మనలో చాలా మంది ప్రోటీన్ కోసం గుడ్లు తింటారు. ఐతే.. గుడ్ల కంటే వేరుశనగలు బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. పల్లీలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కేజీ మాంసంలో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో, అన్ని ప్రోటీన్స్ వేరుశనగల్లోనూ ఉంటాయి. అలాగే కోడిగుడ్డు బరువుకి సమానమైన పల్లీలలో.. కోడిగుడ్డులో కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి. అందువల్ల ప్రోటీన్ కావాలనుకునేవారు, పల్లీలు తినడం బెటరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మన దేశంలో వేరుశనగల కంటే.. వాటి నుంచి తీసే నూనె, డాల్డాను ఎక్కువగా వాడుతున్నారు. ఐతే.. పల్లీలు తినడానికి మాత్రమే కాదు.. వాటితో ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. సబ్బులు, నైట్రోగ్లిజరిన్, వార్నిష్, కలర్స్, పురుగుమందుల తయారీలో వీటిని వాడుతున్నారు. వేరుశనగల్లోని ప్రోటీన్‌తో దారాలు కూడా తయారుచేస్తున్నారు. వీటి తొక్కలతో సెల్యులోజ్‌ని చేస్తున్నారు. ఈ సెల్యులోజ్‌ని పేపర్, ప్లాస్టిక్, బోర్డుల తయారీకి వాడుతారు.
శరీరానికి కావాల్సిన శక్తి, ప్రొటీన్, పాస్ఫరస్, థెయామీన్, నియాసిన్ అనే పోషకాలు పల్లీల్లో ఉంటాయి. ఎ, బి, సి, ఇ సహా 13 రకాల విటమిన్లూ, ఐరన్, కాల్షియం, జింక్, బోరాన్.. వంటి 26 రకాల కీలక ఖనిజాలూ ఈ పప్పుల్లో ఉంటాయి. అలాగే గుండెకు మేలు చేసే మోనో అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు కూడా ఈ గింజల్లో లభిస్తాయి.
స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీ, క్యారెట్, బీట్‌రూట్ కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు పల్లీలలో ఉంటాయి. వేరుశనగలు క్యాన్సర్‌ను అడ్డుకోగలవు. అలాగే ముసలితనం త్వరగా రాకుండా చెయ్యగలవు. పిల్లల ఎదుగుదలకు ఇవి చాలా అవసరం. ఇలా పల్లీలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా, వీటిలో 70 శాతం ఉండే శాచురేటెడ్, 15 శాతం ఉండే పాలి అన్‌శాచురేటెడ్ కొవ్వులు.. పెద్దవారికి కీడు చేస్తాయి. అందువల్ల రోజూ ఓ గుప్పెడు పల్లీలు తింటే ఆరోగ్యానికి మంచిదనీ, అంతకంటే ఎక్కువ తింటే అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.