20, జూన్ 2021, ఆదివారం

Pripyat: శిథిల ప్రపంచం!.. విషాద దీవిలో వినూత్న జీవం!.. నిశీధి మాటున సుజల సౌధం!

ప్రిప్యత్ నగరం (image credit - Twitter - birdovahkiin)

Pripyat: అదో విచిత్ర నగరం. అక్కడి ప్రతి దృశ్యమూ... చిత్రంగానే ఉంటుంది. మనం వేరే ప్రపంచంలోకి వెళ్లిపోయామా అన్న అనుభూతి కలుగుతుంది. భవనాలు, రోడ్లూ, పరిసరాలూ అన్నీ... వింతగానే ఉంటాయి. పైకి అత్యంత సుందరంగా కనిపించే ఆ నగరం... లోపల అత్యంత విషాదాన్ని దాచుకుంది. రష్యాలోని ప్రిప్యత్ సిటీ గురించే ఈ ఇంట్రడక్షన్.

కాస్త ఖాళీ జాగా కనిపిస్తే చాలు... కబ్జా చేస్తున్న రోజులివి. మరి ఆ నగరంలో జన సంచారమే ఉండదు. ఆకాశాన్ని అంటినట్లుండే భవనాలు కూడా బోసిపోయి ఉంటాయి. నిత్యం నిశ్శబ్దం రాజ్యమేలుతూ ఉంటుంది.

దట్టమైన అడవి... మధ్యమధ్యలో ఎత్తైన భవనాలు, విశాలంగా రోడ్లు, ప్రశాంత వాతావరణం... ఇవన్నీ కలిసి అదో చిత్రమైన ప్రాంతంలా అనిపిస్తుంది. అవును... నిజంగానే ఈ భూమ్మీద అదో వైవిధ్యభరిత ప్రదేశం.

రష్యాకు దిగువన ఉన్న ఉక్రెయిన్‌కు ఉత్తరాన ఉంది ఈ ప్రిప్యత్ నగరం. ఇక్కడ ప్రవహించే ప్రిప్యత్ నది పేరునే ఈ నగరానికీ పెట్టారు. 1970లో ప్రత్యేకించి ఓ పద్ధతి ప్రకారం నిర్మించిన అద్భుత నగరం ఇది.

35 ఏళ్లుగా... శిథిలావస్థలో సెలవు తీసుకుంటోంది. నిశీధి చరిత్రకు నిలువుటద్దమై నిలుస్తోంది. ఒకవైపు పొడవైన ప్రిప్యత్ నది. మరోవైపు సుందరమైన సాగర తీరం. మధ్యలో ఆధునిక నిర్మాణ శైలిని పోలివుండే ఎత్తైన భవనాలు. వీటన్నింటి మధ్యా ఆకట్టుకునే ఫెర్రీస్ జైంట్ వీల్. వీటికి తోడుగా మౌన ముద్రలో ఉన్న పాత ఎగ్జిబిషన్. ఇవన్నీ కలిసి... భూమిపై కాకుండా... మరెక్కడో వేరే గ్రహంపై ఉన్నామా అనిపించక మానదు. మూడో ప్రపంచ యుద్ధం వచ్చి... అంతా నాశనమైపోయిందా? అనిపించేలా ఉంటాయి ఇక్కడి దృశ్యాలు. ఈ నగరంలో తిరిగే వాళ్లకు ప్రతీదీ వింతగానే అనిపిస్తుంది. ఇక్కడి వీధులూ, ఏరియాలూ... వేటికవే పాత దనాన్ని కొత్తగా చూపిస్తుంటాయి. ప్రిప్యత్‌లోని గడియారాల్లో చాలావరకూ ఉదయం 11 గంటల 55 నిమిషాలకి ఆగిపోయి ఉంటాయి. 1986లో నగరమంతా కరెంటు పోయింది. ఇక అప్పటి నుంచీ గడియారాలన్నీ ఆగిపోయాయి.

