26, జూన్ 2021, శనివారం

Savanna: పర్వతాలపై వాన, ఎడారిని సస్యశ్యామలం చేస్తోందా? ఆ సహజసిద్ధ వింత ప్రదేశం ఎక్కడుంది? ఆశల డెల్టా ఆకవాంగో!

ఆకవాంగో డెల్టాలో చిరుత (Image credit - Wikipedia)

Savanna: పర్వతాలపై వాన, ఎడారిని సస్యశ్యామలం చేస్తోందా? ఆ సహజసిద్ధ వింత ప్రదేశం ఎక్కడుంది? ఆశల డెల్టా ఆకవాంగో!

ఆఫ్రికా ఖండం అంటేనే ఎన్నో వింతలు, విశేషాలు. అలాంటి చోట ఓ చిత్రమైన డెల్టా సంగతుల్ని తెలుసుకుందాం. ఎక్కడో పర్వతాలపై కురిసే వర్షం... ఓ పది నెలల పాటూ... ఎడారిని సస్యశ్యామలం చేస్తుంది. వన్య ప్రాణులకు ప్రాణం పోస్తుంది. ఆ టైమ్‌లో అక్కడి పర్యావరణ మార్పులూ, ప్రకృతి విశేషాల్ని తెలుసుకొని తీరాల్సిందే.

కలహారీ ఎడారి (Kalahari Desert)... ఆఫ్రికాలోని పెద్ద ఎడారుల్లో అదీ ఒకటి. ఓ నదిని తనలో దాచుకొని... వన్యప్రాణులు, పక్షులతోపాటూ... మానవాళికీ ఎంతో మేలు చేస్తోంది. బీడువారిన నేలకు ప్రాణం ఎలా వస్తుందో, అది పసు-పక్ష్యాదులకు ఊపిరి ఎలా పోస్తుందో తెలుసుకుందాం.

చూడచక్కని పచ్చిక బయళ్లు, విశాల సమతల మైదానాలు, అరవిరిసిన అందాల ప్రకృతి, వన్యప్రాణుల విహారి, ప్రాణికోటి జీవనవాహిని... అదే... ఆకవాంగో డెల్టా (Okavango delta).

ఆఫ్రికా... బోట్స్‌వానా (Botswana) దేశంలో... తన ప్రత్యేకతను చాటుకుంటూ... యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది... ఆకవాంగో డెల్టా.

ఇక్కడ గడ్డి తినే సాధు జంతువులుంటాయి... వేటాడే వన్యమృగాలూ ఉంటాయి. అడవిలో వేటి పోరాటం వాటిదే... వేటి జీవనం వాటిదే. దేనికీ రక్షణ ఉండదు. ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు.

ఆఫ్రికా అంటేనే... ఎడారి ఖండం. అలాంటి చోట... ఆకవాంగో డెల్టా... సతత హరితంగా కళకళలాడటానికి కారణం... దక్షిణ ఆఫ్రికాలో పొడవైన నదుల్లో ఒకటైన ఆకవాంగో. కలహారీ ఎడారిలో ప్రవహించే ఈ నది... అంతరిక్షం నుంచీ చూస్తే... ఓ భారీ చెయ్యి ఆకారంలో కనిపిస్తుంది.

ఇసుకపై గలగలా పారే ఆకవాంగో నదీ జలాలు అత్యంత స్వచ్ఛంగా, పరిశుద్ధంగా ఉంటాయి. ఇవి ఇక్కడి ఎడారి వాతావరణాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి.

ప్రతీ సంవత్సరం... జనవరి, ఫిబ్రవరిలో అంగోలా పర్వతాలపై కుండపోత వర్షం కురుస్తుంది. ఆ నీరు... 12 వందల కిలోమీటర్లు దక్షిణానికి ప్రవహిస్తుంది. అది క్రమంగా... డెల్టాలోని 250 కిలోమీటర్లు విస్తరిస్తుంది. ఇందుకు దాదాపు నెల పడుతుంది. ఆ తర్వాత కొన్ని నెలలపాటూ... ఈ నీరు ఇలాగే ఉంటుంది.

