27, జూన్ 2021, ఆదివారం

Niagara Falls: ప్రపంచంలోనే రెండో పెద్ద జలపాతం! నయగారాల నయాగరా!

నయాగరా జలపాతం (కెనడా వైపు నుంచి) (రాత్రివేళ)

Niagara Falls: ప్రపంచంలోనే రెండో పెద్ద జలపాతం నయాగరా అని మనకు తెలుసు. గుర్రపు నాడా ఆకారంలో ఉండే ఆ వాటర్‌ఫాల్స్ అందర్నీ ఆకర్షిస్తూ, ఏడాదంతా పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. ఆ జలపాతం విశేషాలేంటో, అక్కడి హైడ్రాలిక్ పవర్ జెనరేషన్ ఎలా సాగుతుందో తెలుసుకుందాం.

నయాగరా అంటే... జలపాతం మాత్రమే కాదు. దానికి 10 వేల ఏళ్ల చరిత్ర ఉంది. పర్యాటక రంగానికే కాక... ఆర్థిక, వాణిజ్య అవసరాలు కూడా తీర్చుతోంది. సముద్ర ప్రయాణాలకు కూడా... దారి చూపిస్తూ... ఎంతో మేలు చేస్తోంది నయాగరా.

పాల నురగలు, మంచు బిందువులు, జాలువారే సోయగాలు. ఉద్ధృత ప్రవాహాలతో... చూసినకొద్దీ చూడాలనిపించేలా... భలే ఉంటుంది నయాగరా జలపాతం. న్యూయార్క్, కెనడాలోని ఒంటారియో సరిహద్దు మధ్య నయాగరా నది (Niagara River)పై ఉన్న ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జలపాతం ఇది.



నయాగరా అంటే ఒక జలపాతం కాదు. మూడు జలపాతాల్ని కలిపి అలా పిలుస్తున్నారు. వాటిలో రెండు అమెరికా సరిహద్దులో ప్రవహిస్తున్నాయి. అవి అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వెయిల్ ఫాల్స్. మూడోది కెనడాలో ప్రవహిస్తున్న గుర్రపు నాడా జలపాతం (The Horse Shoe Falls). మూడు పేర్లు, మూడు ధారలూ ఉన్నా... మూడూ పక్కపక్కనే ప్రవహిస్తూ... ఒకటే జలపాతంలా కనిపిస్తాయి. 17వ శతాబ్దంలో ఇక్కడ "నయాగరేగా" అనే జాతి జనం నివసించేవాళ్లు. అందుకే దీన్ని నయాగరా ఫాల్స్ అని పిలుస్తున్నారు. నిట్టనిలువుగా ఉండే ఈ జలపాతం ఎత్తు 173 అడుగులు.

10 వేల ఏళ్ల కిందట... విస్కాన్సిన్ మంచు పర్వతాలపై మంచు దిబ్బలు కరగడంతో... అక్కడి నుంచీ... నీరు ప్రవాహంలా సాగుతూ... నయాగరా జలపాతం ఏర్పడింది. మొదట్లో... ఒకటే ప్రవాహంలా ఉండేది. భూమి కోతల వల్ల... దీని దశ, దిశలో మార్పులొచ్చాయి. జలపాతం నుంచీ జాలువారే ఈ నీరు... మరిన్ని చిన్న సరస్సులు ఏర్పడేందుకు జీవం పోస్తోంది. అవన్నీ... చివరకు పసిఫిక్ మహా సముద్రంలో కలుస్తున్నాయి.

మిగతా రోజుల్లో ఉద్ధృతంగా ప్రవహించే నయాగరా... శీతాకాలంలో మాత్రం గడ్డకట్టిపోతుంది. ముఖ్యంగా జనవరి రాగానే... మైనస్ ఉష్ణోగ్రతల వల్ల... ప్రవాహంలో ఐస్ గడ్డలు తేలుతుంటాయి. ఐతే... పూర్తిగా గడ్డకట్టిన సందర్భాలు తక్కువ. రికార్డుల ప్రకారం 1848లో నయాగరాలోని వేల క్యూబిక్ అడుగుల నీరు గడ్డకట్టింది (Niagara Freeze). ఫలితంగా భారీ ఐస్ గడ్డలు ఆనకట్టలుగా మారాయి.

