17, ఏప్రిల్ 2024, బుధవారం

Why don't trees grow on mountains? - పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు?

 


భూమిపై ఎక్కడ చూసినా చెట్లు కనిపిస్తాయి. నీరు లేని ఎడారుల్లో కూడా రకరకాల చెట్లను చూస్తుంటాం. కానీ పర్వతాలపై చెట్లు కనిపించవు? ఎందుకిలా? అక్కడ నీరు ఉన్నా.. చెట్లెందుకు పెరగవు?


అత్యంత ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు పెద్దగా పెరగక పోవడానికి ప్రధాన కారణం అక్కడి తీవ్రమైన వాతావరణ పరిస్థితులే. చెట్లు పెరగాలంటే నీరు కావాలి. భూమిపై ఉండే చెట్లు.. భూగర్భజలాలను వేర్ల ద్వారా తీసుకుంటాయి. పర్వతాలు ఎత్తుగా ఉంటాయి కాబట్టి.. అక్కడ భూగర్భ జలాలు లభించవు. ఒకవేళ లభించినా అవి గడ్డకట్టి ఉంటాయి. అదే సమయంలో పర్వతాలపై ఉండే మంచు, నీరు లాగా మారదు. అది కూడా గడ్డకట్టి ఉంటుంది కాబట్టి.. దాన్ని చెట్లు, నీరు లాగా తీసుకోలేవు. ఈ పరిస్థితుల్లో చెట్లు క్రమంగా ఎండిపోతాయి. 


మరో కారణం కూడా ఉంది. వాతావరణం బాగా చల్లబడినప్పుడు చెట్లలోపలి నీరు కూడా గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. అలాగే.. చెట్లలో నీరు ప్రవహించే మార్గాల్లో పగుళ్లు ఏర్పడతాయి. దీనికి తోడు పర్వతాలపై విపరీతమైన, బలమైన చల్లగాలులు వీస్తుంటాయి. ఒక్కోసారి మంచు తుపాను రాగలదు. కొన్నిసార్లు మంచు దిబ్బలు విరిగిపడుతుంటాయి (avalanche). ఇలా చెట్లు పెరిగేందుకు వాతావరణం ఏమాత్రం అనుకూలంగా ఉండదు.


వాతావరణం ఎలా ఉన్నా.. పర్వతాలపై కూడా కొన్ని జాతుల చెట్లు పెరగగలవు. పైన్, అశోకా, రెడ్‌వుడ్స్, సర్వి, సెడార్స్, స్ప్రూసెస్, కౌరీస్, హెమ్‌లాక్స్, డగ్లాస్ ఫర్స్, లార్చెస్, యూస్ వంటి చెట్లు పర్వతాలపై కూడా పెరుగుతాయి. ఇవి వాతావరణాన్ని బట్టీ, తమలో మార్పులు చేసుకుంటాయి. ఇవి నీరు లేకపోయినా చాలా కాలం బతికి ఉండగలవు.