31, మార్చి 2024, ఆదివారం

Wonders of the World - ప్రపంచ వింతలు - 1

 


ఈ ప్రపంచమే ఒక వింత. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో. అలాంటి కొన్ని ఇప్పుడు చెప్పుకుందాం.


మనిషి శరీరంలో ఎన్ని అణువులు ఉంటాయి? 70 కేజీల వ్యక్తి శరీరంలో 7 ఆక్టీలియన్ అణువులు ఉంటాయి. అంటే 7 పక్కన 27 జీరోలు.

7,000,000,000,000,000,000,000,000,000


150ml వైన్ తయారుచెయ్యడానికి కేజీ 130 గ్రాముల ద్రాక్షపండ్లు అవసరం. అందుకే వైన్ ధర ఎక్కువగా ఉంటుంది.


సీతాకోకచిలుకలు ఈ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ అంటార్కిటికాలో లేవు.


ఫేమస్ పెయింటర్ పాబ్లో పికాసో పుట్టినప్పుడు ఏడవలేదు, కదల్లేదు. కనీసం ఊపిరి కూడా తీసుకోలేదు. చనిపోయాడనుకొని నర్సు పక్కన పెట్టింది. ఆ సమయంలో పికాసో తల్లి బంధువైన ఓ డాక్టర్ వచ్చి, సిగరెట్ పొగను పికాసో ముఖంపై ఊదాడు. దాంతో ఒక్కసారిగా కదిలిన పికాసో, ఊపిరి తీసుకొని, ఎడవడం మొదలుపెట్టాడు.


పాయిజన్ ఏరో అనే కప్ప శరీరంలో ఒకేసారి 2200 మందిని చంపగల విషం ఉంటుంది. ఈ కప్పలు దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి.

Poison arrow frog


గోల్డెన్ టార్టాయిస్ బీటిల్, ఊసరవెల్లిలా రంగులు మార్చగలదు. ఇది ఆకులు తింటూ బతుకుతుంది.


యాపిల్స్‌లో 7500 రకాలున్నాయి. ఈ చెట్టు గులాబీ జాతికి చెందినది.


వంకాయల్లో నికోటినిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సిగరెట్లు, చుట్టలో ఉండే నికోటిన్ లాగానే ఉంటుంది. కానీ ఇది మన శరీరానికి అంతగా హాని చెయ్యదు. 1 సిగరెట్‌లో ఎంత నికోటిన్ ఉంటుందో, అంత నికోటిన్ 9 కేజీల వంకాయల్లో ఉంటుంది.


30, మార్చి 2024, శనివారం

Why do monkeys still exist? - కోతులు ఇంకా ఎందుకు ఉన్నాయి?

 


కోతి నుంచి మనిషి వచ్చాడన్నది సైన్స్ చెబుతున్న మాట. మరైతే.. కోతులు ఇంకా ఎందుకున్నాయి? అవి ఉండకూడదు కదా అనే ప్రశ్న చాలా మందికి ఉంది. దీనిపై సైంటిస్టులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 450 కోట్ల సంవత్సరాల కిందట భూమి ఏర్పడిన తర్వాత.. వందల కోట్ల సంవత్సరాలు భూమిపై ఏ జీవమూ లేదు. భూమి చల్లబడిన తర్వాత.. Pangaea అనే భారీ సముద్రం ఏర్పడింది. ఆ సమయంలో ఖండాలన్నీ కలిసి, ఒకటే ఖండంగా ఉండేవి. ఆ భారీ సముద్రం నుంచే వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములు ఆవిర్భవించాయి. క్రమంగా అవే రూపాంతరం చెందుతూ.. కోట్ల సంవత్సరాల్లో రకరకాల సముద్ర జీవులుగా మారాయి. ఈ సమయంలోనే ఏక ఖండం కాస్తా, వేర్వేరు ఖండాలుగా విడిపోయింది.