1936లో రెండోసారి అత్యంత చల్లటి వాతావరణం ఏర్పడింది. అమెరికావైపు ఉండే రెండు జలపాతాలూ గడ్డకట్టాయి. 1911, 1912లో కూడా ఇలాంటి ప్రకృతి వింత కనిపించింది. అప్పట్లో జనం... గడ్డకట్టిన జలపాతంపై నడుస్తూ వెళ్లడం విశేషం. ఈమధ్య కాలంలో... 2015లో జలపాతం పూర్తిగా మంచుమయం అయ్యింది.

ఉదయం వేళ తళతళా మెరిసిపోయే నయాగరా... రాత్రివేళ... రంగురంగుల కాంతులతో ఇంద్రధనస్సును గుర్తుచేస్తుంది. కెనడావైపు ఏర్పాటుచేసిన ఫ్లడ్ లైట్ల కాంతులు జలపాతంపై పడుతుంటే... అద్భుత దృశ్యం ఆవిష్కృతమై.... చూపుతిప్పుకోనివ్వదు.

ఈ భారీ నయాగరాను దాటేందుకు... 1848లో ఇక్కడో వంతెన నిర్మించారు. దాన్ని చార్లెస్ ఎల్లెట్స్ నయాగరా బ్రిడ్జి అనేవారు. 1855లో పాత బ్రిడ్జి స్థానంలో... సస్పెన్షన్ బ్రిడ్జి (Suspension Bridge)ని కట్టారు. 1866లో రైళ్లు కూడా ప్రయాణించేలా... స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు.

1941లో నయాగరా జలపాతానికి దగ్గర్లో నిర్మించిన రెయిన్ బో (Rainbow Bridge) బ్రిడ్జ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ వంతెన ద్వారా... జనం... అమెరికా, కెనడా సరిహద్దులు దాటేందుకు వీలవుతోంది.

నయాగరా జలపాతం ప్రవాహంపై నౌకలను (Canal Ships) నడిపించేలా... 1950లో వెల్ లాండ్ కాలువను అభివృద్ధి చేశారు. ఈ కాలువ ద్వారా... సముద్రంలోకి వెళ్తున్న నౌకలు... సరుకుల్ని అమెరికా, కెనడాతో ఇతర దేశాలకు తరలిస్తున్నాయి.





అమెరికాలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాల్లో నయాగరాది ఎప్పుడూ టాప్ టెన్‌ ప్లేసే. జలపాతపు అందాల్ని అత్యంత దగ్గరగా చూసేందుకు... అమెరికా, కెనడా ప్రభుత్వాలు ఎన్నో సౌకర్యాలు కల్పించాయి. ఎన్నో సాహస క్రీడలకు కూడా... నయాగరా కేరాఫ్ అడ్రెస్ అవుతోంది.

19వ శతాబ్దం నుంచీ... పర్యాటక వినోదానికి ప్రకృతి గీసిన కాన్వాస్‌లా మారిపోయింది నయాగరా. ఎక్కువగా హనీమూన్ జంటల్ని ఆకర్షించే ఈ జలపాతాన్ని చూసేందుకు ప్రపంచ దేశాల నుంచీ ఏటా 3 కోట్ల మంది వస్తున్నారు. అమెరికా నుంచీ చూస్తే... ఇది... కొంచెం పక్క నుంచీ పడుతున్నట్లు కనిపిస్తుంది. అదే... కెనడాలో ఉన్నవారు చూస్తే మాత్రం... చక్కగా, ఎదురుగా ఉంటూ... శక్తిమంతమైన, హోరెత్తే ప్రవాహాలతో ఆహ్లాదభరితంగా ఉంటుంది.

జలపాతం చెంతకు వెళ్లాలనీ... ఆ ప్రవాహం, నీటి తుంపరల్లో తడిసి ముద్దవ్వాలని అందరికీ ఉంటుంది. క్రూయిజ్ బోట్లతో ఆ సౌకర్యం కల్పిస్తున్నాయి కెనడా, అమెరికా ప్రభుత్వాలు. 1846 నుంచీ ఈ బోట్లు... సేవలందిస్తున్నాయి. ఇది ప్రమాదకరమైన జర్నీ అయినా... తగిన జాగ్రత్తలు తీసుకుంటుండటం వల్ల... ఎంతో వినోదాన్ని అందిస్తోంది.

జలపాతపు హోరు గాలులు, జోరు చినుకుల్లో తడిసిపోవాలనుకుంటే... మరో మార్గం కూడా ఉంది. అదే... హరికేన్ డెక్. ఇక్కడ ఓ నిమిషం నిల్చుంటే చాలు... హిమాలయాల్లో ఉన్న ఫీల్ కలిగి తీరుతుంది. (

ఇక్కడి "వర్ల్‌పూల్ ఎయిరో కార్ కేబుల్ కార్" మరో ప్రత్యేకత. జలపాతం పైనుంచీ, సుడిగుండం మీదుగా... కేబుల్‌కార్‌లో వెళ్తుంటే... మాటలకందని అనుభూతి సొంతమవుతుంది. జాలువారే జలపాతాన్ని ఎయిరో కార్ (Aero Car) నుంచీ దగ్గరగా చూస్తే... నోట మాటలు రావు.

జలపాతానికి రెండువైపులా... రెండు పార్కులున్నాయి. అమెరికాలో నయాగరా స్టేట్ పార్క్ (State Park) ఉండగా... కెనడాలో... క్వీన్ విక్టోరియా ఆర్టిఫిషియల్ పార్క్ (Victoria Park) ఉంది. జలపాతపు హోరును కింద నుంచీ చూసేందుకు ఈ పార్కులు వీలు కల్పిస్తున్నాయి. ఒక్కసారి అక్కడకు వెళ్తే... వాటర్‌ఫాల్స్‌ మధ్యలో నిల్చున్న అనుభూతి కలిగితీరుతుంది.

కెనడావైపు రెండు క్యాసినో (Canada Casino)లు కూడా ఉన్నాయి. మన గోవాలో కంటే... అవి ఎక్కువ గేమ్స్, ఎక్కువ బెట్ ఆప్షన్స్‌తో ఆకట్టుకుంటున్నాయి.

పర్యాటకంగానే కాదు... సాహసాలకు కూడా నయాగరా కేరాఫ్ అయ్యింది. 1859లో జీన్ ఫ్రాంకోయిస్ బ్లోడిన్...... టైట్ రోప్ వాకింగ్‌ (Rope Walk)తో... నయాగరా జలపాతాన్ని విజయవంతంగా దాటాడు. ఆ తర్వాత చాలా మంది ఈ విన్యాసం చేశారు. పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. టైట్‌రోప్ వాకింగ్...... చేసేవాళ్లను షేక్ చేస్తూ... చూసేవాళ్లకు షాకిస్తుంది. అందువల్ల దాన్ని కళ్లారా చూసేందుకు అప్పట్లో జనం పెద్దసంఖ్యలో వచ్చేవాళ్లు.

రోప్‌వాక్‌లో సక్సెస్ కంటే... ఫెయిలే ఎక్కువగా ఉండటంతో... 1896లో ఈ విన్యాసాన్ని నిషేధించారు. ఐతే... 116 సంవత్సరాల తర్వాత... 2012లో నిక్ వాలెండా.... రెండు ప్రభుత్వాల అనుమతీ తీసుకుని ఈ విన్యాసం చేశాడు. విజయవంతంగా జలపాతాన్ని దాటాడు. ఆయన వాకింగ్ చేసిన టైట్ రోప్ పొడవు 1800 అడుగులు.

