26, జూన్ 2021, శనివారం

HoloPortation: అమెరికాలో మాయం, ఇండియాలో ప్రత్యక్ష్యం! టెక్నాలజీతో ఏదైనా సాధ్యమేనా? హోలో పోర్టేషన్!

హోలోపోర్టేషన్ (Image credit - Youtube)

ఈ రోజు మనం కమ్యూనికేషన్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల్ని తెలుసుకుందాం. టెక్నాలజీ ఎంత వేగంగా మారిపోతోందంటే... ఫ్యూచర్ మనం ఊహించలేనంత గొప్పగా ఉండబోతోంది. డిజిటల్ టెక్నాలజీకి... త్రీడీ, 4డీ తోడై... వర్చువల్ రియాల్టీ కళ్లముందు కనిపిస్తోంది. ఆ అద్భుత ప్రపంచంలోకి ఓసారి వెళ్దాం. భవిష్యత్తులో రాబోయే... వింతల్ని తెలుసుకొని ఆశ్చర్యపోదాం.

కమ్యూనికేషన్ కోసం ఒకప్పుడు ఉత్తరాలుండేవి. తర్వాతి కాలంలో టెలీగ్రాం వచ్చింది. ఆ తర్వాత... ల్యాండ్ ఫోన్లు, మొబైళ్లు దూసుకొచ్చాయి. ఇప్పుడంతా స్మార్ట్ వరల్డ్. లేటెస్టుగా వీడియో కాలింగ్, వర్చువల్ కాన్ఫరెన్సులు కూడా చేస్తున్నాం. ఇకపై ఏయే మార్పులు రాబోతున్నాయి? కమ్యూనికేషన్ ఎలా ఉండబోతోంది? వచ్చే పదేళ్లలో టెక్నాలజీ ఎలా మారబోతోంది?

ప్రపంచం వేగంగా దూసుకుపోతోంది. టెక్నాలజీ మనల్ని ఎక్కడికో తీసుకుపోతోంది. ఒక్కసారి ఊహించుకోండి. ఎక్కడో అమెరికాలో ఉండే వాళ్లు... ఒక్క క్షణంలో మన పక్కన ప్రత్యక్షమైతే... షేక్ హ్యాండ్ ఇచ్చి... మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది? అదిరిపోదూ! రైట్... ఇప్పటివరకూ ఇలాంటివి మనం సినిమాల్లోనే చూశాం. ఇప్పుడు నిజంగానే చూడబోతున్నాం. అదే టెక్నాలజీలో న్యూ ట్రెండ్. దాని పేరు హోలో పోర్టేషన్ (HoloPortation).

అసలేంటి ఈ హోలో పోర్టేషన్ అంటే? "హోలోగ్రామ్‌కీ" దీనికీ ఏదైనా సంబంధం ఉందా? దాని ద్వారానే దీన్ని డెవలప్ చేశారా? ఇలాంటి డౌట్లు మనకు రావడం సహజమే. ఇదో సైంటిఫిక్ టెక్నాలజీ. ఇప్పటివరకూ ఇది మనకు అనుభవం లేదుకాబట్టి... దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. జాగ్రత్తగా తెలుసుకుంటే... ఇది ఎంత గొప్పదో, ఎలాంటి విప్లవాలకు ఇది దారితియ్యబోతోందో అర్థమవుతుంది.

హోలోపోర్టేషన్ అనేది ఓ రకమైన త్రీడీ కాప్చర్ టెక్నాలజీ. దీని ద్వారా హై-క్వాలిటీ త్రీడీ మోడల్స్‌ను తయారుచేయవచ్చు. ఇక్కడ మోడల్స్ అంటే... మనుషులు, జంతువులు, వస్తువులు ఏవైనా కావచ్చు. ఇలా తయారుచేసిన వాటిని... కంప్రెస్ చేసి... ప్రపంచంలో ఎక్కడి నుంచైనా, మరెక్కడికైనా పంపించవచ్చు. అది కూడా రియల్‌ టైమ్‌లో.

