చైనా కీటకాల మార్కెట్లు... (Image credit - Twitter - Raghav Sharma) |
China Insects Markets: పంజరాల్లో పక్షుల్ని అమ్మే షాపుల్ని చూశాం. కుక్కల్నీ, పిల్లుల్నీ అమ్మే పప్పీ స్టోర్లనూ చూశాం. అక్కడ మాత్రం కీటకాల్ని, పురుగుల్నీ అమ్ముతారు. కావాలంటే అప్పటికప్పుడే ఫ్రై చేసి ఇస్తారు. ఇందుకోసం చైనాలో మూడు ఫేమస్ మార్కెట్లు ఉన్నాయి. అవేంటో, వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. "చైనా వాళ్లు పాములూ, కప్పల్నీ తింటారట"... ఇదీ ఒకప్పుడు జనం సరదాగా చెప్పుకున్న మాట. రోజులు మారాయి. చైనా చాలా డెవలప్ అయ్యింది. ఎంతలా అంటే... ప్రస్తుతం అక్కడి వాళ్లు తినని కీటకం అంటూ ఏదీ లేదు. పాకే పురుగుల నుంచీ... అనకొండల వరకూ... ఎగిరే తూనీగల నుంచీ... తేళ్ల వరకూ... అన్నీ ఆరగిస్తున్నారు. ఆ విచిత్ర విశేషాల్ని తెలుసుకుందాం.
మనకు పాము కనిపిస్తే పూజలు చేస్తాం. అదే తేలు కనిపిస్తే... చెప్పుకి పనిచెబుతాం. చైనా వాళ్లు మాత్రం ఏది కనిపించినా... వెంటనే బంధిస్తారు. తర్వాత టైమ్ చూసుకొని... చక్కగా ఫ్రై చేస్తారు. ఇంటిల్లిపాదీ కలిసి హాయిగా భోంచేస్తారు. పక్షులు, జంతువులు, చేపలు, పురుగులు... ఇలా అన్ని రకాల ప్రాణులకూ కేరాఫ్ అడ్రస్... చైనా... షాంఘైలోని ఈ ప్రాచీన మార్కెట్. దీనికి ప్రత్యేక పేరంటూ ఏదీ లేదు. స్థానికులు దీన్ని షాంఘై ఓల్డ్ మార్కెట్ లేదా... కీటకాల మార్కెట్ అంటారు. ఈ మార్కెట్‌లో ఉప్పులు, పప్పులూ ఉండవు. రకరకాల కీటకాలు, పక్షులూ మాత్రం అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. మార్కెట్‌లో అడుగుపెట్టగానే పిల్లుల అరుపులూ, పక్షుల కిలకిలా రావాలూ వినిపిస్తాయి. మొరిగే కుక్కలు కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ పెట్ షాపులోనైనా ఇవి కామనే. ఇక్కడ అదనంగా మరిన్ని విశేషాలున్నాయి.
పిల్లులు, పక్షుల్ని చూశాక ఇంకాస్త ముందుకువెళ్తే... ఇరుకైన సందులు ఉంటాయి. అక్కడ కనిపిస్తాయి ఎన్నో వింతలు. మన కళ్లను మనమే నమ్మలేం. తాబేళ్లు టబ్బుల్లోంచీ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ కనిపిస్తాయి. కప్పలు... తొట్టెల్లోంచీ గెంతేందుకు ట్రై చేస్తూ ఉంటాయి. కీచురాళ్లూ, కీటకాలూ... ఎలా తప్పించుకోవాలో తెలియక తమ బోనుల్లోనే అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తాయి. ఇలాంటి చాలా దృశ్యాలు మన కంటపడతాయి. కొన్ని దృశ్యాలు అయ్యో పాపం అనిపిస్తాయి కూడా. ఇక్కడ దొరకని కీటకం అంటూ ఏదీ ఉండదు. అవి కూడా ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. ప్రతీ కీటకానికి ప్రత్యేక బోనులుంటాయి. పేపర్ బాక్సులూ, ప్లాస్టిక్ డబ్బాలు, వైరు పెట్టెలు, ఇలా చాలా రకాలుంటాయి వీటిలో. కీటకాలు తినే ఆహారం కూడా ఇక్కడ దొరుకుతుంది. ఎవరైనా వాటిని పెంచాలనే ఆసక్తి ఉన్నవాళ్లు... ఆ ఆహారం కొనుక్కుంటారు.
