూరంలో... రాజధాని షిల్లాంగ్‌లో ఉన్న విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాలి. ఈ ఎయిర్‌పోర్ట్‌కి దేశంలోని ప్రధాన నగరాల నుంచీ విమాన సర్వీసులున్నాయి. రైల్లో వెళ్లాలంటే... చిరపుంజికి 150 కిలోమీటర్ల దూరంలో గౌహతి రైల్వేస్టేషన్ ఉంది. ఈ స్టేషన్‌కి కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచీ కనెక్టివిటీ ఉంది.

మేఘాలయలో పర్యాటకం కాస్త చవకైనదే. రోజంతా టూర్ బస్‌లో తిరిగేందుకు టికెట్ రేటు 400 రూపాయలు. రాజధాని షిల్లాంగ్‌లో... గవర్నమెంట్ టూరిజం ఆఫీస్‌ నుంచీ... ప్రభుత్వ, ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి. షిల్లాంగ్ నుంచీ చిరపుంజికి... 55 కిలోమీటర్ల దూరం. ఈ రూట్‌లో జర్నీ అత్యంత అద్భుతంగా ఉంటుంది. ప్రయాణం చేస్తున్నట్లే అనిపించదు. పచ్చదనం పరచుకున్న కొండ మార్గాల్లో... వాహనాలు దూసుకుపోతాయి.

షిల్లాంగ్ నుంచి ఓ 30 కిలోమీటర్లు వెళ్లగానే రెండువైపులా పచ్చదనంతో నిండిన పర్వతాలు... మధ్యలో లోయ కనిపిస్తుంది. దీని పేరు 'మాక్టో లోయ'. దీన్ని చేరేందుకు... పచ్చటి కొండల మధ్య... నల్లటి తాచులా ఉండే... సన్నటి రోడ్డుపై ప్రయాణించాలి. అప్పుడు కలిగే అనుభూతిని స్వయంగా అనుభవించాల్సిందే.

ఈ లోయ నుంచీ కిందకు దిగితే... వ్యూపాయింట్ వస్తుంది. చల్లని, స్వచ్ఛమైన గాలి తాకుతుంటే, లోయ అందాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మాక్టో లోయ నుంచీ చిరపుంజిలోకి అడుగుపెట్టాలంటే, ఓ దట్టమైన అడవిని దాటాల్సి ఉంటుంది. ఇది సంవత్సరంలో ఎక్కువ కాలం మేఘాలతోనే నిండివుంటుంది. ఇక్కడ గిరిజన విద్యార్థుల కోసం రామకృష్ణమఠం... ఓ హైస్కూల్‌ని ప్రారంభించింది. ఇక్కడో ఎకో పార్క్ (Eco Park) కూడా ఉంది. కొండలపై నిర్మించిన ఈ పార్కును చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా... లవర్స్ అడ్డాగా దీన్ని పిలుస్తారు. షిల్లాంగ్ నుంచీ... చిరపుంజీ వెళ్లే పర్యాటకులు... ఈ పార్కును చూడకుండా వెళ్తే... ఏదో మిస్సైనట్లే. ఈ పార్కు ఎత్తైన కొండలపై ఉండటం వల్ల... ఇక్కడి నుంచీ... కిందికి జాలువారే జలపాతాల్ని చూడొచ్చు. సాధారణంగా మనం జలపాతాల్ని కింది నుంచీ చూస్తాం. ఇక్కడ పైనుంచీ చూసే వీలుంది. ఈ ఫీలింగ్... మెస్మరైజ్ చేస్తుంది.

ఈ లోయల్లోని సరస్సులపై... బోట్లలో ప్రయాణించడం మరో మర్చిపోలేని ఫీల్. ఇక్కడి ఔషధ మొక్కల నుంచీ వచ్చే గాలి... ఎన్నో ఆరోగ్య సమస్యల్ని పోగొడుతుంది. ఈ ప్రకృతి అందాలు... మానసిక ఆహ్లాదం కలిగిస్తాయి. ఈ థ్రిల్ కోసమే... మహా సముద్రాలు దాటి మరీ ఇక్కడికొస్తున్నారు ప్రపంచ పర్యాటకులు.

ఎక్కడైనా జలపాతం ఉందంటే... ఆ ప్రకృతి అందాల్ని వర్ణించడానికి మాటలు చాలవు. అలాంటిది... చిరపుంజిలో చాలా ఫాల్స్ ఉన్నాయి. అన్నీ ఎత్తైన కొండలపై నుంచీ జాలువారుతూ... నయన మనోహరంగా ఉంటాయి. ఇంకెందుకాలస్యం... ఓసారి వాటి విశేషాల్ని తనివితీరా తెలుసుకుందాం.

షిల్లాంగ్ నుంచీ రోడ్డు మార్గంలో చిరపుంజీ వెళ్తూ... ఎకో పార్క్ దాటాక... భూలోక స్వర్గం కనిపిస్తుంది. సెవెన్ సిస్టర్స్‌ (Seven Systers) జలపాతం... పాయలుగా విడిపోయి... ప్రకృతి సీమపై... సహజసిద్ధ అందాల్ని జోడించింది. వర్షాకాలంలో ఇది నయన మనోహరంగా కనిపిస్తుంది. మేఘాలయలో ఎక్కువ మందిని ఆకర్షించే జలపాతం ఇదే. సెవెన్ సిస్టర్స్ తర్వాత... కట్టిపడేసే మరొకటి మావ్‌స్మాయ్ జలపాతం (Mawsmai Waterfalls). ఇది మావ్‌స్మాయ్ గ్రామానికి దగ్గర్లో ఉండటం వల్ల ఆ పేరుతో పిలుస్తున్నారు. ఇది 1000 అడుగుల కంటే ఎత్తు నుంచీ కిందికి ఉద్ధృతంగా జాలువారుతుంది. మన దేశంలో నాలుగో ఎత్తైన జలపాతమిది. మేఘాలు ఉన్నప్పుడు... ఇది మరింత అందంగా కనిపిస్తుంది.

