8, మార్చి 2024, శుక్రవారం

Why some grapes has no seeds? కొన్ని ద్రాక్ష పండ్లలో గింజలు ఎందుకు ఉండవు?


కొబ్బరికాయ, పైనాపిల్‌లో గింజలుండవు. స్ట్రాబెర్రీలో గింజలు బయటివైపు ఉంటాయి. అరటి, ఫిగ్స్‌లో గింజలు ఉన్నా, మనం వాటిని తినడానికి ఇబ్బంది ఉండదు. ఐతే.. ద్రాక్షపండ్లు, బొప్పాయి, పుచ్చకాయ, యాపిల్ వంటి వాటిలో గింజలు ఉంటే, ఆ గింజలను తొలగించి తినడం ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ రోజుల్లో గింజలు లేని విధంగా పండ్లను పండిస్తున్నారు.


గింజలతో వచ్చే పండ్లు సహజసిద్ధమైనవి. కానీ మనం సీడ్‌లెస్ ఫ్రూట్సే ఎక్కువగా కొంటున్నాం. అందువల్ల రైతులు కూడా అలాంటి పంటలే పండిస్తున్నారు. ఇందుకోసం వారు క్లోనింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. అదేంటో తెలుసుకుందాం.


సాధారణంగా విత్తనాలను నేలలో పాతితే, మొక్కలు వస్తాయని మనకు తెలుసు. కానీ రైతులు, తీగలు లేదా చెట్ల కొమ్మలను నేలలో పాతి, మొక్కలు వచ్చేలా చేస్తున్నారు. ఈ పద్ధతిని 'క్లోనింగ్‌' అంటారు.


క్లోనింగ్‌ అంటే సహజమైన పద్ధతిలో కాకుండా.. కృత్రిమంగా ప్రాణులను సృష్టించడం. ఇలాంటి ప్రాణుల్లో జన్యుపరంగా కొన్ని మార్పులు చేస్తారు. తద్వారా ప్రాణి ఎలా ఉండాలని కోరుకుంటారో, అలా ఉండేలా చేస్తారు. మొక్కల విషయంలోనూ ఇలాగే చేస్తారు. అందువల్ల క్లోనింగ్ ప్రక్రియ ద్వారా పెరిగే చెట్లు, తీగలు.. గింజలు లేని ద్రాక్ష, పుచ్చకాయ, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్లను ఇస్తున్నాయి.


క్లోనింగ్ ఎలా చేస్తారు అన్నది గమనిస్తే, సహజ సిద్ధమైన చెట్టు లదా తీగ నుంచి ఒక చిన్న కొమ్మ లేదా తీగను కట్ చేసి, దాన్ని, ఆ చెట్టు వేర్లను ఉత్పత్తి చేసే హార్మోన్లలో ముంచుతారు. తర్వాత తడి మట్టిలో ఉంచుతారు. కొన్ని రోజుల తర్వాత ఆ కొమ్మకు భూమిలో వేర్లు, భూమి పైన ఆకులు వస్తాయి. గింజతో పనిలేకుండా వచ్చిన ఈ మొక్కకు వచ్చే పండ్లు కూడా, గింజలు లేకుండా వస్తాయి. 


ఎంత కృత్రిమంగా పెంచినా, ఒక్కోసారి క్లోనింగ్ మొక్కల పండ్లలో కూడా గింజలు వస్తాయి. కానీ వాటికి బలం ఉండదు. అందువల్ల అవి పెద్దగా పెరగలేవు, గట్టిగా అవ్వవు. చివరకు అవి పండు గుజ్జులో కలిసిపోతాయి. 


ఇంతకీ సహజ సిద్ధమైన, గింజలు ఉండే పండ్లు తింటే మంచిదా లేక, సీడ్‌లెస్ పండ్లు తిన్నా పర్వాలేదా? అనే ప్రశ్నకు కచ్చితమైన ఆన్సర్ లేదు. కొంతమంది నిపుణులు గింజలు ఉండేవి తింటేనే మంచిదనీ, వాటిలోనే ఎక్కువ ఫైబర్ ఉంటుంది అంటుంటే.. మరికొందరు గింజలు లేనివి తిన్నా పర్వాలేదని అంటున్నారు. అన్ని రకాల పండ్లూ ఆరోగ్యానికి మంచివే అంటున్నారు. అలాగే మరికొందరు.. సీడ్‌లెస్‌వి తినొద్దనీ, అవి సహజంగా వచ్చినవి కావని అంటున్నారు. ఇలా ఈ ప్రశ్నపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.