సింపుల్‌గా చెప్పాలంటే... ఆస్ట్రేలియాలో ఉన్న ఓ వ్యక్తి... హైదరాబాద్‌లో ప్రత్యక్షం అవ్వాలి. ఇక్కడి తన అన్నయ్య పక్కనే ఉండి మాట్లాడాలి. మామూలుగా అయితే ఇది సాధ్యపడదు కదా. హోలోపోర్టేషన్‌తో సాధ్యమే. ఎలా అంటే... ఆస్ట్రేలియాలోని తన రూంలో చుట్టూ కెమెరాలు అమర్చి... త్రీడీ రూపంలో తనను తాను కాప్చర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కాప్చర్ అవుతున్న రూపం... అదే సమయంలో... వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా... కంప్రెస్ అవుతుంది. అది ఇంటర్నెట్ ద్వారా క్షణాల్లో హైదరాబాద్‌కి చేరుతుంది. హైదరాబాద్‌లోని... తన తమ్ముడి ఇంట్లో కూడా... హోలో పోర్టేషన్ టెక్నాలజీ ఉంటుంది. అందువల్ల కంప్రెస్ అయిన ప్రతిరూపం... ఇక్కడ తిరిగి త్రీడీ రూపంలో ప్రత్యక్షమవుతుంది.

ఆస్ట్రేలియాలో వ్యక్తి ఎలా కదిలితే... హైదరాబాద్‌లో ప్రతిరూపం అలాగే కదులుతుంది. ఆస్ట్రేలియాలో కూర్చుంటే... ఇక్కడా కూర్చుంటాడు. ఆస్ట్రేలియాలో షేక్ హ్యాండ్ ఇస్తే... ఇక్కడా ఇస్తాడు. ఐతే... ఈ హోలోపోర్టేషన్ ప్రతిరూపంతో మాట్లాడాలంటే... మన దగ్గరా త్రీడీ కాప్చర్ హోలోపోర్టేషన్ టెక్నాలజీ తప్పనిసరిగా ఉండాలి. అదెలా అంటే... మనం ఎవరితోనైనా వీడియో కాలింగ్ చెయ్యాలంటే... మన దగ్గర వీడియో కాలింగ్ మొబైల్ ఉండాలి. 4జీ ఉండాలి. అవతలి వాళ్ల దగ్గరా అవి ఉండాలి. అప్పుడే సాధ్యమవుతుంది కదా. అలాగే హోలోపోర్టేషన్ కూడా.

హోలోపోర్టేషన్ వ్యక్తిని మనం చూడాలన్నా, అతనితో సంభాషించాలన్నా, మనం హోలోలెన్స్ పెట్టుకోవాలి. తద్వారా త్రీడీ కాప్చర్ ప్రతిరూపాన్ని ఈ లెన్స్ చూపిస్తాయి. ప్రతి రూపంలో ఉన్న వ్యక్తి కూడా ఆస్ట్రేలియాలో అవే లెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తద్వారా... ఇక్కడున్న మనం కూడా... ఆస్ట్రేలియాలో వ్యక్తికి త్రీడీ ప్రతిరూపంలో కనిపిస్తాం. తద్వారా... ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికీ, చూసుకోవడానికీ, కూర్చోడానికీ, తిరగడానికీ, షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడానికీ, అన్నింటికీ వీలవుతుంది.



కాస్త వింతగా, అర్థమయ్యీ, అర్థం కానట్లుగా ఉందా? దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఎక్కడెక్కడో ఉన్న వాళ్లు మాట్లాడుకోవాలంటే మొబైల్ కావాలి. వీడియో కాల్ చేసుకోవాలంటే... ఇంటర్నెట్ ఉండాలి. మరి హోలో పోర్టేషన్ జరగాలంటే ఏం కావాలి? ఏయే పరికరాలు అవసరం? అసలీ టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతోంది? దీని పరిధి భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది? తెలుసుకుందాం.