నీరు రాగానే... కలహారీ ఎడారిలో ఎక్కడెక్కడో ఉన్న జంతువులు, ప్రాణులు... ఇక్కడకు క్యూ కడతాయి. రంగురంగుల వలస పక్షుల రాకతో... ఈ డెల్టా... సందడిగా మారిపోతుంది.

మన దేశంలో నదులు సముద్రంలో కలుస్తాయి కదా... ఈ నదిలో నీరు... మార్చిలో డెల్టా మైదానాన్ని చేరిన తర్వాత... డిసెంబర్‌లో ఆవిరైపోతుంది. అందువల్ల ఇది ఏ సముద్రంలోనూ కలవదు. అందుకే ఆఫ్రికాలోని ఏడు సహజసిద్ధ ప్రకృతి వింతల్లో... ఆకవాంగో డెల్టా కూడా ప్లేస్ దక్కించుకుంది.

15వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆకవాంగో డెల్టా... బోట్స్‌వానాకు అతి పెద్ద ఒయాసిస్సులా పనిచేస్తోంది. ఇదే లేకపోతే... కలహారీ ఎడారి... కరువు దిబ్బలా మారేది. లక్షల మంది జనానికీ, ప్రాణులకూ... జీవనాధారం లేకుండాపోయేది.



డిసెంబర్ నుంచి 3 నెలల నరకం:
ఈ ప్రకృతికి ఆకవాంగో డెల్టా చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు. అంతరించిపోతున్న ఎన్నో జంతువులకు ఇది ప్రాణం పోస్తోంది. అరుదైన జాతులకు జీవనాధారంగా నిలుస్తోంది. ఐతే... డిసెంబర్ రాగానే... డెల్టా... నిప్పుల కొలిమిలా మారుతుంది. ఎందుకు? ఆ టైమ్‌లో ప్రాణులు ఏం చేస్తాయి? తెలుసుకుందాం.

వన్యప్రాణులకు, పక్షులకు... ఆకవాంగో డెల్టా... ఓ సీజనల్ హోమ్‌. ఆఫ్రికా ఏనుగులు, అడవి దున్నలు, నీటి ఏనుగులు, లెచ్యూలు, జిరాఫీలు, సింహాలు, చిరుతలు, హైనాలు, మొసళ్లు, యాంటెలోప్స్, ఖడ్గమృగాలు, జీబ్రాలు, కోతులు... ఇలా ఎన్నో రకాల వన్య ప్రాణులకు... కేరాఫ్ అడ్రస్ ఆకవాంగో డెల్టా.

నీటి జాడను వెతుక్కుంటూ... ఈ జంతువులన్నీ ఎక్కడెక్కడి నుంచో... ఇక్కడకు గుంపులు, గుంపులుగా వచ్చేస్తాయి. స్వచ్ఛమైన నదీ జలాల్లో సేద తీరుతూ... పచ్చిక బయళ్లలో సంచరిస్తాయి.

ఈ ఆటవిక రాజ్యంలో... బలమున్న ప్రాణిదే పైచేయి... జింకల్ని అడవి కుక్కలో, పులులో చంపుతుంటే... వాటిని పట్టుకునేందుకు నీటిలో మొసళ్లు ఆవురావురుమంటూ ఎదురుచూస్తాయి.

జంతువులే కాదు... 400 రకాల పక్షులకు కూడా ఈ డెల్టా ఆవాసం కల్పిస్తోంది. అత్యంత అరుదైన గద్దలు, గుడ్లగూబలు, క్రెస్టెడ్ కొంగలు, హామ్మర్ కాప్, ఆస్ట్రిచ్, హోలీ ఐబిస్ లాంటి నీటి పక్షులు సీజన్‌లో కనిపిస్తాయి. ఇవి చేపలూ, కప్పలు, పురుగుల్ని తింటూ... ఇక్కడే కాలనీలు నిర్మించుకుంటాయి, గూళ్లు కడతాయి... గుడ్లు పెట్టి... సంతానాన్ని వృద్ధి చేస్తాయి.

