9, మార్చి 2024, శనివారం

Why Yellow colour not good for Kitchen? వంటగదిలో పసుపు రంగు ఉండకూడదా?

 


మన ఇంట్లో ఏ గదికి ఏ కలర్ పెయింట్ ఉండాలో మనమే డిసైడ్ చేసుకుంటాం. మనకు నచ్చే కలర్స్ వేయించుకుంటాం. అదే వాస్తు నిపుణులను అడిగితే, వారు వాస్తు శాస్త్రం ఆధారంగా సలహాలు ఇస్తారు. ఐతే.. సైంటిఫిక్ కోణంలో చూస్తే, వంటగదిలో పసుపు రంగు ఉండకూడదు. అది పెయింటే కాదు.. వస్తువులు కూడా ఎల్లో కలర్‌లో ఉండకూడదు. అందుకే మార్కెట్‌లో లభించే కిచెన్ ఐటెమ్స్ జనరల్‌గా పసుపు రంగులో ఉండవు.


కిచెన్‌లో పసుపు రంగు ఉంటే.. అక్కడికి బొద్దింకలు వస్తాయి. సాధారణంగా బొద్దింకలు చీకటి ప్రదేశాల్లో ఉంటాయి. అవి పసుపు రంగును చూడలేువు. వాటి కళ్లకు ఎల్లో కలర్‌ని చూసే సామర్థ్యం లేదు. అందువల్ల పసుపు రంగు వాటికి నలుపు రంగులా కనిపిస్తుంది. అందువల్ల అది చీకటి ప్రదేశం అని భావించి, ఎల్లో కలర్ ఉన్న చోటికి బొద్దింకలు ఎక్కువగా వస్తాయి. అందువల్ల కిచెన్‌లో ఆ కలర్ లేకుండా చూసుకోవాలి. 


మీకు కిచెన్‌లో బొద్దింకల సమస్య ఎక్కువగా ఉంటే.. మీరు చిన్న చిట్కాలతో వాటిని బయటకు పంపవచ్చు. వాటికి నీరు దొరకకుండా చేస్తే, వారంలో పూర్తిగా బొద్దింకలు వెళ్లిపోతాయి. లేదంటే పలావు ఆకులను పొడిలా చేసి, బొద్దింకలు తిరిగేచోట చల్లాలి. బిర్యానీ ఆకుల వాసన వాటికి అస్సలు నచ్చదు. అందువల్ల అవి చావకుండానే, వెళ్లిపోతాయి. ఇలా వాటిని చంపకుండానే, ఇంటి నుంచి బయటకు పంపవచ్చు.



8, మార్చి 2024, శుక్రవారం

Why some grapes has no seeds? కొన్ని ద్రాక్ష పండ్లలో గింజలు ఎందుకు ఉండవు?


కొబ్బరికాయ, పైనాపిల్‌లో గింజలుండవు. స్ట్రాబెర్రీలో గింజలు బయటివైపు ఉంటాయి. అరటి, ఫిగ్స్‌లో గింజలు ఉన్నా, మనం వాటిని తినడానికి ఇబ్బంది ఉండదు. ఐతే.. ద్రాక్షపండ్లు, బొప్పాయి, పుచ్చకాయ, యాపిల్ వంటి వాటిలో గింజలు ఉంటే, ఆ గింజలను తొలగించి తినడం ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ రోజుల్లో గింజలు లేని విధంగా పండ్లను పండిస్తున్నారు.


గింజలతో వచ్చే పండ్లు సహజసిద్ధమైనవి. కానీ మనం సీడ్‌లెస్ ఫ్రూట్సే ఎక్కువగా కొంటున్నాం. అందువల్ల రైతులు కూడా అలాంటి పంటలే పండిస్తున్నారు. ఇందుకోసం వారు క్లోనింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. అదేంటో తెలుసుకుందాం.


సాధారణంగా విత్తనాలను నేలలో పాతితే, మొక్కలు వస్తాయని మనకు తెలుసు. కానీ రైతులు, తీగలు లేదా చెట్ల కొమ్మలను నేలలో పాతి, మొక్కలు వచ్చేలా చేస్తున్నారు. ఈ పద్ధతిని 'క్లోనింగ్‌' అంటారు.