డిజిటల్ టెక్నాలజీ దాటి... ఇప్పుడిప్పుడే వర్చువల్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నాం. హోలోపోర్టేషన్ ఓ టెక్నాలజీ విప్లవం అనే చెప్పుకోవాలి. ఇది మిక్స్‌డ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్‌మెంటెండ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీలను కలిపితే ఏర్పడిన న్యూ కాన్సెప్ట్. ఇది మొత్తం త్రీడీ కాప్చర్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు మనం కంప్యూటర్లలో చూస్తున్నట్లే... అవే బొమ్మలు మన పక్కనే ఉంటాయన్నమాట. అవి త్రీడీ హోలోగ్రామ్ తరహాలో కనిపిస్తాయి. ఇందుకోసం ఓ గదిలో చుట్టూ ఎన్ని త్రీడీ కెమెరాలు ఉంటే, త్రీడీ బొమ్మ అంత స్పష్టంగా తయారవుతుంది. కనీసం రెండు కెమెరాలు ఉండాలి. వాటికి అదనంగా హోలోలెన్స్ ఉన్న హెడ్‌సెట్స్ అవసరం. టెలీపోర్టేషన్ ఎవరుచేసినా... తప్పనిసరిగా త్రీడీ హోలోలెన్స్ పెట్టుకోవాల్సిందే. ఈ మొత్తం వ్యవస్థను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేస్తూ... కంప్యూటర్ వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ పక్కాగా పనిచేస్తేనే హోలోపోర్టేషన్ సాధ్యం.

హోలోపోర్టేషన్ ఎలా పనిచేస్తుందంటే... గదిలో ఉన్న త్రీడీ కెమెరాలు... నిరంతరం మన కదలికల్ని కాప్చర్ చేస్తూ ఉంటాయి. ఈ డిజిటల్ డేటాను కంప్యూటర్‌కి పంపుతాయి. కంప్యూటర్‌లో డిజిటల్ డేటా కాస్తా... త్రీడీ వర్చువల్ డేటాగా మారుతుంది. అంటే మన కదలికలతో త్రీడీ బొమ్మ తయారవుతుందన్నమాట. ఈ త్రీడీ బొమ్మ... ఇంటర్నెట్ ద్వారా... ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్తుంది. అంటే మనతో టెలీపోర్టేషన్‌లో ఉన్నవాళ్లు అమెరికాలో ఉంటే... మన బొమ్మ అక్కడికి వెళ్తుందన్నమాట. ఈ త్రీడీ హోలోగ్రామ్ దృశ్యాన్ని అక్కడి వాళ్లు... హోలోగ్రామ్ టెక్నాలజీని వాడే... హోలోలెన్స్ ద్వారా చూడగలరు. మాట్లాడగలరు.

మొబైల్‌లో కాల్ డేటా రికార్డైనట్లు... టెలీపోర్టేషన్‌లో దృశ్యాలు, కంప్యూటర్లలో రికార్డవుతాయి. సో, జరిగిపోయిన పోర్టేషన్‌ సంభాషణలను, దృశ్యాల్నీ తిరిగి ప్లే చేసుకోవచ్చు. కావాలంటే వాటి సైజును చిన్నగా చేసి చూసుకోవచ్చు. లైవ్‌లో రికార్డింగ్ జరిగేటప్పుడు కూడా బొమ్మల పరిమాణం తగ్గించుకునే వీలుంది. తద్వారా... ఎక్కువ బ్యాండ్‌విడ్త్ ఖర్చవకుండా చేసుకోవచ్చు. దీన్ని మరింత తీర్చిదిద్దేందుకు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయి.

ఎన్నో ప్రయోజనాలు:
హోలోపోర్టేషన్ ద్వారా చాలా లాభాలున్నాయి. ఏదైనా వస్తువు పాడైతే... దాన్ని హోలోలెన్స్ ద్వారా... వర్చువల్ వరల్డ్‌లో చూస్తూ... రిపేర్ చేయవచ్చు. ఇందుకోసం మనం మెకానిక్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. ఎలా రిపేర్ చెయ్యాలో... వర్చువల్ వరల్డ్‌లో ప్రతీ పార్టునూ చూసి నేర్చుకోవచ్చు. హోలోలెన్స్ మెమరీలో... ముందుగానే రికార్డ్ చేసి ఉంచిన త్రీడీ వర్చువల్ హోలోగ్రామ్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేందుకు వీలవుతుంది.
 
గుండె ఎలా పనిచేస్తుంది? ఇది తెలియాలంటే... మనం ఓ గుండెను తెచ్చుకొని... తెలుసుకోవాల్సిన పని లేదు. హోలోలెన్స్‌లో ముందుగానే రికార్డ్ చేసివున్న వర్చువల్ బొమ్మను పరిశీలిస్తే సరిపోతుంది. గుండెకు సంబంధించిన మొత్తం వివరాలు తెలిసిపోతాయి. రక్తప్రసరణ ఎలా జరుగుతుందో అర్థమవుతుంది.

