రొరైమా పర్వతం (Image credit - Twitter) |
Roraima: అదో అద్భుతమైన సాహస యాత్ర. జీవితాంతం గుర్తుండిపోయే మధుర స్మృతుల జ్ఞాపిక. అడుగడుగునా సవాళ్లు స్వాగతం పలుకుతున్నా... సమస్యలు సుడిగుండాల్లా వెనక్కి లాగేస్తున్నా... ముందుకే సాగిపోవాలనిపించే రహస్యాల ప్రహేళిక. అక్కడకు ఒక్కసారి వెళ్లడమే గగనం. కనీసం సగం ప్రయాణం సాగించినా గొప్పే. బహుశా స్వర్గం అంటే ఇలాగే ఉంటుందేమో అని అనిపించే సుదూర సుందర ప్రపంచం అది. మూడు దేశాల్లో విస్తరించి... విచిత్రాల్ని తనలో దాచుకుంటూ... విస్మయం కలిగించే రొరైమా పర్వత ప్రయాణమే ఈ స్టోరీ.
పర్వతం అనగానే... ఎత్తైన ఓ కొండ... పైన శిఖరాగ్రం... చుట్టూ మంచు పరచుకున్న దృశ్యాలు... సింపుల్‌గా చెప్పాలంటే... మనకు హిమాలయాలు గుర్తుకురావడం సహజం. మరి రొరైమా పర్వతం కూడా అలాగే ఉంటుందా? ఇంకేదైనా ప్రత్యేకత ఉందా? ఊహూ... ఆది పూర్తి భిన్నం.
చుట్టూ దట్టమైన హరితారణ్యం. ఆకాశంలో తేలియాడే మంచు మేఘాలు. అత్యంత ఎత్తు నుంచీ జాలువారే జలపాతాలు. నింగీ నేలా ఏకమైనట్లు కనిపించే లోకం. స్వర్గంలో ఉన్నామా అనిపించే వాతావరణం. ఇవన్నీ రొరైమా సొంతం. చదువుతుంటేనే భలే ఉందే ఆ ప్రాంతం అని అనిపించట్లా. అవును. నిజంగా అదో అద్భుతమే. భువిపై వెలసిన దివి ఈ సస్యశ్యామల ప్రదేశం.
దక్షిణ అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి పకరైమా. ఇక్కడే వెలసింది ఓ అద్భుతమైన పర్వతం. అదే రొరైమా. ఇతర పర్వతాలకు పూర్తి భిన్నంగా... త్రిభుజాకారంలో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది ఈ హిమ నదం. సాధారణంగా ఏ పర్వతానికైనా... పైన శిఖరాగ్రం ఉంటుంది. ఈ పర్వతంపై అలా ఉండదు. అందుకే ఇది మిగతావాటికి భిన్నంగా, ప్రత్యేకంగా నిలుస్తోంది. దాదాపు మూడు కిలోమీటర్ల ఎత్తుండే ఈ పర్వతంపైన 31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విశాల మైదానం ఉంటుంది. చుట్టూ పరచుకున్న మంచు పొరలు... ఈ హిమనదానికి ప్రత్యేక ఆకర్షణ. వెనిజులా, బ్రెజిల్, గయానా దేశాల మధ్య ఉన్న పకరైమా పర్వత శ్రేణిలో... సహస సిద్ధంగా ఏర్పడింది రొరైమా పర్వతం. ఇది ఇప్పటిది కాదు. ఈ భూమిపై జీవం పుట్టకముందే... ఈ పర్వతం పుట్టుకొచ్చింది. దీని వయసెంతో తెలుసా. 200 కోట్ల సంవత్సరాలకు పైనే.
