అమెజాన్ నది (image credit - Wikipedia) |
Amazon River: మానవ చరిత్రకు పునాదులు వేసింది నదులే. ప్రపంచంలోని ఏ నాగరికతలు తీసుకున్నా... నదులతో వాటికి విడదీయరాని సంబంధం ఉంటుంది. నదీ పరీవాహక ప్రాంతాలన్నీ, ప్రకృతి వరాలతో సస్యశ్యామలం అవుతుంటాయి. అలాంటి వాటిలో ఎన్నో విశిష్టతలతో, విశేషంగా ఆకట్టుకుంటోంది అమెజాన్. ప్రపంచంలోని అతి పెద్ద నది అయిన అమెజాన్‌కి మనం ఎంతో రుణపడి ఉన్నాం. మానవాళి మనుగడకు ఆ నది ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తోంది. అవేంటో, అక్కడి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకాశం నుంచీ చూస్తే... అనకొండలా ఉంటుంది. దగ్గరకు వెళ్తే గంభీరంగా కనిపిస్తుంది. ఉద్ధృతంగా ప్రవహించే అమెజాన్‌లో ఎన్నో వింతలు. ఒకరకంగా చెప్పాలంటే అదో అద్భుత హరితారణ్య ప్రపంచం. పరిశోధకులకు సైతం అంతుబట్టని రహస్యాల సమాహారం.
ఎన్నో వంపులు, వయ్యారాలు. అడుగడుగునా నదీ సంగమాలు. స్వచ్ఛమైన జల ప్రవాహాలు. దట్టమైన హరితారణ్యాలు. ప్రకృతి సీమలో అరవిరిసిన అందాలు. అరుదైన వన్య ప్రాణుల నిలయం. దక్షిణ అమెరికాలో అద్భుత ప్రపంచం. అమెజాన్.......... డ్రోన్ కెమెరాలకు కూడా అందనంత పెద్ద నది. ఇది ఎంత పెద్దదంటే... దీని తర్వాత పెద్దవైన ఏడు నదులన్నీ కలిపినా... అంత కంటే ఎక్కువ నీరు అమెజాన్‌లో ప్రవహిస్తోంది.
దక్షిణ అమెరికాలో అమెజాన్ నది మ్యాప్ (image credit - wikipedia) |
6వేల 400 కిలోమీటర్లు ప్రవహిస్తూ... ఆఫ్రికాలోని నైలూ తర్వాత అతి పొడవైన నదిగా రికార్డు సృష్టించింది అమెజాన్. దక్షిణ అమెరికాలోని పెరూ, కొలంబియా, బ్రెజిల్, ఈక్వెడార్, బొలీవియా, వెనిజులా, ఫ్రెంచ్ గయానా దేశాల్లో ప్రవహిస్తోంది ఈ జీవ నది.
అమెజాన్ అంటేనే అద్భుతాల నిలయం. దక్షిణ అమెరికాలోని 30 శాతం ప్రాంతాల్లో ఈ నది విస్తరించింది. ఇది ఇంత పెద్దగా ఉన్నా... దీనిపై ఎక్కడా వంతెనల వంటివి నిర్మించలేదు. ఎందుకంటే ఎక్కువగా ఈ నది అడవుల్లోనే ప్రవహిస్తోంది.
చూడచక్కటి దృశ్యాల్ని ఆవిష్కరించే అమెజాన్... ఆండీస్ పర్వత శ్రేణిలోని మిస్మీ పర్వతం నుంచి ఆవిర్భవించింది. ప్రారంభంలోనే ఇది 250 కిలోమీటర్ల ముఖద్వారంతో మొదలవుతుంది. మధ్యలో పెరూలోని ఎప్యూరిమాక్ నదీ ప్రవాహాన్ని కలుపుకొని... ఇది మరింత పెద్దదవుతుంది. ఎప్యూరిమాక్‌తోపాటూ... మరో 13 నదుల సంగమంతో... అమెజాన్ అత్యంత పెద్ద నదిగా అవతరించింది. వీటితోపాటు 11 వందల చిన్న చిన్న పాయలు ఈ నదిలో కలుస్తున్నాయి. ఆండీస్ పర్వతాల హిమ ప్రవాహాలు... అమెజాన్‌ను సజీవంగా ఉంచుతున్నాయి. కొన్ని చోట్ల గంభీరంగా, కొన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ప్రవహించే అమెజాన్ లోతు చాలా ఎక్కువ. కొన్నిచోట్ల అత్యధికంగా 330 అడుగుల లోతు ఉంటుంది.