క్లోనింగ్‌ అంటే సహజమైన పద్ధతిలో కాకుండా.. కృత్రిమంగా ప్రాణులను సృష్టించడం. ఇలాంటి ప్రాణుల్లో జన్యుపరంగా కొన్ని మార్పులు చేస్తారు. తద్వారా ప్రాణి ఎలా ఉండాలని కోరుకుంటారో, అలా ఉండేలా చేస్తారు. మొక్కల విషయంలోనూ ఇలాగే చేస్తారు. అందువల్ల క్లోనింగ్ ప్రక్రియ ద్వారా పెరిగే చెట్లు, తీగలు.. గింజలు లేని ద్రాక్ష, పుచ్చకాయ, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్లను ఇస్తున్నాయి.


క్లోనింగ్ ఎలా చేస్తారు అన్నది గమనిస్తే, సహజ సిద్ధమైన చెట్టు లదా తీగ నుంచి ఒక చిన్న కొమ్మ లేదా తీగను కట్ చేసి, దాన్ని, ఆ చెట్టు వేర్లను ఉత్పత్తి చేసే హార్మోన్లలో ముంచుతారు. తర్వాత తడి మట్టిలో ఉంచుతారు. కొన్ని రోజుల తర్వాత ఆ కొమ్మకు భూమిలో వేర్లు, భూమి పైన ఆకులు వస్తాయి. గింజతో పనిలేకుండా వచ్చిన ఈ మొక్కకు వచ్చే పండ్లు కూడా, గింజలు లేకుండా వస్తాయి. 


ఎంత కృత్రిమంగా పెంచినా, ఒక్కోసారి క్లోనింగ్ మొక్కల పండ్లలో కూడా గింజలు వస్తాయి. కానీ వాటికి బలం ఉండదు. అందువల్ల అవి పెద్దగా పెరగలేవు, గట్టిగా అవ్వవు. చివరకు అవి పండు గుజ్జులో కలిసిపోతాయి. 


ఇంతకీ సహజ సిద్ధమైన, గింజలు ఉండే పండ్లు తింటే మంచిదా లేక, సీడ్‌లెస్ పండ్లు తిన్నా పర్వాలేదా? అనే ప్రశ్నకు కచ్చితమైన ఆన్సర్ లేదు. కొంతమంది నిపుణులు గింజలు ఉండేవి తింటేనే మంచిదనీ, వాటిలోనే ఎక్కువ ఫైబర్ ఉంటుంది అంటుంటే.. మరికొందరు గింజలు లేనివి తిన్నా పర్వాలేదని అంటున్నారు. అన్ని రకాల పండ్లూ ఆరోగ్యానికి మంచివే అంటున్నారు. అలాగే మరికొందరు.. సీడ్‌లెస్‌వి తినొద్దనీ, అవి సహజంగా వచ్చినవి కావని అంటున్నారు. ఇలా ఈ ప్రశ్నపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. 


7, మార్చి 2024, గురువారం

Can water clear the effect of Alcohol? - మద్యం మత్తు నీళ్లతో వదులుతుందా?

 


మద్యం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలా మంది తాగుతుంటారు. దానివల్ల వారికి మత్తు వచ్చి, మైండ్ సరిగా పనిచెయ్యదు. ఎంత మత్తు ఎక్కింది? వదిలేందుకు ఎంత టైమ్ పడుతుంది అనేది వారు ఎంత తాగారు? ఏం తాగారు? అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఐతే.. త్వరగా మత్తు వదిలిపోవాలంటే.. నీటితో వీలవుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


మద్యంలో చాలా వరకు నీరే ఉంటుంది. కొద్దిగా ఇథైల్‌ ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ ఎంత శాతం ఉంది అనే దాన్ని బట్టీ, ఆయా పానీయాల మత్తు తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఐతే.. ఇథైల్‌ ఆల్కహాల్ స్వయంగా మత్తు కలిగించలేదు. 


సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు.. ముందుగా జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత ఆహారం, రక్తంలో కలుస్తుంది. మద్యం విషయంలో ఇలా జరగదు. దీన్ని తాగినప్పుడు, జీర్ణం అవ్వాల్సిన పని లేకుండానే, కాసేపటికే రక్తంలో కలుస్తుంది.


