5, మార్చి 2024, మంగళవారం

How does a diamond shine? - బొగ్గు నుంచి వచ్చే వజ్రం ఎలా మెరుస్తుంది?


వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అంటారు.. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటారు.. ఎందుకంటే డైమండ్ అత్యంత కఠినమైనది. ఐతే, ఈ వజ్రం బొగ్గు నుంచి వస్తుంది. బొగ్గు కఠినంగా ఉండదు. మరి డైమండ్ ఎందుకు ఉంటుంది? అసలు నల్లటి బొగ్గు నుంచి తెల్లటి వజ్రం ఎలా వస్తుంది? దానికి ఆ మెరుపులు ఎలా వస్తాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు డైమండ్స్ చుట్టూ ఉంటాయి.


బొగ్గు మూడు రూపాల్లో ఉంటుంది. సాధారణ బొగ్గు, గ్రాఫైట్, డైమండ్. సాధారణ బొగ్గు, గ్రాఫైట్ చూడటానికి నల్లగానే ఉంటాయి. రెండూ కఠినంగా ఉండవు. మరి వజ్రాలు ఎందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి? దీని వెనక బలమైన కారణం ఉంది.

 

సైంటిస్టుల ప్రకారం.. లక్షల సంవత్సరాల కిందట భూమి చల్లబడిన తర్వాత.. శిలాద్రవం భూమిలోపలి పొరల్లో వుండిపోయింది. కాలక్రమంలో ఉష్ణోగ్రత, ఇతర ఖనిజాల ఒత్తిడి వల్ల.. బొగ్గు మూలకాలు ఒకదానికొకటి అత్యంత దగ్గరకు చేరి, స్పటిక ఆకారాల్లోకి మారాయి. అవి స్వచ్ఛమైన కార్బన్ స్పటికలు. అవే వజ్రాలు. అలా అవి మారడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది.


వజ్రాలు గట్టిగా, కఠినంగా ఎలా మారుతున్నాయి అన్నదానికి మనం స్పాంజీని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్పాంజీని నొక్కితే.. చిన్నగా అవుతుంది. ఇంకా నొక్కితే మరింత చిన్నగా అవుతుంది. అలా నొక్కుతూ పోతే.. అది చిన్నగా అవుతూ, అవుతూ.. బాగా కుచించుకుపోతుంది. ఇక చిన్నగా అవ్వలేనంతగా నొక్కితే, అప్పుడు అది గట్టిగా అవుతుంది. ఇక దాన్ని నొక్కడానికి వీలవ్వదు. కొన్ని లక్షల సంవత్సరాలు ఇలా నొక్కుతూనే ఉంటే, మెత్తని స్పాంజీ కాస్తా.. గట్టి రాయిలా అయిపోతుంది. వజ్రం విషయంలోనూ ఇదే జరుగుతోంది. 


ఇక వజ్రానికి మెరుపు ఎలా వస్తుందంటే.. సాధారణంగా కార్బన్ స్పటికలకు మెరుపు అంతగా ఉండదు. వజ్రాల తయారీ నిపుణులు.. భూమిలో దొరికిన వజ్రాన్ని రెండుగా కోస్తారు. ఆ రెండు ముక్కలనూ.. రెండు వజ్రాల లాగా సానపడతారు. ఆ సమయంలో వజ్రాలకు కోణాలను ఏర్పరుస్తారు. కాంతి ఈ కోణాలపై పడినప్పుడు.. బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా వేర్వేరు కోణాల దగ్గర కాంతి ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ.. ఒక కోణం కాంతి, మరో కోణంపై ప్రసరిస్తూ, కోణాలన్నీ మెరుస్తూ, వజ్రం మెరుస్తున్నట్లు కనిపిస్తుంది.