ఒకే ఒక్క రోజులో... జనమంతా... ఇళ్లు వదిలి వెళ్లిపోవడంతో... ఈ ప్రాంతం కాంక్రీట్ జంగల్‌లా మారింది. ఈ భూమ్మీద జనం అంటూ లేకపోతే... వచ్చే 35 ఏళ్ల తర్వాత... భూమి ఎలా మారిపోతుందో... ప్రిప్యత్‌ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పచ్చదనం విపరీతంగా పెరగడంతో... రకరకాల పక్షులు, జంతువులకు ఆవాసమైంది. జింకలు, తోడేళ్లు, అడవి పందులు సహా చాలా రకాల వన్య ప్రాణులకు నిలయమైంది. ఒక రకంగా చెప్పాలంటే... జనం వెళ్లిపోవడం జంతువులకు కలిసొచ్చినట్లైంది. నిర్మానుష్యంగా ఉన్న నగరాన్ని ఆక్రమించాయి. రష్యాలో అత్యధికంగా వన్యప్రాణులు ఉన్న ప్రాంతాల్లో ఈ ఏరియా కూడా చేరింది.

ఇక శీతాకాలం వస్తే... ఈ ప్రదేశం... మరోలా కనిపిస్తుంది. దివి భువికి దిగివచ్చిందా అన్న ఫీల్ కలిగిస్తుంది. కనుచూపుమేరా కప్పుకొని ఉన్న మంచు దుప్పటి మధ్య ఇక్కడి పైన్ వృక్షాలు మనోహరంగా కనిపిస్తాయి. దట్టమైన మంచు ఇక్కడి భవనాలూ, ఇళ్లూ, రోడ్లను కమ్మేస్తుంది. ఇలాంటి ప్రాంతాలు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ... ఇక్కడ నిజంగానే ఓ నగరం నిద్రపోతోంది.

ఈ భూమిపై అద్భుతమైన నగరాల్లో ఒకటైన ప్రిప్యత్... ఎందుకలా మారింది? అక్కడి జనం ఏమయ్యారు? ఎందుకు అంతా కట్టకట్టుకొని... వెళ్లిపోయారు? గజం భూమిని వదులుకోవడానికే యుద్ధాలు చేస్తున్న ఈ రోజుల్లో... ఓ నగరం నగరం... నిర్మానుష్యంగా ఎందుకు మారింది?

చెర్నోబిల్ (Chernobyl)... ఈ పేరు వింటే చాలు... అణుకంపం గుర్తురాక మానదు. ప్రపంచంలోనే అత్యంత విషాదకర న్యూక్లియర్ రియాక్టర్ ప్రమాదం మనసులో మెదిలి తీరుతుంది. ఒళ్లు ఒక్కసారిగా జలదరిస్తుంది. లక్షల మందిని పొట్టన పెట్టుకున్న చెర్నోబిల్ దుర్ఘటనకూ... ప్రిప్యత్ నగరానికీ అత్యంత దగ్గర సంబంధం ఉంది.

అది 1986 ఏప్రిల్ 26. నాటి సోవియట్ రష్యాలోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఓ ప్రయోగం జరుగుతోంది. నాలుగో రియాక్టర్‌ పనిచేసేందుకు ఎంత పీడనం అవసరమన్నదాన్ని పరిశీలిస్తున్నారు సైంటిస్టులు.
వాళ్లు అనుకున్నది ఒకటైతే... జరిగింది మరొకటైంది. నాలుగో రియాక్టర్‌ నుంచి పవర్‌ ప్రొడక్షన్‌ ఒక్కసారిగా పెరిగింది. దాన్ని కట్టడి చేసే క్రమంలో అధికారులు కాస్త కంగారుపడ్డారు. ఆ టైమ్‌లో చేసిన చిన్న పొరపాటు... మానవ జాతికే గ్రహపాటుగా మారింది. విద్యుత్‌ ఉత్పత్తి మరింత పెరిగి... రియాక్టర్ పీడనం అంతకంతకూ ఎక్కువైంది. ఓ స్థాయి దాటాక సైంటిస్టులకు ఏం చేయాలో అర్థంకాలేదు. ఇక కంట్రోల్ చెయ్యడం తమ వల్ల కాదనుకున్నారు. జూనియర్ల నుంచీ సీనియర్ల వరకూ... అందరూ చేతులెత్తేశారు. అంతే... రియాక్టర్‌ ఉపరితలం ఒక్కసారిగా పేలిపోయింది.

