ప్రపంచంలో దోమలు అన్ని దేశాల్లో ఉన్నాయి. రిపోర్టుల ప్రకారం.. అంటార్కిటికా, ఐస్‌లాండ్‌లో మాత్రమే దోమలు లేవు. మైనస్ ఉష్ణోగ్రతల వల్లే అక్కడ దోమలు లేవని తెలుస్తోంది. ఐతే.. దోమలు ఎవర్ని ఎక్కువగా కుడతాయి? వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం.
దోమలు చెమట పట్టిన వారిని ఎక్కువగా కుడతాయి. ఎందుకంటే.. చెమటలో ఉండే అమ్మోనియా, లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్ అంటే దోమలకు ఇష్టం. అందువల్ల దోమలు కుట్టకూడదంటే, చెమట పట్టకుండా చూసుకోవాలి. అలాగే దోమలకు కార్బన్ డై ఆక్సైడ్ అంటే ఇష్టం. ఎవరైతే ఎక్కువగా శ్వాస తీసుకుంటూ ఉంటారో, వారు ఎక్కువగా కార్బన్ డై ఆక్సై్డ్ వదులుతారు. అలాంటి వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. అధిక బరువు ఉన్నవారు, గర్భిణులు ఎక్కువగా కార్బన్ డై ఆక్సైడ్ రిలీజ్ చేస్తారు. అలాగే గర్భిణులకు చెమట కూడా ఎక్కువగా పడుతుంది. అందువల్ల వారిపై దోమలు 21 శాతం ఎక్కువగా దాడిచేస్తాయని పరిశోధనల్లో తేలింది.
దోమలు డార్క్ కలర్ డ్రెస్సులకు ఎట్రాక్ట్ అవుతాయి. ఎవరైతే రెడ్, బ్లాక్, నేవీ బ్లూ కలర్ డ్రెస్సులు వేసుకుంటారో, దోమలు వారిని ముందుగా కుడతాయి. అందువల్ల దోమలకు దొరకకూడదంటే, లైట్ కలర్ డ్రెస్సులు వేసుకోవాలి.
మద్యం తాగేవారిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఎందుకంటే, మద్యం తాగాక వారికి ఎక్కువగా చెమట పడుతుంది. అందువల్ల మద్యానికి దూరంగా ఉంటే, దోమల నుంచి కూడా తప్పించుకోవచ్చు. బ్లడ్ గ్రూప్‌లలో O బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఏ, బీ గ్రూపుల వారిపై తక్కువగా దాడి చేస్తాయి. చర్మంపై గాయాలు, కురుపులూ ఉంటే.. అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది. అలాంటి చోటికి దోమలు ఎక్కువగా వెళ్తాయి. అందువల్ల గాయాలను త్వరగా తగ్గించుకోవాలి.
మొత్తంగా సాయంత్రం వేళ స్నానం చేసి, లైట్ కలర్ డ్రెస్ వేసుకొని, చెమట పట్టకుండా చూసుకునేవారిపై దోమల దాడి తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.