సముద్రంలోని కొన్ని రకాల జీవులు.. నేలపైకి రావడం ప్రారంభించాయి. ఇది జీవ పరిణామక్రమంలో మరో ముందడుగు అయ్యింది. నేలపైకి వచ్చిన జీవులు ఈత కొట్టలేవు కాబట్టి.. భూమిపై బతికేందుకు వీలుగా వాటికి కాళ్లు వచ్చాయి. మరికొన్ని జీవులు.. ఆకాశంలో ఎగిరేందుకు ప్రయత్నించాయి. వాటికి రెక్కలొచ్చాయి. ఇలా కోట్ల సంవత్సరాలు గడిచే కొద్దీ.. మనుగడ కోసం పోరాటం చేసే జీవులకు... అందుకు తగినట్లుగా మార్పులు వస్తున్నాయి. దీన్నే శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ జీవ పరిణామ క్రమ సిద్ధాంతం అంటారు.


కోతి నుంచి మనిషి రావడం అనేది కూడా ఒక్క రోజులో జరిగింది కాదు. చెట్లు ఎక్కుతూ, కొమ్మలు పట్టుకొని, అక్కడి పండ్లను తింటూ బతికే కోతుల్లో కొన్ని కొత్త జాతులు ఆవిర్భవించాయి. చింపాజీలు, ఒరంగుటాన్లు, గొరిల్లాల వంటివి అలా వచ్చినవే. ఆ తర్వాత వాటి నుంచి వచ్చిన జాతే మనిషి జాతి. కొత్తగా వచ్చే ప్రతి జాతీ.. దాని ముందు జాతి కంటే అన్ని రకాలుగా మెరుగుగా ఉంటుంది. అంతే తప్ప, అది ముందు జాతిని అంతం చెయ్యదు. అందువల్లే కోతులు ఇప్పటికీ ఉన్నాయి. ఇది జీవుల పరిణామ క్రమంలో జరిగే సహజ ప్రక్రియ. భవిష్యత్తులో మనిషిని మించిన జీవులు రావనే గ్యారెంటీ లేదు.


సృష్టిలో మరో ధర్మం కూడా ఉంది. ఏ జీవులైతే.. ప్రకృతిలో పరిస్థితులను తట్టుకొని నిలబడతాయో.. అవి మనుగడ సాగించగలుగుతాయి. తట్టుకోలేని జీవులు అంతరించిపోతాయి. డోడో పక్షి, టాస్మేనియా టైగర్, ఆఫ్రికా మమ్మోత్ ఏనుగులు, డైనోసార్లు వంటి చాలా జీవులు ఇలాగే అంతరించిపోయాయి.


29, మార్చి 2024, శుక్రవారం

Are Peanuts better than egg? - గుడ్డు కంటే పల్లీలే గొప్పవా?

 


మనలో చాలా మంది ప్రోటీన్ కోసం గుడ్లు తింటారు. ఐతే.. గుడ్ల కంటే వేరుశనగలు బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. పల్లీలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కేజీ మాంసంలో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో, అన్ని ప్రోటీన్స్ వేరుశనగల్లోనూ ఉంటాయి. అలాగే కోడిగుడ్డు బరువుకి సమానమైన పల్లీలలో.. కోడిగుడ్డులో కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి. అందువల్ల ప్రోటీన్ కావాలనుకునేవారు, పల్లీలు తినడం బెటరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


మన దేశంలో వేరుశనగల కంటే.. వాటి నుంచి తీసే నూనె, డాల్డాను ఎక్కువగా వాడుతున్నారు. ఐతే.. పల్లీలు తినడానికి మాత్రమే కాదు.. వాటితో ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. సబ్బులు, నైట్రోగ్లిజరిన్, వార్నిష్, కలర్స్, పురుగుమందుల తయారీలో వీటిని వాడుతున్నారు. వేరుశనగల్లోని ప్రోటీన్‌తో దారాలు కూడా తయారుచేస్తున్నారు. వీటి తొక్కలతో సెల్యులోజ్‌ని చేస్తున్నారు. ఈ సెల్యులోజ్‌ని పేపర్, ప్లాస్టిక్, బోర్డుల తయారీకి వాడుతారు.