చైనా వాళ్లు కీచురాళ్లు అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు. అందువల్ల ఈ మార్కెట్‌లో రకరకాల కీచురాళ్లు ఉంటాయి. వీటిలో కొన్నింటి రేట్లు చాలా ఎక్కువ. ఒక్కొక్కటైతే 60వేల రూపాయలకు పైనే ఉంటుంది. మరీ అంత రేటంటే నమ్మడం కష్టమే. కానీ ఇది నిజం. ఇందుకో కారణం ఉంది మరి. చైనాలో కీచురాళ్ల కొట్లాట ప్రత్యేకమైనది. మన దగ్గర కోళ్ల పందేల లాగా... అక్కడ కీచురాళ్ల మధ్య కలహాలు పెడతారు. అవి కొట్టుకుంటూ ఉంటే... వాటి ఫైటింగ్‌ను ఎంజాయ్ చేస్తారు. కీచురాళ్ల ఫైటింగ్‌లో గెలిచిన కీటకాన్ని దాదాపు ఓ వజ్రంతో సమానంగా భావిస్తారు దాని ఓనర్లు. ఎందుకంటే దానిపై జరిగే బెట్టింగ్ లక్షల్లో ఉంటుంది. గెలిచే కీచురాళ్లకు విపరీతమైన రేట్ ఉన్నా... ఈ మార్కెట్‌లో చాలా కీచురాళ్లు పది రూపాయల కంటే తక్కువ రేటే పలుకుతాయి.
ఇక్కడ అమ్మకానికి ఉంచే రంగురంగుల చేపలు, తాబేళ్లూ, స్టార్ ఫిష్‌లు, సీ హార్స్... ఇతరత్రా సముద్ర జీవులు... కొన్ని గంటల్లోనే చుట్టుపక్కల రెస్టారెంట్లలో మెనూ ఐటెమ్స్‌గా మారిపోతాయని తెలిస్తే, విచారం కలగక మానదు. కిలకిలలాడే పక్షుల పరిస్థితీ అంతే... ఏమాత్రం జాలి లేనట్లుగా... వాటిని కొనుక్కెళ్లి... ఫ్రై చేసుకు తినేస్తారు చాలా మంది. మనకైతే... అయ్యో పాపం అనిపిస్తుంది గానీ... చైనాలో అది కామన్. మన దగ్గర కోళ్లూ, మేకల్ని చంపినట్లే... అక్కడ రకరకాల పక్షుల్ని వండుకు తింటారు. పర్యావరణ ప్రేమికులకు మాత్రం ఈ మార్కెట్ చేదు అనుభవాల్ని మిగుల్చుతుంది. ఇక్కడి జంతువులు, పక్షులూ, నోరులేని మూగ జీవాలు బోనుల్లో బంధీ అయి... అరుస్తూ ఉంటే... చూడటానికి బాధ కలిగించే దృశ్యమే అది. వాటిని స్వేచ్ఛగా వదిలేయమంటూ... అప్పుడప్పుడూ ఆందోళనలు కూడా చేస్తుంటారు సామాజిక వేత్తలు. కానీ వందల ఏళ్లుగా ఈ మార్కెట్ ఇలాగే కొనసాగుతోంది. మంచో చెడో... తన ప్రత్యేకతతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
"చైనా వాళ్లు తినని కీటకం ఉందా?" అంటే లేదనేదే సమాధానం. ఈ భూమ్మీద మనిషిని తప్ప... ప్రాణమున్న ప్రతి జీవినీ తింటున్నారు చైనీయులు. వందల రకాల కీటకాల్ని "రెడీ టూ ఈట్" అంటూ అమ్మే... బీజింగ్ నైట్ మార్కెట్‌ను పరిశీలనగా చూస్తే ఒళ్లు జలదరించకమానదు. అక్కడి రోడ్ల పక్కన రకరకాల చీకులు కనిపిస్తాయి. దూరం నుంచీ చూస్తే... రంగురంగుల్లో ఉండే అవి... ఇట్టే ఆకట్టుకుంటాయి. దగ్గరకు వెళ్లి చూస్తే మాత్రం మతిపోక మానదు. కొంతమందైతే ఆ దృశ్యాల్ని చూడలేరు కూడా. తేళ్లు, స్టార్‌ఫిష్‌లు, బొద్దింకలు, పాములూ, తొండలు, జర్రులు, గొంగళి పురుగులు, మిడతలు, సీహార్స్, సాలీళ్లు... ఇలా రకరకాల కీటకాలూ, పురుగుల్ని... ఫ్రై చేసి... చీకులకు గుచ్చి అమ్ముతారు ఇక్కడ. మన జిల్లాల్లో చికెన్ పకోడీ అమ్మినట్లు... వీళ్లు రోడ్డు పక్కనే ఇలా కీటకాల చీకులు అమ్ముతారు.