ఈ పర్వతంపైకి వెళ్లినవాళ్లు... కోట్లాది సంవత్సరాల కిందట పుట్టిన ప్రదేశంపై అడుగుపెట్టినట్లు భావిస్తూ... ఓ రకమైన తన్మయత్వాన్ని పొందుతారు. సూర్యోదయం, సూర్యాస్తమయాల్ని ఈ ఎత్తైన ప్రాంతం నుంచీ చూస్తే... సరికొత్తగా, నయన మనోహరంగా అనిపిస్తుంది. ఈ ప్రకృతిలో ఎంత అందం దాగివుందో అర్థమవుతుంది. ఎత్తైన ప్రదేశం నుంచీ కిందికి చూడటం ఒక్కోసారి భయం కూడా కలిగిస్తుంది. అలాంటి అనుభూతి కూడా ఇక్కడ పొందుతుంటారు కొందరు. స్థానికులు ఈ పర్వతాన్ని... భూమికి కేంద్రంగా పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ పర్వతం భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది. బ్రెజిల్ పురాణాల ప్రకారం... రొరైమాపై... క్విన్ అనే దేవత నివసిస్తూ ఉంటుందట. అక్కడి నుంచీ భూమండలం మొత్తాన్నీ పరిపాలిస్తూ ఉంటుందన్నది స్థానికుల నమ్మకం. అలాగని ఈ పర్వతంపై ఏ గుళ్లూ, గోపురాల వంటివి లేవు.
రోరైమాపై నాలుగు జలపాతాలున్నాయి. వాటిలో దాదాపు కిలోమీటర్ ఎత్తు నుంచీ జాలువారే, అతిపెద్ద జలపాతాన్ని ఏంజెల్ ఫాల్స్ అంటారు. దాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. దానికంటే పెద్ద జలపాతాలు ఈ భూమిపై ఉన్నా... చాలామంది టూరిస్టులు... ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తైనది అనుకుంటూ ఉంటారు. అంతలా మెస్మరైజ్ చేస్తుందది. మంచుతో మమేకమైనట్లు కనిపించే ఏంజెల్ ఫాల్స్‌ను హిమగిరి పైనుంచీ చూడటం అనిర్వచనీయం. బండరాళ్ల మధ్య నుంచీ దూసుకెళ్లే ప్రవాహం... అత్యంత ఎత్తు నుంచీ కిందికి జారుతూ ఉంటే... ఆ దృశ్యం ఆహ్లాదమయం. ఇక్కడ ఏర్పడే ఇంద్రధనస్సు (Rainbow)... రకరకాల రంగులతో చూపుల్ని కట్టిపడేస్తుంది. ఈ పర్వతం మధ్యలో... జలపాతం వెనక నిల్చొని జలకాలాడేందుకు వీలుంది. ఆ అనుభూతి కోసమే తరలివస్తుంటారు పర్యాటకులు.
ఈ జలపాతం నుంచీ వచ్చే నీరు... ఒరినోకో నదీ ప్రవాహమై సాగుతోంది. వెనెజులాలోని ఒరినోకో 2వేల 140 కిలోమీటర్ల పొడవుంటుంది. దక్షిణ అమెరికాలో అమెజాన్ తర్వాత ఇదే అతి పొడవైన నది. అక్కడి చాలా మంది పేదలకు ఈ నదే జీవనాధారం. ఎక్కువ భాగం వెనిజులాలో ఉన్న రొరైమా... పక్కనే ఉన్న కనైమా నేషనల్ పార్కులో భాగమై ఉంది. ఈ పార్కులో కనిపించే జంతువులు, రకరకాల పూల జాతులు... ప్రపంచంలో మరెక్కడా ఉండవు. గొప్ప విషయమేంటంటే... ఈ పార్కు నుంచీ రొమేనియాకు ప్రవహించే నీరు... అత్యంత శుభ్రమైనది. ఏమాత్రం కలుషితం కానిది. ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతో... కనైమా నేషనల్ పార్కును ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఇక్కడి టూరిజం డెవలప్‌మెంట్‌కి తగిన చర్యలు తీసుకుంది.
