13, మార్చి 2024, బుధవారం

Where does sand come from? - ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది?

 


సముద్ర తీరాల్లో, నదుల ఒడ్డున, ఎడారుల్లో భారీగా ఇసుక ఉంటుంది? ప్రపంచ వ్యాప్తంగా భవనాల నిర్మాణంలో ఎంత ఇసుక వాడుతున్నా, ఇంకా చాలా శాండ్ మిగిలే ఉంటోంది. ఎందుకంటే.. మనం వాడుతున్న దాని కంటే, ఎక్కువ ఇసుక సహజసిద్ధంగా ఉత్పత్తి అవుతోంది. అసలు ఈ ఇసుక ఎలా తయారవుతోందో తెలుసుకుందాం.


ఇసుక అనేది అతి చిన్న రాళ్ల సమూహం. ఈ రాళ్లు 2 మిల్లీమీటర్ల కంటే చిన్న సైజులో ఉంటాయి. ఈ ఇసుక మన చుట్టూ ఉండే కొండల నుంచే వస్తుంది. ఎలా అంటే.. ఈ కొండల్లో ఉండే పెద్ద రాళ్లు.. లక్షల సంవత్సరాలు అయ్యే కొద్దీ.. గాలి, వాన, మంచు, వడగళ్ల కారణంగా.. అరిగిపోతూ ఉంటాయి. ఇలా అరిగే సమయంలో ఈ రాళ్లలోని ఐరన్, సిలికాన్, అల్యూమినియం వంటి ఖనిజాలు వేటికవే విడిపోతాయి. 


విడిపోయిన ఖనిజాల్లో.. కొన్ని బంకమట్టిగా మారతాయి. మరికొన్ని ఇసుక, స్లిట్‌గా మారతాయి. వేల సంవత్సరాలు గడిచేకొద్దీ.. ఇవన్నీ గురుత్వాకర్షణ వల్ల దగ్గరవుతాయి. ఇలా ఏర్పడిన కొత్త పదార్థాన్ని లోమ్ అంటారు. ఈ లోమ్.. వర్షాలు, వరదల వల్ల కొట్టుకుపోతూ.. నదుల్లోకి చేరుతుంది. అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్తుంది. సముద్ర గర్భంలో ఒక పొరలాగా ఏర్పడుతుంది.


వేల సంవత్సరాలు గడిచేకొద్దీ.. లోమ్ లోని బంకమట్టి, స్లిట్ గట్టిపడుతూ.. సముద్ర గర్భానికి అతుక్కుపోతాయి. ఇసుక రేణువులు మాత్రం లోమ్ నుంచి విడిపోతాయి. ఇవి నీటి కదలికలను బట్టీ కదులుతాయి. అలలు వీటిని సముద్ర తీరానికి చేరుస్తాయి. ఇలా సంవత్సరాలు గడిచేకొద్దీ.. తీరంలో ఇసుక పెరుగుతూ ఉంటుంది. ఇలా కొండలపై ఉండే బండరాళ్లు.. ఇసుకగా మారేందుకు లక్షల సంవత్సరాలు పడుతుంది.


ఎడారుల్లో ఇసుక ఉండటానికి ప్రధాన కారణం కూడా సముద్రమే. ఇప్పుడు ఎడారులుగా ఉన్న ప్రాంతాలన్నీ.. ఒకప్పుడు సముద్రాలే. వాటిలో భారీగా ఇసుక ఉండేది. లక్షల సంవత్సరాల్లో నీరు ఎండిపోయిన తర్వాత.. మిగిలిపోయిన ఇసుకే.. ఎడారిగా కనిపిస్తోంది.