ఆమధ్య కెనడాలో కొత్తగా... మిస్ట్ రైడర్ (Mist Rider) జిప్‌లైన్‌ను ప్రవేశపెట్టారు. జలపాతం పక్కనే 2వేల 200 పొడవైన లైన్‌లో వెళ్తూ...... గాల్లో తేలుతూ... టూరిస్టులు... ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మిస్ట్ అంటే పొగమంచు... జిప్‌లైన్‌లో వెళ్తున్నప్పుడు పొగ మంచు అనుభూతి సొంతమవుతుంది.

అప్పుడప్పుడూ హాలీవుడ్ సినిమాల్లో కూడా ఈ జలపాతం హొయలొలికిస్తోంది. ఇక్కడ తరచూ షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి.

నది పక్కన "నయాగరా రిక్రియేషనల్ ట్రైల్" పేరుతో సైకిళ్లపై వెళ్తూ (Cycling ride) ఎంజాయ్ చేసేందుకు ఓ వినోద యాత్ర ఉంది. ఫోర్ట్ ఎర్రీ నుంచి ఫోర్ట్ గార్జ్ వరకు 35 కిలోమీటర్లు ఇది విస్తరించివుంది. ఈ దారిలో 1882లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన చారిత్రక దృశ్యాల్ని చూడొచ్చు.

వినోదంతోపాటూ... విషాదాలకూ ఈ వాటర్‌ఫాల్స్ కేంద్రమవుతోంది. జీవితంపై విరక్తి చెందిన చాలా మంది... ఇందులో దూకి సూసైడ్ చేసుకుంటున్నారు. పైగా... జలపాతం దగ్గర తరచూ పర్యాటకులు జారిపడే ప్రమాదాలు జరుగుతున్నాయి. అందువల్ల అధికారులు కొన్ని కండీషన్లు పెట్టారు. డేంజర్ జోన్లకు టూరిస్టులను వెళ్లనివ్వకుండా... జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే... ఫైన్లు కూడా వేస్తున్నారు.





Niagara Hydroelectric Power Plant: నయాగరా అత్యంత ఎక్కువ శక్తిని విడుదల చేస్తోంది. అందుకే... అక్కడో హైడ్రో పవర్ ప్రాజెక్టును నిర్మించారు. శతాబ్దాలుగా అది ఉత్పత్తి చేస్తున్న కరెంటు... అమెరికా, కెనడాలో... ఇళ్లు, పరిశ్రమలకు ఉపయోగపడుతోంది. ఆ భారీ ప్రాజెక్టు విశేషాల్ని తెలుసుకుందాం.

"నయాగరా ఉద్ధృతి చూశారుగా... ఎంత బలంగా ఉందో... క్షణాల్లో గ్యాలన్ల కొద్దీ నీరు... కిందికి దూసుకుపోతోంది. ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టును నిర్మిస్తే... బోల్డంత కరెంటు ఉత్పత్తి చెయ్యొచ్చు" అనుకున్నారు ఇంజినీర్లు. ఇలా మొదలైన ఆలోచనకు... 1759లో ప్రయత్నాలు తోడయ్యాయి. డేనియల్ జాన్‌కైరీ తన రంపపు మిల్లు అవసరాల కోసం... నయాగరా ప్రవాహంతో ఓ చిన్న కాలువను నిర్మించాడు. తన మిల్లు కోసం కావాల్సిన కరెంటును ఉత్పత్తి చేసుకున్నాడు. ఆ తర్వాత... ఆ ప్రాజెక్టు మరింత విస్తరించింది. 1881 నాటికి మరింత ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసింది. జలపాతం పక్కనే ఉన్న ఓ ఊరికి సరిపడా విద్యుత్ తయారైంది.

నికోలా టెల్సా.... త్రీ ఫేజ్ కరెంట్ పద్ధతిని కనిపెట్టి, ఇతర పద్ధతుల్లో కూడా కరెంటును ఉత్పత్తి చెయ్యడంతో... దూరప్రాంతాలకు కూడా కరెంటు సరఫరా సాధ్యమైంది. 1896లో... భూమి లోపల... లక్ష హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టును నిర్మించారు. ఫలితంగా... దాదాపు 50 కిలోమీటర్ల దాకా సరఫరాను పెంచారు. 1906లో కెనడా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కొనడంతో... ఇది మరింత విస్తరించింది. నదీ ప్రవాహంలో... 75 శాతాన్ని... సొరంగాల ద్వారా ప్రవహింపజేసి... జల విద్యుత్ ఉత్పత్తిని భారీగా చేపట్టారు. 115 ఏళ్లుగా.... అమెరికా, కెనడాలకు సరఫరా చేస్తున్నారు.