కోటి సంవత్సరాల కిందటే పుట్టిన అమెజాన్.... పరీవాహక ప్రాంతం ఆస్ట్రేలియా ఖండమంత విశాలమైనది. దక్షిణ అమెరికాలో 40 శాతం భూభాగం దీనిదే. దాదాపు 70లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. అక్కడి వ్యవసాయానికి ఈ నదే జీవనాధారం. అమెజాన్ చుట్టూ 55 లక్షల చదరపు కిలోమీటర్లలో దట్టమైన అడవులున్నాయి. ఫలితంగా ఈ నది ప్రత్యక్షంగా మూడున్నర కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తోంది.
అనంతమైన జీవరాసులకు ఆవాసం అమెజాన్ పరీవాహక ప్రాంతం. ఇక్కడున్నంత దట్టమైన అడవులు ప్రపంచంలో మరెక్కడా లేవు. భూమిపై ఉన్న మొత్తం జీవరాసుల్లో 33 శాతం ఈ రెయిన్ ఫారెస్ట్‌లోనే ఉన్నాయి. ఇతర దేశాల్లోని అడవుల్లో కంటే ఎక్కువ జీవ వైవిధ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. ప్రపంచంలోని పది శాతం ప్రాణులు అమెజాన్ అడవుల్లో ఉన్నాయి. ప్రపంచంలోని 20 శాతం పక్షి జాతులకు ఈ అడవులే ఆధారం. దాదాపు 25 లక్షల కీటక జాతులు ఇక్కడున్నాయి. 40 వేల రకాల జాతుల మొక్కలు, చెట్లున్నాయి.
అమెజాన్‌లో మాత్రమే కనిపించే ఓ చెట్టు సొక్రాటీ ఎగ్జోరిజా (Socratea exorrhiza). దీని ప్రత్యేకతేంటంటే... ఇది మెల్లగా నడుస్తూ వెళ్తుంది. ఈ చెట్టు వేర్లు భూమిలో కాకుండా... చెట్టు మొదట్లో ఉంటాయి. అవి వెలుతురు వున్న వైపు పెరుగుతూ... అక్కడి భూమిలోకి చొచ్చుకెళ్తాయి. తిరిగి కొత్త వేర్లు పుట్టగానే... పాత వేర్లు చెనిపోతాయి. అలా ఈ చెట్టు నీడలోంచీ ఎండలోకి నడుస్తుందన్న మాట. ఇలా రోజుకి రెండు మూడు సెంటీమీటర్లు కదులుతుంది ఈ వాకింగ్ పామ్.
అమెజాన్‌లో రకరకాల ఔషధ మొక్కలున్నాయి. వాటిలో ఇప్పటివరకూ ఒక శాతాన్ని మాత్రమే మందుల తయారీకి వాడుతున్నారు. కేన్సర్‌ను నిర్మూలించే రకరకాల మొక్కలకు అమెజాన్ రెయిన్ ఫారెస్టే కేంద్రం.
మన దగ్గర గోదావరి నీరు... బంగాళాఖాతంలో కలుస్తున్నట్లు... అమెజాన్ నుంచీ ఏటా కొన్ని వేల క్యూబిక్ కిలోమీటర్ల నీరు వృథాగా అట్లాంటిక్ మహా సముద్రంలో కలిసిపోతోంది. నదులను అనుసంధానం చేయాలనే ఆలోచనలేవీ లేని దక్షిణ అమెరికా ప్రభుత్వాలు... అమెజాన్ నీటిని అలాగే వదిలేస్తున్నాయి.
అమెజాన్ లాగే... అక్కడి అనకొండలు కూడా చాలా పెద్దవి. అవే కాదు... అరుదైన డాల్ఫిన్లకూ, భయంకరమైన చేపలకూ అమెజాన్ పుట్టిల్లు. అందుకే ఆ నదిలో బోట్ షికారు చేయడం, అక్కడి అడవుల్లో తిరగడం ఓ సాహసమే. అమెజాన్ జీవ వైవిధ్యం... వైవిధ్యమే.
