17, ఏప్రిల్ 2024, బుధవారం

What percentage of gold is in 22 carat jewellery? - 22 క్యారెట్ల నగలలో బంగారం ఎంత శాతం ఉంటుంది?

 


మనందరికీ తెలుసు.. 22 క్యారెట్ల నగలలో బంగారం వంద శాతం ఉండదు అని. మరి ఎంత శాతం ఉంటుంది? అసలు ఈ క్యారెట్ లెక్క ఎందుకు? తెలుసుకుందాం.


ఒకప్పుడు మనల్ని బ్రిటీష్ వాళ్లు పరిపాలించారు కదా.. అప్పుడు వాళ్లు.. బ్రిటన్ దేశంలో పాటించే తూనికలు-కొలతలను ఇండియాలో ప్రవేశపెట్టారు. క్రమంగా భారతీయులు వాటికి అలవాటుపడ్డారు. క్యారెట్ అనేది కూడా బ్రిటన్ నుంచే వచ్చింది.


ప్రాచీన బ్రిటన్‌లో గ్రెయిన్, క్వార్ట్ అనే కాయిన్లు ఉండేవి. నాలుగు క్వార్ట్‌లు, ఒక గ్రెయిన్‌కి సమానం. అలాగే.. నాలుగు గ్రెయిన్లు చెయ్యాలంటే.. 1 క్యారెట్ బంగారం అవసరం. అప్పట్లో వ్యాపారులు, సంపన్నులూ... బ్రిటన్ రాజుకి నాణేలను ఇవ్వాల్సి వచ్చేది. అది కూడా 24 క్యారెట్ల విలువైనవి. అప్పట్లో రాజుకి ఇచ్చే నాణేలను నాణ్యమైన బంగారంతో చేసేవారు. దాంతో.. 24 క్యారెట్లు అనేది బంగారం స్వచ్ఛతకు ప్రమాణంగా మారింది.

 

ప్రస్తుతం గోల్డ్ కాయిన్స్‌ని స్వచ్ఛమైన బంగారంతో తయారుచేస్తున్నారు. అందువల్ల వీటిని 24 క్యారెట్ల గోల్డ్‌ కింద చెబుతారు. బంగారు నగలను వంద శాతం బంగారంతో చేస్తే, అవి గట్టిగా ఉండవు. అలా నగలను తయారుచెయ్యడం చాలా కష్టం. అందువల్ల నగల తయారీలో కొంత రాగి లేదా వెండిని కలుపుతారు. అందువల్ల వాటి స్వచ్ఛత 24 క్యారెట్లు ఉండదు. రాగి లేదా వెండిని ఎంత శాతం కలిపారు అన్న దాన్ని బట్టీ వాటి క్యారెట్ విలువను చూపిస్తారు.


సాధారణంగా నగలను 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 12 క్యారెట్లలో తయారుచేస్తారు. అంటే.. 22 క్యారెట్ల బంగారు నగలలో బంగారం 91.67 శాతం ఉంటుంది. వెండి లేదా రాగి 8.33 శాతం ఉంటుంది. అదే... 18 క్యారెట్ల నగలలో బంగారం 75 శాతం ఉంటే, మిగతావి 25 శాతం ఉంటాయి. అలాగే 12 క్యారెట్ల నగలలో బంగారం 50 శాతం ఉంటుంది. మిగతావి 50 శాతం ఉంటాయి. 



15, ఏప్రిల్ 2024, సోమవారం

Strange Facts - వింతలు - విచిత్రాలు - 6

 


న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. ఒకప్పుడు లైట్ హౌస్ లాగా పనిచేసేది. దాన్ని 1886లో ఆవిష్కరించిన నెల తర్వాత.. దాని టార్చ్‌ని ఆన్ చేశారు. అప్పటి నుంచి 16 ఏళ్లపాటూ అది లైట్‌హౌస్ లాగా పనిచేసింది. ఆ టార్చ్ రాత్రివేళ 38 కిలోమీటర్ల దూరం వరకూ కనిపించేది.


ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌లో మొత్తం 26 లెటర్స్ ఉంటాయని మనకు తెలుసు. ఐతే.. 1524 వరకూ.. 25 లెటర్సే ఉండేవి. ఆ తర్వాత చివరి లెటర్‌గా Jని యాడ్ చేశారు. అప్పటివరకూ Jకి బదులుగా I లెటర్‌నే వాడేవారు. ఆ తర్వాత J అవసరాన్ని గుర్తించి, దాన్ని యాడ్ చేశారు. ఐతే, J  తర్వాత మరే లెటర్‌నీ యాడ్ చెయ్యలేదు. 