ఒక్క గుండే కాదు. శరీరంలో ఏ పార్ట్ గురించైనా వివరంగా తెలుసుకోవచ్చు. వర్చువల్ బాడీ లోంచీ తెలుసుకోవాలనుకున్న పార్టును బయటికి తీసి... ఇతరులతో దానిపై చర్చించవచ్చు. మన చేతి వేళ్లే ఇక్కడ సెన్సార్లు. సో... వేళ్లతో మనం ఎలాంటి ఆదేశాలిస్తే... హోలోపోర్టేషన్ వర్చువల్ వరల్డ్ అలా పనిచేస్తుంది. మన వాయిస్‌ని గుర్తుపట్టి పనిచేసే టెక్నాలజీ కూడా ఉంది.

తలనొప్పికి స్కాన్ చేసే... సీటీ స్కానర్‌ను చూడాలంటే... హాస్పిటల్‌కి వెళ్లాల్సిన పనిలేదు. మన ఇంట్లోనే అది ఉన్నట్లుగా హోలోలెన్స్ చూపిస్తాయి. స్కానింగ్ ఎలా జరుగుతుందో, అందులో ఏయే మెషిన్లు ఉంటాయో అత్యంత స్పష్టంగా తెలుసుకోవచ్చు.

అరోగ్య సమస్యలు కూడా ఈ విధానం ద్వారా తెలుస్తాయి. ఏ చెయ్యికో నొప్పి వస్తే... హోలోగ్రామ్ లెన్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సమస్య చిన్నదే అయితే... చేతికి స్వయంగా ట్రీట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు.

బిజినెస్ గ్రాఫ్స్, సైంటిఫిక్ కోడ్స్, స్టాక్ మార్కెటింగ్, ప్రాఫిట్ అండ్ లాస్, చార్ట్స్ వంటివి కూడా విశ్లేషించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది.

ఆటలు ఆడేందుకు కూడా ఈ టెక్నాలజీ చక్కగా ఉపయోగపడుతుంది. నెట్‌తో అనుసంధానమై లైవ్‌లో గేమ్స్ ఆడేందుకు వీలవుతుంది. ఇల్లే ప్లే గ్రౌండ్‌గా మారిపోతుంది.

సినిమా చూడాలంటే... బిగ్ స్క్రీనో, టీవీయో అవసరం లేదు. హోలోపోర్టేషన్‌తో ఇల్లే థియేటర్‌లా మారిపోతుంది. సినిమాలు, వీడియోలూ అన్నీ గాల్లో చూసేయొచ్చు. ఇంట్లో ఎంత మంది ఉంటే... అంతమందీ ఒకే సినిమా చూడాల్సిన పనిలేదు. ఎవరికి నచ్చింది వాళ్లు చూడొచ్చు.

ఆగ్‌మెంటెడ్ రియాల్టీతో కూడిన ఈ టెక్నాలజీ... భవన నిర్మాణాలకు డిజిటల్ రూపం ఇస్తోంది. దీనివల్ల భవనాలు, ఆఫీసుల్ని నిర్మించకముందే... అవి ఎలా ఉంటాయో... త్రీడీ రూపంలో చూడొచ్చు. అప్పటికప్పుడు మార్పులు చేసేయొచ్చు.

అపరాధ కేసుల పరిశోధనలోనూ హోలోపోర్టేషన్ దూసుకొస్తోంది. ఇన్వెస్టిగేషన్‌లో అప్పటికప్పుడే... ఆన్‌లైన్‌లో డేటాను సేవ్ చేసేందుకు, విశ్లేషించేందుకు ఇది ఉపయోగపడుతోంది. కంటికి కనిపించని మరకలు, ఫింగర్ ప్రింట్లను హోలో సెన్సార్ల ద్వారా విశ్లేషించేలా దీన్ని డెవలప్ చేస్తున్నారు.

విద్యారంగానికి కూడా హోలోపోర్టేషన్, ఆగ్‌మెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ ఎంతో మేలు చేస్తున్నాయి. స్టడీ ప్రాజెక్టుల్ని మరింత ప్రయోజనాత్మకంగా చేసేందుకు వీలవుతోంది.

అంతా బాగానే ఉంది. మరి ఈ టెక్నాలజీ ముందున్న సవాళ్లేంటి? వాటిని అధిగమించేందుకు ఏం చేస్తున్నారు? తెలుసుకుందాం.