అమెజాన్ లో గ్రీన్ అనకొండ (image credit - wikipedia) |
అమెజాన్ అనగానే టక్కున గుర్తొచ్చేవి అనకొండలే. ప్రపంచంలోనే అతి పెద్ద సర్ప జాతులైన అనకొండలు ఈ నదిలోనే ఉంటాయి. నెమ్మదిగా కదిలే అనకొండలు... ఏడాదిలో ఎక్కువ సేపు నీటిలోనే గడిపేస్తాయి. విషం లేని అనకొండలు మనుషుల్ని తిన్న సందర్భాలు తక్కువే. ఐతే, టూరిస్టులపై అనకొండల దాడులు మాత్రం అప్పుడప్పుడూ జరుగుతున్నాయి. ప్రధానంగా అనకొండలు... నది దగ్గరకు వచ్చే గొర్రెలు, ఒట్టర్లు ఇతర జంతువులు, పక్షులపై దాడి చేసి, గుటుక్కుమనిపిస్తాయి. జెయింట్ ఒట్టర్లు ఈ నదిలోనే గూళ్లు కట్టుకొని జీవిస్తుంటాయి. స్థానికులు తరచుగా వేటాడుతుండటంతో... వీటి సంఖ్య ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతోంది.
అమెజాన్‌లో 5 వేల రకాల చేపలున్నాయి. ఏటా కొత్త కొత్త జాతుల్ని గుర్తిస్తూనే ఉన్నారు. చేపలతోపాటూ పీతలు, తాబేళ్లు, ఆల్గే వంటివి కూడా ఉన్నాయి. మనుషులు ఎప్పుడు దొరుకుతారా దాడి చేసి తిందామని చూసే పిరానా చేపలు (piranha fish) ఈ నదిలో తిరుగుతుంటాయి. ఏవైనా చేపలు గుంపుగా వెళ్తున్నాయంటే... అవి పిరానాలు కావచ్చు. ఎందుకంటే అవి గుంపులుగానే తిరుగుతాయి. పిరానాలకు చిక్కితే క్షణాల్లో మీల్స్ అయిపోయినట్లే. ముఖ్యంగా నల్లటి పిరానాలు అత్యంత ప్రమాదకరమైనవి. వీటి పళ్లు చాలా గట్టిగా, పదునుగా ఉంటాయి. స్థానికంగా వీటిని అమెజాన్ దెయ్యాలని అంటారు.
పిరానాలతోపాటు.... దాదాపు 8 అడుగుల పొడవు పెరిగే ఈల్ చేపలు (Amazon Eels) కూడా ఇక్కడ కనిపిస్తాయి. 20 కేజీలకు పైగా బరువుండే ఈల్.... దాదాపు 900 వోల్డుల కరెంటును ఉత్పత్తి చేయగలదు. దాన్ని పట్టుకుంటే షాకే. చూడ్డానికి పాములా ఉండే ఈల్ చేపల్ని వల వేసి పట్టుకోవడం ఓ సవాలే. ఇవి తిరిగే ప్రాంతాల్లో నీటిలోకి దిగవద్దని సైన్ బోర్డులుంటాయి.
అమెజాన్‌లో మరో ప్రత్యేకమైన చేప... "సీ కౌ" (Sea Cow Fish). ఎద్దు తలను పోలినట్లుండే ఈ చేపలు... నది ఉత్తర మార్గంలో ఉంటాయి. ప్రస్తుతం ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అమెజాన్‌కి మరో ప్రత్యేకత ఇక్కడ కనిపించే రివర్ డాల్ఫిన్స్. నదుల్లో తిరిగే డాల్ఫిన్లలో ఇవే అతి పెద్దవి. ఒక్కోటీ 6 నుంచీ 8 అడుగులు పెరుగుతాయి. చిన్నప్పుడు నల్లగా ఉండే ఇవి... పెద్దవయ్యాక... రోజ్ కలర్‌లోకి మారతాయి. అందుకే వీటిని పింక్ డాల్ఫిన్స్ అని పిలుస్తారు. ఈ డాల్ఫిన్లను స్థానిక గిరిజనులు బోటో అంటారు. ఈ పేరు పెట్టడానికి ఓ కథ ప్రచారంలో ఉంది. పూర్వం బ్రెజిల్‌లో ఓ డాల్ఫిన్... మనిషిలా మారేదట. నది పక్కన తిరిగే అమ్మాయిలను ఎత్తుకుపోయేదట. దాన్ని బోటో అని పిలిచేవాళ్లు. అదే పేరుతో ఈ డాల్ఫిన్లు ఫేమస్ అయ్యాయి. డాల్ఫిన్లతోపాటూ మొసళ్లు, రకరకాల తాబేళ్లు, ఇతరత్రా జంతువులు, అరుదైన పక్షుల్ని ఈ నదీ పరీవాహక ప్రాంతాల్లో చూడొచ్చు.