రొరైమాను చూసేందుకు సంవత్సరంలో ఏ రోజైనా రావచ్చు. ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. సన్నటి జల్లులు రోజూ పడుతూనే ఉంటాయి. శీతాకాలంలోనైతే దట్టమైన మంచు ఈ పర్వతాన్ని చుట్టుముడుతుంది. ఆ దృశ్యాన్ని చూసి తీరాల్సిందే. వాన, మంచు వల్ల అక్కడ ఎక్కడ చూసినా పచ్చదనం పరచుకొని ఉంటుంది. అందుకే ఎన్నో రకాల పంటలకు, జీవ జాతులకూ ఆ ప్రాంతం నిలయమైంది.
ఐదు రోజుల సుదీర్ఘ ప్రయాణం. అద్భుత ప్రపంచంలో సవాళ్ల మధ్య సాహస యాత్ర:
మనం ఏ ఊరికో వెళ్తే... చక్కటి రవాణా మార్గం ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గమ్యాన్ని చేరొచ్చు. అదే రొరైమా పర్వతాన్ని చేరాలంటే మాత్రం తలకిందులుగా తపస్సు చేయాలి. ఆ ప్రయాణంలో అడుగడుగునా సవాళ్లు స్వాగతమిస్తాయి. మధ్యలోనే మానేసి వెనక్కి వెళ్లిపోమంటాయి. కానీ, జీవితంలో థ్రిల్ కావాలనుకునేవాళ్లు... రొరైమాను టార్గెట్ చేస్తారు. మరి వాళ్ల సాహస యాత్ర ఎలా సాగుతుందో తెలుసుకుందాం.
రొరైమా పర్వతం మానవ మనుగడకు దూరంగా... ఎక్కడో దట్టమైన అడవుల్లో ఉంది. అయినప్పటికీ ఆ పర్వతాన్ని చేరేందుకు వెనిజులా నుంచీ గ్రాన్ సబానా రోడ్డు మార్గం ఉంది. ఆ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అనేదే ఉండదు. పొల్యూషన్ మాటే గుర్తుకురాదు. విశాల మైదానం మధ్య... రివ్వున దూసుకుపోతాయి టూరిస్ట్ వెహికిల్స్. ఆ రోడ్డు మార్గం శాంటా ఎలెనా వరకే ఉంటుంది. అక్కడి నుంచీ ఎవరైనా సరే కాలినడక మొదలుపెట్టాల్సిందే.
రొరైమా పర్వతాన్ని ఎక్కాలంటే... కనీసం ఐదు రోజులు పడుతుంది. అది కూడా అనుభవం ఉన్న గైడ్లు వెంట ఉంటే. లేదంటే... దారి తప్పి... నానా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. ముందుగా పర్వత సానువుల్లో ఉండే పెమన్ గ్రామం నుంచీ పర్యాటకుల నడక మొదలవుతుంది. దారి పొడుగునా సవన్నా గడ్డి మైదానాలూ, లోయలూ, వంపులు తిరిగిన మలుపులూ ఉంటాయి. గ్రామం దాటి... పర్వతం సమీపంలోకి వెళ్లేందుకే ఓ రోజు పడుతుంది. అక్కడి వరకూ వెళ్లడం కూడా కష్టమే చాలామందికి.