ఇప్పుడు మొబైళ్లు ఎంతలా వాడుకలోకి వచ్చేశాయో... త్రీడీ పోర్టేషన్ కూడా అంతలా అందరికీ అందుబాటులోకి వచ్చేస్తే... కమ్యూనికేషన్ స్వరూపమే మారిపోతుంది. ఐతే... ఇదంత తేలిక కాదు. దీని ముందు చాలా సవాళ్లున్నాయి. అవేంటో, టెక్ సవ్వీలు ఏం చెయ్యాలనుకుంటున్నారో తెలుసుకుందాం.

సవాళ్లు:
హోలోపోర్టేషన్ వల్ల డిజిటల్, త్రీడీ రూపంలో మరో ప్రపంచ సృష్టి జరుగుతోంది. దానికి ఆగ్‌మెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ తోడై... ప్రపంచం టెక్నికల్‌గా అత్యద్భుతంగా మారిపోతోంది. మన లైఫ్‌... మరింత డిజిటల్ అయిపోతోంది.

ఏ టెక్నాలజీ అయినా మొదట్లో ఎన్నో సవాళ్లు తప్పవు. ప్రస్తుతం మనం వాడుతున్న సెల్‌ఫోన్ల విషయంలోనూ అదే జరిగింది. ల్యాండ్‌ ఫోన్లు, సెల్యులార్ మొబైళ్ల మొదలు... స్మార్ట్ ఫోన్ల వరకూ... ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. హోలోపోర్టేషన్ కూడా అంతే. తొలిదశలో ఉన్న ఇది... ఎన్నో సవాళ్లతో ముందడుగు వేస్తోంది. వచ్చే పదేళ్లలో ఈ టెక్నాలజీ వరల్డ్ కమ్యూనికేషన్ రూపురేఖలే మార్చేస్తుందనడంలో సందేహం అక్కర్లేదు.

ప్రస్తుతానికి ఆశ్చర్యం, ఆసక్తి కలిగిస్తున్న హోలోపోర్టేషన్‌కి ఉన్న అతి పెద్ద సమస్య రూం సెట్టింగ్. ఇది సాధ్యపడాలంటే... త్రీడీ కెమెరాలు, కంప్యూటర్, హోలోలెన్స్, హెడ్‌సెట్స్‌ ఇవన్నీ ఉండాలి. ఇందుకు దాదాపు 5 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాలి. జస్ట్ హోలోలెన్స్ కావాలన్నా రెండు లక్షలు అవసరం. మొబైల్ ఫోన్లలో వీడియోకాలింగ్‌కి వంద రూపాయలు కూడా అవ్వవు. అలాంటిది హోలోపోర్టేషన్‌కి లక్షలు ఖర్చుపెట్టడం కష్టమే కదా. ఈ ఖర్చును 90 శాతం తగ్గించగలగాలి. అప్పుడే ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తుంది.

హోలోపోర్టేషన్‌లో ఉన్న మరో సమస్య ఎక్కువ ఇంటర్నెట్, ఎక్కువ వేగంతో బ్యాండ్‌విడ్త్ కావాలి. సెకన్‌కి 30 నుంచీ 50 ఎంబీల బ్యాండ్‌విడ్త్ అవసరం. అంటే ఐదు నిమిషాలపాటూ నెట్ వాడితే... 14 జీబీలు అయిపోతుంది. ఓ గంట వాడాలంటే... 175జీబీ ఉండాలి. అంటే ఇప్పుడు మనం మొబైళ్లలో 3 నెలలు వాడుతున్న ఇంటర్నెట్... హోలోపోర్టేషన్‌లో గంటలోనే అయిపోతుందన్నమాట. అందుకు అయ్యే ఖర్చే 600 రూపాయలు.