రొయ్య గుండె దాని తలలో ఉంటుంది. రొయ్యలకు ధమనులు ఉండవు. అందువల్ల వాటి అవయవాలు రక్తంలో తేలుతూ ఉంటాయి. 


పందులు ఆకాశంవైపు చూడలేవు. ఎందుకంటే, వాటి మెడ కండరాలు, వెన్నెముక, తల పైకి ఎత్తేందుకు వీలుగా ఉండవు. అందువల్ల పందులు పైకి చూడలేవు.


వేలి ముద్రలు ఎలాగైతే ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయో, నాలిక ముద్రలు కూడా అలా వేర్వేరుగా ఉంటాయి. కవలలకు కూడా టంగ్ ప్రింట్స్ వేరుగానే ఉంటాయి. నాలిక కలర్, షేప్, సర్ఫేస్ ఫీచర్స్ ఇవన్నీ ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఫోరెన్సిక్ పరీక్షల్లో నాలిక ముద్రలను కూడా పరీక్షిస్తారు.


ప్రతీ సంవత్సరం పిడుగుల వల్ల మనుషుల కంటే జిరాఫీలు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నాయి. వాటి మరణాల రేటు మనుషుల మరణాల కంటే 30 రెట్లు ఎక్కువగా ఉంది. వర్షాలు పడే సమయంలో జిరాఫీలు మనలా ఇళ్లలో ఉండే వీలు లేకపోవడం వల్ల, అవి చెట్ల కిందకు వెళ్తున్నాయి. అక్కడే పిడుగులు పడుతుండటం వల్ల చనిపోతున్నాయి. బీబీసీ సైన్స్ ఫోకస్ ఈ విషయాన్ని తెలిపింది.


ప్రపంచంలో అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్. ఐతే.. దాని బ్రెయిన్ మాత్రం చాలా చిన్నది. దాని బ్రెయిన్ కంటే, దాని కన్ను పెద్దగా ఉంటుంది. మరో విశేషం ఏంటంటే.. భూమిపై ఉన్న ప్రాణుల్లో అతి పెద్ద కళ్లను కలిగినవి ఆస్ట్రిచ్‌లే. ఈ కళ్లు 5 సెంటీమీటర్లు ఉంటాయి. ఇవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరాయి.


13, ఏప్రిల్ 2024, శనివారం

Why do we fall asleep while reading? - చదివేటప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది?


స్కూల్లో అయినా, లైబ్రరీలో అయినా.. ఎక్కడైనా సరే.. చదివేటప్పుడు చాలా మందికి నిద్ర వస్తుంది. ఎంత ప్రయత్నించినా అది ఆగదు. బుక్ ఓపెన్ చెయ్యగానే నిద్ర మొదలవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి సొల్యూషన్ ఏంటి? తెలుసుకుందాం.


ఎవరైతే ప్రశాంతంగా కూర్చొని, సైలెంటుగా చదువుతూ ఉంటారో, వారికి బుక్ ఓపెన్ చేసిన పావు గంట తర్వాత నుంచి నిద్ర రావడం మొదలవుతుంది. దీనికి కారణం.. చదివేటప్పుడు వారి శరీర కదలికలు తగ్గిపోతాయి. కళ్లు, బ్రెయిన్, చేతులు మాత్రమే పనిచేస్తుంటాయి. అందువల్ల శరీరంలోని కండరాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. అప్పుడు కండరాల్లోని కణాల్లో దహనచర్య (Combustion) కూడా తగ్గిపోతుంది. అందువల్ల లాక్టిక్ యాసిడ్ తయారవుతుంది. ఈ యాసిడ్.. ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది. ఈ కారణంగా.. రక్తంలో ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. అందువల్ల శరీరానికి ఆక్సిజన్ తక్కువగా ఉండే రక్తం సప్లై అవుతూ ఉంటుంది.


శరీరానికి కావాల్సిన మొత్తం ఆక్సిజన్‌లో దాదాపు 20 శాతం ఆక్సిజన్ బ్రెయిన్ తీసుకుంటుంది. ఐతే.. లాక్టిక్ యాసిడ్ వల్ల.. బ్రెయిన్‌కి వెళ్లే రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. దాంతో బ్రెయిన్ యాక్టివ్‌గా పని చెయ్యలేదు. అప్పుడే నిద్ర రావడం మొదలవుతుంది. ఇలా కంటిన్యూగా బ్రెయిన్‌కి ఆక్సిజన్ తక్కువగా వస్తున్నంతసేపూ.. బ్రెయిన్ మొద్దుబారినట్లుగానే ఉంటుంది. అందుకే చదివేటప్పుడు నిద్ర మొదలైతే, ఆగదు.