పర్వతం సమీపం నుంచీ మరింత పైకి వెళ్లేందుకు చిన్న చిన్న కొండలూ, గుట్టలూ ఎక్కాల్సి ఉంటుంది. రెండు నదులను కూడా దాటాల్సి ఉంటుంది. ఈ నదులు ఎంత ప్రమాదకరమైనవంటే... ఉన్నట్టుండి వీటిలో ప్రవాహం పెరుగుతుంది. చుట్టుపక్కల ఎక్కడైనా భారీ వర్షాలు కురిస్తే... నదుల నీటిమట్టం పెరిగి... బోట్లలో వెళ్లేవాళ్లకు సవాళ్ల సాహస యాత్ర తప్పదు. నదుల్లో ప్రయాణానికి ఇక్కడ ప్రత్యేక బోట్లు నడిపేవారుంటారు. పర్యాటకులకు ఎలాంటి ఆపదా కలగకుండా వాళ్లే జాగ్రత్తగా అవతలి ఒడ్డుకు తీసుకెళ్తారు. ఐతే... ఆ పడవ ప్రయాణం... వేగంగా సాగుతుంది. ఆనందంతోపాటూ ఒకింత టెన్షన్ కూడా కలిగిస్తుంది. ఈ ప్రయాణం మధ్యలో చిన్న చిన్న జలపాతాలు కూడా కనిపిస్తూ, ఆహ్లాదం కలిగిస్తూ, టెన్షన్ మరచిపోయేలా చేస్తాయి. కనైమా నేషనల్ పార్కులో హచా జలపాతం పక్క నుంచీ పడవలో వెళ్తుంటే... కలిగే థ్రిల్ అంతా ఇంతా కాదు. జలపాతపు సవ్వడికి తోడు... మంచు తుంపరలు గాలిలో ఎగురుతుంటే... ఆ బ్యూటీఫుల్ సీనరీని బంధించేందుకు... కెమెరాలకు పనిచెబుతుంటారు పర్యాటకులు. ఇలాంటి ఎన్నో సాహసాలు చేస్తూ... లక్ష్యంవైపు పయనం సాగించేందుకు మరో రోజు పడుతుంది.
వీటన్నింటినీ దాటితే... నిలువెత్తుగా ఉండే... రొరైమా స్టార్టింగ్ పాయింట్‌ను చేరవచ్చు. అక్కడుండే బేస్ క్యాంప్‌లో కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడి వాతావరణం అద్భుతంగా ఉంటుంది. చుట్టూ మంచు మేఘాలు విస్తరించి ఉంటాయి. దట్టమైన అడవిని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. బేస్ క్యాంప్ నుంచీ మూడు కిలోమీటర్ల ఎత్తులో ఉండే పర్వతం పై భాగాన్ని చేరుకునేందుకు మరో మూడ్రోజులు పడుతుంది. చుట్టూ దట్టమైన అడవి, జోరుగా కురుస్తున్న వానలో ట్రెక్కింగ్ సాగుతుంది. అప్పుడు వేసే ప్రతీ అడుగూ ఓ సాహసమే. ఏమాత్రం పట్టుతప్పినా ప్రమాదమే. అనుక్షణం అలర్ట్‌గా ఉండాల్సిందే. ఆ పర్వతంపై మరో ప్రత్యేకత ఏంటంటే... అక్కడ రకరకాల రంగు రాళ్లు, క్రిస్టల్స్, అరుదైన మొక్కలు, ప్రాణులూ కనిపిస్తాయి. బాగున్నాయి కదా అని వాటిని ఇంటికి తీసుకెళ్లడానికి వీలుండదు. తిరుగు ప్రయాణంలో ఎవరి దగ్గర ఏయే వస్తువులున్నాయో అధికారులు చెకింగ్ చేశాకే... ఇళ్లకు పంపిస్తారు.
ఎన్నో కష్టాల్ని ఓర్చుకొని పర్వతం పైకి వెళ్తే... సరికొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అక్కడి నుంచీ జాలువారే జలపాతాన్ని పర్వతంపై నుంచీ చూడటం ఓ అద్భుతం. ఆ పర్వతం చాలా పెద్దది కాబట్టి... దాన్ని చూసేందుకు కనీసం రెండ్రోజులు పడుతుంది. అంత టైమ్ కేటాయిస్తే, భూలోక స్వర్గాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. అక్కడి మరో ప్రత్యేకత ఏంటంటే... పర్వతం మొత్తం తిరిగిన వాళ్లు వెనెజులాతోపాటూ... బ్రెజిల్, గయానా దేశాల్లోకి కూడా వెళ్లినట్లవుతుంది. మూడు దేశాల్లో ఈ పర్వతం విస్తరించి ఉన్నందువల్ల ఆయా ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. అందువల్ల పర్యాటకులు ఏ దేశ సరిహద్దులు దాటినా ఎలాంటి సమస్యలూ ఉండవు. పర్వతం ఎక్కేందుకు ఐదురోజులు పట్టినా... దిగేందుకు మాత్రం రెండ్రోజులే పడుతుంది.