శరీరానికి కావాల్సిన శక్తి, ప్రొటీన్‌, పాస్ఫరస్‌, థెయామీన్‌, నియాసిన్‌ అనే పోషకాలు పల్లీల్లో ఉంటాయి. ఎ, బి, సి, ఇ సహా 13 రకాల విటమిన్లూ, ఐరన్‌, కాల్షియం, జింక్‌, బోరాన్‌.. వంటి 26 రకాల కీలక ఖనిజాలూ ఈ పప్పుల్లో ఉంటాయి. అలాగే గుండెకు మేలు చేసే మోనో అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు కూడా ఈ గింజల్లో లభిస్తాయి. 


స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీ, క్యారెట్, బీట్‌రూట్ కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు పల్లీలలో ఉంటాయి. వేరుశనగలు క్యాన్సర్‌ను అడ్డుకోగలవు. అలాగే ముసలితనం త్వరగా రాకుండా చెయ్యగలవు. పిల్లల ఎదుగుదలకు ఇవి చాలా అవసరం. ఇలా పల్లీలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా, వీటిలో 70 శాతం ఉండే శాచురేటెడ్, 15 శాతం ఉండే పాలి అన్‌శాచురేటెడ్ కొవ్వులు.. పెద్దవారికి కీడు చేస్తాయి. అందువల్ల రోజూ ఓ గుప్పెడు పల్లీలు తింటే ఆరోగ్యానికి మంచిదనీ, అంతకంటే ఎక్కువ తింటే అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.


28, మార్చి 2024, గురువారం

Why mosquitoes bite pregnant women more? - దోమలు ఎందుకు గర్భిణులను ఎక్కువగా కుడతాయి?

 


ప్రపంచంలో దోమలు అన్ని దేశాల్లో ఉన్నాయి. రిపోర్టుల ప్రకారం.. అంటార్కిటికా, ఐస్‌లాండ్‌లో మాత్రమే దోమలు లేవు. మైనస్ ఉష్ణోగ్రతల వల్లే అక్కడ దోమలు లేవని తెలుస్తోంది. ఐతే.. దోమలు ఎవర్ని ఎక్కువగా కుడతాయి? వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం.


దోమలు చెమట పట్టిన వారిని ఎక్కువగా కుడతాయి. ఎందుకంటే.. చెమటలో ఉండే అమ్మోనియా, లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్ అంటే దోమలకు ఇష్టం. అందువల్ల దోమలు కుట్టకూడదంటే, చెమట పట్టకుండా చూసుకోవాలి. అలాగే దోమలకు కార్బన్ డై ఆక్సైడ్ అంటే ఇష్టం. ఎవరైతే ఎక్కువగా శ్వాస తీసుకుంటూ ఉంటారో, వారు ఎక్కువగా కార్బన్ డై ఆక్సై్డ్ వదులుతారు. అలాంటి వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. అధిక బరువు ఉన్నవారు, గర్భిణులు ఎక్కువగా కార్బన్ డై ఆక్సైడ్ రిలీజ్ చేస్తారు. అలాగే గర్భిణులకు చెమట కూడా ఎక్కువగా పడుతుంది. అందువల్ల వారిపై దోమలు 21 శాతం ఎక్కువగా దాడిచేస్తాయని పరిశోధనల్లో తేలింది.


దోమలు డార్క్ కలర్ డ్రెస్సులకు ఎట్రాక్ట్ అవుతాయి. ఎవరైతే రెడ్, బ్లాక్, నేవీ బ్లూ కలర్ డ్రెస్సులు వేసుకుంటారో, దోమలు వారిని ముందుగా కుడతాయి. అందువల్ల దోమలకు దొరకకూడదంటే, లైట్ కలర్ డ్రెస్సులు వేసుకోవాలి.


మద్యం తాగేవారిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఎందుకంటే, మద్యం తాగాక వారికి ఎక్కువగా చెమట పడుతుంది. అందువల్ల మద్యానికి దూరంగా ఉంటే, దోమల నుంచి కూడా తప్పించుకోవచ్చు. బ్లడ్ గ్రూప్‌లలో O బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఏ, బీ గ్రూపుల వారిపై తక్కువగా దాడి చేస్తాయి. చర్మంపై గాయాలు, కురుపులూ ఉంటే.. అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది. అలాంటి చోటికి దోమలు ఎక్కువగా వెళ్తాయి. అందువల్ల గాయాలను త్వరగా తగ్గించుకోవాలి.


మొత్తంగా సాయంత్రం వేళ స్నానం చేసి, లైట్ కలర్ డ్రెస్ వేసుకొని, చెమట పట్టకుండా చూసుకునేవారిపై దోమల దాడి తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.


27, మార్చి 2024, బుధవారం

Why didn't Moon fall on the ground? చందమామ ఎందుకు భూమిపై పడట్లేదు?

 


మనం ఒక రాయిని పైకి ఎగరేస్తే.. అది మళ్లీ భూమిపై పడుతుంది. కారణం భూమికి ఉండే గురుత్వాకర్షణ బలం. కానీ చందమామ మాత్రం.. భూమి చుట్టూ తిరుగుతుందే తప్ప.. భూమిపై పడట్లేదు. ఇలా ఎందుకు అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. కారణం తెలుసుకుందాం.


భూమికి ఉండే గ్రావిటీ పవర్ వల్లే.. చందమామ భూమి చుట్టూ తిరుగుతుంది. ఐతే.. ఈ గురుత్వాకర్షణ బలం.. వస్తువు ఎంత దూరంలో ఉంది, ఎంత బరువుతో ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దగ్గరగా ఉండే వస్తువులను భూమి బలంగా తనవైపు లాక్కుంటుంది. దూరంగా ఉండే వస్తువులపై గ్రావిటీ పవర్ తక్కువగా ఉంటుంది. చందమామ భూమికి 

3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల.. దానిపై గ్రావిటీ పవర్ తక్కువగా ఉంది. అలాగని పూర్తిగా గ్రావిటీ లేకుండా పోలేదు. అందువల్ల చందమామ భూమికి దూరంగా ఉన్నా.. పూర్తిగా వెళ్లిపోకుండా.. భూమి చుట్టూ తిరుగుతూ ఉంది.


చందమామ భూమిపై పడకుండా ఉండటానికి కారణం.. దాని పరిభ్రమణ వేగమే. భూమిపై ఉన్న వస్తువు.. భూమి గ్రావిటీ నుంచి తప్పించుకోవాలంటే అది సెకండ్‌కి 11 కిలోమీటర్లకు పైగా వేగం (Orbital velocity)తో వెళ్లాలి. మీరు ఒక రాయిని ఈ వేగంతో ఆకాశంలోకి విసిరితే.. ఆ రాయి.. కంటిన్యూగా అదే వేగంతో వెళ్తే.. అది భూమిపై పడదు. అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది. అలాగే చందమామ కూడా భూమి చుట్టూ సెకండ్‌కి 1 కిలోమీటర్ కంటే ఎక్కువ వేగంతో తిరుగుతోంది. చందమామపై భూమి గ్రావిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల.. అది సెకండ్‌కి 1 కిలోమీటర్ వేగంతో భూమి చుట్టూ తిరిగినా చాలు, అది భూమిపై పడదు. అలా కాకుండా చందమామ తిరగడం ఆగినా, వేగం తగ్గినా.. అది భూమిపై పడగలదు.


మనం ఒక బొంగరాన్ని తిప్పినప్పుడు.. అది వేగంగా తిరిగినంతసేపూ.. తిరుగుతూనే ఉంటుంది. వేగం తగ్గినా, తిరగడం ఆగినా.. అది పడిపోతుంది. ఇలాగే మనం ఒక బకెట్‌కి తాడు కట్టి.. దాన్ని మన చుట్టూ గుండ్రంగా తిప్పుతూ ఉంటే.. అలా తిప్పినంతసేపూ ఆ బకెట్... కింద పడదు. వేగం తగ్గించినా, తిప్పడం ఆపినా, ఆ బకెట్ భూమిపై పడిపోతుంది. ఇదే ఫార్ములా చందమామకూ వర్తిస్తుంది.


450 కోట్ల సంవత్సరాల కిందట చందమామ ఏర్పడినప్పుడు అది భూమికి 27 కిలోమీటర్ల దూరంలోనే ఉండేదని శాస్త్రవేత్తల అంచనా. ఐతే.. చందమామ క్రమంగా భూమికి దూరంగా వెళ్తోంది. ఇప్పుడు కూడా సంవత్సరానికి 3.78 సెంటీమీటర్లు భూమికి దూరం వెళ్తోంది. అంటే.. భవిష్యత్తులో చందమామ.. మరింత దూరంగా వెళ్లిపోతుంది అనుకోవచ్చు.


ఒకవేళ చందమామ భూమివైపు రావడం మొదలుపెడితే.. భూమికి 18,470 కిలోమీటర్ల దగ్గరకు రాగానే పేలిపోతుంది. ఈ దూరాన్ని రోచ్ లిమిట్ అంటారు. ఈ లిమిట్ దాటి ఏది లోపలికి వచ్చినా పేలిపోతుంది. అందుకే ఉల్కలు, తోకచుక్కల వంటివి.. రోచ్ లిమిట్ లోకి రాగానే ముక్కలవుతాయి. చందమామ కూడా అలా వచ్చి, ముక్కలైతే.. ఆ రాళ్లు అగ్ని గోళాల్లా భూమిపై పడతాయి. దాంతో భూమిపై నగరాలన్నీ నాశనం అవుతాయి. జీవులన్నీ చనిపోతాయి. భూభ్రమణంలో కూడా మార్పులొస్తాయి. భూమి తిరిగే వేగం తగ్గిపోతుంది. భూతాపం బాగా పెరిగిపోతుంది. అలలు 30 వేల అడుగుల ఎత్తుకు లేస్తాయి. రోజూ 10 సునామీలు వస్తాయి. చివరకు యుగాంతం వస్తుంది. లక్కీగా అలా జరిగే ప్రమాదం లేదు. చందమామ భూమిపై పడే ఛాన్స్ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.



25, మార్చి 2024, సోమవారం

Why and how oxygen is collected? - ఆక్సిజన్‌ను ఎందుకు, ఎలా సేకరిస్తారు?

 


గాలిలో మనకు కావాల్సినంత ఆక్సిజన్ ఉంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్‌ని సేకరించి, సిలిండర్లలో స్టోర్ చెయ్యాల్సి ఉంటుంది. ఆస్పత్రుల్లో పేషెంట్ల కోసం, సముద్రాల్లో డైవర్ల కోసం, పర్వతాలు ఎక్కేవారి కోసం, అంతరిక్షంలోకి వెళ్లే ఆస్ట్రోనాట్ల కోసం, రాకెట్లలో ఫ్యూయల్ కోసం ఇలా చాలా అవసరాల కోసం ఆక్సిజన్‌ను సేకరిస్తారు. ఇందుకు రెండు ప్రత్యేక ప్రక్రియలు ఉన్నాయి.


జనరల్‌గా గాలిలో 21 శాతం ఆక్సిజన్‌, 78 శాతం నైట్రోజన్‌, ఒక శాతం ఇతర వాయువులు ఉంటాయి. గాలిలో ఆక్సిజన్‌ అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని తొలిసారిగా లెవోషియర్‌, ప్రీస్ట్‌లీ అనే సైంటిస్టులు కనిపెట్టారు. రంగు, రుచి, వాసన లేని ఈ గ్యాస్.. భూమి పొరల్లో మెటల్ ఆక్సైడ్‌ (Metal oxide) రూపంలో 50 శాతం దాకా ఉంది. ఈ ఆక్సిజన్ వాయువుని చల్లబరిస్తే, మైనస్‌ 185 డిగ్రీల సెంటిగ్రేడు దగ్గర లైట్ బ్లూ కలర్ లిక్విడ్‌లా మారుతుంది. అలాగే మైనస్‌ 219 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు చల్లబరిస్తే, ఇది ఐస్ లాగా ఘనపదార్థంగా మారుతుంది.


ల్యాబ్‌లో పొటాషియం క్లోరేట్‌ (Potassium chlorate), మాంగనీస్‌ డై ఆక్సైడ్‌ (Manganese dioxide)ని కలిపి వేడి చేస్తే, ఆక్సిజన్‌ గ్యాస్ తయారవుతుంది. అలాగే గాలి నుంచి కూడా ఫ్రాక్షనల్ డిస్టిల్లేషన్ (Fractional Destillation) విధానంలో ఆక్సిజన్‌ని సేకరించవచ్చు. ఇందుకోసం గాలిపై ఒత్తిడిని 200 రెట్లు పెంచి, సన్నని కన్నం ద్వారా, ఒక రూంలోకి పంపిస్తారు. రూంలోకి వెళ్లాక ఒత్తిడి ఒక్కసారిగా పోతుంది. దాంతో గాలి, లిక్విడ్ లాగా మారుతుంది. ఆ తర్వాత ఆ లిక్విడ్ నుంచి నైట్రోజన్‌ గ్యాస్‌ని వేరు చేస్తారు. దాంతో ఆక్సిజన్‌ లిక్విడ్ రూపంలో లభిస్తుంది. దీన్ని గ్యాస్ లాగా మార్చి సిలిండర్లలో నింపుతారు. ఇలా ఈ భూమిపై సమస్త జీవ రాశికీ ప్రాణ వాయువుగా చెప్పుకునే ఆక్సిజన్ గ్యాస్‌ని ప్రత్యేక పద్ధతుల్లో రెండు రకాలుగా సేకరిస్తారు.


24, మార్చి 2024, ఆదివారం

Why walk in the morning? - ఉదయం వేళ ఎందుకు నడవాలి?

 


కొంతమంది ఉదయం వేళ వాకింగ్ చేస్తారు. కొంతమంది సాయంత్రం వేళ చేస్తారు. ఆరోగ్య నిపుణులు మాత్రం సాయంత్రం కంటే మార్నింగ్ వాకే బెటర్ అంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం.


రాత్రివేళ మనం నిద్రపోయినప్పుడు విశ్రాంతి లభిస్తుంది. ఈ సమయంలో మన శరీరంలోని అన్ని అవయవాలూ రెస్ట్ తీసుకుంటాయి. మార్నింగ్ లేచాక కూడా చేతులు, కాళ్లు సహా చాలా అవయవాలు అలాగే ఉంటాయి. వాటిని యాక్టివ్ చేసేందుకు వాకింగ్ సరైనది అని నిపుణులు తేల్చారు.


ఉదయం వేళ నడిచే సమయంలో.. బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తద్వారా గుండె నుంచి శరీర భాగాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఫలితంగా అన్ని అవయవాలూ ఆక్సిజన్ పొందుతూ ఆరోగ్యంగా ఉంటాయి. నడక గుండెకు చాలా మంచిదని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు.. నడక వల్ల చెమట పడుతుంది. దాంతో చర్మ కణాలు క్లీన్ అవుతాయి. మృత కణాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా చర్మంపై ముడతలు తగ్గి, యంగ్ లుక్‌తో కనిపిస్తాం. 


రాత్రివేళ వాహనాల రాకపోకలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఉదయాన్నే వాతావరణంలో వాయు కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాకింగ్ చేస్తే, ఆక్సిజన్ బాగా లభిస్తుంది. అదే సాయంత్రం వేళైతే.. వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈవెనింగ్ కంటే మార్నింగ్ వాకే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.