సాధారణంగా వర్షం వచ్చే ముందు వాతావరణం చల్లబడుతుంది. చల్లని గాలి వీస్తుంది. పరిసరాలు ఆహ్లాదకరంగా మారతాయి. ఐతే.. ఆ సమయంలో మనకు చెమట పట్టి, ఉక్కగా అనిపిస్తుంది. అలా ఎందుకో తెలుసుకుందాం.
భారీ వర్షం వచ్చే ముందు మనకు చెమట ఎక్కువగా పడుతుంది. ఇలా ఎందుకంటే.. చెమట పట్టడం అనేది చర్మం పై భాగంలో కంటిన్యూగా జరిగే ప్రక్రియ. అంటే.. చర్మం కింద ఉండే స్వేద గ్రంధులు.. నిరంతరం చెమటను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఆ చెమట.. చర్మం పైభాగానికి నిరంతరం వస్తూనే ఉంటుంది. అది వాతావరణంలోని వేడిని గ్రహించి.. ఆవిరిగా మారి.. గాలిలో కలిసిపోతుంది. వేడి వాతావరణం ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. గాలిలో నీటి శాతం అంటే తేమ ఎంత ఉంది అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది.
గాలిలో తేమ తక్కువగా ఉంటే.. చెమట త్వరగా ఆవిరి అవుతుంది. అప్పుడు మనకు ఉక్కగా అనిపించదు. అదే గాలిలో తేమ ఎక్కువగా ఉంటే.. చెమట త్వరగా ఆవిరి అవ్వదు. వర్షం వచ్చే ముందు గాలిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ గాలిలో మరింత నీరు పట్టదు. అందువల్ల చెమట.. గాలిలో ఆవిరి అవ్వదు. అప్పుడు చర్మంపైకి వచ్చే చెమట, ఆవిరి అవ్వకుండా అక్కడే ఉండిపోతుంది. అదే సమయంలో చల్లని తేమ వాతావరణాన్ని తట్టుకునేందుకు శరీరం వేడెక్కుతుంది. దాంతో చర్మంపై చెమట క్రమంగా పెరుగుతూ ఉంటే.. మనకు ఉక్కపోస్తున్నట్లు అనిపిస్తుంది.