గాలి లేని భూమిని ఊహించగలమా? కష్టం.. ఈ భూమిపై జీవం ఉండటానికి ప్రధాన కారణం గాలి. మనందరికీ ప్రతీ క్షణం గాలి కావాలి. మరి ఈ గాలి.. భూమిని వదిలి వెళ్లిపోతుందా? అలాంటి అవకాశం ఉందా?
భూమిపై వేడి, రాత్రిళ్లు అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది. మేఘాలు కూడా ఆకాశంలోకి వెళ్తాయి. మరి గాలి ఎందుకు వెళ్లదు? ఎందుకంటే గాలి బరువుగా ఉంటుంది కాబట్టే. జనరల్‌గా మనం గాలికి బరువు ఉండదు అనుకుంటాం. నిజానికి గాలికి కూడా బరువు ఉంటుంది. భూమి ఉపరితలంపై ఒక క్యూబిక్ మీటర్ ప్రదేశంలో గాలి బరువు 1కేజీ 300 గ్రాములు ఉంటుంది. అంటే మన దగ్గర ఒక క్యూబిక్ మీటర్ అట్టపెట్టె ఉంటే.. అది ఖాళీగా ఉన్నా, అందులో గాలికి బరువు ఉన్నట్లే. ఐతే.. ఈ గాలి అన్ని ప్రదేశాల్లో ఒకే బరువుతో ఉండదు. అంటే.. భూమి ఉపరితలంపై ఎక్కువ బరువు, ఆకాశంలోకి వెళ్లే కొద్దీ తక్కువ బరువుతో ఉంటుంది.
ప్రత్యేక కారణాల వల్ల.. ఎక్కువ బరువు ఉన్న గాలి.. తక్కువ బరువు ఉన్న గాలి వైపు వెళ్తుంది. అందువల్ల మనకు తరచూ గాలి కదులుతున్న, వీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా గాలి కదలడం వల్లే మనకు సుడిగాలులు, తుఫాన్ల వంటివి వస్తుంటాయి.
భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి, బరువైన వాటిని తనవైపు లాక్కుంటుంది. గాలి బరువు కంటే, భూమి బరువు ఎక్కువ. అందువల్ల గాలిని నిరంతరం గురుత్వాకర్షణ శక్తి లాగుతూనే ఉంటుంది. ఈ కారణంగానే గాలి భూమితోనే ఉంటోంది. భూమికి గ్రావిటీ పవర్ లేకపోతే, గాలి ఎప్పుడో విశ్వంలోకి వెళ్లిపోయేది. భూమి భూమిలా ఉన్నంతకాలం, గ్రావిటీ పవర్ తగ్గనంతకాలం గాలి ఉంటుంది.
ఇంతకీ ఈ గాలి ఎంతవరకూ ఉందో తెలుసా? భూమి ఉపరితలం నుంచి సుమారు 30 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉంది. ఈ గాలిలో బరువైన గాలి.. మొదటి 10 కిలోమీటర్లలోనే ఉంది. అంటే, మొత్తం గాలిలో 75 శాతం గాలి.. 10 కిలోమీటర్ల ఎత్తులోనే ఉంది. మిగతా 20 కిలోమీటర్ల ఎత్తులో 25 శాతం గాలి ఉంది.
చందమామపై ఎయిర్ ఎందుకు లేదు అనేది మరో ప్రశ్న. చందమామపై ఉండే గ్రావిటీ.. గాలిని లాక్కునేంత బలంగా లేదు. అందువల్ల అక్కడ గాలి లేదు.