మన శరీరంలో అరచేతులు ప్రత్యేకమైనవి. వీటిపై గీతలు ఉంటాయి. వాటిపై ఆధారపడి ఏకంగా హస్తసాముద్రిక శాస్త్రం కూడా ఉంది. ఈ గీతల ఆధారంగా కొంతమంది మన భవిష్యత్తును చెబుతుంటారు. ఐతే, వారు చెప్పే దానికి శాస్త్రీయ ఆధారాలు లేవన్నది హేతువాదుల వాదన. ఇంతకీ ఈ గీతలు ఎందుకు ఏర్పడతాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
తల్లి గర్భంలో శిశువు తయారయ్యే సమయంలో ఈ గీతలు ఏర్పడతాయి. ఎందుకంటే.. అరచేతులకు ముడుచుకునే స్వభావం ఉంటుంది. గర్భంలో చేతులు తయారయ్యే సమయంలో శిశువు.. తన అర చేతులను ఎలా మడిస్తే, అలా గీతలు ఏర్పడతాయి. అందుకే ఈ గీతలు అందరికీ ఒకేలా కనిపించవు. మనం మన అరచేతులను మడిచి చూస్తే.. ఎక్కడ అరచెయ్యి వంగుతుంతో, అక్కడ ఆ గీతలు స్పష్టంగా కనిపిస్తాయి.
అరచేతిలో ముడుచుకునే కీళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ ఎముకలకు తగినట్లుగా చర్మం ఏర్పడుతుంది. కీళ్లను మడిచేటప్పుడు.. చర్మం కూడా మడతపడుతుంది. ఆ సమయంలో గీతలు ఉన్న చోట చర్మం లోపలికి వెళ్తుంది. ఇలా జరగడానికి కారణం నార కణాలు. వీటిని ఇంగ్లీష్‌లో ఫైబ్రోస్ టిష్యూ (fibrous tissue) అంటాం. చేతులను ముడిచేటప్పుడు ఈ నార కణాలు.. చర్మాన్ని గుంజి, లోపలికి లాగుతాయి. ఇవి ఏయే ప్రాంతాల్లో లోపలికి లాగుతాయో, ఆ ప్రాంతాల్లో అరచేతి రేఖలు ఏర్పడతాయి.
నిజానికి అరచేతిలో ఏ గీతలూ ఉండవు. అరచేతిని మడిచినప్పుడు, చర్మం ముడుచుకోవడం వల్ల అక్కడ గీతల్లా కనిపిస్తాయి. దీని వెనక నార కణాలు పనిచేస్తూ ఉంటాయి. అవే లేకపోతే.. అరచేతి చర్మం పనితీరు సరిగా ఉండుదు. అందువల్ల ఈ గీతలు ఎంత ఎక్కువగా ఉంటే, అంత మంచిది అనుకోవచ్చు.