పెళ్లి ఉంగరాన్ని రోజూ ధరిస్తే, సంవత్సర కాలంలో అది 6 మిల్లీ గ్రాములు తగ్గిపోతుంది. ఈ లెక్కన ఆ ఉంగరం 1 గ్రాము బరువు తగ్గాలంటే, 165 సంవత్సరాలకు పైగా పడుతుంది.
గుడ్లగూబ, ఊసరవెల్లి, నీటి ఏనుగు.. ఒకేసారి రెండు దిక్కులను చూడగలవు. అంటే.. మనం ఒకేసారి రెండు కళ్లతో ఒకే దృశ్యాన్ని చూస్తాం. కానీ ఈ మూడూ మాత్రం.. రెండు కళ్లతో ఒకేసారి వేర్వేరు దృశ్యాలను చూడగలవు. అందుకు వీలుగా వీటి కనుగుడ్లు.. వేర్వేరుగా కదలగలవు.
ఈ ప్రపంచంలో అంతటా బ్యాక్టీరియా, వైరస్ ఉన్నాయి. ఒక లీటర్ సముద్ర నీటిలో 100 కోట్ల బ్యాక్టీరియా, 1000 కోట్ల వైరస్‌లు ఉంటాయని అంచనా. ఇవి లీటర్ నీటిలో 20వేల రకాలవి ఉంటాయని అంచనా.
ఏనుగు, జిరాఫీ రోజూ 2 నుంచి 4 గంటలే నిద్రపోతాయి. గబ్బిలాలు రోజూ 18 నుంచి 20 గంటలు నిద్రపోతాయి.
ఆస్ట్రేలియాకి చెందిన ఈము పక్షులు గంటకు 45 కిలోమీటర్లు పరుగెత్తగలవు. కానీ ఇవి వెనక్కి నడవలేవు. ఆస్ట్రిచ్ తర్వాత పెద్ద పక్షులు ఇవే. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే ఈ పక్షులు వీలైనంతవరకూ మనుషులకు దూరంగా.. అడవుల్లో జీవిస్తాయి.
మన గుండె నిమిషానికి 72సార్లు కొట్టుకుంటుందని మనకు తెలుసు. తాబేలు గుండె నిమిషానికి 13సార్లే కొట్టుకుంటుంది. శరీరము చిన్నదైనకొద్దీ హార్ట్ బీట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ఒంటె గుండె నిమిషానికి 35 సార్లు కొట్టుకుంటే.. ఎలుక గుండె 400 సార్లు కొట్టుకుంటుంది.
భూమిపై నుంచి మనం ఎప్పుడూ ప్రస్తుత సూర్యుణ్ని చూడలేం. మనం ఎప్పుడు సూర్యుణ్ని చూసినా అది గత సూర్యుడే అవుతుంది. అంటే 8 నిమిషాల ముందు ఉన్న సూర్యుడి రూపం అవుతుంది. సూర్యుడి కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. కాబట్టి మనం భూమిపై నుంచి 8 నిమిషాల ముందు ఉన్న సూర్యుణ్ని మాత్రమే చూడగలం. మరోలా చెప్పాలంటే.. మనం వర్తమానంలో ఉండి.. గతాన్ని చూస్తాం.