క్షణాల్లో అణువిద్యుత్‌ కేంద్రం సమీప ప్రాంతాలకు రేడియేషన్‌ వ్యాపించింది. ఎనిమిది టన్నుల రేడియో ధార్మిక పదార్థాలు విడుదలయ్యాయి. అత్యంత విషపూరితమైన ఆ వాయువులు... గాల్లో కలిసిపోయాయి. జపాన్‌లోని హిరోషిమా, నాగసాగిలో జరిగిన అణుబాంబుల దాడుల్లో వెలువడిన దాని కంటే... 200 రెట్లు అధికంగా రేడియో ధార్మిక పదార్థాలు చెర్నోబిల్‌ దుర్ఘటనలో విడుదలయ్యాయి. పేలుడు జరిగినప్పుడు స్పాట్‌లో 30 మంది చనిపోగా.... ఆ తర్వాత కాన్సర్ వల్ల 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాలక్రమంలో రకరకాల శ్వాసకోస, జీర్ణకోశ, మూత్రపిండాల వ్యాధులతో 9లక్షల 80 వేల మంది ప్రాణాలొదిలారు. ఇప్పటికీ చాలా మంది రోగాల బారిన పడుతూనే ఉన్నారు.

గర్భిణీలపై రేడియేషన్ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది. ఇప్పటికీ ప్రిప్యత్, చెర్నోబిల్ ఏరియాల్లో పిల్లలు మానసికంగా, శారీరకంగా వికలాంగులుగా పుడుతున్నారు. అందువల్లే ఈ దుర్ఘటన... భూమిపై అత్యంత విషాదకరమైన పరిణామంగా చరిత్రకెక్కింది. రేడియేషన్ ప్రభావం యూరప్ దేశాలపైనా కనిపించింది. విష వాయువులు లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించాయి. అక్కడ కూడా అణు ధార్మికత పెరిగింది. అణు ధార్మికత బ్యాహ్య వాతావరణంలో కలవడం వల్ల అంతా విషపూరితంగా మారింది. గాలి, నీరు, పంటలు, ఆహారం అన్నీ విషతుల్యమయ్యాయి. భూగర్భ జలాలపై కూడా అణు ధార్మికత ప్రభావం పడింది.

నాలుగో రియాక్టర్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ప్రిప్యత్ నగరం. పవర్ ప్లాంట్‌లో పనిచేసే 49వేల మంది సిబ్బంది ఈ నగరంలోనే ఉండేవాళ్లు. ఇక్కడ 13వేలకు పైగా అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. 15 స్కూళ్లు, ఓ హాస్పిటల్ ఉండేది. 25 షాపింగ్ మాళ్లు, 10 జిమ్‌లు కూడా ఉండేవి. ఓ భారీ ఎగ్జిబిషన్ నగరానికే తలమానికంగా కనిపించేది. వీటితోపాటూ పార్కులు, సినిమా హాళ్లు, చిన్నతరహా పరిశ్రమలూ ఈ నగరంలో వెలిశాయి.
ఇంత చక్కటి, నిర్మాణాత్మక నగరం... ఒక్క దుర్ఘటనతో నిశీథిలోకి వెళ్లిపోయింది. పేలుడు జరిగిన గంటల్లోనే ఈ నగరంలో వాళ్లంతా... ఉన్నపళంగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. దాదాపు 3 లక్షల మంది పెట్టే బెడా సర్దుకుపోయారు. రెండ్రోజుల్లో నగరం మొత్తం ఖాళీ అయిపోయింది. చెర్నోబిల్ ప్రమాదం వల్ల ప్రిప్యత్‌లో రేడియేషన్... సాధారణం కంటే కొన్ని వేల రెట్లు పెరిగింది. ఫలితంగా ఈ నగరం... నివాస రహితంగా మారింది. అందుకే 35 ఏళ్లుగా ఇలా నిద్రపోతూనే ఉంది. ఈ సిటీని వదిలి వెళ్లిపోయిన వర్కర్ల కోసం... స్లావుటిచ్ (Slavutych) అనే మరో నగరాన్ని నిర్మించింది ప్రభుత్వం.

