భూమికి ఆకర్షణ శక్తి ఉండటం వల్ల, ఏదైనా వస్తువు మన చేతి నుంచి జారితే, అది భూమిపైనే పడుతుంది గానీ ఆకాశం వైపు వెళ్లదు. నీరు కూడా భూమివైపే పడుతుంది తప్ప.. పైకి వెళ్లదు. కానీ మంట మాత్రం పైకే వెళ్తుంది. భూమిపై ఎక్కడ ఎలాంటి మంట వచ్చినా, అది పైకే ఎగసిపడుతుంది తప్ప, భూమివైపు వెళ్లదు. ఇందుకు కారణం తెలుసుకుందాం.
మంట పైకి వెళ్లడానికి ప్రధాన కారణం గాలి. మంట మండేటప్పుడు, తన చుట్టూ ఉన్న గాలిని వేడెక్కిస్తుంది. దాంతో ఆ గాలి బరువు తగ్గుతుంది. తేలికైన గాలిపై భూమ్యాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో ఆ గాలి.. భూమి నుంచి దూరంగా పైకి వెళ్తుంది. అలా ఆ గాలి వెళ్లగానే.. ఆ ప్రదేశంలోకి బరువైన గాలి వచ్చి చేరుతుంది. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది.
పైకి వెళ్లే గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. బరువైన గాలి వేగం తక్కువగా ఉంటుంది. మంటచుట్టూ ఉండే గాలి.. పైకి వెళ్తున్నప్పుడు.. దాని కారణంగా.. మంట కూడా పైకే వెళ్తుంది. అందుకే మంట ఎప్పుడూ పైకే వెళ్తుంది.
పెద్దల సమక్షంలో, విద్యార్థులు ఓ చిన్న ప్రయోగంతో దీన్ని చేసి చూడవచ్చు. ఓ కొవ్వొత్తిని వెలిగించినప్పుడు, మంట పైకి వెళ్తుంది. ఆ కొవ్వొత్తిని పక్కకు వంచినా, కిందకు వంచినా, ఎటు వంచినా, మంట మాత్రం వంగకుండా, పైకే వెళ్తుండటాన్ని గమనించవచ్చు. మరో విషయం.. దేనికైనా నీడ ఉంటుంది గానీ, మంటకు ఉండదు. అందువల్ల కొవ్వొత్తి, దాన్ని పట్టుకున్నవారి నీడ కనిపిస్తుంది కానీ, మంట నీడ కనిపించదు. అందుకే వెలుతురు ఉన్న చోట, చీకటి ఉండదు అంటారు.