8, ఏప్రిల్ 2024, సోమవారం

How to make electricity from coal? - బొగ్గుతో కరెంట్ ఎలా తయారుచేస్తారు?


బొగ్గు నల్లగా ఉంటుంది. దాన్ని మనం రకరకాలుగా వాడుకుంటూ ఉంటాం. ఐతే.. ఆ బొగ్గుతో కరెంటు ఎలా ఉత్పత్తి చేస్తారు అనే డౌట్ మనకు ఉంటుంది. ఆ ప్రక్రియ తెలుసుకుందాం.


పెట్రోల్, డీజిల్ ఎలాంటిదో బొగ్గు కూడా అలాంటిదే. అంటే.. ఇది ఒక ఇంధనం లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా ఎక్కువగా కెమికల్ ఎనర్జీ ఉంటుంది. ఆ కెమికల్ ఎనర్జీని వాడుకొని.. ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. ఈ పని థెర్మల్ పవర్ స్టేషన్లలో జరుగుతుంది. ఇండియాలోని NTPC, KTPS, RTPP, STPP వంటి వాటిలో ఇదే జరుగుతుంది.


గనుల్లో దొరికే బొగ్గు క్లీన్‌గా ఉండదు. అందువల్ల దాన్ని ముందుగా క్లీన్ చేస్తారు. తర్వాత ఎండబెడతారు. తడి పోయిన తర్వాత ఆ బొగ్గును థెర్మల్ పవర్ స్టేషన్లలో మండిస్తారు. ఇలా మండించినప్పుడు, ఆ వేడి నుంచి నీరు, ఆవిరి రూపంలో వస్తుంది. ఈ ఆవిరిపై విపరీతమైన ప్రెషర్ పెట్టి.. గొట్టాల ద్వారా వెళ్లేలా చేస్తారు. గొట్టాల చివర టర్బైన్లు ఉంటాయి. నీటి ఆవిరి వేగంగా వెళ్లడంతో టర్బైన్లపై ప్రెషర్ ఏర్పడి అవి గిరగిరా తిరుగుతాయి.


టర్బైనులో విద్యుత్ అయస్కాంత స్తూపం ఉంటుంది. ఈ పిల్లర్.. సెకండ్‌కి 50 సార్లు తిరుగుతుంది. ఈ టర్బైన్‌లో ఉన్న అయస్కాంత క్షేత్రంలో కరెంటు తీగలు ఉంటాయి. టర్బైన్ తిరిగినప్పుడు ఈ తీగలు కదులుతాయి. ఫారడే సూత్రం ప్రకారం.. తీగలు కదిలినప్పుడు ఆల్టర్నేటింగ్ కరెంట్ (AC) పుడుతుంది. ఇలా బొగ్గును ఇంధనంలా వాడి, టర్బైన్లు తిరిగేలా చేసి, తద్వారా కరెంటు ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. 


7, ఏప్రిల్ 2024, ఆదివారం

Why won't the horse sit? - గుర్రం ఎందుకు కూర్చోదు?

 


ఈ ప్రకృతికి ఓ ధర్మం ఉంది. అది ఏ జీవికైనా.. అవసరమైనంతవరకే అవయవాల్ని ఇస్తుంది. అదనంగా ఏదీ ఇవ్వదు. ఉదాహరణకు మనుషులనే తీసుకుంటే, మనకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మనకు ఎగరాల్సిన అవసరం లేదు. తప్పనిసరై ఎగరాలి అనుకుంటే.. అందుకు కావాల్సిన తెలివితేటలు మనకు ప్రకృతి సిద్ధంగా వచ్చాయి. మన చేతికి 5 వేళ్లు ఉంటాయి. వాటిలో ఒకటి తక్కువైనా సమస్యే, ఒకటి ఎక్కువగా ఉన్నా సమస్యే. అదనపు వేలు వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. 


చేపలు మాట్లాడలేవు. ఒకవేళ మాట్లాడినా నీటిలో ఆ మాటలు ఇతర చేపలకు సరిగా వినిపించవు. అందువల్ల ప్రకృతి వాటికి మాటలు ఇవ్వలేదు. మాటలతో వాటికి పనిలేదు. పాముకి కాళ్లు లేవు. అయినా అది వేగంగా వెళ్లేలా ఏర్పాటు ఉంది. తాబేలుకి డిప్ప, జిరాఫీకి పొడవైన మెడ, గబ్బిలానికి ధ్వని తరంగాలు, గద్దకు శక్తిమంతమైన చూపు, ఇలా ఈ సృష్టిలో ప్రతీ జీవీ.. తనకు ఉన్న ప్రత్యేకతలతో హాయిగా జీవించేలా ఏర్పాట్లు ఉన్నాయి. గుర్రం విషయంలోనూ ఇదే జరుగుతోంది.