71 రకాల జాతుల చేపలకు ఈ డెల్టాయే ప్రాణాధారం. ఆకవాంగో నదిలో కనిపించే చేపలే.... ఆఫ్రికాలోని మరో నది... జాంబెజీలో కూడా కనిపిస్తాయి. దీన్నిబట్టీ... ఈ రెండు నదులకూ... చరిత్రలో లింక్ ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఏప్రిల్ నుంచీ... ఆగస్టు వరకూ... ఈ డెల్టా... కళకళలాడుతుంది. సెప్టెంబర్‌లో శీతాకాలం వచ్చేస్తుంది. టెంపరేచర్లు అమాంతం తగ్గిపోతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు... దాదాపు జీరో డిగ్రీలకు పడిపోతాయి.

నవంబర్‌లో వేడి పెరుగుతుంది. 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరి, పచ్చదనం తగ్గిపోతుంది. జింకల్లాంటి గడ్డి తినే సాధు జంతువులకు... ఇది గడ్డుకాలమే.

డిసెంబర్‌లో ఆకవాంగో నీరు దాదాపు ఆవిరవుతుంది. డ్రై సీజన్ వచ్చేస్తుంది. అప్పటివరకూ నీటిలో తిరుగుతూ, నీటిలోనే బతుకుతున్న జంతువులకు... అప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నది అసలు సమస్య.

జనవరి, ఫిబ్రవరిలో... డెల్టా మొత్తం ఎడారిలా మారిపోతుంది. ఆ సమయంలో వచ్చే ఉరుముల వల్ల... కార్చిచ్చులు రాజుకుంటాయి. అడవి తగలబడుతుంది. ఉన్న కాస్త ఎండుగడ్డీ... బూడిద అవుతుంది. వేడి మరింత పెరిగి... ప్రాణికోటికి ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది.

మూగజీవులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని... తలో దిక్కుకూ చెదిరిపోతాయి. పుట్టిల్లు లాంటి డెల్టా వదిలి ఎటు వెళ్లాలో, ఎలా వెళ్లాలో తెలియక ఆ ప్రాణుల చిట్టి ప్రాణాలు గిలగిలా కొట్టుకుంటాయి.

రోజులు గడిచే కొద్దీ... మంటల తీవ్రత పెరుగుతుంది. దాదాపు డెల్టా మొత్తం తగలబడిపోతుంది. అప్పటివరకూ లక్షల ప్రాణులకు ఆవాసంలా ఉన్న మైదానం... ఎడారి దిబ్బలా, నిప్పుల కొలిమిలా మారిపోతుంది.

సరిగ్గా అప్పుడే... ఆకవాంగోలో మేజిక్ జరుగుతుంది. మార్చిలో అంగోలా పర్వతాల నుంచీ... వర్షపు నీరు... వరదలా వస్తుంది.

ఎండిపోయిన ఎడారికి మళ్లీ ప్రాణం వస్తుంది. మంటల్ని తట్టుకొని నిలిచిన జంతువులు, ప్రాణులు... నీటి రాకతో ఊపిరి పోసుకుంటాయి.

డెల్టా మొత్తం... పచ్చదనం పరచుకుంటుంది. పక్షులు మళ్లీ గూళ్లు కట్టుకుంటాయి. జంతువులు... ఆవాసాలు వెతుక్కుంటాయి.

ఇలా... ప్రతి సంవత్సరం... ఆకవాంగో... సరికొత్త ప్రపంచానికి స్వాగతం పలుగుతుంది.



వైల్డ్ సఫారీ, విక్టోరియా జలపాతం:
ఆఫ్రికాలో ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌లలో ఒకటి ఆకవాంగో. అడవుల్లో సఫారీ కలిగించే థ్రిల్... మాటలకు అందనిది. ఇక దగ్గర్లోనే ఉన్న విక్టోరియా ఫాల్స్‌ (Victoria Falls)కి వెళ్తే... మనసు గాల్లో తేలిపోతుంది. ఆ పర్యాటక విశేషాల్ని తెలుసుకుందాం.