రక్తంలో కలిసిన వెంటనే మద్యం.. శరీరంలోని కణ జాలాల్లోకి చాలా వేగంగా వెళ్తుంది. ఆ తర్వాత అది అసిటాల్డిహైడుగా మారుతుంది. ఇది చెడు వాసన కలిగివుంటుంది. అందుకే, మద్యం తాగిన వారి నుంచి చెడు వాసన వస్తూ ఉంటుంది. ఈ అసిటాల్డిహైడ్.. బ్రెయిన్ లోకి కూడా వెళ్తుంది. మెదడు కణాల్లో ఉన్న అమైనో యాసిడ్‌తో కలుస్తుంది. అప్పుడు బ్రెయిన్‌కి మత్తు వస్తుంది. (acetaldehyde)


అసిటాల్డిహైడ్ నీటిలో కరుగుతుంది. అందువల్ల, మద్యం తాగిన వారి మత్తు వదిలించేందుకు.. నిపుణుల పర్యవేక్షణలో, ముఖంపై నీరు చల్లవచ్చు. మత్తు మరీ ఎక్కువగా ఉంటే, నిపుణుల పర్యవేక్షణలో, ఓ బకెట్ నీళ్లు తెచ్చి, కుమ్మరించవచ్చు. దాంతో బట్టలు తడుస్తాయి. ఆ తడి చాలాసేపు ఉంటుంది. తడివల్ల.. చర్మ కణాల్లోని అసిటాల్డిహైడ్ నీటిలో కరుగుతుంది. దాంతో కొంత మత్తు వదిలిపోతుంది. అలాగే.. శరీరంలో వేడి కూడా తగ్గడం వల్ల, మత్తు ప్రభావం మరింత తగ్గుతుంది. 

Note: Alcohol is injurious to health


6, మార్చి 2024, బుధవారం

How insects fly in running Train?- కదులుతున్న రైల్లో పురుగులు ఎలా ఎగరగలుగుతున్నాయి?

 


జనరల్‌గా మనందరికీ బస్సులో జర్నీ కంటే, రైలు ప్రయాణం నచ్చుతుంది. ఎందుకంటే.. బస్సులు సిటీల్లో వెళ్తుంటాయి. రైళ్లు మాత్రం పచ్చిక బయళ్లు, కొండలు, ప్రకృతిలో వెళ్తుంటాయి. కిటికీ పక్కన కూర్చొని, అలా చూస్తుంటే, చెట్లు, ఇళ్లు, పొలాలూ అన్నీ వెనక్కి పారిపోతున్నట్లు కనిపిస్తాయి. ఆ ప్రయాణం కొంత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఐతే.. మీరెప్పుడైనా కదిలే రైల్లో ఈగలు, దోమలు, లైట్ పురుగులు ఎలా ఎగరగలుగుతున్నాయో ఆలోచించారా?


దోమలు, ఈగలతో పోల్చితే రైలు వేగం చాలా ఎక్కువ. కానీ ట్రైన్‌లో పురుగులు స్వేచ్ఛగా ఎగురుతాయి. అంటే, రైలు వేగంతో సమానంగా అవి ఎగురుతున్నట్లే. ఇది ఎలా సాధ్యం?


దీనికి కారణం స్థిరమైన వేగంతో ఉండే గాలి. అంటే.. రైలులో లేదా కారులో లేదా విమానంలో అన్ని డోర్లూ మూసివేశాక.. అవి వేగంగా వెళ్తున్నప్పుడు.. వాటిలోపలి గాలికి కూడా అదే స్థిరమైన వేగం ఉంటుంది. గాలి మాత్రమే కాదు.. లోపలున్న మనుషులు, వస్తువులు, పురుగులకు కూడా అదే వేగం ఉంటుంది. అందువల్ల అవి ఈగలు, దోమలూ స్వేచ్ఛగా ఎగరగలుగుతాయి.


రైలులో ఉన్నవారికి.. ఈగలు... రైలు వేగంతో ఎగురుతునట్లు అనిపించదు. అవి మామూలు వేగంతో ఎగురుతున్నట్లే అనిపిస్తుంది. కానీ బయటి నుంచి చూసేవారికి ఈ తేడా తెలుస్తుంది. కదిలే రైలును ఎవరైనా బయటి నుంచి చూస్తే.. వారు... రైలుతోపాటూ.. లోపలి మనుషులు, వస్తువులు, కీటకాలు కూడా అదే వేగంతో వెళ్తున్న అనుభూతిని పొందగలరు.