మన ఇళ్ల దగ్గర ఆవు, గేదె, మేక లాంటి జంతువులు నేల మీద నాలుగు కాళ్లనీ ముడుచుకుని కూర్చోవడం చూస్తుంటాం. ఒంటె, ఏనుగు లాంటి పెద్ద జంతువులు నేలపై కూర్చొని సేద తీరుతాయి. తద్వారా వాటి కాళ్ల కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. కానీ గుర్రానికి అలా కూర్చోవాల్సిన అవసరం లేదు.


వేగంగా పరుగెత్తగల జంతువుగా గుర్రం ఫేమస్. హార్స్ రేసుల్లో గుర్రాలు దూసుకెళ్తాయి. వేగంతో పాటు అనేక కిలోమీటర్ల దూరం పరుగెత్తినా అలసిపోని శక్తి గుర్రం సొంతం. అందుకు కారణం దాని కాళ్లలోని కండరాలు చాలా బలంగా, దృఢంగా ఉండటమే. 


గుర్రం మూడు కాళ్లపై కూడా నిలబడగలదు. తద్వారా అది ఒక కాలుకి విశ్రాంతి ఇవ్వగలదు. అలా అది వన్ బై వన్ కాళ్లకు విశ్రాంతి ఇస్తుంది. దాంతో కూర్చోవాల్సిన అవసరం లేకుండానే కాళ్ల కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. గుర్రం నిలబడి నిద్రపోగలదు కూడా. కొన్ని సందర్భాల్లో మాత్రం హార్స్ పూర్తిగా పక్కకు ఒరిగి నిద్రపోతుంది. ఇలా ఈ సృష్టి గుర్రానికి ఈ ప్రత్యేకతను ఇచ్చింది.



5, ఏప్రిల్ 2024, శుక్రవారం

Strange Facts - వింతలు - విచిత్రాలు - 3

 


సముద్రం నీరు ఉప్పగా ఉంటుందని మనకు తెలుసు. ఆ నీటిని తెచ్చి, ఫ్రిజ్‌లో పెట్టి గడ్డకట్టిస్తే, ఆ తర్వాత గడ్డలను కరిగిస్తే వచ్చే నీరు ఉప్పగా కాకుండా మామూలుగా ఉంటుంది. దీన్నే బ్రిన్ రిజెక్షన్ (Brine rejection) అంటారు. నీరు గడ్డకట్టేటప్పుడు క్రిస్టల్ ఆకారంలోకి మారుతుంది. ఇలాంటి ఆకారంలోకి ఉప్పు మారలేదు. అందువల్ల ఉప్పు.. ఆ ఐస్ క్యూబ్ లో ఉండదు. అందువల్ల ఐస్ క్యూబ్ కరిగిన తర్వాత.. ఆ నీరు సాల్టీగా ఉండదు.


క్లౌన్ చేపలు ఆడవి, మగవిగా, మగ చేపలు ఆడవిగా మారగలవు. ఇది ఈ చేపల్లో ప్రత్యేకత. ఈ చేపల్లో 30 రకాల జాతులను గుర్తించారు. ఇవి ఎల్లో, ఆరెంజ్, రెడ్డిష్, బ్లాకిష్ కలర్స్‌లో ఉంటాయి. ఇవి 18 సెంటీమీటర్ల వరకూ పెరుగుతాయి.


ఖండాలు సంవత్సరానికి 2 సెంటీమీటర్లు కదులుతున్నాయి. భారత ఉపఖండం మాత్రం సంవత్సరానికి 5 సెంటీమీటర్లు కదులుతోంది. ఇది ఆగ్నేయ దిశగా కదులుతోంది. అందువల్ల నార్త్ ఈస్ట్ ఇండియా చైనాలోకి చొచ్చుకెళ్తోంది. 


శరీరంలో 1 కేజీ కొవ్వు, 7,700 కేలరీల ఎనర్జీ కలిగివుంటుంది. ఈ లెక్కన బరువు తగ్గాలి అనుకునేవారు.. 1 కేజీ బరువు తగ్గాలంటే.. 7,700 కేలరీలను తగ్గించుకోవాలి. ఐతే.. మగవారికి రోజూ 2500 కేలరీలు అవసరం, మహిళలకు 2000 కేలరీలు అవసరం. వీటిని మెయింటేన్ చేస్తూ, కొవ్వును కరిగించుకుంటే, ఆరోగ్యంగా ఉంటారు.