1961లో ఆధునిక టెక్నాలజీతో... నయాగరా జలవిద్యుత్ కేంద్రం ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రస్తుతం ఇది 2.4 గిగాబైట్ల కరెంటును ఉత్పత్తి చేస్తూ... న్యూయార్క్‌లో ఎక్కువ కరెంటు ఇస్తున్న ప్రాజెక్టుగా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సెకనుకు 3లక్షల 75వేల యు.ఎస్ గ్యాలన్ నీటిని నయాగరా నది నుంచి... పైపుల ద్వారా ల్యూవిస్టన్, రాబర్ట్ మోసెస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు మళ్ళిస్తున్నారు. అక్కడి హైడ్రాలిక్ టర్బైన్ల ద్వారా ప్రవహింపజేసి.... తయారుచేస్తున్న కరెంటును.... కెనడా, అమెరికాకు సరఫరా చేస్తున్నారు.

1950లో అమెరికా, కెనడా మధ్య ప్రత్యేకమైన ఒప్పందం ఒకటి కుదిరింది. దాని ప్రకారం... చలికాలంలో... నయాగరా గడ్డకట్టకుండా చేస్తారు. అది గడ్డకడితే... విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. అందుకే... ప్రభుత్వాలే... గడ్డకట్టకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఐతే... సహజ సిద్ధ ప్రకృతిలో జరుగుతున్న పరిణామాల్ని ఆపడం అధికారుల వల్ల కావట్లేదు. ఏటా జనవరి, ఫిబ్రవరిలో... జలపాతం గడ్డకడుతూ... విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలుగుతూనే ఉంది.

ప్రస్తుతం నయగరా నదిపై అత్యంత శక్తివంతమైన జలవిద్యుత్ కేంద్రాలు కెనడాలోని సర్ ఆడమ్ బెక్ 1 అండ్ 2, రాబర్ట్ మోసెస్ నయగరా పవర్ ప్లాంట్... అలాగే... అమెరికా వైపు ఉన్న లెవిస్టన్ పంప్ జనరేటింగ్ ప్లాంట్. వీటి ద్వారా... కావాల్సినంత పవర్‌ను జనరేట్ చేస్తున్నారు. ఇలా వినోదం, ఆహ్లాదం పంచుతూ, ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్న నయాగరా... భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగవుతుందంటే నమ్మగలరా? కానీ ఇది జరుగుతుంది. ఐతే... ఇప్పుడే కాదు. అందుకు మరో 50 వేల ఏళ్లు పడుతుంది. పైనుంచీ నీటిలో వస్తున్న ఉప్పు, రాతిపొడి... జలపాతం నుంచీ కిందికి జారి... నయాగరా నదిలో ఉండిపోతోంది. ఏటా నదిలో పూడిక పెరిగిపోతోంది. అందువల్ల 50వేల ఏళ్ల తర్వాత నయాగరా నది లోతు పూర్తిగా తగ్గిపోయి... నీటి ప్రవాహం చెదిరిపోతుందంటున్నారు శాస్త్రవేత్తలు.

ఇవీ నయాగరా జలపాత విశేషాలు. దీన్ని చూసేందుకు ఏడాదిలో ఎప్పుడైనా వెళ్లి రావచ్చు. మామూలు కాలాల్లో జలధారతో ఆకట్టుకునే నయాగరా.... వింటర్‌లో వెళ్తే మాత్రం... మంచు ప్రపంచంలా కనిపిస్తుంది. వీలైతే ప్లాన్ చేసుకోండి అంటున్నాయి అమెరికా, కెనడా ప్రభుత్వాలు.