చైనా రాజధాని బీజింగ్‌కి ఉత్తరాన ఉన్న ఈ మార్కెట్‌ను డోంగ్ డామెన్ నైట్ మార్కెట్ (Dongdamen Night Market) అంటారు. పగటి కంటే రాత్రి వేళ ఈ మార్కెట్ ఎక్కువ బిజీగా ఉంటుంది. సాయంత్రం నుంచే సందర్శకుల సందడి మొదలవుతుంది. గంటలు గడిచేకొద్దీ... ఈ ఐటెమ్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోతాయి.
ఇలాంటిదే మరొకటి ఉంది. అదే వాంగ్‌ఫ్యూజింగ్ స్నాక్ స్ట్రీట్ (Wangfujing Street). ఇక్కడ అమ్మే కేకుల్లో సాలీళ్లు ఉంటాయి. చాకొలెట్ కుకీల్లో పురుగులుంటాయి. ఇలా రకరకాల తిండి పదార్థాల్లో... కీటకాలు, పురుగుల్ని మిక్స్ చేస్తారు. వాటిని నంజుకు తింటూ... ఆ టేస్టే వేరంటారు స్థానికులు. కొత్త కొత్త రుచుల్ని ఆస్వాదిస్తూ... ఆహార ప్రియులు పండగ చేసుకుంటారు.
వాంగ్‌ఫ్యూజింగ్ స్నాక్ స్ట్రీట్‌లో మరో ప్రత్యేకం... గ్రీన్ ఆనియన్ పాన్ కేక్స్. ఇక్కడ మాత్రమే కనిపించే ఈ కేకుల్ని షాపింగ్‌కి వచ్చిన వాళ్లు కచ్చితంగా టేస్ట్ చూడాలంటుంటారు వ్యాపారులు. చూడగానే ఆకట్టుకునే ఈ కేక్స్‌లో వెజ్, నాన్ వెజ్ రెండు రకాలూ ఉంటాయి.
మిడతల్నీ, కీచురాళ్లనూ ప్రపంచంలో చాలా రెస్టారెంట్లు వండి వడ్డిస్తున్నాయి. చైనాలో మాత్రం అన్ని రకాల పురుగుల్నీ తినేందుకు అనుకూలంగా సిద్ధం చేస్తారు. మనలాంటి వాళ్లకు వాటిని చూస్తేనే బెరుకుగా ఉంటుంది. చైనీయులకు మాత్రం... ఆ పురుగులూ, నీటి కీటకాలు, తేనెటీగలు, పట్టు పురుగుల గూళ్లంటే విపరీతమైన ఇష్టం. మన దేశంలో స్నాక్స్ అంటే... ఏ మిర్చి బజ్జీలో, సమోసాలో తింటాం. అక్కడివాళ్లకు ఈ కీటక ప్రపంచమే స్నాక్స్. మన దగ్గర మందులోకి మంచింగ్ కింద చికెన్, జీడిపప్పు వంటివి ఉంటే... అక్కడ మాత్రం ఈ కరకరలాడే పురుగులే నోరూరించే మంచింగ్.
డోంగ్ డామెన్ నైట్ మార్కెట్, వాంగ్‌ఫ్యూజింగ్ స్నాక్ స్ట్రీట్‌లో చైనీస్ వంటకాలన్నీ కనిపిస్తాయి. వరైటీ రుచులు చవులూరిస్తాయి. వీటిలో చాలా వరకు ఫ్రై చేసినవీ, గ్రిల్లింగ్ చేసినవే ఉంటాయి. ఇలా ఆర్డరిస్తే చాలు... అలా సర్వ్ అవుతాయి. అఫ్‌కోర్స్... నోట్లో పెట్టుకోగానే... క్షణాల్లో కరిగిపోతాయి కూడా. ఇక్కడకు వెళ్లిన వాళ్లకు మొదట వేటితో మీల్స్ ప్రారంభించాలో అర్థం కాదు. వేటికవే పోటీ పడుతూ, ఊరిస్తూ ఉంటాయి. మనం తినే రైస్, చపాతీలతో కూడా ఈ వరైటీలను అందిస్తున్నారు వీళ్లు. ఈ పదార్థాల్లో ఎక్కువ మంది ఇష్టపడేవి. తేళ్లే... ఎందుకంటే ఇవి కరకరలాడుతూ ఉంటాయట. నూనెలో ఫ్రై చేయడం వల్ల వీటి రుచి... రొయ్యల్లాగా ఉంటుందని చెబుతుంటారు చాలామంది.