ఒక బంతి ద్వారా కూడా ఈ ప్రయోగం చేసి చూడవచ్చు. బయట ఎక్కడైనా బంతిని ఎగరేస్తే, అది తిరిగి మన చేతిలో పడుతుంది. ఇదే విధంగా కదిలే రైలులో చేస్తే.. బంతి గాలిలోకి ఎగిరి, తిరిగి వెనక్కి వచ్చేసరికి.. రైలు కొంత ముందుకి వెళ్తుంది కాబట్టి.. ఆ బంతి.. చేతిలో పడకుండా, వెనక్కి పడాలి. కానీ అలా జరగదు. అది చేతిలోనే పడుతుంది. ఎందుకంటే.. ఆ బంతి కూడా.. రైలు వేగంతో ముందుకి వెళ్తుంది కాబట్టే.


ఇదంతా డోర్లు మూసివేసినప్పుడు మాత్రమే. డోర్స్ ఓపెన్ చేస్తే, బయటి గాలి లోపలికి వస్తుంది. దాంతో లోపలున్న గాలి స్థిరమైన వేగంలో మార్పులొస్తాయి. అందువల్ల పురుగులు స్థిరమైన వేగంతో ఎగరలేవు. ఎగరేసిన బంతి కూడా, తిరిగి స్థిరంగా చేతిలో పడే అవకాశాలు తక్కువ.


5, మార్చి 2024, మంగళవారం

How does a diamond shine? - బొగ్గు నుంచి వచ్చే వజ్రం ఎలా మెరుస్తుంది?


వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అంటారు.. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటారు.. ఎందుకంటే డైమండ్ అత్యంత కఠినమైనది. ఐతే, ఈ వజ్రం బొగ్గు నుంచి వస్తుంది. బొగ్గు కఠినంగా ఉండదు. మరి డైమండ్ ఎందుకు ఉంటుంది? అసలు నల్లటి బొగ్గు నుంచి తెల్లటి వజ్రం ఎలా వస్తుంది? దానికి ఆ మెరుపులు ఎలా వస్తాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు డైమండ్స్ చుట్టూ ఉంటాయి.


బొగ్గు మూడు రూపాల్లో ఉంటుంది. సాధారణ బొగ్గు, గ్రాఫైట్, డైమండ్. సాధారణ బొగ్గు, గ్రాఫైట్ చూడటానికి నల్లగానే ఉంటాయి. రెండూ కఠినంగా ఉండవు. మరి వజ్రాలు ఎందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి? దీని వెనక బలమైన కారణం ఉంది.

 

సైంటిస్టుల ప్రకారం.. లక్షల సంవత్సరాల కిందట భూమి చల్లబడిన తర్వాత.. శిలాద్రవం భూమిలోపలి పొరల్లో వుండిపోయింది. కాలక్రమంలో ఉష్ణోగ్రత, ఇతర ఖనిజాల ఒత్తిడి వల్ల.. బొగ్గు మూలకాలు ఒకదానికొకటి అత్యంత దగ్గరకు చేరి, స్పటిక ఆకారాల్లోకి మారాయి. అవి స్వచ్ఛమైన కార్బన్ స్పటికలు. అవే వజ్రాలు. అలా అవి మారడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది.


వజ్రాలు గట్టిగా, కఠినంగా ఎలా మారుతున్నాయి అన్నదానికి మనం స్పాంజీని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్పాంజీని నొక్కితే.. చిన్నగా అవుతుంది. ఇంకా నొక్కితే మరింత చిన్నగా అవుతుంది. అలా నొక్కుతూ పోతే.. అది చిన్నగా అవుతూ, అవుతూ.. బాగా కుచించుకుపోతుంది. ఇక చిన్నగా అవ్వలేనంతగా నొక్కితే, అప్పుడు అది గట్టిగా అవుతుంది. ఇక దాన్ని నొక్కడానికి వీలవ్వదు. కొన్ని లక్షల సంవత్సరాలు ఇలా నొక్కుతూనే ఉంటే, మెత్తని స్పాంజీ కాస్తా.. గట్టి రాయిలా అయిపోతుంది. వజ్రం విషయంలోనూ ఇదే జరుగుతోంది. 


