జనరల్‌గా మనందరికీ బస్సులో జర్నీ కంటే, రైలు ప్రయాణం నచ్చుతుంది. ఎందుకంటే.. బస్సులు సిటీల్లో వెళ్తుంటాయి. రైళ్లు మాత్రం పచ్చిక బయళ్లు, కొండలు, ప్రకృతిలో వెళ్తుంటాయి. కిటికీ పక్కన కూర్చొని, అలా చూస్తుంటే, చెట్లు, ఇళ్లు, పొలాలూ అన్నీ వెనక్కి పారిపోతున్నట్లు కనిపిస్తాయి. ఆ ప్రయాణం కొంత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఐతే.. మీరెప్పుడైనా కదిలే రైల్లో ఈగలు, దోమలు, లైట్ పురుగులు ఎలా ఎగరగలుగుతున్నాయో ఆలోచించారా?
దోమలు, ఈగలతో పోల్చితే రైలు వేగం చాలా ఎక్కువ. కానీ ట్రైన్‌లో పురుగులు స్వేచ్ఛగా ఎగురుతాయి. అంటే, రైలు వేగంతో సమానంగా అవి ఎగురుతున్నట్లే. ఇది ఎలా సాధ్యం?
దీనికి కారణం స్థిరమైన వేగంతో ఉండే గాలి. అంటే.. రైలులో లేదా కారులో లేదా విమానంలో అన్ని డోర్లూ మూసివేశాక.. అవి వేగంగా వెళ్తున్నప్పుడు.. వాటిలోపలి గాలికి కూడా అదే స్థిరమైన వేగం ఉంటుంది. గాలి మాత్రమే కాదు.. లోపలున్న మనుషులు, వస్తువులు, పురుగులకు కూడా అదే వేగం ఉంటుంది. అందువల్ల అవి ఈగలు, దోమలూ స్వేచ్ఛగా ఎగరగలుగుతాయి.
రైలులో ఉన్నవారికి.. ఈగలు... రైలు వేగంతో ఎగురుతునట్లు అనిపించదు. అవి మామూలు వేగంతో ఎగురుతున్నట్లే అనిపిస్తుంది. కానీ బయటి నుంచి చూసేవారికి ఈ తేడా తెలుస్తుంది. కదిలే రైలును ఎవరైనా బయటి నుంచి చూస్తే.. వారు... రైలుతోపాటూ.. లోపలి మనుషులు, వస్తువులు, కీటకాలు కూడా అదే వేగంతో వెళ్తున్న అనుభూతిని పొందగలరు.
ఒక బంతి ద్వారా కూడా ఈ ప్రయోగం చేసి చూడవచ్చు. బయట ఎక్కడైనా బంతిని ఎగరేస్తే, అది తిరిగి మన చేతిలో పడుతుంది. ఇదే విధంగా కదిలే రైలులో చేస్తే.. బంతి గాలిలోకి ఎగిరి, తిరిగి వెనక్కి వచ్చేసరికి.. రైలు కొంత ముందుకి వెళ్తుంది కాబట్టి.. ఆ బంతి.. చేతిలో పడకుండా, వెనక్కి పడాలి. కానీ అలా జరగదు. అది చేతిలోనే పడుతుంది. ఎందుకంటే.. ఆ బంతి కూడా.. రైలు వేగంతో ముందుకి వెళ్తుంది కాబట్టే.
ఇదంతా డోర్లు మూసివేసినప్పుడు మాత్రమే. డోర్స్ ఓపెన్ చేస్తే, బయటి గాలి లోపలికి వస్తుంది. దాంతో లోపలున్న గాలి స్థిరమైన వేగంలో మార్పులొస్తాయి. అందువల్ల పురుగులు స్థిరమైన వేగంతో ఎగరలేవు. ఎగరేసిన బంతి కూడా, తిరిగి స్థిరంగా చేతిలో పడే అవకాశాలు తక్కువ.