4, ఏప్రిల్ 2024, గురువారం

Secret of Eagle vision - గద్ద చూపులో ఎన్నో ప్రత్యేకతలు

 


మన తెలుగు రాష్ట్రాల్లో గద్దలు ఎక్కువగా కనిపించవుగానీ.. కర్ణాటకలో ఎక్కడ చూసినా అవే ఉంటాయి. డేగ చూపు పవర్‌ఫుల్ అని మనకు తెలుసు. దాని ప్రత్యేకతలు తెలుసుకుందాం.


మనుషుల కంటి చూపు కంటే, పక్షుల కంటి చూపులో ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గద్దల్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు గద్దని గమనిస్తే, దాని కనుగుడ్లు విశాలంగా, పొడవుగా ఉంటాయి. అంటే.. కనుగుడ్డులో కంటి కటకానికీ, రెటీనాకీ మధ్య విశాలమైన ప్రదేశం ఉంటుంది.


మనుషులతో పోల్చితే, పక్షుల రెటీనాలలో జ్ఞాన సంబంధిత జీవ కణాలు (sensory cells) ఎక్కువగా ఉంటాయి. పైగా అవి రెటీనాలో సమానంగా వ్యాపించి ఉంటాయి. అందువల్ల గద్ద పైనుంచి ఎగురుతూ చాలా ఎక్కువ భూవైశాల్యాన్ని చూడగలదు. 


గద్దకు ప్రతీదీ మనకంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. మన కంటికి కనిపించని వాటిని కూడా గద్ద చూడగలదు. మనం ఏదైనా చూసినప్పుడు.. ఆ దృశ్యం ప్రతిబింబం.. మన కంటిలో ఏర్పడుతుంది. గద్దకూ ఇలా జరుగుతుంది. కాకపోతే గద్ద కంటిలో ఏర్పడే ప్రతిబింబం చాలా స్పష్టంగా ఉంటుంది. మన కంటిలో కంటే, గద్ద కంటిలో ఈ ప్రతిబింబ కణాలు 8 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే గద్ద దూరంగా ఉండే వాటిపై కూడా అతి త్వరగా దృష్టిని కేంద్రీకరించగలుగుతుంది.


కంటిలోని ద్రవాల కదలికల వల్ల మనం సెకనుకు 25 ప్రతిబింబాలను చూడగలం. గద్ద సెకనుకు 150 ప్రతిబింబాలను చూడగలుగుతుంది. అంతేకాదు.. మన కంటికి కనిపించని అతినీల లోహిత కిరణాలను (ultra violet rays) గద్ద చూడగలదు. అందువల్ల కోడిపిల్ల రెట్ట వేస్తే, ఆ రెట్ట నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాల్ని గద్ద ఆకాశం నుంచి చూస్తుంది. దాంతో.. అక్కడో కోడి పిల్ల ఉన్నట్లు గద్దకు తెలిసిపోతుంది. ఇలా ఈగిల్ ఫోకస్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది.