మనం ఒక రాయిని పైకి ఎగరేస్తే.. అది మళ్లీ భూమిపై పడుతుంది. కారణం భూమికి ఉండే గురుత్వాకర్షణ బలం. కానీ చందమామ మాత్రం.. భూమి చుట్టూ తిరుగుతుందే తప్ప.. భూమిపై పడట్లేదు. ఇలా ఎందుకు అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. కారణం తెలుసుకుందాం.
భూమికి ఉండే గ్రావిటీ పవర్ వల్లే.. చందమామ భూమి చుట్టూ తిరుగుతుంది. ఐతే.. ఈ గురుత్వాకర్షణ బలం.. వస్తువు ఎంత దూరంలో ఉంది, ఎంత బరువుతో ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దగ్గరగా ఉండే వస్తువులను భూమి బలంగా తనవైపు లాక్కుంటుంది. దూరంగా ఉండే వస్తువులపై గ్రావిటీ పవర్ తక్కువగా ఉంటుంది. చందమామ భూమికి
3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల.. దానిపై గ్రావిటీ పవర్ తక్కువగా ఉంది. అలాగని పూర్తిగా గ్రావిటీ లేకుండా పోలేదు. అందువల్ల చందమామ భూమికి దూరంగా ఉన్నా.. పూర్తిగా వెళ్లిపోకుండా.. భూమి చుట్టూ తిరుగుతూ ఉంది.
చందమామ భూమిపై పడకుండా ఉండటానికి కారణం.. దాని పరిభ్రమణ వేగమే. భూమిపై ఉన్న వస్తువు.. భూమి గ్రావిటీ నుంచి తప్పించుకోవాలంటే అది సెకండ్‌కి 11 కిలోమీటర్లకు పైగా వేగం (Orbital velocity)తో వెళ్లాలి. మీరు ఒక రాయిని ఈ వేగంతో ఆకాశంలోకి విసిరితే.. ఆ రాయి.. కంటిన్యూగా అదే వేగంతో వెళ్తే.. అది భూమిపై పడదు. అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది. అలాగే చందమామ కూడా భూమి చుట్టూ సెకండ్‌కి 1 కిలోమీటర్ కంటే ఎక్కువ వేగంతో తిరుగుతోంది. చందమామపై భూమి గ్రావిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల.. అది సెకండ్‌కి 1 కిలోమీటర్ వేగంతో భూమి చుట్టూ తిరిగినా చాలు, అది భూమిపై పడదు. అలా కాకుండా చందమామ తిరగడం ఆగినా, వేగం తగ్గినా.. అది భూమిపై పడగలదు.
మనం ఒక బొంగరాన్ని తిప్పినప్పుడు.. అది వేగంగా తిరిగినంతసేపూ.. తిరుగుతూనే ఉంటుంది. వేగం తగ్గినా, తిరగడం ఆగినా.. అది పడిపోతుంది. ఇలాగే మనం ఒక బకెట్‌కి తాడు కట్టి.. దాన్ని మన చుట్టూ గుండ్రంగా తిప్పుతూ ఉంటే.. అలా తిప్పినంతసేపూ ఆ బకెట్... కింద పడదు. వేగం తగ్గించినా, తిప్పడం ఆపినా, ఆ బకెట్ భూమిపై పడిపోతుంది. ఇదే ఫార్ములా చందమామకూ వర్తిస్తుంది.
450 కోట్ల సంవత్సరాల కిందట చందమామ ఏర్పడినప్పుడు అది భూమికి 27 కిలోమీటర్ల దూరంలోనే ఉండేదని శాస్త్రవేత్తల అంచనా. ఐతే.. చందమామ క్రమంగా భూమికి దూరంగా వెళ్తోంది. ఇప్పుడు కూడా సంవత్సరానికి 3.78 సెంటీమీటర్లు భూమికి దూరం వెళ్తోంది. అంటే.. భవిష్యత్తులో చందమామ.. మరింత దూరంగా వెళ్లిపోతుంది అనుకోవచ్చు.
ఒకవేళ చందమామ భూమివైపు రావడం మొదలుపెడితే.. భూమికి 18,470 కిలోమీటర్ల దగ్గరకు రాగానే పేలిపోతుంది. ఈ దూరాన్ని రోచ్ లిమిట్ అంటారు. ఈ లిమిట్ దాటి ఏది లోపలికి వచ్చినా పేలిపోతుంది. అందుకే ఉల్కలు, తోకచుక్కల వంటివి.. రోచ్ లిమిట్ లోకి రాగానే ముక్కలవుతాయి. చందమామ కూడా అలా వచ్చి, ముక్కలైతే.. ఆ రాళ్లు అగ్ని గోళాల్లా భూమిపై పడతాయి. దాంతో భూమిపై నగరాలన్నీ నాశనం అవుతాయి. జీవులన్నీ చనిపోతాయి. భూభ్రమణంలో కూడా మార్పులొస్తాయి. భూమి తిరిగే వేగం తగ్గిపోతుంది. భూతాపం బాగా పెరిగిపోతుంది. అలలు 30 వేల అడుగుల ఎత్తుకు లేస్తాయి. రోజూ 10 సునామీలు వస్తాయి. చివరకు యుగాంతం వస్తుంది. లక్కీగా అలా జరిగే ప్రమాదం లేదు. చందమామ భూమిపై పడే ఛాన్స్ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.