పట్టు పురుగుల పెంపకం కోసం చైనా రాజధాని బీజింగ్‌లో ఓ భారీ ఫ్యాక్టరీ ఉంది. అలాగే నీటిలో పెరిగే కీటకాల్ని పెంచేందుకు హాంకాంగ్‌లో ఓ ఫ్యాక్టరీ ఉంది. అక్కడి నుంచీ వాటిని టన్నుల కొద్దీ తెప్పించి... ఇక్కడి మార్కెట్‌లో అమ్ముతుంటారు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే... పట్టు పురుగుల గూళ్లను కూడా ఇక్కడ ఎక్కువ మంది చాక్లెట్ తిన్నంత తేలిగ్గా లాగించేస్తుంటారు.
నల్లటి సాలీళ్లకు కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుంది. చూడ్డానికే భయంకరంగా ఉండే బ్లాక్ స్పైడర్స్... ఇక్కడి ప్లేట్లలో స్నాక్స్‌లా మారిపోతాయి. మనం పకోడీ తిన్నట్లుగా... చైనీయులు వీటిని ఓ పట్టు పడతారు. మనం వీటిని తినం కాబట్టి... మనకు ఇవి కొత్తగా, వింతగా అనిపిస్తాయి గానీ... డ్రాగన్ దేశంలో పెద్దల నుంచీ చంటి పిల్లల వరకూ... అందరూ కామన్‌గా తినే ఫుడ్డే ఇది.
ప్రపంచ దేశాలకు "యూజ్ అండ్ త్రో" వస్తువుల్ని అలవాటు చేసిన చైనా... ఇప్పుడు కీటకాల్ని తినే అలవాటు కూడా చేస్తోంది. విదేశీ టూరిస్టులు కూడా రకరకాల పురుగులూ, అవీ తింటూ లొట్టలేస్తున్నారు. ఇది మంచి పరిణామమేనా? చైనీయులు పర్యావరణానికి మేలు చేస్తున్నారా? కీడు చేస్తున్నారా?
మనం ఏ గొంగళి పురుగునో, జర్రినో చూస్తే... వాటి కాళ్లూ, ఆకారం... ఒళ్లు జలదరించేలా చేస్తుంది. మనలో కొంతమందైతే... బల్లిని చూసి కూడా భయపడతారు. మరి అలాంటి పురుగుల్నీ, కీటకాల్నీ చైనీయులు ఎందుకంత ఆసక్తిగా లాగిస్తున్నారు? దేశంలో వేరే ఏ ఆహారమూ లేనట్లు... ఎందుకు అమాయక ప్రాణుల్ని చంపి తింటున్నారు? అన్న అనుమానం మనకు కలగడం సహజం. దీనికో కారణం ఉంది.
పూర్వం చైనాలో ఎలుకలు విపరీతంగా పెరిగాయి. పంట పొలాల్ని నాశనం చేశాయి. వాటి వల్ల తీవ్ర కరువు వచ్చింది. అప్పటి రాజు... ఎలుకల్ని పట్టి తినమని జనాన్ని ఆదేశించాడు. ఒక్కో ఎలుక తోకకూ పైసా చొప్పున మనీ ఇస్తానన్నాడు. ఆ ఆదేశాలతో జనం వాటిని తినడం మొదలుపెట్టారు. కాలక్రమంలో... ఇతర జీవుల్ని కూడా ఆరగించడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు చైనాలో 40 శాతం ఆహార కొరతను తీర్చుతున్నది ఈ కీటకాలు, పురుగులే. నిజమే మరి 140 కోట్ల మంది జనాభా... బియ్యమో, గోధుమలో మాత్రమే తిని బతకాలంటే కష్టమే కదా.
"ఈ భూమ్మీద దేన్నైనా మనిషి తినవచ్చు. వృథా అయ్యేది ఏదీ లేదు" చైనా వాళ్లు నమ్మే ఆహార సిద్ధాంతం ఇదే. అందుకే వాళ్లు ప్రతి దాన్నీ టేస్ట్ చూస్తున్నారు. వేటిని ఎలా తినాలో వాళ్లకు తెలిసినంతగా... ప్రపంచంలో ఇంకెవరికీ తెలీదు.
