కరెంటును చాలా మార్గాల ద్వారా ఉత్పత్తి చేస్తారు. నీటి నుంచి, సూర్యరశ్మి నుంచి, గాలి నుంచి, సముద్ర అలల నుంచి.. ఇలా చాలా మార్గాలున్నాయి. చెత్త నుంచి కూడా కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు. ఇది విదేశాల్లో ఎక్కువగా జరుగుతోంది. మన దేశంలో దీనిపై పెద్దగా ప్రచారం జరగట్లేదు. అందువల్ల ఇండియాలో చాలా చెత్త వృథా అవుతోంది.
మనం పారేసే చెత్త, నిజానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగివుంటుంది. చెత్తను సేకరించి, సద్వినియోగం చేసే కార్యక్రమాన్ని ఘన వ్యర్థ పదార్థాల కార్యక్రమం అంటాం. అదే సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్. ఈ రోజుల్లో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇండియా కూడా దీనిపై నానాటికీ ఫోకస్ పెంచుతోంది.
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో చెత్తను 4 భాగాలుగా విభజిస్తారు. అవి 1.పేపర్. ఇందులో పేపర్లు, బుక్స్, అట్టపెట్టెలు, ప్యాకింగ్ మెటీరియల్ వంటివి ఉంటాయి. 2వది గ్లాస్. ఇందులో రకరకాల సీసాలు, మద్యం బాటిళ్లు, గాజు గ్లాసులు, గాజు అద్దాలు వంటివి ఉంటాయి. 3వది ఆర్గానిక్. ఇందులో తడి చెత్త ఉంటుంది. అంటే కూరగాయల చెత్త, పండ్ల చెత్త, టీ పొడి, ఆహార పదార్థాలు, నాన్ వెజ్ ఐటెమ్స్, కొబ్బరి పీచు, ఎండిన ఆకులు, కలప వస్తువుల వంటి, త్వరగా పాడైపోయేవి ఉంటాయి. ఇక 4వది ప్లాస్టిక్. ఇందులో ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ సంబంధిత అన్ని వస్తువులూ వస్తాయి.
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో సేకరించే చెత్తను ఏదో ఒక రకంగా తిరిగి ఉపయోగించుకునేలా రీసైక్లింగ్ చేస్తారు. దీని వల్ల ప్రభుత్వాలకు భారీగా మనీ వస్తుంది. అలాగే పర్యావరణానికీ మేలు జరుగుతుంది. ఈ చెత్త పదార్థాలన్నీ నిజానికి సేంద్రియ రసాయనాలే. వీటిలో చాలా శక్తి దాగి ఉంటుంది. వీటిని మండించినప్పుడు భారీగా ఉష్ణశక్తి విడుదల అవుతుంది. దాన్ని కరెంటుగా మార్చుతారు.
మనం చెత్తగా భావించే ఈ చెత్తను, చైనా లాంటి దేశాలు, ప్రపంచ దేశాల నుంచి చాలా చవకగా కొంటూ.. దాన్ని రీసైక్లింగ్ చేసి.. రోజూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. భారత కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారిస్తోంది. దేశవ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కార్యక్రమం రోజురోజుకూ విస్తరిస్తోంది.