చదివేటప్పుడు నిద్ర రాకూడదంటే ఏం చెయ్యాలో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. చదివేటప్పుడు ఒకే యాంగిల్‌లో ఉండకుండా.. తరచుగా అటూ ఇటూ కదులుతూ ఉండాలి. అలాగే.. పావుగంటకోసారి బ్రేక్ ఇచ్చి.. ఓ నాలుగడుగులు వేసి.. మళ్లీ వచ్చి కూర్చొని చదువుకోవాలి. అంటే.. బాడీకి రెస్ట్ ఇవ్వకుండా చూసుకోవాలి. అప్పుడు ఎంతసేపు చదివినా, నిద్ర రాదు.


ఇది చదువుకే కాదు.. ఆఫీసుల్లో డెస్క్ వర్క్ చేసేవారికీ వర్తిస్తుంది. ఎక్కువసేపు కూర్చొని పని చేస్తూ ఉంటే, నిద్రవస్తుంది. అందువల్ల వారు కూడా మధ్యమధ్యలో పనికి బ్రేక్ ఇచ్చి.. శరీరం, కండరాలూ యాక్టివ్‌గా ఉండేలా చూసుకుంటే.. నిద్రకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. 


Why electric train does not shock? - ఎలక్ట్రిక్‌ ట్రైన్ ఎందుకు షాక్‌ కొట్టదు?

 


భారతీయ రైల్వేలోని చాలా రైళ్లు, మెట్రోరైళ్లు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లూ ఇవన్నీ ఎలక్ట్రిక్‌వే.. వీటిలో చాలా భాగం ఐరన్ తోనే తయారవుతుంది. అలాంటప్పుడు వీటిలో ప్రయాణించేవారికి కరెంటు షాక్ కొట్టాలి కదా? అలా ఎందుకు జరగట్లేదు? ఈ రైళ్లు మనకు సేఫేనా? తెలుసుకుందాం.


కరెంటులో ధనావేశం, రుణావేశం ఉంటుంది. వాటినే ప్లస్, మైనస్‌గా చెప్పుకుంటాం. ఇవి రెండూ, రెండు పోల్స్ లాంటివి. ఎప్పుడైనా కరెంటు ప్రవహించాలంటే.. అది తప్పనిసరిగా ఈ రెండు పోల్స్‌నీ టచ్ చెయ్యాలి. మనకు షాక్ కొట్టాలంటే.. మన బాడీ.. కొంత దూరంలో ఉన్న ప్లస్, మైనస్‌కి కనెక్ట్ అవ్వాలి. అంటే మనం ఒక చేత్తో ప్లస్‌ పోల్‌ని టచ్ చేస్తే, మరో చేత్తో లేదా కాలితో మైనస్ పోల్‌ని ముట్టుకోవాలి. అప్పుడు మాత్రమే కరెంటు మన బాడీలో ప్రవహిస్తుంది. 


ఒక్కోసారి మనం కరెంటు తీగను ముట్టుకున్నప్పుడు మనకు షాక్ కొడుతుంది. ఎందుకంటే.. భూమిపై ఉండే వాతావరణం ప్లస్ పోల్ లాంటిది. భూమి ఉపరితలం మైనస్ పోల్ లాంటిది. మనం కరెంటు తీగను ముట్టుకున్నప్పుడు.. మనకు ప్లస్ టచ్ అవుతుంది. అదే సమయంలో మన కాళ్లు భూమిని తాకి ఉంటే, అది మైనస్ అవుతుంది. అంటే.. కరెంటుకి ప్లస్, మైనస్ రెండూ దొరికినట్లే.. దాంతో ప్రవాహం సాధ్యమవుతుంది. అప్పుడు మన శరీరం నుంచి కరెంటు ప్రవహిస్తుంది. దాంతో మనకు షాక్ కొడుతుంది.