భూమిపై ఆది మానవులు అంతరించి, శతాబ్దాలు గడిచినా... ఇప్పటికీ అలాంటి సంస్కృతులు అమెజాన్ అడవుల్లో కనిపిస్తాయి. బళ్లాలు, బాణాలతో వేటాడే గిరిజనులు అక్కడి అడవుల్లో ఉంటున్నారు. వారి జీవనశైలిని ఓసారి స్పృశిద్దాం. అమెజాన్ గురించి చెప్పుకునేటప్పుడు ఇక్కడి తెగల గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ దాదాపు 4 వందల రకాల తెగలున్నాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో భాష. ఎవరి సంప్రదాయాలు వాళ్లవే.
10 లక్షల మంది దాకా ఉండే గిరిజనుల్లో చాలా మంది ఎవరితోనూ కలవరు. ఒక తెగకూ, మరో తెగకూ పడదు. ఎవరి ప్రపంచం వాళ్లదే, ఎవరి అలవాట్లూ, ఆచారాలూ వాళ్లవే. చిన్నప్పటి నుంచీ అడవిలోనే పెరిగే వీళ్లకు వేటాడటం బాగా వచ్చు. విలువిద్యలో రాటుదేలిన వాళ్లను అమెజోనాస్ (Amazonas) అంటారు. నిజానికి వాళ్ల పేరునే ఆ నదికి పెట్టారు.
అమెజాన్ పైనే ఆధారపడి జీవించే ఈ పేదలకు... బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. నదిలో చేపలు, అడవిలో ఆకులూ, అలములూ తింటూ బతికేస్తున్నారు. కొంతమంది మాత్రం స్వచ్ఛంద సంస్థల చొరవతో... అరటి, కోకో, పళ్లు, కూరగాయల పంటలు పండిస్తున్నారు. అడవి తల్లి ఒడిలో సేదతీరే అమెజోనాస్‌కు 21వ శతాబ్దంలో కొత్త కష్టం వచ్చిపడింది. కబ్జాదారుల అడవుల ఆక్రమణ వీళ్ల ప్రాణాలపైకి తెస్తోంది. కలప దొంగలు వీళ్లను టార్గెట్ చేసి, చంపేస్తున్నారు. వింత వింత వ్యాధుల్ని వ్యాపింపజేసి, ఈ జాతులు అంతరించిపోయేలా చేస్తున్నారు. తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలియని ఈ అమాయకులు... పుడమితల్లి ఒడిలోనే ప్రాణాలు విడుస్తున్నారు. అవతార్ సినిమా తరహాలో జాతుల హననం జరుగుతోంది ఇక్కడ.
మన దేశంలోలాగా భూములపై ఈ పేదలకు హక్కులు లేవు. ఫలితంగా వీళ్లను తరిమేస్తున్నారు అక్కడి అవినీతి రాజకీయ, పారిశ్రామిక పెద్దలు. గ్యాస్ తవ్వకాలు, రోడ్లు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలు ఈ జాతులకు శాపంగా మారుతున్నాయి. బలవంతంగా భూముల్ని లాక్కొంటుంటే... ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆకాశం వైపు చూసేవాళ్లు ఇక్కడ లక్షల్లో ఉన్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు... ఈ తెగల రక్షణ కోసం ప్రయత్నిస్తున్నాయి. వీళ్లకు వైద్య సదుపాయాలు కల్పిస్తూ, చదువు చెప్పిస్తున్నాయి. గిరిజనులే కాదు... అమెజాన్ కూడా చిక్కుల్లో పడుతోంది. వేగంగా కాలుష్యమవుతోంది. బాక్సైట్, ఇనుము, నికెల్, బంగారం కోసం ఇక్కడ పెద్ద ఎత్తున గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. అవి నదీ పరీవాహక ప్రాంతాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి.
అడవుల నరికివేత మరో పెద్ద సమస్య. ఏకంగా 7 దేశాల్లో చెట్లను నరికేస్తున్నారు. రోజూ వేల టన్నుల్లో కలప తరలిపోతోంది. పర్యావరణ రక్షణ చట్టాలైతే ఉన్నాయి గానీ... వాటి అమలు అంతంతమాత్రమే. పదేళ్లుగా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. అయినా ఫలితాలు కనిపించట్లేదు. అక్రమార్కుల అత్యాశ వల్ల స్వచ్ఛమైన అమెజాన్ నీరు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. భూమిపై మిగతా ప్రాంతాలు నాశనమవుతున్నట్లే... అమెజాన్ కూడా... దురాశాపరుల చేతుల్లో చిక్కి శల్యమవుతోంది.
