మనందరికీ గులాబీలు నచ్చుతాయి. చాలా అందమైన, ఆకర్షణీయమైన ఈ పూలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ప్రేమను వ్యక్తం చెయ్యడానికి రోజాలనే ఎంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే సంప్రదాయం ఉంది.
రోజా పూలలో ఒక్కో రంగుకీ ఒక్కో అర్థం ఉంది. లవ్ ప్రపోజల్ కోసం రెడ్ కలర్ రోజాను ఇస్తారు. ఎవరికైనా థాంక్స్ చెప్పేటప్పుడు పింక్ కలర్ రోజాను ఇస్తారు. స్నేహాన్ని వ్యక్తం చెయ్యడానికి ఎల్లో కలర్ రోజా ఉంది. ఎవరైనా మీకు ఆరెంజ్ కలర్ గులాబీని ఇస్తే, దాని అర్థం వారు మీతో సంతోషంగా ఉన్నారని. అలాగే.. గొడవలు మానేసి, శాంతిగా ఉందాం అని చెప్పేందుకు వైట్ రోజాను ఇస్తారు. ఎవరికైనా ఫేర్‌వెల్ చెప్పేటప్పుడు కూడా వైట్ రోజ్ ఇస్తారు. ఇంకా.. ఎవరైనా మిస్టరీగా అనిపిస్తే, వారికి బ్లూ రోజాలను ఇస్తారు. మనం బలంగా ఉన్నాం, మనకు తిరుగులేదు అని చెప్పేందుకు గ్రీన్ రోజాలను ఇస్తారు.
రోజాల కలర్స్ మాత్రమే కాదు.. నంబర్‌కి కూడా అర్థాలున్నాయి. ఒక అమ్మాయికి ఒక రోజా పువ్వు ఇస్తే, దాని అర్థం, తొలిచూపులోనే నిన్ను ప్రేమించాను అని. అదే 9 గులాబీలు ఇస్తే, మనిద్దరం జీవితాంతం కలిసి ఉందామని అర్థం. అదే 15 రోజాలు ఇస్తే, నీ నుంచి దూరం అవుతున్నందుకు క్షమించు అని అర్థమట. లవర్స్ లేదా పార్ట్‌నర్స్ బ్రేకప్ సమయంలో ఇలా 15 రోజాలు ఇచ్చుకుంటారు.
ప్రపంచంలో ఎన్నో రకాల పూలు ఉండగా.. రోజాలనే ఎందుకు ఇస్తారు అనే ప్రశ్న మనకు రావచ్చు. ఎందుకంటే.. రోజా పూలంటేనే మానవ సంబంధాలు, స్వచ్ఛతకు ప్రతీక. మన జీవితంలోని స్నేహం, ప్రేమ, శాంతి, ఐకమత్యం ఇలా ప్రతీ ఫీలింగ్‌నీ వ్యక్తం చెయ్యడానికి రకరకాల రంగుల్లో రోజాలు ఉన్నాయి. ఐతే, ఎన్ని రంగులు ఉన్నా, రెడ్ రోజాలు అన్నింటికంటే గొప్పవిగా భావిస్తారు. ఎందుకంటే రెడ్ రోజాలు.. అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి, వాటిని చూడగానే పాజిటివ్ ఫీల్ కలిగిస్తాయి. ఇవి హృదయాన్ని టచ్ చేస్తాయి. మానవ సంబంధాలను బలపరుస్తాయి. అందుకే ప్రేమను వ్యక్తం చెయ్యడానికి రెడ్ రోజాలనే ఇస్తారు.