మనందరికీ తెలుసు.. 22 క్యారెట్ల నగలలో బంగారం వంద శాతం ఉండదు అని. మరి ఎంత శాతం ఉంటుంది? అసలు ఈ క్యారెట్ లెక్క ఎందుకు? తెలుసుకుందాం.
ఒకప్పుడు మనల్ని బ్రిటీష్ వాళ్లు పరిపాలించారు కదా.. అప్పుడు వాళ్లు.. బ్రిటన్ దేశంలో పాటించే తూనికలు-కొలతలను ఇండియాలో ప్రవేశపెట్టారు. క్రమంగా భారతీయులు వాటికి అలవాటుపడ్డారు. క్యారెట్ అనేది కూడా బ్రిటన్ నుంచే వచ్చింది.
ప్రాచీన బ్రిటన్‌లో గ్రెయిన్, క్వార్ట్ అనే కాయిన్లు ఉండేవి. నాలుగు క్వార్ట్‌లు, ఒక గ్రెయిన్‌కి సమానం. అలాగే.. నాలుగు గ్రెయిన్లు చెయ్యాలంటే.. 1 క్యారెట్ బంగారం అవసరం. అప్పట్లో వ్యాపారులు, సంపన్నులూ... బ్రిటన్ రాజుకి నాణేలను ఇవ్వాల్సి వచ్చేది. అది కూడా 24 క్యారెట్ల విలువైనవి. అప్పట్లో రాజుకి ఇచ్చే నాణేలను నాణ్యమైన బంగారంతో చేసేవారు. దాంతో.. 24 క్యారెట్లు అనేది బంగారం స్వచ్ఛతకు ప్రమాణంగా మారింది.
ప్రస్తుతం గోల్డ్ కాయిన్స్‌ని స్వచ్ఛమైన బంగారంతో తయారుచేస్తున్నారు. అందువల్ల వీటిని 24 క్యారెట్ల గోల్డ్ కింద చెబుతారు. బంగారు నగలను వంద శాతం బంగారంతో చేస్తే, అవి గట్టిగా ఉండవు. అలా నగలను తయారుచెయ్యడం చాలా కష్టం. అందువల్ల నగల తయారీలో కొంత రాగి లేదా వెండిని కలుపుతారు. అందువల్ల వాటి స్వచ్ఛత 24 క్యారెట్లు ఉండదు. రాగి లేదా వెండిని ఎంత శాతం కలిపారు అన్న దాన్ని బట్టీ వాటి క్యారెట్ విలువను చూపిస్తారు.
సాధారణంగా నగలను 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 12 క్యారెట్లలో తయారుచేస్తారు. అంటే.. 22 క్యారెట్ల బంగారు నగలలో బంగారం 91.67 శాతం ఉంటుంది. వెండి లేదా రాగి 8.33 శాతం ఉంటుంది. అదే... 18 క్యారెట్ల నగలలో బంగారం 75 శాతం ఉంటే, మిగతావి 25 శాతం ఉంటాయి. అలాగే 12 క్యారెట్ల నగలలో బంగారం 50 శాతం ఉంటుంది. మిగతావి 50 శాతం ఉంటాయి.