ఇక వజ్రానికి మెరుపు ఎలా వస్తుందంటే.. సాధారణంగా కార్బన్ స్పటికలకు మెరుపు అంతగా ఉండదు. వజ్రాల తయారీ నిపుణులు.. భూమిలో దొరికిన వజ్రాన్ని రెండుగా కోస్తారు. ఆ రెండు ముక్కలనూ.. రెండు వజ్రాల లాగా సానపడతారు. ఆ సమయంలో వజ్రాలకు కోణాలను ఏర్పరుస్తారు. కాంతి ఈ కోణాలపై పడినప్పుడు.. బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా వేర్వేరు కోణాల దగ్గర కాంతి ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ.. ఒక కోణం కాంతి, మరో కోణంపై ప్రసరిస్తూ, కోణాలన్నీ మెరుస్తూ, వజ్రం మెరుస్తున్నట్లు కనిపిస్తుంది.  


4, మార్చి 2024, సోమవారం

Does the wind leave the earth? - భూమిని వదిలి గాలి వెళ్లిపోతుందా?

 


గాలి లేని భూమిని ఊహించగలమా? కష్టం.. ఈ భూమిపై జీవం ఉండటానికి ప్రధాన కారణం గాలి. మనందరికీ ప్రతీ క్షణం గాలి కావాలి. మరి ఈ గాలి.. భూమిని వదిలి వెళ్లిపోతుందా? అలాంటి అవకాశం ఉందా?


భూమిపై వేడి, రాత్రిళ్లు అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది. మేఘాలు కూడా ఆకాశంలోకి వెళ్తాయి. మరి గాలి ఎందుకు వెళ్లదు? ఎందుకంటే గాలి బరువుగా ఉంటుంది కాబట్టే. జనరల్‌గా మనం గాలికి బరువు ఉండదు అనుకుంటాం. నిజానికి గాలికి కూడా బరువు ఉంటుంది. భూమి ఉపరితలంపై ఒక క్యూబిక్ మీటర్ ప్రదేశంలో గాలి బరువు 1కేజీ 300 గ్రాములు ఉంటుంది. అంటే మన దగ్గర ఒక క్యూబిక్ మీటర్ అట్టపెట్టె ఉంటే.. అది ఖాళీగా ఉన్నా, అందులో గాలికి బరువు ఉన్నట్లే. ఐతే.. ఈ గాలి అన్ని ప్రదేశాల్లో ఒకే బరువుతో ఉండదు. అంటే.. భూమి ఉపరితలంపై ఎక్కువ బరువు, ఆకాశంలోకి వెళ్లే కొద్దీ తక్కువ బరువుతో ఉంటుంది.


ప్రత్యేక కారణాల వల్ల.. ఎక్కువ బరువు ఉన్న గాలి.. తక్కువ బరువు ఉన్న గాలి వైపు వెళ్తుంది. అందువల్ల మనకు తరచూ గాలి కదులుతున్న, వీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా గాలి కదలడం వల్లే మనకు సుడిగాలులు, తుఫాన్ల వంటివి వస్తుంటాయి. 


భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి, బరువైన వాటిని తనవైపు లాక్కుంటుంది. గాలి బరువు కంటే, భూమి బరువు ఎక్కువ. అందువల్ల గాలిని నిరంతరం గురుత్వాకర్షణ శక్తి లాగుతూనే ఉంటుంది. ఈ కారణంగానే గాలి భూమితోనే ఉంటోంది. భూమికి గ్రావిటీ పవర్ లేకపోతే, గాలి ఎప్పుడో విశ్వంలోకి వెళ్లిపోయేది. భూమి భూమిలా ఉన్నంతకాలం, గ్రావిటీ పవర్ తగ్గనంతకాలం గాలి ఉంటుంది.


ఇంతకీ ఈ గాలి ఎంతవరకూ ఉందో తెలుసా? భూమి ఉపరితలం నుంచి సుమారు 30 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉంది. ఈ గాలిలో బరువైన గాలి.. మొదటి 10 కిలోమీటర్లలోనే ఉంది. అంటే, మొత్తం గాలిలో 75 శాతం గాలి.. 10 కిలోమీటర్ల ఎత్తులోనే ఉంది. మిగతా 20 కిలోమీటర్ల ఎత్తులో 25 శాతం గాలి ఉంది. 