హోలోపోర్టేషన్ కాస్ట్‌లీ కాబట్టి... ఇమేజ్ సైజ్ తగ్గిస్తే చాలా ప్రయోజనాలుంటాయి. అప్పుడు ఎక్కువ నెట్ అవసరం ఉండదు. పైగా బొమ్మల క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇందుకోసం ఆమధ్య ఓ కారు వెనక భాగంలో.... సెట్టింగ్ వేసి... మొబైల్ హోలోపోర్టేషన్ సిస్టం తీసుకొచ్చారు. ఇది రియల్ టైమ్ త్రీడీ కాప్చర్, ట్రాన్స్‌మిషన్‌ను మరింత క్వాలిటీతో ఇస్తోంది. ఈ టెక్నాలజీ వల్ల... ఇంట్లోనే ఉండి హోలోపోర్టేషన్ చెయ్యాల్సిన పనిలేదు. కారులో వెళ్తూ కూడా... త్రీడీ బొమ్మలతో మాట్లాడవచ్చు. ఇందులో ఎదురయ్యే ప్రధాన సమస్య ఇంటర్నెట్ సిగ్నల్స్. కారు వెళ్తూ ఉంటే... హైస్పీడ్‌లో నెట్ రావడం కష్టమే. ఇప్పుడున్న నెట్ స్పీడ్ ఏమాత్రం చాలదు.

హోలోపోర్టేషన్‌లో మరో సమస్య లైటింగ్. రూంలో అయితే... లైటింగ్‌ను ఎడ్జస్ట్ చేసుకొని... త్రీడీ బొమ్మను స్పష్టంగా చూడొచ్చు. అదే... బయటకు వెళ్తే... అక్కడి వాతావరణాన్ని బట్టీ... త్రీడీ బొమ్మ కనిపిస్తుంది. లైటింగ్ సరిగా లేకపోతే... బొమ్మ నల్లగా, చీకటిగా కనిపిస్తుంది. మాటిమాటికీ అటూ ఇటూ కదిలిపోతూ, చెదిరిపోతూ ఇర్రిటేషన్ తెప్పిస్తుంది. దీన్ని అధిగమించేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.

హోలోపోర్టేషన్‌లో ఉన్న మరో సమస్య సెట్టింగ్ పరిమాణం. ఓ కంప్యూటర్, రెండు కెమెరాలు ఇవన్నీ ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తాయి. ఇవి లేకపోతే ఇది జరగదు. ఈ మొత్తం వ్యవస్థను మొబైల్ కెమెరా సైజుకి తీసుకురావాల్సి ఉంటుంది. మొబైల్‌కే త్రీడీ కెమెరాలు సెట్ చేసి, మొబైల్‌లోనే కాప్చరింగ్, ప్రాసెసింగ్ అన్నీ చేయగలిగితే... అతి పెద్ద సమస్య తీరినట్లవుతుంది. అదే జరిగితే... ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పోర్టేషన్ చేసుకోవచ్చు. ఈ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి.
 
తొలిదశలో మొబైల్ టెక్నాలజీ కూడా ఇబ్బందిగానే ఉండేది. మాటిమాటికీ సిగ్నల్స్ పోతూ చిరాకు తెప్పించేది. మరి ఇప్పుడో... మొబైల్ లేకపోతే క్షణం గడవట్లేదు. హోలోపోర్టేషన్ కూడా అంతే. ప్రస్తుతానికి ఇది పూర్తిస్థాయిలో లేనప్పటికీ... ఫ్యూచర్ దీనిదే. పదేళ్ల తర్వాత... ఇది లేకుండా మనకు రోజు గడవదు. అప్పటికి ఇంటర్నెట్ వేగం పది రెట్లు పెరుగుతుంది. డిజిటల్, వర్చువల్ టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది. అందువల్ల హోలోపోర్టేషన్... అందరికీ అందుబాటులోకి వచ్చి... సరికొత్త కమ్యూనికేషన్ రివల్యూషన్ రాకమానదు. ఆ రోజు వీలైనంత త్వరగా రావాలని కోరుకుందాం.

వన్ జీ నుంచీ 2జీ రావడానికి ఐదేళ్లు పడితే... 2జీ నుంచీ 3జీ రావడానికి మూడేళ్లే పట్టింది. ప్రస్తుతం 4జీ వచ్చిన ఏడాదికే 5జీ వచ్చేసింది. 6జీ కోసం పరుగు మొదలైంది. డిజిటల్ టెక్నాలజీ ఎంత పెరిగితే, మన జీవితం అంత హాయిగా ఉంటుంది. ఇప్పుడు దానికి వర్చువల్, హోలోగ్రామ్ కూడా తోడవుతోంది. సో... కనుసైగలు, వేళ్ల కొనలతో శాసించే ఫ్యూచర్ రాబోతోంది. దాని కోసం ఎదురుచూద్దాం.