ఎలక్ట్రిక్‌ ట్రైన్‌లో ఇంజిన్‌‌ని మాత్రమే ఎలక్ట్రిక్‌ వైర్లకు కనెక్ట్ చేస్తారు. బోగీలను కనెక్ట్ చెయ్యరు. ఐతే.. ఇంజిన్‌కీ, బోగీలకూ మధ్య లింక్ ఉంటుంది కాబట్టి, బోగీల్లో కూడా కరెంటు ప్రవహిస్తుంది కదా అనే డౌట్ మనకు రావచ్చు. అది నిజమే. బోగీల్లో కూడా కరెంటు ప్రవహించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడో టెక్నిక్ ఉంది. రైలు ఇంజిన్, బోగీలు అన్నింటికీ ప్లస్ మాత్రమే ఉంటుంది. మైనస్ ఉండదు. రైలు పైన ఉండే కరెంటు తీగ.. ప్లస్ అన్నమాట. మైనస్ అనేది భూమి ఉపరితలం. అందువల్ల పై నుంచి వచ్చే కరెంటును డైరెక్టుగా పట్టాల నుంచి భూమికి కనెక్ట్ అయ్యేలా చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక మెషిన్ ఉంటుంది. అందువల్ల కరెంటు ప్రవాహం ఆ యంత్రం ద్వారా సాగుతుంది.


కరెంటు ప్రవాహం ఆ మెషిన్ ద్వారానే ఎందుకు వెళ్తుంది? బోగీల వైపు కూడా వెళ్లొచ్చు కదా... అనే మరో డౌట్ మనకు రావచ్చు. ఇక్కడ మరో టెక్నిక్ ఉంది. కరెంట్ ఎప్పుడూ వీలైనంత వేగంగా వెళ్లే మార్గాన్ని వెతుక్కుంటుంది. అంటే.. ప్రవాహంలో ఎలాంటి అవరోధాలూ ఉండకుండా చూసుకుంటుంది. రైల్లోని మెషిన్.. కరెంటును వేగంగా భూమికి చేరేలా చేస్తుంది. ఆ మార్గం కాకుండా మరే మార్గంలో వెళ్లినా ఆలస్యం అవుతుంది. అందువల్ల కరెంటు ఆ యంత్రం ద్వారానే వెళ్తుంది. ఈ కారణంగా రైలులో ఉన్నవారికి కరెంటు పాస్ అవ్వదు. అందుకే ఎలక్ట్రిక్ రైలులో ప్రయాణించేవారికి షాక్ కొట్టదు.


Strange Facts - వింతలు - విచిత్రాలు - 5


పులులకు ఉండే నల్లటి చారలు.. బొచ్చుపై మాత్రమే కాదు.. చర్మంపై కూడా ఉంటాయి. ఇవి దాదాపు వేలి ముద్రల లాంటివి. ఎందుకంటే, ఏ రెండు పులులకూ ఒకే రకమైన చారలు ఉండవు. ఈ చారలు రాత్రివేళ వేటాడేందుకు పులికి ఉపయోగపడతాయి. చారల కారణంగా పులి గడ్డిలో వెళ్తున్నప్పుడు.. అది గడ్డిలో కలిసిపోతుంది. దాంతో పులికి వేటాడటం తేలికవుతుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌కి చెందిన నేచర్ స్టడీ సొసైటీ నిర్ధారించింది. 


మనకు మామూలు సమయంలో కంటే, స్నానం చేసేటప్పుడు క్రియేటివ్ ఐడియాలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే, మన శరీరంపై గోరు వెచ్చని నీరు పడినప్పుడు.. శరీరంలో డోపమైన్ (Dopamine) అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మన మూడ్‌ని మార్చగలదు. దీని కారణంగా మనుషులు మరింత క్రియేటివ్‌గా ఆలోచిస్తారు.


హెడ్‌ఫోన్స్ వల్ల మన చెవిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఎవరైనా ఒక గంట పాటూ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే, వారి చెవిలో బ్యా్క్టీరియా 700 రెట్లు పెరుగుతుంది. అందుకే వీలైనంవరకూ హెడ్‌ఫోన్స్ వాడకపోవడం మేలని పరిశోధకులు చెబుతున్నారు.


చందమామ కంటే ఆస్ట్రేలియా వైశాల్యం ఎక్కువ. చందమామ వైశాల్యం 3,400 కిలోమీటర్లు. ఆస్ట్రేలియా వైశాల్యం తూర్పు నుంచి పడమరకు 4వేల కిలోమీటర్లు.