రేడియేషన్ ఎంత ప్రమాదకరమైందో, దానివల్ల ఎంత అనర్థం జరుగుతుందో కళ్లకు కట్టే నగరం ప్రిప్యత్. ప్రస్తుతం ఆ సిటీలో జనం లేకపోయినా... ప్రయోగాలకూ, పరిశోధనలకూ వేదికవుతోంది. సినిమా షూటింగ్స్‌, టూరిజంకి కూడా కేరాఫ్‌గా నిలుస్తోంది. రొటీన్ నగరాలకు భిన్నంగా కనిపిస్తూ... ప్రతి ఒక్కరినీ ఏదో ఒక రకంగా ఆకట్టుకుంటోంది. అణు రియాక్టర్ పేలిన మూడు దశాబ్దాల తర్వాత... ప్రిప్యత్ నగరాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. చెర్నోబిల్, ప్రిప్యత్, ఇతర చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగాలనుకునే సందర్శకులు ముందుగా ఉక్రెయిన్ ప్రభుత్వం నుంచీ డే పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. పేలుడు జరిగిన ప్రాంతానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న కీవ్‌లో ట్రావెలింగ్, టూరిస్టు కంపెనీలు డే పాస్‌లను అందిస్తున్నాయి.

ఇక్కడి 5 రకాల టూర్ ఏజెన్సీలు... సందర్శకుల్ని ప్రిప్యత్‌కు తీసుకెళ్తాయి. రూల్ ప్రకారం పూర్తిగా పాడై, శిథిలావస్థలో ఉన్న ఇక్కడి భవనాల్లోకి పర్యాటకులు వెళ్లడం నిషేధం. టూర్ ఏజెన్సీలు కచ్చితంగా ఈ నిబంధనలు పాటిస్తాయి. ఏ క్షణాన కూలిపోతాయో తెలియని ఈ భవనాల్లోకి పర్యాటకుల్ని వెళ్లనివ్వవు. ఇప్పటికీ ఇక్కడ రేడియేషన్ సమస్య కాస్తో కూస్తో అలాగే ఉంది. అందుకే ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా... ముందుగానే అక్కడి రేడియో ధార్మికత ఎంత ఉందో తెలుసుకున్నాకే, వెళ్లేదీ, లేనిదీ నిర్ణయిస్తారు. కొంతమంది ఔత్సాహికులు మాత్రం... స్వయంగా వెళ్లి నగరమంతా ఒంటరిగా తిరుగుతారు. రేడియేషన్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ఎవరికి వాళ్లు పరికరాలతో టెస్ట్ చేస్తుంటారు. ఇలా ఈ నగరం టూరిజం కేంద్రంగా మారింది. ఎందుకూ పనికిరాకుండా పోతుందనుకున్న సిటీ కాస్తా... ప్రయోజనకరంగా మారింది.

ఈ ఏరియాలో పరిశోధనలు కూడా ఎక్కువగానే జరుగుతాయి. చెర్నోబిల్ దుర్ఘటన ఇక్కడి భూములపై ఎంత ప్రభావం చూపిందో పరిశోధకులు అప్పుడప్పుడూ ఇక్కడికొచ్చి... టెస్టులు చేస్తుంటారు. భూ వాతావరణంపై రేడియేషన్ విష ప్రభావాన్ని అంచనా వేస్తుంటారు. వర్చువల్ గేమింగ్ వరల్డ్‌లో కూడా ప్రిప్యత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌లా... కాల్ ఆఫ్ ప్రిప్యత్ గేమ్... యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తుంది. చెర్నోబిల్ దుర్ఘటనపై కూడా స్టాకెర్ షాడో ఆఫ్ చెర్నోబిల్ అనే గేమ్ ఉంది. అప్పుడప్పుడూ హాలీవుడ్ సినిమాలు, డాక్యుమెంటరీల షూటింగ్‌లు కూడా ఇక్కడ జరుగుతున్నాయి.