చందమామపై ఎయిర్ ఎందుకు లేదు అనేది మరో ప్రశ్న. చందమామపై ఉండే గ్రావిటీ.. గాలిని లాక్కునేంత బలంగా లేదు. అందువల్ల అక్కడ గాలి లేదు. 


3, మార్చి 2024, ఆదివారం

Why we cannot hear sounds of Sun - సూర్యుడి పేలుళ్ల శబ్దాలు మనకు ఎందుకు వినిపించవు?

 


మన చుట్టుపక్కల ఎవరైనా క్రేకర్స్ కాల్చితే.. ఆ శబ్దాలు మనకు తీవ్రంగా వినిపిస్తాయి. అలాగే ఎక్కడో కిలోమీటర్ల అవతల ట్రైన్ కూత పెడితే.. అది కూడా మనకు వినిపిస్తుంది. ఇలా రకరకాల ధ్వనులను మనం వింటూ ఉంటాం. మరి అంతరిక్షంలో సూర్యుడిపై క్షణక్షణం భారీ పేలుళ్లు జరుగుతూ ఉంటాయి. ఆ శబ్దాలు మనకు ఎందుకు వినిపించవు?


మన సౌర కుటుంబంలో సూర్యుడు కేంద్రం. మన భూమి, ప్రాణికోటి మనుగడకు సూర్యుడే ఆధారం. సూర్యుడిలో ప్రధానంగా ఉండేది రెండే వాయువులు. ఒకటి హైడ్రోజన్, రెండు హీలియం. హైడ్రోజన్ సుమారు 75 శాతం ఉండగా.. మిగతాది హీలియం ఉంటుంది. కేంద్రక సంలీన చర్య వల్ల, ప్రతి సెకనుకూ సుమారు 60 వేల టన్నుల హైడ్రోజన్‌ పరమాణువులు, హీలియం పరమాణువులుగా మారుతాయి. ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంత సూత్రమైన E = mc2 ప్రకారం, 60వేల టన్నుల హైడ్రోజన్.. హీలియంగా మారినప్పుడు, దాదాపు 420 టన్నుల ద్రవ్యరాశి, శక్తిగా మారుతుంది. దాన్నే మనం సోలార్ పవర్‌గా చెబుతాం. మరి ఒక్క సెకన్‌లోనే అంత ఎనర్జీ వస్తే, ఎంత పెద్ద పేలుళ్లు జరిగివుండాలి? మరి మనకు ఆ శబ్దాలు ఎందుకు వినిపించవు?


సూర్య గోళం ఏడు లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంటుంది. సూర్యుడిలో 10 లక్షల భూములు పట్టగలవు. ఐతే.. సూర్యుడిలో కేంద్రక సంలీన చర్య.. పై భాగంలో జరగదు. అంతర్భాగంలో 2లక్షల కిలోమీటర్లలోపే జరుగుతుంది. ఆ తర్వాత పుట్టే ఎనర్జీ లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, ఉపరితలానికి చేరుతుంది. అది చాలా వేడిగా.. ఉడుకుతూ ఉంటుంది. అక్కడ వేడి దాదాపు 5,600 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంత వేడి ఎనర్జీ ఉందంటే.. లోపల ఎంత పెద్ద పేలుళ్లు జరుగుతాయో ఊహకందదు. భూమి బద్ధలైనట్లుగా భారీ శబ్దాలు వస్తుంటాయి. వాటిని వినడం మనవల్ల కాదు. 


లక్కీగా సూర్యుడి పేలుళ్ల శబ్దాలు భూమి వరకూ రావు. ఎందుకంటే సూర్యుడు మనకు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అంతరిక్షం అంతా శూన్యమే. శూన్యంలో కాంతి ప్రసరిస్తుంది గానీ, శబ్దం ప్రయాణించలేదు. అందువల్ల సూర్యుడి శబ్దాలు శూన్యంలో ప్రయాణించి, మన భూమికి రాలేవు. అందుకే అంతరిక్షంలో వ్యోమగాములు గట్టిగా అరిచినా, పక్కనే ఉన్నవాళ్లకు కూడా వినిపించదు.