మన శరీరంలో ఏదైనా అవయవం పాడైతే, అది వీలైనంతవరకూ తనకు తానుగా చికిత్స చేసుకుంటుంది. ఇలా బాడీలోని అన్ని అవయవాలూ ప్రయత్నిస్తాయి. ఒక్క నోట్లోని దంతాలు మాత్రం అలా చెయ్యవు. కారణం వీటిలో సజీవ కణజాలం ఉండదు. పైగా దంతాలపై ఎనామెల్ పొర ఉంటుంది. అది పాడైతే, తిరిగి ఉత్పత్తి కాలేదు.


బిర్యానీలో వాడే జాజికాయలు (nutmeg) ఒక రకంగా మత్తుపదార్థం లాంటివి. ఎందుకంటే వాటిలో మిరిస్టిసిన్ (myristicin) అనే సహజమైన కాంపౌండ్ ఉంటుంది. ఇది బ్రెయిన్‌ మొద్దుబారేలా చెయ్యగలదు. ఎవరైనా జాజికాయలను ఎక్కువగా వాడితే, వారికి మతి భ్రమిస్తుంది. మత్తు వస్తుంది. ఈ విషయాన్ని కెనడాలోని మెక్‌గిల్ యూనివర్శిటీ చెప్పింది.


అన్ని గ్రహాలూ యాంటీ-క్లాక్‌వైజ్ తిరుగుతుంటే, శుక్రగ్రహం మాత్రం క్లాక్‌వైజ్ తిరుగుతుంది. ఐతే.. భూమి తనచుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడితే, వీనస్‌ తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతుంది. ఐతే.. అది సూర్యుడి చుట్టూ తిరగడానికి 225 రోజులే పడుతుంది. ఇలా ఈ గ్రహం ఒకసారి తన చుట్టూ తాను తిరిగేలోపే, సూర్యుడి చుట్టూ భ్రమణం పూర్తి చేస్తుంది. ఇలా ఎందుకంటే, గ్రహాలు ఏర్పడిన సమయంలో శుక్రగ్రహం కూడా యాంటీ-క్లాక్‌వైజ్ తిరుగుతూ ఉంటే, మరో గ్రహమో లేక గ్రహశకలమో శుక్రగ్రహాన్ని కుడివైపు నుంచి ఎడమవైపుకి ఢీకొడుతూ వెళ్లి ఉండొచ్చనీ, దాంతో అప్పటినుంచి అది రివర్సులో తిరగడం మొదలుపెట్టి ఉండొచ్చనే అంచనా ఉంది. అందువల్లే అది నెమ్మదిగా తిరుగుతోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

 


10, ఏప్రిల్ 2024, బుధవారం

Which side to sleep on? - ఏ దిక్కువైపు పడుకోవాలి?

 


మనం ఏ దిక్కువైపు పడుకుంటే మంచిది? అనే ప్రశ్న మనలో చాలా మందికి ఉంటుంది. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల సమాధానాలు మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తాయి. సైన్స్ ఏం చెబుతుందో తెలుసుకుందాం.


నిద్ర అనగానే.. చాలా మంది వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుంటారు. వాస్తు ప్రకారం.. తూర్పు లేదా దక్షిణంవైపు తల పెట్టుకొని పడుకోవాలి. కాళ్లు పశ్చిమం లేదా ఉత్తరం వైపు ఉండాలి. అలా వీలు కాకపోతే.. తల పశ్చిమం లేదా ఈశాన్యం వైపు ఉండొచ్చు. వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు ఈ నియమాలు పాటిస్తారు.


జపాన్‌లో కొంతమంది ఉత్తరం లేదా పశ్చిమం వైపు చూస్తూ నిద్రపోరు. ఎందుకంటే జపాన్‌లో చనిపోయిన వారి తలలు, ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉంచుతారు. అలాగే ఆఫ్రికాలో చనిపోయిన వారి తలలు పశ్చిమంవైపు చూస్తున్నట్లు ఉంచుతారు. అందుకని జపనీస్ అలా నిద్రపోరు, అది వారి నమ్మకం.


సైన్స్ ప్రకారం చూస్తే.. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి.. ఉత్తరం లేదా దక్షిణంవైపు తలపెట్టుకొని పడుకోకూడదు అని కొంతమంది శాస్త్రవేత్తలు గతంలో నమ్మేవారు. ఆధునిక కాలంలో.. దీనిపై చాలా పరిశోధనలు జరిగాయి. వాటి ప్రకారం.. భూమి గ్రావిటీ పవర్.. మనపై ఎప్పుడూ ఉంటుంది. నిద్రపోయినా, మెలకువగా ఉన్నా.. అది నిరంతరం ఉంటుంది. అందువల్ల, నిద్రకీ, పడుకునే విధానానికీ, గురుత్వాకర్షణ శక్తి ప్రభావానికీ సంబంధం లేదు. 