జనం లేని ఈ ఏరియాల్లో దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి ఊహాగానాలు సాధారణమే కదా. అమెరికా పారానార్మల్ సొసైటీ పరిశోధకులు ఓ రాత్రంతా ఇక్కడే ఉండి పరిశోధనలు చేశారు. చివరకు దెయ్యాల వంటివి ఇక్కడ లేవని తేల్చారు. 2012లో... చెర్నోబిల్ డైరీస్ పేరుతో ఓ హర్రర్ థ్రిల్లర్ మూవీ కూడా వచ్చింది.

ఇప్పటికే శిథిలావస్థకు చేరిన ప్రిప్యత్... త్వరలోనే పూర్తిగా కనుమరుగయ్యేలా ఉంది. చుట్టుపక్కల విస్తరిస్తున్న అడవి, అందులోని ఎత్తైన చెట్లు... క్రమంగా ఇక్కడి భవనాల్ని కప్పేస్తున్నాయి. మరికొన్నేళ్లలో అపార్ట్‌మెంట్లన్నీ కూలిపోయి... ఇదో అభయారణ్యంగా మారినా ఆశ్చర్యం అక్కర్లేదు.

చెర్నోబిల్‌ పవర్ ప్లాంట్‌ వ్యర్థాల్ని శుభ్రం చేసే ప్రక్రియ రెండున్నర దశాబ్దాలుగా కొనసాగుతోంది. 2065 నాటికి పూర్తిగా శుభ్రం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మూతపడింది. 2000 సంవత్సరం నుంచీ ఇది పనిచేయట్లేదు. దీన్ని పునరుద్ధరించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 20 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. 20 ఏళ్లుగా పనులు కొనసాగుతున్నాయి. త్వరలో ప్లాంట్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

చరిత్రలో జరిగిన విషాదంపై ఎలాగూ చేయగలిగింది ఏమీ లేదు. దురదృష్టమేంటంటే.... ఇప్పటికీ చెర్నోబిల్ రేడియో ధార్మిక ప్రభావిత ప్రాంతాల్లో పది లక్షల మంది చిన్నారులున్నారు. ఉక్రెయిన్‌లో పుడుతున్న పిల్లల్లో ప్రతీ సంవత్సరం 6 వేల మంది దాకా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అప్పటి దుర్ఘటన శాపం 35 ఏళ్లైనా వదలట్లేదు. ఈ ప్రభావం పూర్తిగా పోవాలంటే... మరో 24 వేల సంవత్సరాలు పడుతుందంటున్నారు సైంటిస్టులు.

చెర్నోబిల్ చుట్టుపక్కల దాదాపు 10 లక్షల ఎకరాలు ఇప్పటికీ పంటలు పండేందుకు అనువుగా లేవు. మరో వందేళ్ల వరకూ అక్కడ వ్యవసాయం చేయకూడదని తేల్చారు శాస్త్రవేత్తలు.

మానవుడు తన అవసరాల కోసం... ప్రమాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. ప్రపంచాన్ని డేంజర్ జోన్‌లోకి నెట్టేస్తున్నాడు. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన చోట... నిర్లక్ష్యపు జాడలు నిప్పు రాజేస్తున్నాయి. ప్రకృతి వినాశనానికి దారితీస్తున్నాయి. ప్రిప్యత్ నగరం, చెర్నోబిల్ దుర్ఘటన మనకు చెబుతున్నది ఇదే. దీన్నుంచీ గుణపాఠం నేర్చుకోవడం అత్యవసరం. భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా చేయడం బాధ్యతాయుతం.