7, ఏప్రిల్ 2024, ఆదివారం

Why won't the horse sit? - గుర్రం ఎందుకు కూర్చోదు?

 


ఈ ప్రకృతికి ఓ ధర్మం ఉంది. అది ఏ జీవికైనా.. అవసరమైనంతవరకే అవయవాల్ని ఇస్తుంది. అదనంగా ఏదీ ఇవ్వదు. ఉదాహరణకు మనుషులనే తీసుకుంటే, మనకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మనకు ఎగరాల్సిన అవసరం లేదు. తప్పనిసరై ఎగరాలి అనుకుంటే.. అందుకు కావాల్సిన తెలివితేటలు మనకు ప్రకృతి సిద్ధంగా వచ్చాయి. మన చేతికి 5 వేళ్లు ఉంటాయి. వాటిలో ఒకటి తక్కువైనా సమస్యే, ఒకటి ఎక్కువగా ఉన్నా సమస్యే. అదనపు వేలు వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. 


చేపలు మాట్లాడలేవు. ఒకవేళ మాట్లాడినా నీటిలో ఆ మాటలు ఇతర చేపలకు సరిగా వినిపించవు. అందువల్ల ప్రకృతి వాటికి మాటలు ఇవ్వలేదు. మాటలతో వాటికి పనిలేదు. పాముకి కాళ్లు లేవు. అయినా అది వేగంగా వెళ్లేలా ఏర్పాటు ఉంది. తాబేలుకి డిప్ప, జిరాఫీకి పొడవైన మెడ, గబ్బిలానికి ధ్వని తరంగాలు, గద్దకు శక్తిమంతమైన చూపు, ఇలా ఈ సృష్టిలో ప్రతీ జీవీ.. తనకు ఉన్న ప్రత్యేకతలతో హాయిగా జీవించేలా ఏర్పాట్లు ఉన్నాయి. గుర్రం విషయంలోనూ ఇదే జరుగుతోంది.


మన ఇళ్ల దగ్గర ఆవు, గేదె, మేక లాంటి జంతువులు నేల మీద నాలుగు కాళ్లనీ ముడుచుకుని కూర్చోవడం చూస్తుంటాం. ఒంటె, ఏనుగు లాంటి పెద్ద జంతువులు నేలపై కూర్చొని సేద తీరుతాయి. తద్వారా వాటి కాళ్ల కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. కానీ గుర్రానికి అలా కూర్చోవాల్సిన అవసరం లేదు.


వేగంగా పరుగెత్తగల జంతువుగా గుర్రం ఫేమస్. హార్స్ రేసుల్లో గుర్రాలు దూసుకెళ్తాయి. వేగంతో పాటు అనేక కిలోమీటర్ల దూరం పరుగెత్తినా అలసిపోని శక్తి గుర్రం సొంతం. అందుకు కారణం దాని కాళ్లలోని కండరాలు చాలా బలంగా, దృఢంగా ఉండటమే. 


గుర్రం మూడు కాళ్లపై కూడా నిలబడగలదు. తద్వారా అది ఒక కాలుకి విశ్రాంతి ఇవ్వగలదు. అలా అది వన్ బై వన్ కాళ్లకు విశ్రాంతి ఇస్తుంది. దాంతో కూర్చోవాల్సిన అవసరం లేకుండానే కాళ్ల కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. గుర్రం నిలబడి నిద్రపోగలదు కూడా. కొన్ని సందర్భాల్లో మాత్రం హార్స్ పూర్తిగా పక్కకు ఒరిగి నిద్రపోతుంది. ఇలా ఈ సృష్టి గుర్రానికి ఈ ప్రత్యేకతను ఇచ్చింది.