అమెజాన్‌కు ఏ చిన్న నష్టం జరిగినా... అది భూమిపై ఉన్న మనందరిపైనా ప్రభావం చూపుతుంది. అక్కడి రెయిన్ ఫారెస్ట్‌లో అడవులు అంతరించిపోతే... భూమి ప్రమాదంలో పడినట్లే. అమెజాన్ అడవుల వల్లే... ఈ భూమిపై వేడి 5 డిగ్రీలు తక్కువగా ఉంటోంది. ఇక్కడి చెట్లు... భూమిపై ఉన్న కార్బన్ డై ఆక్సైడ్‌తోపాటూ, మోనాక్సైడ్ వంటి విష వాయువుల్ని పెద్ద మొత్తంలో పీల్చుకుంటూ... మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. ప్రకృతి మనకు ఇచ్చిన వరం అమెజాన్. కరిగిపోతున్న కొవ్వొత్తిలా అమెజాన్... ప్రపంచానికి ఎంతో మేలు చేస్తోంది. దక్షిణ అమెరికా దేశాల పర్యాటక రంగానికి ఆ నది కోట్ల డాలర్లు కురిపిస్తోంది. ప్రపంచ టూరిస్టులకు మర్చిపోలేని అనుభవాల్ని మిగుల్చుతోంది.
ప్రపంచ దేశాలన్నీ కాంక్రీట్ జంగళ్లుగా మారుతున్నాయి. కాస్త ప్రశాంతంగా ఉండే ప్రదేశం ఎక్కడుందా అని వెతుక్కుంటున్న పర్యాటకులకు అమెజాన్ స్వర్గధామం. ఏటా ఆక్కడకు లక్షల మంది క్యూ కడుతున్నారు. నదిలో ప్రయాణిస్తూ, అడవుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. టూరిస్టుల కోసం బ్రెజిల్ సహా అమెజాన్ పరీవాహక దేశాలు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నాయి. దట్టమైన అడవుల్లో బోట్లలో ప్రయాణించడం మాటలకందని ఆనందమే కదా. ప్రపంచంలో ఉన్న బెస్ట్ కెమెరాలన్నింటికీ పనిచెప్పగల అద్భుత దృశ్యాలకు నిలయం అమెజాన్. ప్రకృతి ప్రేమికులకు ఇక్కడ దొరికేంత ఆహ్లాదం ఇంకెక్కడా దొరకదు.
15, 20 కేజీల చేపల్ని పట్టడం, అనకొండలతో ఆడుకోవడం వంటివి రాకపోయినా పర్వాలేదు. వాటిని నేర్పేందుకు ఇక్కడ ప్రత్యేక గైడ్లు ఉంటారు. వాళ్లతో పడవల్లో వెళ్తే చాలు... గ్రీన్ వరల్డ్‌ను కళ్ల ముందు నిలుపుతారు. కొంతమంది విదేశీయులైతే... ప్రత్యేకించి చేపలు పట్టేందుకే అమెజాన్‌కు వెళ్తుంటారు. తెలివిగా ఎరవేసి భారీ చేపల్ని ఇట్టే పట్టేస్తారు. అమెజాన్ ముఖద్వారం దగ్గర... నెల్లో రెండుసార్లు భారీ ఎత్తున అలలు వస్తాయి. అవి ప్రమాదకరమైనవని తెలిసినా... కొందరు సర్ఫర్లు మాత్రం వాటితో పోటీ పడతారు.
ఇదీ అద్భుతాల అమెజాన్ కథ. మానవుల వల్ల ఎంత హాని జరుగుతున్నా... ఆ నది, అక్కడి అడవులు... సమస్త ప్రపంచానికి మేలే చేస్తున్నాయి. వృక్షో రక్షతి రక్షితః. మొక్కల్ని పెంచడం వల్ల ఎంత లాభమో మనందరికీ తెలుసు. ఆక్సిజన్ లేకుండా క్షణం కూడా బతకలేని మనకు ప్రాణ వాయువుని ఇస్తున్నది అడవులే. అమెజాన్ లాంటి జీవ నదులు, వాటి పరీవాహక ప్రాంతాల్ని కాపాడేందుకు ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాలి. అడవుల నరికివేతకు పాల్పడవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే రేపటి తరాలకు సస్యశ్యామల ప్రపంచాన్ని అందించగలం.