ఆకవాంగో... ప్రాణికోటికే కాదు... పర్యాటక రంగానికి కూడా ఎంతో మేలు చేస్తోంది. దక్షిణ ఆఫ్రికా ఖండంలో ఇదో పాపులర్ టూరిస్ట్ ఎట్రాక్షన్.

పర్యాటకులకు సఫారీ మజా అందించేందుకు... ఇక్కడ చాలా టూరిజం ప్యాకేజీలున్నాయి. స్థానికులే ఇక్కడ గైడ్లుగా పనిచేస్తారు. చిన్నప్పటి నుంచీ జంతువుల్ని చూస్తూ పెరిగిన వాళ్లు కావడంతో... వాళ్లకు తెలిసినంతగా... ఈ డెల్టా గురించి ఇంకెవరికీ తెలియదు.

అడవిలో ఓపెన్ వెహికిల్స్‌లో వెళ్తూ... వన్య మృగాల్ని అత్యంత దగ్గరగా చూడటం, వాటిని కెమెరాల్లో బంధించడం... అదో థ్రిల్.

సాధారణంగా... టూరిస్టులు... ఏడు రోజుల ప్యాకేజీ ఎంచుకుంటారు. బోట్స్‌వానాలో మాన్ ఎయిర్‌పోర్ట్‌ (Maun Airport)కి రాగానే... అక్కడి నుంచీ... చార్టర్ ప్లేన్‌లో... ఆకవాంగో డెల్టా క్యాంపుకి చేరతారు. మొదటి ఐదు రోజులు... డెల్టాలో గడిపేస్తారు. హెలీ టూరిజంతోపాటూ, మోటార్ బోట్లలో ప్రయాణిస్తారు.

లగ్జరీ అయినా... హాట్ ఎయిర్ బెలూన్‌లో గాల్లో విహరించడం మరో ఎక్సైట్‌మెంట్. డెల్టా మొత్తాన్నీ పక్షిలా చూసేందుకు వీలవుతుంది.

జులై నుంచీ సెప్టెంబర్ వరకూ... ఈ టూర్ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ టైమ్‌లో... వన్యప్రాణులు, పక్షులు పెద్ద సంఖ్యలో డెల్టా వాటర్‌లో కనిపిస్తాయి.

చివరి రెండ్రోజులూ... జింబాబ్వేలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద విక్టోరియా జలపాతం (Victoria Falls) చూసేందుకు వెళ్తారు.

జాంబియా, జింబాబ్వే దేశాల మధ్య ప్రవహించే... జాంబెజీ నదీ (Zambezi River) ప్రవాహం వల్ల ఈ జలపాతం ఏర్పడింది. ఉత్తర అమెరికాలోని నయాగరా జలపాతం కంటే... ఇది రెండు రెట్లు ఎత్తైనది, గంభీరమైనది.

సాహసాలు చేసే పర్యాటకులకు ఈ జలపాతం దగ్గర చాలా అడ్వెంచర్లు ఉన్నాయి. ఎక్కువ మంది ఇష్టపడేది... బంగీ జంప్. (Bungee Jump)

ఇలా... ఆకవాంగో... ఎన్నో ప్రకృతి వింతలు, అద్భుతాల్ని తనలో దాచుకుంటూ... ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. నీరు లేకపోతే... ఈ ప్రపంచం లేదు. మన దేశంలో ఎన్నో జీవ నదులున్నా... వాటి నీరు... సముద్రంలో వృథాగా కలిసిపోతోంది. నీరు ఎంత ప్రాణాధారమో, నీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో, నీరు లేకపోతే, కలిగే నష్టాలేంటో... తెలుసుకోవడానికి... ఆకవాంగో డెల్టాయే ప్రత్యక్ష ఉదాహరణ.