ఓవరాల్‌గా ఈ ట్రిప్ కోసం కనీసం ఓ వారం కేటాయించాల్సి వస్తుంది. అంత టైమ్ లేదనుకునేవాళ్ల కోసం బ్రెజిల్ ప్రభుత్వం హెలీ టూరిజం తీసుకొచ్చింది. శాంటా ఎలెనా వరకూ వాహనాల్లో వెళ్లే టూరిస్టులు... అక్కడి నుంచీ చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కేస్తారు. గాలిలో తేలుతూ... ఆకాశం నుంచీ ఆ పర్వతాన్ని చూడటం మాటలకందని అనుభూతి. ఫ్లైట్‌లో పర్వతాన్ని చూసేందుకు కూడా రెండు గంటలు పడుతుంది. ముఖ్యంగా గాలిలో ఎగురుతూ జలపాతాన్ని చూడటం నయనానందమే. ఎంత ఆకాశం నుంచీ చూసినా... సాహసాలు చేస్తూ వెళ్లినప్పుడు కలిగే తృప్తి విమానంలోంచీ చూస్తే కలగదంటారు టూరిస్టులు. సాహసాలు చేయాలనుకునేవాళ్లుకు అంతకంటే బెస్ట్ ప్లేస్ ఏముంటుంది? అందుకే... అక్కడ నిరంతరం టూరిస్టుల సందడి కనిపిస్తూనే ఉంటుంది.
రొరైమా దగ్గర గ్రహాంతర వాసులు తిరుగుతున్నారా? వాళ్లే ఆ పర్వతాన్ని సృష్టించారా?:
పురాతన కోటల్లో దెయ్యాలుంటాయని ఎలాగైతే ప్రచారం జరుగుతుందో... పర్వత ప్రాంతాల్లో గ్రహాంతర వాసులు ఉన్నారనే ప్రచారం కూడా అలాగే సాగుతోంది. రొరైమా పర్వతం కూడా అందుకు మినహాయింపు కాలేదు. అక్కడి వింతలన్నింటికీ ఏలియన్సే కారణమని నమ్మేవాళ్లున్నారు. అందుకు కొన్ని సాక్ష్యాల్ని చూపిస్తున్నారు.
రొరైమా పర్వతం విపరీతంగా నచ్చేయడంతో... ఓ రచయిత... ది లోస్ట్ వరల్డ్ ( LOST WORLD ) అనే నవలను రాశాడు. అందులో హీరో... తన ప్రేయసిని వెతుక్కుంటూ... ఈ పర్వత ప్రాంతాల్లో రకరకాల సాహసాలు చేస్తాడు. చివరకు పర్వతం పైన ఆమెను చేరుకుంటాడు. అక్కడి నుంచీ ప్రపంచాన్ని చూస్తూ... స్వర్గపు అంచులకు వెళ్లిన ఆనందం పొందుతాడు. ఆ కథ ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. అందులో పర్వతం ఎక్కేందుకు హీరో ఏయే మార్గాల్లో వెళ్లాడో... అవే మార్గాల్ని ఇప్పుడు ట్రెక్కింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. లోస్ట్ వరల్డ్ నవలను చదివిన ఎంతోమంది... ఆ పర్వతం, ఎక్కేందుకు, చూసేందుకు వెళ్తుంటారు. ఏటా రొరైమాను చూసేందుకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. గ్రూపులుగా వచ్చేవాళ్లు... వారం పాటు... వేర్వేరు ప్రదేశాల్లో టెంట్లు వేసుకుంటూ... ప్రయాణం సాగిస్తున్నారు. అక్కడ సేఫ్‌గా వెళ్లడమే కష్టమనుకుంటే... ఆ కష్టంలోనూ... రకరకాల ఫీట్లు చేస్తూ... థ్రిల్ పొందుతారు కొందరు. కొంతమందైతే... ఏంజెల్ ఫాల్స్ దగ్గర రోప్ వాకింగ్ కూడా చేస్తుంటారు. ఈ టైట్ రోప్‌లో ఏడాదికి ఒకరిద్దరు తప్ప... చాలా మంది ఫెయిలవుతుంటారు. తమ ప్రయాణంలో ప్రతీ ఘట్టాన్నీ సెల్ఫీ వీడియోలు తీస్తూ... తమ అనుభవాల్ని పంచుకుంటున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. కొన్ని కొన్ని సెల్ఫీలు... ప్రాణాలకు తెగించి మరీ తీస్తున్నట్లు కనిపిస్తుంటాయి.