మావ్‌స్మాయ్ జలపాతానికి దగ్గర్లో ఓ పెద్ద గుహ (Mawsmai Cave) కూడా ఉంది. మేఘాలయలో ఇదే పొడవైన గుహ. చీకటిగా ఉండే ఇందులోకి వెళ్తే... మంచుతో తయారైన రకరకాల ఆకారాలు దర్శనమిస్తాయి. వాటిని చూస్తూ... స్వయంగా ఆకారాల్ని వెతుకుతూ... అదో పజిల్‌లా ఫీలవుతారు టూరిస్టులు.

చిరపుంజికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అద్భుతమైన జలపాతం దైన్-త్లేన్ (Dainthlen Falls). ఒకప్పుడు ఇక్కడి గుహల్లో... ఓ కొండ చిలువ ఉండేది. దాని పేరునే ఈ జలపాతానికి పెట్టారట. ఇది అందమైన జలపాతం కావడంతో... ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు.

ఇక్కడే ఉండే మరో జలపాతం... మిస్సింగ్‌ ఫాల్స్‌ (Missing Falls). మిగతా జలపాతాలు... కొండలపై నుంచి కిందకు పడితే... ఇది... కొండల కింద... భూ అంతర్భాగం నుంచీ ఓ ప్రవాహంలా బయటకు వస్తుంది. ఇలా దాక్కుని ఉండటం వల్లే దీన్ని 'రహస్య జలపాతం' అని పిలుస్తున్నారు.

చిరపుంజిలో మరో జలపాతానికి ఓ విషాదగాథ ఉంది. అదే నోహ్కాళికాయ్ జలపాతం (Nohkalikai Falls). చుట్టూ పచ్చటి అడవి... మధ్యలో పాలధారలా కనిపిస్తుంది. 1100 అడుగుల ఎత్తుండి... దేశంలోని ప్రముఖ జలపాతాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడికి దగ్గర్లోని ఓ ఊర్లో... చిన్న కుటుంబం వుండేది. భార్యాభర్త ఓ పాప ఉండేవాళ్లు. భర్త ప్రమాదంలో చనిపోయాడు. గత్యంతరం లేక ఆమె మరో పెళ్లి చేసుకుంది. రెండో భర్తకు... పాప నచ్చేదికాదు. ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. ఓ రోజు భార్య లేని టైమ్ టూసి... చిన్నారిని చంపేశాడు. పాప గురించి ఆమె ఆరా తీసింది. నిజం చెప్పాడు. భరించలేకపోయిన ఆమె... తీవ్ర ఆవేదనతో కొండపై నుంచీ కిందికి దూకేసింది. ఆ తర్వాత అక్కడ ఈ జలపాతం ఏర్పడిందట. ఆ జలపాతానికి ఆమె పేరును పెట్టి... నోహ్కాళికాయ్ అని పిలుస్తున్నారు. ఓ విషాధ గాథ ఉండటంతో... ఈ వాటర్‌ఫాల్స్ ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది.

సాధారణంగా జలపాతాలు... నదీ ప్రవాహాల నుంచీ ఏర్పడతాయి. నోహ్కాళికాయ్ మాత్రం... కొండలపై ఉన్న వాగులు, సరస్సుల నుంచీ వచ్చే నీటితో ఏర్పడింది. జలపాతపు ధార వల్ల ఏర్పడిన గుంట... ఎండాకాలంలో ఆకుపచ్చగా, చలికాలంలో బ్లూ కలర్‌లో కనిపించడం ఓ ప్రకృతి వింత.

చిరపుంజిలో... ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని ఉండదు... ప్రతీ ప్రాంతమూ... పర్యాటక శోభతో ఆకర్షిస్తుంది. దక్షిణ భాగంలో... బంగ్లాదేశ్‌ (Bangladesh Border)ని అనుకొని ఉంటుంది. అక్కడి లోయలు, వాటిపై తేలుతూ సాగే మబ్బులతో... పచ్చటి ప్రకృతి కనువిందు చేస్తుంది. ముఖ్యంగా... భారత్ నుంచీ... బంగ్లాదేశ్‌ను చూడాలనే ఆలోచనతో చాలా మంది పర్యాటకులు సరిహద్దులకు వెళ్తుంటారు.

ఇవన్నీ చూశాక... పర్యాటకులు తిరుగు ప్రయాణమవుతారు. వెళ్తూ... వెళ్తూ... సెవెన్ సిస్టర్స్ జలపాతాన్ని మరోసారి చూస్తారు. కొండల అంచుల్లోంచి, మేఘాల్ని చీల్చుకుంటూ... లోయల అందాలకు వీడ్కోలు చెబుతూ... టూర్ ముగిస్తారు.

ఇవీ చిరపుంజీ విశేషాలు. మన తెలుగు రాష్ట్రాల్లో శీతాకాలం... పర్యటనలకు సరైన సమయం. మేఘాలయలో మాత్రం వర్షాకాలమే సరైన టైమ్. జులై నుంచీ ఫిబ్రవరి వరకూ చిరపుంజీ.... పర్యాటకులతో సందడిగా ఉంటుంది. వీలైతే... షిల్లాంగ్‌లో ఓ మూడ్రోజులు ఉండేలా ట్రిప్ ప్లాన్ చేసుకోండి... అని అక్కడి టూరిజం శాఖ స్వాగతం పలుకుతూ ఉంటుంది.