ఈ పురుగులు చూడ్డానికి బెరుకుగా ఉన్నా... వీటిలో ప్రోటీన్లూ, మినరల్స్, పోషక పదార్థాలు ఎక్కువే. మనం తినే చికెన్, మటన్, చేపలు, రొయ్యల కంటే... కీటకాల్లోనే ఎక్కువ పోషకాలుంటాయట. అందుకే ఇప్పుడు చాలా దేశాల వంటకాల్లో వీటి వాడకం పెరుగుతోంది. విదేశీ రెస్టారెంట్ల మెనూల్లో కూడా కీటక జాతుల లిస్ట్ ఎక్కువవుతోంది. అమెరికా, బ్రెజిల్, హాంకాంగ్, జపాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో కీటకాల్ని ఆరగిస్తున్నారు.
చైనా జనం తినే కోట్లాది పురుగులన్నీ... ప్రత్యేకంగా ఫ్యాక్టరీల్లో పెంచుతున్నవే. ప్రకృతిలో తిరిగే వాటిని వాళ్లు చంపరు, తినరు. పర్యావరణానికి హాని కలగకుండా అక్కడి ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంది. పక్షులైనా, పురుగులైనా... మార్కెట్లలో కొనుక్కొని తినాల్సిందే. ఈ రూల్స్ అతిక్రమిస్తే... భారీ జరిమానాలు తప్పవు. అందుకే చైనాలో ఇలాంటి మార్కెట్లు ఎక్కడ బడితే అక్కడ ఉంటాయి.
నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నా... ప్రభుత్వం, పోలీసుల కళ్లుగప్పి... చాలా మంది బయటి కీటకాలూ, పురుగుల్ని పట్టి తినేస్తున్నారు. అందుకే అక్కడి ప్రభుత్వం పర్యావరణ సమతుల్యత కోసం ప్రత్యేకంగా ప్రాణుల్ని పెంచి... పర్యావరణంలోకి వదిలేస్తోంది. కనీసం అలాగైనా సమతుల్యతను కాపాడినట్లు అవుతుందని అధికారులు లెక్కలేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలతో ఆందోళనకారుల ఆగ్రహావేశాలను చల్లబరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
చైనాలో అతిపెద్దవైన కీటకాల మార్కెట్, డోంగ్ డామెన్ నైట్ మార్కెట్, వాంగ్‌ఫ్యూజింగ్ స్నాక్ స్ట్రీట్ విదేశీయుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తమ దేశాల్లో దొరకని వరైటీ వంటకాల్ని ఇక్కడికి వచ్చే పర్యటకులు టేస్ట్ చూస్తారు. ఇలాంటివి తినే అలవాటు లేని వాళ్లు కూడా... ఈ మార్కెట్లకు వచ్చి సరదాగా ఓ ట్రయల్ వేస్తారు. కొన్ని విదేశీ రెస్టారెంట్లైతే... చైనా వంటకాల కోసమే ఆ దేశాల చెఫ్‌లను నియమించుకుంటున్నాయి. చైనా రుచులను కస్టమర్లకు అందిస్తున్నాయి.
మన దేశంలో కూడా ఈశాన్య రాష్ట్రాల జనం ఇలాంటి వంటకాల్ని తింటున్నారు. మెట్రో సిటీల్లో కొన్ని ప్రముఖ రెస్టారెంట్లు కూడా చైనా వంటకాల్ని అలవాటు చేస్తున్నాయి. ఇప్పటికే చైనా నూడుల్స్, ఫ్రైడ్ రైస్ స్టాల్స్ మన రాష్ట్రాల్లోని ప్రతీ వీధిలో కనిపిస్తున్నాయి. విదేశీ అలవాట్లను త్వరగా అలవర్చుకునే మనం... భవిష్యత్తులో కీటకాల వంటకాలకు కూడా అలవాటు పడినా ఆశ్చర్యం అక్కర్లేదు. చైనా లాగా ఇక్కడ కూడా అలాంటి మార్కెట్లు వెలిసే రోజులూ రావచ్చు.
ప్రపంచంలో ప్రతీ దేశానికీ ప్రత్యేక ఆహారపు అలవాట్లున్నాయి. ఇతర దేశాల వాళ్లకు అవి ఆశ్చర్యంగా, వింతగా అనిపించినా... అవన్నీ మానవ మనుగడలో భాగమే. చైనాలో కీటకాల వంటకాలు కూడా ఆ కోవలోకే వస్తాయి. వాటిని చూసి అభ్యంతరం చెప్పే వాళ్లు ఉన్నట్లే... సపోర్ట్ చేసేవాళ్లూ ఉన్నారు. అందుకే ఆ మార్కెట్లలో బిజినెస్ నానాటికీ పెరుగుతూనే ఉంది.