30 నుంచీ 50 కేజీల బరువు లగేజీ మోస్తూ... ఎత్తైన కొండల్నీ ఎక్కుతూ ముందుకు సాగడం కష్టమైన యాత్రే. కానీ చాలా మంది దాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకుంటారు. పర్వతం చెంతకు వెళ్లాక తిండీ తిప్పలూ తప్పవు. తమతో తెచ్చుకున్న ఆహారం మూడ్రోజులకే అయిపోతుంది. ఏ జంతువుల్నో చంపి తినాలనుకుంటే... అధికారులు ఊరుకోరు. కఠినమైన శిక్షలుంటాయి. అందువల్ల పర్యాటకులకు మిగతా నాలుగైదు రోజులూ ఒకరకంగా పస్తులు తప్పవు. అకులూ, అలములూ తిని బతకాల్సిందే.
ఈ ప్రాంతం మనకే కాదు... గ్రహాంతర వాసులకు కూడా చాలా ఇష్టమని ప్రచారం జరుగుతోంది. రొరైమా పక్క నుంచీ వెళ్లే.... ఎగిరే పళ్లాలని తాము చూశామని అప్పుడప్పుడూ పర్యాటకులు చెబుతుంటారు.
అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అన్నదే ఓ మిస్టరీ. ఒకవేళ ఉంటే... వాళ్లకు ఈ పర్వతంతో పనేంటన్నది మరో మిస్టరీ. పర్యాటకులు మాత్రం... పర్వతం దగ్గర ఎగిరే పళ్లాలను వీడియోల్లో రికార్డు చేసి మరీ చూపిస్తున్నారు. ఆ వీడియోల్లో దృశ్యాలు ఎంతవరకూ నిజమన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. జీవితంలో ఛాన్స్ ఉంటే... కచ్చితంగా వెళ్లి చూడాల్సిన ప్రదేశాల్లో రొరైమా కూడా ఒకటని అంటుంటారు పర్యాటకులు. వారం పాటూ కలిగే అనుభవాలు... జీవితాంతం గుర్తుండిపోతాయంటారు చాలా మంది. కొత్తగా పెళ్లై, సాహసాలు చేయాలనే అభిరుచి ఉండేవాళ్లకు... అదే బెస్ట్ స్పాట్ అన్నది ఎక్కువమంది చెప్పే మాట. అందుకు తగ్గట్టుగానే... అక్కడ చాలా జంటలు... కనిపిస్తుంటాయి.
ఇదీ అద్భుతమైన పర్వతం రొరైమా కథ. ప్రపంచ దేశాలన్నీ పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. దక్షిణ అమెరికా దేశాలు కూడా... ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితమిస్తున్నాయి. ఏటా లక్షలాది టూరిస్టులు రొరైమాను సందర్శిస్తున్నారు. తమ అనుభవాల్ని ఇంటర్నెట్ ద్వారా పంచుకుంటున్నారు. వీలైతే... మీరు కూడా అక్కడికి వెళ్లండి. మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చెయ్యండి అంటున్నారు.