భారత కరెన్సీ నోటు చిరిగేముందు కనీసం 4000 మంది చేతులు మారుతుందని అంచనా


సాధారణంగా మనం నిమిషానికి 20 సార్లు కనురెప్పలను ఆడిస్తాం. మనకు తెలియకుండానే ఇలా చేస్తాం. ఐతే.. కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ముందు పనిచేసేవారు మాత్రం నిమిషానికి 7 నుంచి 9 సార్లు మాత్రమే కనురెప్పలను ఆడిస్తారు. ఇది కళ్లకు సమస్యే.


కంగారూలు వెనక్కి నడవలేవు. కారణం వాటి కాళ్ల నిర్మాణం వెనక్కి నడిచేందుకు అనుకూలంగా ఉండదు. ఐతే.. కంగారూలు బలమైన కాళ్లు, తోక వల్ల ఒకేసారి 10 అడుగుల వరకూ గెంతగలవు.


4, ఏప్రిల్ 2024, గురువారం

Secret of Eagle vision - గద్ద చూపులో ఎన్నో ప్రత్యేకతలు

 


మన తెలుగు రాష్ట్రాల్లో గద్దలు ఎక్కువగా కనిపించవుగానీ.. కర్ణాటకలో ఎక్కడ చూసినా అవే ఉంటాయి. డేగ చూపు పవర్‌ఫుల్ అని మనకు తెలుసు. దాని ప్రత్యేకతలు తెలుసుకుందాం.


మనుషుల కంటి చూపు కంటే, పక్షుల కంటి చూపులో ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గద్దల్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు గద్దని గమనిస్తే, దాని కనుగుడ్లు విశాలంగా, పొడవుగా ఉంటాయి. అంటే.. కనుగుడ్డులో కంటి కటకానికీ, రెటీనాకీ మధ్య విశాలమైన ప్రదేశం ఉంటుంది.


మనుషులతో పోల్చితే, పక్షుల రెటీనాలలో జ్ఞాన సంబంధిత జీవ కణాలు (sensory cells) ఎక్కువగా ఉంటాయి. పైగా అవి రెటీనాలో సమానంగా వ్యాపించి ఉంటాయి. అందువల్ల గద్ద పైనుంచి ఎగురుతూ చాలా ఎక్కువ భూవైశాల్యాన్ని చూడగలదు. 


గద్దకు ప్రతీదీ మనకంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. మన కంటికి కనిపించని వాటిని కూడా గద్ద చూడగలదు. మనం ఏదైనా చూసినప్పుడు.. ఆ దృశ్యం ప్రతిబింబం.. మన కంటిలో ఏర్పడుతుంది. గద్దకూ ఇలా జరుగుతుంది. కాకపోతే గద్ద కంటిలో ఏర్పడే ప్రతిబింబం చాలా స్పష్టంగా ఉంటుంది. మన కంటిలో కంటే, గద్ద కంటిలో ఈ ప్రతిబింబ కణాలు 8 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే గద్ద దూరంగా ఉండే వాటిపై కూడా అతి త్వరగా దృష్టిని కేంద్రీకరించగలుగుతుంది.


కంటిలోని ద్రవాల కదలికల వల్ల మనం సెకనుకు 25 ప్రతిబింబాలను చూడగలం. గద్ద సెకనుకు 150 ప్రతిబింబాలను చూడగలుగుతుంది. అంతేకాదు.. మన కంటికి కనిపించని అతినీల లోహిత కిరణాలను (ultra violet rays) గద్ద చూడగలదు. అందువల్ల కోడిపిల్ల రెట్ట వేస్తే, ఆ రెట్ట నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాల్ని గద్ద ఆకాశం నుంచి చూస్తుంది. దాంతో.. అక్కడో కోడి పిల్ల ఉన్నట్లు గద్దకు తెలిసిపోతుంది. ఇలా ఈగిల్ ఫోకస్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది.


3, ఏప్రిల్ 2024, బుధవారం

Why cattle ruminate? - పశువులు ఎందుకు నెమరు వేస్తాయి?

 


మన ఇళ్ల దగ్గర మీరు గమనించే ఉంటారు, ఆవులు, గేదెల వంటివి ఆహారం నెమరు వేస్తూ ఉంటాయి. అవి అలా ఎందుకు చేస్తాయో, నెమరు వేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.


మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఆది కడుపులోకి వెళ్లిపోతుంది. దాన్ని మనం మళ్లీ పైకి తీసుకురాలేం. అలా తీసుకొస్తే, వామ్టింగ్ అయిపోతుంది. కానీ ఆవులు, గేదెలు, ఎద్దుల వంటి వాటి విషయంలో ఇది భిన్నంగా జరుగుతుంది. అవి తిన్న ఆహారాన్ని మళ్లీ తిరిగి నోటిలోకి తెచ్చుకోగలవు. అలా తెచ్చుకొని, బాగా నములుతాయి. దాన్నే మనం నెమరువేస్తున్నాయి అంటాం. దీనికి ప్రత్యేక కారణం ఉంది.


మనం మనకు కావాల్సిన ఆహారాన్ని ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాం. తద్వారా ఎప్పుడు ఎంత కావాలంటే అంత తింటాం. కానీ పశువులు అలా స్టాక్ పెట్టుకోలేవు కదా.. అందుకే ప్రకృతి వాటికి ప్రత్యేక ఏర్పాటు ఇచ్చింది. అవి తమ పొట్టలోని జీర్ణాశయంలో ఆహారాన్ని స్టాక్ పెట్టుకుంటాయి. ఎలా అంటే.. వాటి జీర్ణాశయంలో 4 గదులు ఉంటాయి. అక్కడ స్టాక్ ఉంచుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వడానికి 3 రోజులు పడుతుంది.


పశువులు పొలానికి వెళ్లినప్పుడు గడ్డి, ఇతర మేతను నమలకుండా డైరెక్టుగా మింగేస్తాయి. ఆ ఆహారం వాటి జీర్ణాశయంలోని మొదటి గది అయిన ర్యూమన్‌ (rumen)లోకి వెళ్తుంది. అక్కడ మెత్తగా అయ్యి, కొంతవరకూ జీర్ణమవుతుంది. జీర్ణం కాని ఆహారాన్ని పశువులు తిరిగి నోట్లోకి తెచ్చుకుంటాయి. దాన్ని బాగా నములుతాయి. మెత్తగా అయ్యేలా చేస్తాయి. అదే నెమరువెయ్యడం అంటే.


నెమరు వేసిన తర్వాత మెత్తబడిన ఆహారం, జీర్ణాశయంలోని రెండో గది అయిన రెటిక్యులమ్‌ (reticulum)లోకి వెళ్తుంది. ఆ తర్వాత మూడో గది అయిన ఒమేసమ్‌ (omasum)లోకి వెళ్తుంది. చివరిగా నాలుగో గది అయిన అబోమేసమ్‌ (abomesum)లోకి వెళ్తుంది. ఆ తర్వాత పూర్తిగా జీర్ణమవుతుంది. ఇలా పశువులకు ప్రకృతి.. ప్రత్యేక ప్రక్రియను ఇచ్చింది.


2, ఏప్రిల్ 2024, మంగళవారం

Strange Facts - వింతలు - విచిత్రాలు - 2


మొసలి నేలపై తిన్నగా మాత్రమే నడవగలదు. పక్కకు తిరిగి నడవడం దానికి చాలా కష్టం. ఎప్పుడైనా మొసలి వెంటపడితే.. తిన్నగా పరుగెత్తకుండా.. అటూ ఇటూ జిగ్‌జాగ్‌గా పరుగెత్తాలి. అప్పుడు మొసలి పట్టుకోలేదు.


మిడతల్లో కొన్ని కలర్స్ మార్చుకోగలవు, మరికొన్ని పరిస్థితులను బట్టీ తమ ప్రవర్తనను కూడా మార్చుకుంటాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మిడతల కాలి కండరాలు మనిషి కాలి కండరాల కంటే.. దాదాపు 1000 రెట్లు బలంగా ఉంటాయి.


ఆరోగ్యంగా ఉండే మనిషిలో 5 గ్రాముల దాకా ఇనుము ఉంటుంది. ఇందులో సగం ఎర్రరక్త కణాలలోనే ఉంటుంది. ఈ ఇనుముతో 3 అంగుళాల మేకును తయారుచెయ్యవచ్చు.


మనిషి శరీరంలో ఉండే కార్బన్‌తో 900 పెన్సిల్స్ తయారుచెయ్యవచ్చు.