మనం ఏ దిక్కున పడుకున్నా.. మన శరీరం నుంచి అయస్కాంత క్షేత్ర రేఖలు వెళ్తూనే ఉంటాయి. మన శరీరంలో సుమారు 20 మిల్లీగ్రాముల దాకా మాంగనీస్ ఉంటుంది. అలాగే సుమారు 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. మనం ఏ దిక్కున పడుకున్నా.. అయస్కాంత క్షేత్ర ప్రభావం మనపై ఒకేలా ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకూ.. భూ అయస్కాంత క్షేత్రానికి తగినట్లుగానే మన శరీరం నడుచుకుంటుంది. అందువల్ల మనం ఏ దిక్కున పడుకున్నా.. ఏ సమస్యా ఉండదని మోడ్రన్ సైంటిస్టులు చెబుతున్నారు. కంఫర్ట్‌గా నిద్రపోవడం ముఖ్యం అని అంటున్నారు.


9, ఏప్రిల్ 2024, మంగళవారం

History of Potato - బంగాళాదుంపల్ని విషంలా చూసేవారు!

 


ఈ రోజుల్లో బంగాళాదుంపలు లేని ఇల్లు దాదాపు ఉండదు. కూరల్లో, బజ్జీలలో, చిప్స్ లాగా ఇలా ఎన్నో రకాలుగా ఆలూని వండుకోవచ్చు. అలాంటి ఈ దుంపలను ఒకప్పుడు విషంలా చూసేవారు. ఆలూ చరిత్ర తెలుసుకుందాం.


బంగాళాదుంపలు పుట్టింది దక్షిణ అమెరికాలో. వీటిలో 4000 రకాలు ఉన్నాయి. ఇవి ఎల్లో, రెడ్, బ్లూ, బ్లాక్ ఇలా చాలా రంగుల్లో ఉన్నాయి. అంతేకాదు.. వీటిలో చిన్న దుంపలు బఠాణీ గింజ సైజులో ఉంటాయి. పెద్ద దుంపలను మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ప్రపంచ దేశాల ప్రజలు.. బియ్యం, గోధుమలు, మొక్కజొన్నతోపాటూ.. దుంపలను ఎక్కువగా తింటున్నారు.


క్రీస్తుపూర్వం 3వేల సంవత్సరాల కాలంలో దక్షిణ అమెరికాలోని పెరూ ప్రాంతంలో 'ఇన్కా ఇండియన్లు' నివసించేవారు. వారే తొలిసారి బంగాళాదుంపలను పండించారని చెబుతారు. క్రీస్తు శకం 1537లో స్పెయిన్ దేశస్థుల ద్వారా ఈ దుంపలు యూరప్‌ దేశాలకు చేరాయి. ఐతే.. మొదట్లో యూరోపియన్లు దుంపలు తింటే చనిపోతారని అనుకునేవారు. వాటిని విషంలా చూసేవారు.


జర్మనీ రాజు ఫ్రెడెరిక్‌ విలియం ఈ దుంపల గురించి ఆరా తీశారు. అప్పుడు ఈ దుంపల్లో ఉండే పోషకాల గురించి తెలుసుకున్నారు. వాటిని పండించమని ఆదేశించారు. అలా యూరప్‌లో దుంపల వాడకం పెరిగింది. ఆ తర్వాత ఈ దుంపలు.. 1621లో ఉత్తర అమెరికాకీ, 1719లో ఇంగ్లాండుకీ పరిచయం అయ్యాయి. వీటిని 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు భారత్‌కి పరిచయం చేశారు.


బంగాళాదుంపలో 80 శాతం నీరే ఉంటుంది. ఇంకా ప్రోటీన్, సోడియం, పొటాషియం, ఫైబర్, నియాసిన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సీ ఉంటాయి. ఒక అమెరికన్‌ ఏడాదికి 54 కేజీల దుంపల్ని తింటుంటే, ఒక జర్మన్ సంవత్సరానికి 65 కేజీల దుంపలు లాగిస్తున్నారు. అదే ఒక ఇండియన్ ఏడాదికి 33 కేజీల దుంపలే తింటున్నారు. ప్రపంచంలో బంగాళాదుంపల్ని ఎక్కువగా పండిస్తున్న దేశాల్లో చైనా, భారత్, రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ టాప్‌లో ఉన్నాయి.