సింహం గర్జన 8 కిలోమీటర్ల దూరం వినిపిస్తుంది. ఎందుకంటే.. సింహం గర్జన నుంచి 114 డెసిబెల్స్ సౌండ్ వస్తుంది. అదే మనిషి అరుపు నుంచి మాగ్జిమం 65 డెసిబెల్స్ సౌండ్ వస్తుంది. మనం 80 డెసిబెల్స్ వరకూ సేఫ్‌గా వినగలం. ధ్వని అంతకంటే పెరిగితే.. వినడం కష్టమే.


తూనీగలు 30 కోట్ల సంవత్సరాల నుంచి భూమిపై ఉన్నాయి. అదే భూమిపై మనిషి పుట్టి 60 లక్షల సంవత్సరాలే అయ్యింది. 


బొద్దింకలు ఆహారం లేకుండా నెల పాటూ జీవించగలవు. నీరు లేకుండా వారం పాటూ ఉండగలవు. అలాగే బొద్దింక నీటిలోపల మునిగివున్నా 15 నిమిషాలపాటు బతికి ఉండగలదు.


బబుల్‌గమ్‌ నమిలేటప్పుడు మన గుండె కొట్టుకునే వేగం మామూలుగా కంటే, కాస్త పెరుగుతుంది. ఎందుకంటే చ్యూయింగ్ గమ్ నమిలేటప్పుడు, 8 దవడ ఎముకలు కదులుతాయి. అది కూడా ఒక రకమైన ఎక్సర్‌సైజ్ లాంటిదే. అందువల్ల హార్ట్ బీట్ పెరుగుతుంది.


సూర్యుడి చుట్టూ భూమి రోజూ 24 లక్షల కిలోమీటర్లు తిరుగుతోంది. సెకండ్‌కి 29 కిలోమీటర్లకు పైగా వేగంతో భూమి తిరుగుతోంది. అదే మిల్కీ వే గెలాక్సీలో భూమి తిరిగే వేగం సెకండ్‌కి 200 కిలోమీటర్లుగా ఉంది. భూమితోపాటూ సూర్యుడు, ఇతర గ్రహాలు కూడా అదే వేగంతో పాలపుంత గెలాక్సీలో తిరుగుతున్నాయి.


1, ఏప్రిల్ 2024, సోమవారం

Why sweat before rain? - వర్షం వచ్చే ముందు ఉక్కపోత ఎందుకు?

 


సాధారణంగా వర్షం వచ్చే ముందు వాతావరణం చల్లబడుతుంది. చల్లని గాలి వీస్తుంది. పరిసరాలు ఆహ్లాదకరంగా మారతాయి. ఐతే.. ఆ సమయంలో మనకు చెమట పట్టి, ఉక్కగా అనిపిస్తుంది. అలా ఎందుకో తెలుసుకుందాం.


భారీ వర్షం వచ్చే ముందు మనకు చెమట ఎక్కువగా పడుతుంది. ఇలా ఎందుకంటే.. చెమట పట్టడం అనేది చర్మం పై భాగంలో కంటిన్యూగా జరిగే ప్రక్రియ. అంటే.. చర్మం కింద ఉండే స్వేద గ్రంధులు.. నిరంతరం చెమటను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఆ చెమట.. చర్మం పైభాగానికి నిరంతరం వస్తూనే ఉంటుంది. అది వాతావరణంలోని వేడిని గ్రహించి.. ఆవిరిగా మారి.. గాలిలో కలిసిపోతుంది. వేడి వాతావరణం ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. గాలిలో నీటి శాతం అంటే తేమ ఎంత ఉంది అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది.


గాలిలో తేమ తక్కువగా ఉంటే.. చెమట త్వరగా ఆవిరి అవుతుంది. అప్పుడు మనకు ఉక్కగా అనిపించదు. అదే గాలిలో తేమ ఎక్కువగా ఉంటే.. చెమట త్వరగా ఆవిరి అవ్వదు. వర్షం వచ్చే ముందు గాలిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ గాలిలో మరింత నీరు పట్టదు. అందువల్ల చెమట.. గాలిలో ఆవిరి అవ్వదు. అప్పుడు చర్మంపైకి వచ్చే చెమట, ఆవిరి అవ్వకుండా అక్కడే ఉండిపోతుంది. అదే సమయంలో చల్లని తేమ వాతావరణాన్ని తట్టుకునేందుకు శరీరం వేడెక్కుతుంది. దాంతో చర్మంపై చెమట క్రమంగా పెరుగుతూ ఉంటే.. మనకు ఉక్కపోస్తున్నట్లు అనిపిస్తుంది.